e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home బతుకమ్మ ముద్దు రామకృష్ణయ్యఇంగ్లాండు యాత్ర

ముద్దు రామకృష్ణయ్యఇంగ్లాండు యాత్ర

ముద్దు రామకృష్ణయ్యఇంగ్లాండు యాత్ర

ఒక పేదవాడు, చేస్తున్న బడిపంతులు ఉద్యోగానికి సెలవు పెట్టి పై చదువులకోసం అంటూ మంకుపట్టుతో ఇంగ్లాండుకు వెళ్లడం నమ్మశక్యం కాని విషయం. అదీ 1945 లో! రెండో ప్రపంచ యుద్దానికి చివరి రోజులవి. ఇంగ్లాండుపై జర్మనీ బాంబులు కురిపిస్తున్న కాలం. ఈ దాడులకు ఇంగ్లాండుకు బయల్దేరిన పడవలు నడమనే నీట మునుగుతున్నాయి.‘అయినా వెళ్లి రావాలె ఇంగ్లాండుకు’అన్న చందంలో ముద్దు రామకృష్ణయ్య పట్టిన పట్టు విడువలేదు. తన కలను నిజం
చేసుకున్నాడు. ఆయన జీవితమంతా ఓ స్ఫూర్తిదాయక గాథ. మరుగున పడిన ఓ
తెలంగాణ బిడ్డ అక్షరయాత్ర ఇది.రామకృష్ణయ్య పాత కరీంనగర్‌ జిల్లా మంథని వాసి. ఆయన తండ్రి రాజన్న ఊర్లో నానా వ్యాపారాలు చేసి నిండా మునిగి వంటవాడిగా నాగపూర్‌ వెళ్ళిపోయాడు. రాబడి అప్పులకే సరి. ఇంటికి పెద్ద కొడుకైన ముద్దు రామకృష్ణయ్య బాగా చదివి కుటుంబాన్ని ఉద్ధరిద్దామని పదమూడేండ్ల వయసులో వరంగల్‌ వెళ్ళాడు.

ఇండ్లకు బిందెల్లో నీటిని మోస్తూ చదువుకొన్నాడు. చేరదీసిన వారి పిల్లలకు ట్యూషన్లు చెప్పాడు. పట్టుబట్టి పట్టు సాధించుకున్న ఇంగ్లిష్‌, ఆయనకు ట్యూషన్ల రూపంలో అన్నం పెట్టింది. అలా హైదరాబాద్‌లో బీఏ పూర్తయింది. ఎల్‌ఎల్‌బీలో చేరినా ఆర్థిక ఇబ్బందులకు ఎదురీద లేక మధ్యలోనే వదిలేశాడు. గుల్బర్గాకు పోయి బట్టల మిల్లులో కార్మికుడిగా చేరాడు. అప్పటి కాయన వయసు 26 ఏండ్లు. పదహారో ఏటనే పెండ్లయింది, ఒక కూతురుకూడా ఉంది. ఆ తర్వాత ఆదిలాబాద్‌ సరిహద్దు చించోలి గ్రామంలోని పాఠశాలలో, జులై 1933లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు. జూన్‌ 1936లో కర్ణాటకలోని కోహిర్‌కు బదిలీ అయింది. 1944లో ప్రమోషన్‌పై లాతూర్‌లో హైస్కూల్‌ టీచర్‌ అయ్యారు. అంతవరకూ అంతా బాగానే ఉంది. కానీ, అనూహ్యంగా భార్యకు మతి స్థిమితం తప్పింది.

