e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home బతుకమ్మ పదుగురు మెచ్చిన..10 ఉత్తమ దేశాలు!

పదుగురు మెచ్చిన..10 ఉత్తమ దేశాలు!

పదుగురు మెచ్చిన..10 ఉత్తమ దేశాలు!


ఒకప్పుడు, పుడమిమీద భూభాగమంతా ఒక్కచోటే ఉండేదని ఓ సిద్ధాంతం. ఈ ‘సూపర్‌ కాంటినెంట్‌’ను ‘పాంజియా’ అంటారు. ఇదెప్పుడో 30 కోట్ల సంవత్సరాల కిందటి మాట. తర్వాత, క్రమంగా అదంతా విడిపోవడం మొదలైంది. దీన్నే ‘భూఖండ చలనం’ (కాంటినెంటల్‌ డ్రిఫ్ట్‌) అంటున్నాం. ఈ చర్యతోనే ఖండాలు ఏర్పడ్డాయి. వాటిమీద ఆధునిక మానవులూ ఉద్భవించారు. వాళ్లు ఎక్కడ మొదలై, ఎటు ప్రయాణించారనే వాదన పక్కన పెడితే, ధృవప్రాంతం మినహా అంతా ఆక్రమించుకున్నారు. ఎక్కడికక్కడ నాగరికతను అభివృద్ధి చేసుకున్నారు. రాజ్యాలు ఆవిర్భవించాయి, వలసపాలనలు కొనసాగాయి. సరిహద్దులకు సంబంధించి ఇప్పటికీ వివాదాలు ఉన్నా, చాలా దేశాలు స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాయి.

చేతికి ఉన్న అయిదు వేళ్లే వేటికవి వైవిధ్యంగా ఉంటాయి. ఐక్యరాజ్యసమితి గుర్తించిన 193 దేశాలూ ఒకేలా ఉంటాయని ఆశించలేం. కొన్ని దేశాలలో సంపద ఎక్కువగా ఉంది. కొన్నింట సంతోషం వెల్లివిరుస్తున్నది. ఇంకొన్ని పర్యాటకంలో దూసుకుపోతున్నాయి. ఈ జాబితాలు పరిపూర్ణమని, ఇందులోని ప్రతి గణాంకమూ ప్రామాణికమనీ చెప్పలేం. లోకానికి చేరని విషయాలు కొన్ని ఉంటాయి.
లెక్కలను మెరిపించే మాయలూ ఉంటాయి. 100 మంది విద్యార్థులున్న తరగతిలో 90 మంది ఉత్తీర్ణత సాధించినా, 10 మంది ఉన్న చిన్న తరగతిలో 9 మంది ఉత్తీర్ణత పొందినా రెండిటా 90% ఫలితమనే అంటాం. అందుకని, స్ఫూర్తిని నింపుకోవడానికే కొన్ని దేశాల ఘనతను ప్రస్తావించుకుంటూనే.. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అనే మాతృభావనలోని గొప్పదనాన్నీ గుర్తుంచుకొందాం!

దీర్ఘాయుష్మాన్‌ భవ -జపాన్‌

మరణం అనివార్యం. కానీ, సాధ్యమైనంత ఆలస్యంగా చావు తలుపు తట్టాలనేది ఎవరి కోరికైనా. అలా చూసుకుంటే జపాన్‌ ప్రజలు అదృష్టవంతులనే చెప్పాలి. అక్కడ సగటు వయసు 84 ఏండ్ల పైమాటే! దీర్ఘ ఆయుర్దాయానికి పెట్టింది పేరు జపాన్‌. ఇందుకు స్పష్టమైన కారణాలున్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది ఆహారం. జపనీయుల భోజన పద్ధతులు మనకు చాలా దగ్గరగా ఉంటాయి. వరి అన్నం, చేపలు, మాంసం, పాల పదార్థాలు, పండ్లు, కూరగాయలు.. ఇదే వారి మెనూ. కొవ్వు పదార్థాలను చాలా తక్కువగా తీసుకుంటారు. మాంసంలోనూ ‘రెడ్‌ మీట్‌’ జోలికెళ్లరు. గ్రీన్‌ టీ, సోయాబీన్స్‌ ఇష్టపడతారు. ఆహారంలో ఉప్పు కూడా తక్కువే. వీటన్నిటి కారణంగా వారిలో గుండెజబ్బులు, జీర్ణాశయ క్యాన్సర్‌ లాంటి సమస్యలు త్వరగా రావు. పాశ్చాత్య ప్రభావం మొదలైన తర్వాత, క్రమంగా జంక్‌ ఫుడ్‌కు అలవాటుపడ్డారు. దాంతోపాటే ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలూ మొదలయ్యాయి. ఈ ప్రమాదాన్ని మొదట్లోనే పసిగట్టిన అక్కడి ప్రభుత్వం, ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలో సూచిస్తూ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

