కొంచెం క్రియేటివిటీ, కాస్తంత ఓపిక ఉంటే చాలు, హోమ్ డెకరేషన్లో అద్భుతాలు సృష్టించొచ్చు. ఉదాహరణకు పూలతో చేసే డెకరేషన్ ఎప్పుడూ ఓ రేంజ్లో ఉంటుంది. నిజమైన పూలు ఎక్కువ రోజులు తాజాగా ఉండవు. అందువల్లే, చాలామందికి పూలంటే అమితమైన ప్రేమ ఉన్నా ప్లాస్టిక్ పూలతో సర్దుకుపోతారు. కానీ, క్రియేటివిటీకి కాస్తంత పని చెప్తే నిజమైన పూలతో హోమ్ డెకరేషన్ చేసుకోవచ్చు.
ఫ్రేమ్డ్ ప్రెస్డ్ ఫ్లవర్స్ : ఈ టెక్నిక్‌తో ఇంటిని అందంగా మార్చొచ్చు. ముఖ్యంగా నచ్చిన పూలు భద్రంగా గాజు ఫ్రేముల్లో నిగనిగలాడుతుంటే ఇంట్లో ఉన్నంతసేపూ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీనికోసం నచ్చిన పూరేకులను బ్యాకింగ్ కార్డ్‌పై ప్రెస్ చేయాలి. అదికూడా ఏదైనా డిజైన్ లేదా ఆకారాల్లో అమర్చి, ఆ కార్డ్‌ని ఫొటో ఫ్రేమ్‌లో పెట్టాలి. ఈ ఫ్రేములను ఇంట్లోని హాల్, బెడ్రూమ్లో పెట్టుకుంటే ఆకర్షణీయంగా ఉంటాయి.
డ్రై ఫ్లవర్ అండ్ బ్రాంచ్ గార్లాండ్ : కొన్ని రకాల పూలు ఎండిపోతే కూడా చాలా అందంగా ఉంటాయి. అదే రంగు, అవే తళుకులతో కండ్లను కట్టి పడేస్తాయి. వాటిని ఎంచుకొని, కాడలతోసహా తాజాపూలను ఇంట్లో ప్రెస్సింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతి (ఏదైనా పెద్దసైజు అట్టలమధ్య పూలను కొద్దిరోజులు వత్తి పెట్టాక, బయటి వాతావరణంలో ఎండబెట్టాలి) ద్వారా పూలను ఎండబెట్టాలి. ఈ ఎండిన పూలను ఫ్లవర్ వేజ్‌లలో లేదా హ్యాంగింగ్ సెటప్‌లో అరేంజ్ చేయాలి. వీటిని లివింగ్ రూమ్‌లో టీపాయ్‌మీద కూడా పెట్టుకోవచ్చు.
ఫ్లవర్ ఫోన్ కేస్ : ప్రెస్సింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతిద్వారా గులాబీ, లిల్లీ, బంతి మొదలైన పూలను ఫోన్ కేసుల్లో అమర్చాలి. అయితే, ఈరోజుల్లో చాలామంది ఫోన్ కేసులను కొద్దిరోజులకే బోర్ కొట్టి మార్చేస్తున్నారు. పాత ఫోన్ కేసులను బయట పడేయకుండా దాచి పెట్టుకోవాలి. ఈ ఫ్లవర్ ప్రెస్సింగ్ని వాటిపై చేయాలి. అలా తయారుచేసిన నాలుగైదు ఫోన్ కేసులను అందంగా గోడలపై హ్యాంగ్ చేస్తే చూడచక్కగా వుంటుంది.
ఫ్లవర్ బొకే అరేంజ్మెంట్ : పుట్టినరోజు లేదా పెండ్లి రిసెప్షన్లలో కొంతమంది పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలుపుతారు. ఫంక్షన్ తర్వాత వాటిని చెత్తకుండీల్లో వేయకుండా, అందులోని పూలను రెండు, మూడు రోజులు ఎండ బెట్టాలి. తర్వాత వాటిని అదే బొకే కవర్లో పెట్టి, ఇంట్లోని గోడలకు అతికించుకోవచ్చు.