ఎక్కడి ధైర్యమోగానీ, రామకృష్ణయ్య 13వ ఏట మంథని వదిలేటప్పుడే ఎట్టి పరిస్థితిలోనైనా ఇంగ్లాండు వెళ్లి చదువుకోవాలని నిశ్చయించుకొన్నాడు. ఈ పరిస్థితుల్లో తనంతటి వాడికి అది సాధ్యమా అన్న సంశయానికి చోటివ్వలేదు. వయసు పెరిగేకొద్దీ ఆ ఆకాంక్ష వెంటాడుతూనే ఉంది. 37వ యేట 1944లో అది తీవ్రమైంది. నిజాం రాజ్యంలో రాజ బంధువులకు తప్ప అన్యులకు పాస్‌పోర్ట్‌ దొరుకుడే గగనం. మరో దిక్కు రెండో ప్రపంచయుద్ధం. పాస్‌పోర్‌ల జారీయే తగ్గిపోయింది. పైగా ప్రయాణానికి పైకం కావాలి, తాను తిరిగి వచ్చేదాకా భార్యను, బిడ్డను చేరదీసే దయామయులు కావాలి. ఇవన్నీ ఆలోచిస్తూ కూచుంటే ఒక్క అడుగుకూడా పడదు. మొండిగా పాస్‌పోర్ట్‌ ప్రయత్నం షురూ చేశాడు. తనకు తెలిసిన అబ్దుల్‌ హమీద్‌ అనే డిప్యూటీ కలెక్టర్‌కు పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దానిని ఆయన నిజాం సర్కారుకు పంపించాడు.

కొన్నాళ్ళు ఎదురు చూసి, తానే హైదరాబాద్‌లోని పాస్‌పోర్ట్‌ సెక్షన్‌కు వెళ్ళాడు. ‘ఇది ఉరుకులాడితే అయ్యే పని కాదు, కనీసం ఏడాది పడుతుంది. పైగా యుద్ధకాలం. ఇంగ్లాండు పోవుడు మరిచిపోయి లాతూరు వెళ్లిపొమ్మని’ సలహా ఇచ్చారు. అప్పటికే రామకృష్ణయ్య ‘థామస్‌ కుక్‌’ అనే కంపెనీకి సెప్టెంబర్‌లో పడవ ప్రయాణానికి రూ.1,200 చెల్లించి బెర్తు రిజర్వు చేసుకున్నాడు. ఈ విషయం చెప్పి, పాస్‌పోర్ట్‌ మంజూరు చేయమంటూ బ్రిటిష్‌ రెసిడెన్సీకి లేఖ పోయింది. చూసి చూసి రామకృష్ణయ్య రెసిడెన్సీ దగ్గరికెళ్ళాడు. ‘ఈ యుద్ధకాలంలో అసలు యూనివర్సిటీలు నడుస్తున్నాయో లేదో, ఏ యూనివర్సిటీలో నీకు అడ్మిషన్‌ దొరికిందో రుజువులతోసహా కావాల’న్నారు వారు. ఇంగ్లాండుకు టెలిగ్రామ్‌ చేయడానికి చేతిలో డబ్బుల్లేవు. మిత్రుడు మీర్‌ రజా అలీ రూ.15 ఇస్తే, రిప్లై టెలిగ్రామ్‌ వెళ్ళింది. మూడు రోజులకు ఎడిన్‌ బరో యూనివర్సిటీ నుంచి అడ్మిషన్‌ ఇస్తున్నట్లు జవాబు వచ్చింది. దాంతో పాస్‌పోర్ట్‌ చేతిలో పడింది.

ఇంతలో ‘థామస్‌ కుక్‌’ నుండి సెప్టెంబర్‌ 22 నాటికీ బొంబాయిలో ఉండాలని కబురు. ఇంకా వారం రోజుల సమయముంది. డబ్బులు కావాలి. విద్యాశాఖనుండి సెలవు మంజూరు కావాలి. లాతూరు వెళ్లి డిప్యూటీ కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ వద్దకెళ్లి మీరే రక్షించాలని చేతులు జోడించాడు. ‘నీవు లీవు పని చూసుకో, నేను డబ్బులు సర్దుతానని’ ఆయన అభయమిచ్చాడు.