పదుగురు మెచ్చిన..10 ఉత్తమ దేశాలు!

జపాన్‌ పౌరుల ఆయుర్దాయానికి మరో ముఖ్య కారణం అక్కడి ‘ఆరోగ్య వ్యవస్థ’. 1961నుంచి జపాన్‌ ప్రభుత్వం తన పౌరుల ఆరోగ్యంపై దృష్టి సారించింది. ఆ దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ బీమా వర్తిస్తుంది. వైద్యఖర్చులలో 70నుంచి 90 శాతం వరకు ప్రభుత్వమే భరిస్తుంది. మిగతా ఖర్చులకు ఇతర బీమా పాలసీలు తీసుకోవచ్చు. అత్యవసర వైద్యానికి మాత్రమే కాదు, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి కూడా ఈ బీమా వర్తిస్తుంది. ఏ ఆసుపత్రీ బీమాను నిరాకరించడానికి వీల్లేదు. అంతేకాదు! ఏ చికిత్సకు ఎంత రుసుము చెల్లించాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. రిటైర్‌ అయిన తర్వాత ‘ఇన్నాళ్లూ పని చేసింది చాలు. ఇక నిరంతరం విశ్రాంతి తీసుకోవడమే’ అన్న ధోరణిలో ఉంటారు చాలామంది. జపాన్‌ ప్రజలు అందుకు భిన్నంగా, పదవీ విరమణ తర్వాత కూడా ఏదో ఒక వ్యాపకంలో మునిగి తేలుతారు. దీంతో, వారు పెద్దగా వ్యాయామాలు చేయకపోయినా శ్రమైక జీవనం వల్లే, మధుమేహం వంటి జీవనశైలి సమస్యలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో అధిక ఆయుర్దాయం విషయంలో హాంగ్‌కాంగ్‌ పేరుకూడా వినిపిస్తున్నది. సమతులాహారం, ఏ రుతువులో వచ్చే ఆహారాన్ని ఆ కాలంలో తీసుకోవడం, నడకకు ప్రాధాన్యమివ్వడం, కుటుంబానికి ఎక్కువ విలువ ఇవ్వడం వంటివి వీరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.

మరో స్వర్గం -ఫ్రాన్స్‌
ఏ దేశానికైనా పర్యాటకం ఓ ముఖ్య వనరు మాత్రమే కాదు, గర్వకారణం కూడా! విదేశీ యాత్రికులంతా ఓ దేశాన్ని చూసేందుకు వెల్లువెత్తుతుంటే, అది అభినందన లాంటిదే కదా! అలా చూసుకుంటే, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు దర్శించే దేశం ఫ్రాన్స్‌. ఆ దేశ జాతీయోత్పత్తిలో 10 శాతం, అక్కడి ఉద్యోగాలలో 10 శాతం టూరిజం మీదే ఆధారపడి ఉంది. ఏటా దాదాపు తొమ్మిది కోట్ల మంది ఫ్రాన్స్‌ను సందర్శిస్తారని అంచనా. యూరప్‌లో ఇతర దేశాలవారు యాత్రకోసం ఫ్రాన్స్‌ను ఎంచుకోవడం ఇందుకు ఓ ముఖ్యకారణం. ఆ యాత్ర ఎవరినీ నిరాశ పరచదు. ఈఫిల్‌ టవర్‌, మ్యూజియంలు, మనసు మైమరపించే చర్చ్‌లు, కండ్లు చెదిరే కోటల (కేజిల్స్‌)తోపాటు ఆల్ఫ్స్‌ పర్వతాలు, సముద్రతీరాలు వెరసి ఫ్రాన్స్‌ ఓ భూతల స్వర్గాన్ని తలపిస్తుంది.

