e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home బతుకమ్మ దాహాలయాలు.. మెట్ల బావులు

దాహాలయాలు.. మెట్ల బావులు

దాహాలయాలు.. మెట్ల బావులు

చారిత్రక కట్టడాల్లో ఆలయాల తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన నిర్మాణాలు మెట్ల బావులు. నాటికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడంతోపాటు పంటలకు సాగు నీరందించే పుణ్యతీర్థాలుగా వెలుగొందాయి. వీటి ప్రస్తావన రాగానే రాజస్థాన్‌, గుజరాత్‌లాంటి ఉత్తరాది ప్రాంతాలే గుర్తుకొస్తాయి.వాటికి ఏ మాత్రం తీసిపోని శిల్పకళతో, నిర్మాణ కౌశలంతో అలరారుతున్న మెట్ల బావులు మన దగ్గరా ఉన్నాయి. వందల ఏండ్లు గడుస్తున్నా, ఇప్పటికీ చెక్కు చెదరకుండా నాటి నిర్మాణ వైభవాన్ని చాటుతున్నాయి.

తెలంగాణలో చారిత్రక మెట్ల బావులు వందలకొద్దీ ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలోని పురాతన దిగుడు బావి వాటిలో ఒకటి. కామారెడ్డి- ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారికి ఎడమవైపున ఉన్న హనుమాన్‌ దేవాలయ సమీపంలో ఈ బావి ఉంది. దగ్గరికి వెళ్లి చూస్తే తప్ప, ఇక్కడ మెట్ల బావి ఉన్న సంగతి తెలియదు. ఎందుకంటే, నేటమట్టం నుంచి కిందకు 20 మీటర్ల లోతులో బావిని నిర్మించారు. లోపలకు దిగడానికి వీలుగా నలువైపులా మెట్లు ఉన్నాయి. ప్రధాన మార్గాన్ని మాత్రం పడమర దిశలో ఏర్పాటుచేశారు. ఉపరితలం నుంచి 20 అడుగులకు ఒక అంతస్తు చొప్పున మొత్తం ఐదు అంతస్తుల (దాదాపు 100 అడుగుల) లోతులో ఈ బావి ఉంటుంది. గ్రానైట్‌ రాయితో అందంగా తీర్చిదిద్దారు. సునాయాసంగా వెళ్లి, నీళ్లు తెచ్చుకునేలా డిజైన్‌ చేసిన ఈ మెట్ల నిర్మాణం నాటి ఇంజినీరింగ్‌ పరిజ్ఞానానికి ప్రతీక.

నిర్మాణ శైలి
లింగంపేట మెట్లబావి అద్భుతమైన నిర్మాణ కౌశలంతో అలరారుతున్నది. బావి ఉపరితలం నుండి రెండు మీటర్ల కిందివరకూ రాతి కట్టడంతో నిర్మితమైంది. అక్కడ నడవడానికి వీలుగా కొంత ఖాళీస్థలాన్ని వదిలి, దాని కిందివైపున నలుదిశల్లో చేపట్టిన మెట్ల నిర్మాణం (మొత్తం ఐదు అంతస్తుల్లో) అబ్బుర పరుస్తున్నది. రెండో అంతస్తు పైభాగంలో గదులు
(ఆర్చులు) నిర్మించారు. బావికి పైభాగంలో నలువైపులా డంగు సున్నంతో గచ్చు వేయించారు. దానిమీద శిల్పాలను చెక్కించారు. వైష్ణవానికి ప్రతీకలైన శంఖుచక్రాలు, మధ్యలో పుష్పాలు, కొన్నిచోట్ల ఏనుగుసంహార దృశ్యాలు, మరోచోట పులి జింకను వేటాడే ఘట్టం, మరికొన్న చోట్ల నాట్యగత్తెల శిల్పాలు, అక్కడక్కడా లతలు, మయూరాలు.. ఇలా బావికి నలువైపులా సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి. బావి పై భాగంలో చిన్నచిన్న కంకర రాళ్లు, డంగు సున్నం మిశ్రమంతో పైకప్పు (స్లాబ్‌ లాగా) వేశారు. తూర్పుభాగంలో బావిలోని నీటిని పైకి లాగడానికి మోటబావి లాంటి నిర్మాణమున్నది. ఇక్కడినుంచి నీటిని కాలువద్వారా తరలించి పంటలకు చేరేలా ఏర్పాట్లున్నాయి. ఒక జలాశయం మనుషులతో సహా అనేక జీవరాశికి ప్రాణం.

దాహాలయాలు.. మెట్ల బావులు

నాగన్న బావిగా..
18వ శతాబ్దంలో నిజాం పాలనా కాలంలో పాపన్నపేట సంస్థానాధీశుల ఆదేశాల మేరకు లింగంపేట జక్సానీ నాగయ్య ఈ బావిని తవ్వించినట్లు స్థానికులు చెబుతున్నారు. అందుకే ఈ మెట్లబావిని ‘నాగన్న బావి’గా వ్యవహరిస్తున్నారు. ‘ఏనుగుల బావి’ అనే పేరుకూడా ఉన్నది. అత్యంత పటిష్టంగా, అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో చేపట్టిన ఈ బావి నిర్మాణాన్ని మూడేండ్లలో పూర్తి చేశారు. అయితే, ఈ బావి 18వ శతాబ్దానికి ముందే నిర్మితమై, నిజాం కాలంలో పునరుద్ధరణ జరిగినట్టు పురావస్తు నిపుణులు చెబుతున్నారు. వందల ఏండ్ల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఇలాంటి బావులను సంరక్షించి, మన ప్రాచీన వారసత్వ సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

-అరవింద్‌ ఆర్య ,7997 270 270

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దాహాలయాలు.. మెట్ల బావులు

ట్రెండింగ్‌

Advertisement