ఆ రోజుల్లో పై చదువులకు వెళ్లేవారికి సగం జీతంతో మూడేండ్ల సెలవు దొరికేది. తిరిగి వచ్చాక పది సంవత్సరాలు పని చేస్తానని బాండ్‌ పేపర్‌పై రాసి, ఇద్దరు ఉద్యోగుల ష్యురిటీ ఇవ్వాలి. అన్నీ పూర్తి చేసి పై అధికారులకు పంపించాడు. కొన్ని రోజులకు సెలవు మంజూరు కానట్లు తెలిసింది. అనుమతి కోసం అప్లికేషన్‌ ప్రభుత్వానికి పంపాలి. మంజూరుకు ఆరు నెలలు పడుతుందని సెలవిచ్చారు. రామకృష్ణయ్యకు వరంగల్‌లో పరిచయమైన జుల్ఫీకర్‌ అలీ హుక్కాని చొరవతో చివరకు సెలవు దొరికింది. పాస్‌పోర్ట్‌, ఖర్చుకు డబ్బులు, సెలవు చేతిలో ఉన్నాయి. ఇక కుటుంబ భారం ఎవరు మోయాలనేది సమస్య. భార్యను తీసుకొని అత్తవారింటికి వెళ్ళాడు. మీ బిడ్డ భారం మీరే తీసుకోవాలని కోరాడు. తాను ఎటు వెళుతున్నది భార్యకు తెలియదు, చెప్పినా అర్థం కాదు. చెల్లెలి చేతిలో కూతురిని పెట్టాడు. తండ్రి దగ్గర సెలవు అడిగితే, ‘తిరిగి రావాలి బిడ్డా’ అని దీవించాడు.

బొంబాయి తీరం నుండి పడవ కదిలింది. యుద్ధ విమానాల, సబ్‌ మెరైన్ల పర్యవేక్షణలో ప్రయాణం సాగింది. గ్లాస్కో రేవులో పడవ దిగి రైలులో ఎడిన్‌ బరో చేరుకున్నాడు. రావడం ఆలస్యమైందని, అడ్మిషన్లు ముగిశాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ అన్నాడు. వీలయితే లీడ్స్‌లో ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. లీడ్స్‌లో రామకృష్ణయ్యకు ఎం.ఎడ్‌లో అడ్మిషన్‌ దొరికింది. 20 పౌండ్లు ఫీజు కట్టమన్నారు. ఊహించని రీతిలో ఎడిన్‌ బరో నుండి లీడ్స్‌కు రావడం వల్ల ఖర్చు లెక్క తప్పింది. తన దగ్గర 16 పౌండ్లే ఉన్నాయి. 10 పౌండ్లు కట్టి బతిమిలాడితే, వారం రోజుల గడువు ఇచ్చారు. ఇంగ్లాండుకు తనతో పడవలో వచ్చిన సురేష్‌ ఆస్తానాకు డబ్బు సర్దమని లేఖ రాశాడు. వారం గడువు ముగియడాని కొచ్చింది. సాయంత్రం నాలుగవుతున్నది. ఇంకో గంట దాటితే ఆశలు గల్లంతే. అప్పుడే ఇంటి యజమానురాలు ఇదిగో నీకు కవర్‌ వచ్చింది అని ఇచ్చింది.

అందులో సురేష్‌ ఆస్తానా పంపిన పది పౌండ్ల పోస్టల్‌ ఆర్డర్‌ ఉంది. దాంతో లీడ్స్‌ యూనివర్సిటీలో అడ్మిషన్‌ నిలిచింది. ఇక, దినవారీ ఖర్చులకోసం అన్ని పనులూ చేశాడు. ఉదయం తొమ్మిదినుండి మధ్యాహ్నం దాక చదువు, 2 నుండి 10 దాక రైల్వేస్టేషన్లో హమాలీ పని. బాగానే ఉంది కానీ, రెండు వారాల తర్వాత తీసేశారు. నెల రోజులపాటు ఓ ఆఫీస్‌లో పని దొరికింది. ఆ తర్వాత జేబులు ఖాళీ కావడంతో పస్తులుండే కాలం వచ్చింది. యూనివర్సిటీ అనుమతితో పనికోసం లండన్‌కు మారాడు. హోటల్‌లో సర్వర్‌గా పని దొరికింది. పొట్టకు, నీడకు డోకా లేకుండా అయింది. హోటల్‌ యజమాని సాయంతో బీబీసీ అధికారి పరిచయం దొరికింది. దాంతో, రామకృష్ణయ్యకు ‘బ్రిటిష్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌’లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉద్యోగం లభించింది.