పదుగురు మెచ్చిన..10 ఉత్తమ దేశాలు!

సంతోషం తయార్‌! -ఫిన్లాండ్‌
ఇతర జీవులతో పోలిస్తే మనిషికి సవాలక్ష ప్రత్యేకతలు ఉండవచ్చుగాక. వాటన్నిటిలోకి ఎంచదగిన లక్షణం మాత్రం సంతోషమే! అందుకే, మనిషి తను అనుకున్నంతా సంపాదించినా, ఆశ పడినదంతా సాధించినా సంతోషం గురించే తాపత్రయ పడుతాడు. ఈ లోకంలో అందరికంటే సంతోషంగా ఉన్న పౌరులెవరు? అన్నది ఆసక్తికరమైన ప్రశ్న! ఆ దేశం ఫిన్లాండ్‌ అని ఏకంగా ఐక్యరాజ్యసమితి ‘హ్యాపినెస్‌ రిపోర్ట్‌-2020’ పేర్కొన్నది. ఫిన్లాండ్‌ ఈ ఘనతను దక్కించుకోవడం వరుసగా ఇది నాలుగోసారి!నిజానికి, ఫిన్లాండ్‌ వాతావరణం గురించి వింటేనే మనకు నిరాశ ముంచుకొచ్చేస్తుంది. ఉత్తర ధృవ ప్రాంతంలోని అతిసమీప దేశాల్లో ఫిన్లాండ్‌ ఒకటి. ఆక్కడ రక్తం గడ్డ కట్టుకుపోయేంత చలి రాజ్యమేలుతుంటుంది. కొన్ని సందర్భాల్లో, సూర్యుడు సైతం చలికి భయపడి మేఘాల వెనుక దాక్కుంటాడు. కానీ, కొన్ని ప్రత్యేకతల కారణంగా ఫిన్లాండ్‌ వాసులు నిత్యం సంతోషంగా ఉండగలుగుతున్నారు. అవే ఇవి.

పదుగురు మెచ్చిన..10 ఉత్తమ దేశాలు!

సిసు: ఫిన్లండ్‌
వాసులు తరచూ తలుచుకునే ఈ మాటకు అర్థం ‘సంకల్పం’, ‘పట్టుదల’! ప్రతి వ్యతిరేక పరిస్థితినీ అనుకూలంగా మార్చుకోవడమే ఈ సిద్ధాంత సారం. ఈ పాఠం కూడా, వాతావరణం నుంచే వారు నేర్చుకుని ఉంటారు. ‘ఇవాళ సూర్యుడు రావడం లేదు కదా’ అని వాళ్లు బాధపడుతూ కూర్చోరు. బయటకి అడుగుపెడతారు, కంటిముందు వాతావరణాన్ని ఆస్వాదిస్తారు, ఆ రోజు ఏం చేయాలనుకున్నారో అది చేసి తీరుతారు! చేత మారదు, విధానం మారుతుందంతే!
చిత్రమైన హక్కు: సరదాగా కాలిబాటన ప్రయాణిస్తున్నామనుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి తోటలోకో వెళ్లి అక్కడ కాసేపు సేద తీరుతానంటే కుదరదు. ఓ ఖాళీస్థలం చూసుకుని అక్కడ గుడారం వేసుకుంటానంటే చెల్లదు. ఒకరి పొలం గట్టుమీద కూర్చుని వంట చేసుకోవడానికీ వీల్లేదు. సదరు యజమానులు ఎవరైనా అభ్యంతర పెట్టవచ్చు. కానీ, ఇతరుల స్వేచ్ఛకు, ఆస్తికి నష్టం కలిగించనంత సేపూ ఫిన్లాండ్‌లో ఎక్కడైనా అడుగు పెట్టవచ్చు. హాయిగా ప్రయాణిస్తూ జీవితాన్ని నిండుగా ఆస్వాదించవచ్చు.

సానా బాత్‌: ఆవిరి స్నానంగా చెప్పుకునే ‘సానా బాత్‌’ మూలాలు ఫిన్లాండ్‌లో ఉన్నాయి. అక్కడ ఈ స్నానానికి 7,000 సంవత్సరాల చరిత్ర ఉందని అంచనా. సానా బాత్‌ కోసం లక్షల స్నానశాలలు కనిపిస్తాయి. ‘సానా బాత్‌’ ఆరోగ్యానికి మాత్రమే పరిమితమైంది కాదు, స్థాయీస్థోమత వంటి అడ్డంకులన్నీ వదులుకుని అందరూ ఓచోట కలుసుకునే సంప్రదాయంగానూ భావిస్తారు. అరమరికలు లేకుండా కేరింతలు కొడుతూ, కబుర్లు చెప్పుకుంటూ ఆవిరి స్నానాలు ఆస్వాదిస్తారు.

పరిపూర్ణ దేశం -కెనడా
సంతోషంగా ఉన్నంత మాత్రాన సమస్యలు తీరిపోవు. అది సగం బలం మాత్రమే! సంపద ఉన్నంత మాత్రానా జీవితం తృప్తిగా ఉన్నట్టు కాదు. డబ్బు బతుకు ప్రయాణంలో తోడుండే ఓ సాధనమే. జీవితం సంపూర్ణంగా ఉండటానికి సంపద, సంతోషాలతోపాటు మరెన్నో విషయాలు కలిసి ఉండాలి. అలాంటి దేశం ఏదైనా ఉంటుందా అనే విశ్లేషణలూ జరిగాయి. అలాంటి ఓ నివేదికలో కెనడాను యావత్‌ ప్రపంచంలోనే ‘అత్యుత్తమ దేశం’గా పేర్కొన్నారు. ‘యూఎస్‌ న్యూస్‌’ అనే వార్తాసంస్థ ఎన్నో ప్రమాణాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. జీవించడంలోని నాణ్యత, సామాజిక జీవనం, సంస్కృతి, వ్యాపార సౌలభ్యం, తిరుగాడే స్వేచ్ఛ… ఇలాంటి ఎన్నో విభాగాలలో ర్యాంకింగ్‌లను ఇస్తూ, మొత్తమ్మీద కెనడాను ‘పరిపూర్ణతకు దగ్గరగా ఉన్న దేశం’గా నిపుణులు తేల్చారు. ఈ జాబితాలో జపాన్‌, జర్మనీ రెండు, మూడు స్థానాలను అందుకున్నాయి. ‘విదేశీ వ్యవహారాల దగ్గరనుంచి పర్యాటకం వరకూ… ఒక దేశాన్ని భిన్నరంగాలలో పరిశీలించి తన సత్తాను అంచనా వేయాల్సి ఉంటుంది. ప్రపంచం వేగంగా మారుతున్న కొద్దీ, ఈ ప్రమాణాలలోనూ మార్పులు వస్తుంటాయి. వాటి ఆధారంగానే మేం ఈ జాబితాను రూపొందిస్తాం’ అంటున్నారు యూఎస్‌ న్యూస్‌ ఎడిటర్‌ కిమ్‌ కేస్ట్రో.

పదుగురు మెచ్చిన..10 ఉత్తమ దేశాలు!

ఉపాధి హామీ -ఖతార్‌
సమాజం ఇప్పుడేం వస్తుమార్పిడి రోజుల్లో లేదు. పూట గడవాలంటే కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు ఎంతో కొంత సంపాదించాల్సిందే. చిన్నదో పెద్దదో ఓ ఉద్యోగం ఉండటం భవితకు భద్రతలాంటిది. అందుకే, చాలా పరిశోధనలు ఉద్యోగం లేని జీవితాలు దుర్భరంగా గడుస్తాయని హెచ్చరించాయి. నిరుద్యోగులకు ఆరోగ్యం ఖరాబై పోతుందనీ, గుండెజబ్బులు లాంటి సమస్యలు తలెత్తుతాయనీ, అనూహ్యమైన వేదనను వారు అనుభవిస్తారనీ చెబుతున్నాయి. ఇలాంటప్పుడు, ‘అతి ఎక్కువ ఉపాధి ఏ దేశంలో ఉంటుంది?’ అనే అనుమానం రాక మానదు. ‘సీఐఏ ఫ్యాక్ట్‌బుక్‌’ ప్రకారం 24 ఏండ్లు వచ్చేసరికి అత్యల్ప నిరుద్యోగం ఉన్న దేశం ఖతార్‌!‘సీఐఏ’ పేరు వినగానే అది అమెరికా దేశానికి చెందిన గూఢచర్య సంస్థ అని చాలామందికి గురొస్తుంది. ప్రతి దేశానికి సంబంధించిన సంపూర్ణ సమాచారంతో ఈ సంస్థ ఎప్పటికప్పుడు ‘సీఐఏ ఫ్యాక్ట్‌బుక్‌’ను వెలువరిస్తుంటుంది. అందులో పేర్కొన్న గణాంకాల ప్రకారం ఖతార్‌లో నిరుద్యోగం కేవలం 0.4 శాతం మాత్రమే! కారణం స్పష్టమే.