నెలకు 500 పౌండ్ల జీతం. కష్టాలు తీరాయి. ఇంటికి కావలసినంత పంపాడు. సురేష్‌ ఆస్తానాకు ధన్యవాదాలు తెలుపుతూ డబ్బు పంపాడు. 1946 జులై నాటికీ ఎం.ఎడ్‌తోపాటు పీహెచ్‌డీ కూడా పూర్తయింది. వచ్చిన రెండేండ్లలోనే ఇంగ్లాండుకు వచ్చిన పని పూర్తయింది. బీబీసీలో మంచి ఉద్యోగం, చేతిలో ఉన్నత విద్య పట్టాలు, భార్యాపిల్లలను రప్పించుకొని హాయిగా ఇంగ్లాండులో స్థిరపడి పొమ్మని అందరూ ఒత్తిడి చేశారు. కానీ, ‘నేను చదువుకోవడానికే వచ్చాను, నా జ్ఞానమంతా నా దేశానికే చెందుతుంది’ అని సెప్టెంబర్‌ 1946లో ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ఆశగా భార్య వద్దకు వెళ్ళాడు. ఆమె పరిస్థితిలో ఏ మార్పూ లేదు. దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. ‘నీవు కోరినట్లు తిరిగి వచ్చానని’ తండ్రి ఫోటోకు దండం పెట్టాడు.

తొలుత రెండేండ్లపాటు విజయవాడ రేడియో కేంద్రంలో పనిచేశాడు రామకృష్ణయ్య. కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాదులో పనిచేసి.. చివరగా ఏడేండ్ల పాటు జగిత్యాలలో మల్టీపర్పస్‌ హై స్కూల్‌లో హెడ్‌ మాస్టర్‌గా చేసి, అక్కడే 1965లో రిటైర్‌ అయ్యారు. తన హయాంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టి వేలాది విద్యార్థుల గుండెల్లో నిలిచిపోయిన ముద్దు రామకృష్ణయ్య 78వ ఏట, 1985 అక్టోబర్‌ 21న మరణించారు. ఆ కార్య సాధకుడిని స్మరించుకోవడం మనందరి బాధ్యత.

ఇంత స్ఫూర్తిదాయకమైన జీవితం రావలసినంతగా వెలుగులోకి రాలేదు. చుట్టూరా కష్టాలే ఉన్న ఒక అతిసామాన్యుడు ఇంగ్లాండులో గెలిచి, అక్కడే ఉండిపోక తిరిగి వచ్చి ఉపాధ్యాయుడిగా సేవలందించాడు. అక్కడే ఉండిపోతే అందరిలో ఒకడయ్యేవాడు. ఇప్పుడు వేలాది విద్యార్థుల గుండెల్లో నిలిచిపోయాడు. ఈ మధ్య గురుదక్షిణగా ఆయన శిష్యులు శేషం నరసింహాచారి, సూరజ్‌ శంకర్‌ ముద్దు రామకృష్ణయ్య జీవిత విశేషాలతో ‘మార్గదర్శి’ అనే పుస్తకం వేశారు. దాన్ని ఉచితంగానే పంచుతున్నారు. ఆసక్తి ఉన్నవారు 9573610777 కు ఫోన్‌ చేసి, ఎం.ఆర్‌.కె.మెమోరియల్‌ సేవా సదన్‌ ద్వారా అందుకోవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముద్దు రామకృష్ణయ్యఇంగ్లాండు యాత్ర

ట్రెండింగ్‌

Advertisement