పదుగురు మెచ్చిన..10 ఉత్తమ దేశాలు!

1940లో కనుగొన్న ఇంధన నిక్షేపాలు ఆ దేశాన్ని బంగారుబాట పట్టించాయి. ఇంధన పరిశ్రమ అక్కడి పౌరులకే కాదు, ఇతర దేశాల ప్రజలకూ విస్తృత ప్రాతిపదికన ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంది. ఓ సందర్భంలో వెల్లువెత్తున్న ధనరాశులను ఏం చేసుకోవాలో తెలియక, అమెరికా లాంటి దేశాల్లో పెట్టుబడులు మొదలుపెట్టింది ఆ దేశం. తలసరి ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి వంటి విభాగాల్లోనూ తరచూ ఖతార్‌ తొలి స్థానంలో నిలుస్తున్నది.నిరుద్యోగానికి సంబంధించి మరో ఆసక్తికరమైన గణాంకం ఏమిటంటే, కొన్ని జాబితాల్లో కంబోడియాలో తక్కువ నిరుద్యోగం ఉన్నట్టు కనబడుతుంది. అందుకు కారణం, అక్కడి సంపద కాదు. కంబోడియాలో చాలామంది కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు, వ్యవసాయం లాంటి పనులలో ఉపాధి పొందుతున్నారు. దీనివల్ల అందరికీ పని ఉన్నట్టు కనిపిస్తున్నా, వారి జీవన ప్రమాణాలు మాత్రం ఏమంత ఘనంగా ఉన్నాయని భావించలేం.

తల‘సిరి’ ఆదాయం -లగ్జంబర్గ్‌
ఓ ధనిక దేశంలో పుట్టాలని ఎవరికి మాత్రం ఉండదు. జీవితంలో స్థిరపడేంత జీతం రావాలని ఎవరు కోరుకోరు. అలాంటి కలలకు నెలవు లగ్జంబర్గ్‌. యూరప్‌లోని అతిచిన్న దేశాలలో ఇదొకటి. జనాభాకూడా తక్కువే. కానీ, చాలా కారణాలవల్ల లగ్జంబర్గ్‌ లగ్జరీకి నిలయంగా మారింది. ప్రపంచంలోనే ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశాలలో తరచూ నిలుస్తూ ఉంటుంది. లగ్జంబర్గ్‌ ఒకప్పుడు వలసపాలనకూ, పీడనకూ గురైన ప్రాంతం. అక్కడ అపారమైన ఉక్కు నిల్వలున్నాయి. వాటిమీద ఆధిపత్యం కోసం శక్తిమంతమైన దేశాలన్నీ తపించిపోయేవి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయి, తనకంటూ ఓ అస్తిత్వం ఏర్పడిన తర్వాత, ఆ ఉక్కుగనులే ఆర్థిక స్థిరత్వాన్ని అందించాయి. భారతీయుడైన లక్ష్మీమిట్టల్‌ను తిరుగులేని కుబేరుడిగా మార్చిన ‘ఆర్సెలార్‌ మిట్టల్‌’ అక్కడి కంపెనీనే! లగ్జంబర్గ్‌ తిరుగులేని తలసరి ఆదాయానికి కారణం ఉక్కురంగం మాత్రమే కాదు. 1960ల తర్వాత అక్కడి ప్రభుత్వం బ్యాంకింగ్‌, బీమా వంటి సేవారంగాలను ప్రోత్సహించింది.

పదుగురు మెచ్చిన..10 ఉత్తమ దేశాలు!

యూరప్‌ నడిబొడ్డున ఉండటమూ కలిసొచ్చింది. యూరప్‌ వాసులంతా పెట్టుబడులు పెట్టడానికి, డబ్బు దాచుకోవడానికి లగ్జంబర్గ్‌ను ఎంచుకోసాగారు. ఈ ఎదుగుదలను గమనించిన ప్రభుత్వం దేశంలోకి వెల్లువెత్తుతున్న డిపాజిట్ల మూలాల గురించి ఆరా తీయడం మానేసింది. దాంతో నల్లడబ్బును పోగేసుకోవడానికి స్విట్జర్లాండ్‌కు ప్రత్యామ్నాయంగా మారిపోయింది లగ్జంబర్గ్‌. ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్‌ కూడా తన ఆస్తులను ఇక్కడే దాచుకున్నట్టు వినికిడి.
పన్నులకు సంబంధించిన చట్టాలుకూడా లగ్జంబర్గ్‌లో చాలా ఉదారంగా ఉంటాయి.

దాంతో మోన్‌శాంటో, గుడ్‌ఇయర్‌ లాంటి సంస్థలు విపరీతంగా ఎదిగాయి. పన్నుల విషయంలో లగ్జంబర్గ్‌ ఉదారతను గమనించిన స్కైప్‌, అమెజాన్‌ లాంటి సంస్థలుకూడా యూరప్‌లోని తమ ముఖ్యకార్యాలయాలను లగ్జంబర్గ్‌కు తరలించాయి. 1999లో యూరప్‌లోని 19 దేశాలు కలిసి యూరోజోన్‌ అనే ఆర్థిక మండలిని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సభ్యదేశాలమధ్య ఏర్పడిన ఒప్పందాలూ లగ్జంబర్గ్‌ ఎదుగుదలకు కారణమయ్యాయి. తక్కువ జనాభా, ఎక్కువ సంస్థలు, అభివృద్ధి చెందిన దేశాలతో జట్టు.. వెరసి అక్కడి ప్రజల తలసరి ఆదాయాన్ని బాగా పెంచాయి. ఈ స్థాయికోసం చట్టాలను బలహీన పర్చుకోవడం మాత్రం ఆలోచించాల్సిన విషయమే! ఇంతకీ లగ్జంబర్గ్‌ పౌరుల తలసరి ఆదాయం ఎంతనుకున్నారు, దాదాపు 90 లక్షలు!

చదువుల తండ్రి -క్యూబా
చదువు అంటే పెట్టుబడి. ఉపాధికి, భవిష్యత్తుకు, యుక్తాయుక్త విచక్షణకు మూలధనం. అందుకే, కొన్ని దేశాలు చదువుకి ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. అలాంటి ఓ జాబితాను రూపొందిస్తే, క్యూబా ముందంజలో ఉంటుంది. ఆ దేశం తన స్థూల జాతీయోత్పత్తిలో ఏకంగా 12 శాతం చదువు కోసం వెచ్చిస్తుంది. పదేండ్ల క్రితమే 100 శాతం అక్షరాస్యతను సాధించగలిగిందీ దేశం. 1959లో ఫిడెల్‌ క్యాస్ట్రో ఆ దేశ పగ్గాలు చేపట్టగానే, విద్యను జాతీయం చేశారు. ఇప్పటికీ అక్కడ విద్య ఉచితమే. అలాగని ఏదో తూతూమంత్రంగా అమలు కాదు. ‘క్యూబా విద్యా ప్రమాణాలు చాలా అత్యున్నతంగా ఉంటాయని’ యునెస్కో లాంటి సంస్థలే కితాబునిచ్చాయి.

పదుగురు మెచ్చిన..10 ఉత్తమ దేశాలు!

ఎన్నెన్నో అందాలు -స్విట్జర్లాండ్‌

స్విట్జర్లాండ్‌ – సరస్సులు, జలపాతాలు, మంచుకొండలు, పశుసంపద… అన్నింటితో నిండుగా కనిపించే ఈ ప్రాంతం అందమైన దేశాల జాబితాలో పలకరిస్తుంది. దేశంలో 60 శాతానికి పైగా కనిపించే పర్వతప్రాంతాలు మనసును మార్మికలోకాలకు పరుగులు తీయిస్తాయి. వీటికి తోడు జూరిచ్‌, జెనీవా లాంటి పట్టణాలు పకృతి ఒడిలో ఎదుగుతున్న నాగరికతను అందంగా చూపిస్తాయి. స్విట్జర్లాండ్‌లో వాతావరణం కూడా అనూహ్యంగా ఉంటుంది. సూరీడు చురుక్కుమనిపించేంతలోనే, చిరుజల్లులు తడిపేస్తాయి. చలికి వణుకుతూ బయల్దేరుతుండగానే, వెచ్చదనం ఆదుకుంటుంది. ఈ అందాలకు తోడు అరుదైన స్విస్‌ సంస్కృతి, వైవిధ్యమైన జీవన విధానం… స్వర్గం ఇలాగే ఉంటుంది కాబోలు అనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి.

పదుగురు మెచ్చిన..10 ఉత్తమ దేశాలు!

జై భారత్‌ -ఇండియా
భారతావనిలో ధనరాశులు పొంగి పొర్లక పోవచ్చు. ఆయుఃప్రమాణాలు ఆకాశాన్ని తాకక పోవచ్చు. కానీ, మరే దేశానికీ తీసిపోని అందచందాలు, ఆహారం, సంస్కృతి మన ప్రజల సొంతం. మామిడిపండ్ల నుంచి మసాలా దినుసుల వరకూ మన దిగుబడే లోకంలో అత్యధికం. పాడి పరిశ్రమలో అయినా, సాగు భూములలో అయినా మనదే అగ్రతాంబూలం. అత్యధిక చిత్రాలు, అతిపెద్ద ఎన్నికలు జాతర్లు మన దగ్గరే జరుగుతాయి. ఎక్కువ పోస్టాఫీసులు, ఫోన్లు, వైద్యవిద్యార్థులు కలిగిన దేశంగా మనకూ రికార్డు ఉంది. అంతరిక్షం నుంచి అణువిద్యుత్తు వరకు అన్నింటా మనదైన సాధనా సంపత్తిని మెల్లమెల్లగా పుణికి పుచ్చుకుంటున్నాం.

పదుగురు మెచ్చిన..10 ఉత్తమ దేశాలు!

చూడచూడ రుచుల.. -ఇటలీ
తెలుగువారి రుచులకి సాటి వచ్చే ఆహారం ఈ ప్రపంచంలో మరేదీ లేదన్నది బలమైన నమ్మకం. ఇక్కడి వంటకాలను రుచి చూశాక, ఈ మాటను ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. పాశ్చాత్యదేశాల విషయానికొస్తే మాత్రం ఇటాలియన్‌ ఆహారానికి ఎనలేని ఆకర్షణ కనిపిస్తుంది. పిజ్జానుంచి పాస్తావరకు మనకూ తెలిసిన ఇటాలియన్‌ వంటకాలు ఎన్నో. ఇటలీలో విస్తృతమైన వంటకాలు లభ్యం కావడానికి ఆశ్చర్యకరమైన కారణాలు చెబుతారు. రోమన్‌ సామ్రాజ్యకాలంలో వేర్వేరు దేశాలనుంచి వచ్చిన ప్రజలు తమతోపాటుగా సరికొత్త వంటకాలనూ పరిచయం చేశారట. మార్కోపోలో లాంటి యాత్రికులు తిరిగి వచ్చేటప్పుడూ కొన్ని వంటకాలను తీసుకొచ్చారు. ఇక్కడి కార్మికులూ, నిరుపేదలూ… ఆకలి నింపుకోవడానికి పిండి, పంచదారలతో చేసే పదార్థాలు వండుకునేవారు. అవి ఎక్కువ రోజులు నిలువ ఉండటమే కాకుండా, తిన్న వెంటనే సత్తువను అందించేవి. అవే నేటి తరానికి ‘జంక్‌ఫుడ్‌’గా మారతాయని వాళ్లు ఊహించి ఉండరు. పేదరికంతో చవకగా దొరికే టమాటా, బంగాళదుంపలు లాంటి కూరగాయలతోపాటు తేలిగ్గా దొరికే ఆహారంతో వైవిధ్యమైన పదార్థాలను తయారు చేసుకోవాలన్న తపనే, మరిన్ని వంటకాల ఆవిష్కరణకు దారి తీసింది. వెరసి, ‘ఇటలీ వంటకాలు’ అంటేనే నోరూరే స్థాయికి ఆ ఘనత చేరుకొంది.

పదుగురు మెచ్చిన..10 ఉత్తమ దేశాలు!
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పదుగురు మెచ్చిన..10 ఉత్తమ దేశాలు!

ట్రెండింగ్‌

Advertisement