e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home బతుకమ్మ నవ్వుల థెరపీ..‘జాతిరత్నాలు’

నవ్వుల థెరపీ..‘జాతిరత్నాలు’

నవ్వుల థెరపీ..‘జాతిరత్నాలు’

అతణ్ని చూస్తే.. కాస్త సీరియస్‌గా, ఇంకాస్త సిగ్గరిగా కనిపిస్తాడు. కానీ, కలం కదిపితే అక్షరాల్లోనే నవ్వుల విస్ఫోటనాల్ని సృష్టిస్తాడు. వెండితెరను వినోదాల మైకంతో కమ్మేస్తాడు.‘జాతిరత్నాలు’తో థియేటర్లను ‘నవ్వుల డైనమైట్స్‌’తో పేల్చేసిన ఆ యువ దర్శకుడే.. తెలంగాణకు చెందిన అనుదీప్‌. తెలుగు చిత్రసీమకు దొరికిన నిజమైన ‘జాతిరత్నం’. ‘బతుకమ్మ’తో
ముచ్చటిస్తూ అతను చెప్పిన సంగతులు ఓసారి విందాం..

మెదక్‌ జిల్లాలోని నారాయణ్‌ఖేడ్‌ మా స్వస్థలం. పదో తరగతి వరకూ అక్కడే చదువుకున్నా. ఇంటర్మీడియెట్‌ సమయంలో మా కుటుంబం సంగారెడ్డికి షిప్ట్‌ అయింది. హైదరాబాద్‌లో డిగ్రీ చేశా. మా నాన్న విశ్వనాథ్‌, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. అమ్మ కాశీబాయి గృహిణి.

నిజమైన అంచనాలు..
‘జాతిరత్నాలు’ ఇంతటి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అస్సలు ఊహించలేదు. వినోదాన్ని ఇష్టపడే ఓ సెక్షన్‌ ఆడియన్స్‌కు మాత్రమే చేరువవుతుందని అనుకున్నాం. కానీ, సినిమా అద్భుతంగా ఉందని అన్ని వర్గాలూ ముక్తకంఠంతో ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. యువతరం మొదలుకొని ఫ్యామిలీ ఆడియన్స్‌ వరకు, అందరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా స్క్రిప్ట్‌ నుంచి మేకింగ్‌ వరకు మా టీమ్‌ అంతా ఓ జాయ్‌ఫుల్‌ మూడ్‌లో పనిచేశాం. కామెడీ సీన్స్‌ను అలవోకగా రాసుకున్నాం. ఎలాంటి లాజిక్‌లకు ఆస్కారం లేకుండా ప్రేక్షకుల్ని రెండున్నర గంటలు ఫుల్‌గా నవ్వించాలనే ఏకైక లక్ష్యంతో, ఈ సినిమాను తీర్చిదిద్దాం. సినిమా ఫలితం.. మా అంచనాల్ని నిజం చేసింది.

పక్కా తెలంగాణ..
తెలంగాణ మాండలికంలోని సంభాషణలన్నీ చాలా సహజంగా ఉన్నాయని ప్రశంసలొస్తున్నాయి. ఈ సినిమా డైలాగ్స్‌ కోసం ప్రత్యేకమైన వర్క్‌ ఏమీ చేయలేదు. నేను పుట్టి పెరిగిన సంగారెడ్డి, జోగిపేట ప్రాంతాలు.. అక్కడి నా మిత్రులతో గడిపిన సంఘటనల స్ఫూర్తితోనే సంభాషణలు రాసుకున్నా. ఊళ్లలో చాలామంది చిన్న చిన్న విషయాల మీద చర్చలు జరుపుతూ రోజంతా గడుపుతుంటారు. అలా మిత్రబృందాలు కలిసి చేసే టైమ్‌పాస్‌ నుంచే సరదా సంభాషణలు పుడతాయి. వాటినే నేను సినిమాలో వాడా. నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శిలకు స్వతహాగా తెలంగాణ యాసపై మంచి పట్టుంది. దాంతో నేను మామూలుగా చెప్పిన సంభాషణలను కూడా, వాళ్లు తెలంగాణ యాసలోకి మార్చి చెప్పేవారు.

రాంనగర్‌ డేస్‌..
తొలుత నేను రాంనగర్‌లో ఉంటూ సినిమా ప్రయత్నాలు చేసేవాణ్ని. అక్కడికి దగ్గరలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో థియేటర్లు ఎక్కువ కాబట్టి, వరుసగా సినిమాలు చూడొచ్చనే ఉద్దేశ్యంతో రాంనగర్‌ను ఎంచుకున్నా. ఆ రోజులన్నీ సినిమాలు, సరదాలతో ఆనందంగా గడిచిపోయాయి. అంతగా పరిచయం లేని వ్యక్తుల దగ్గర నేను ముభావంగా ఉంటాను. అదే క్లోజ్‌ఫ్రెండ్స్‌ మధ్యన ఉంటే ఫుల్‌జోష్‌లో కనిపిస్తాను. రాంనగర్‌ డేస్‌లో నా కంపెనీని మిత్రులందరూ బాగా ఎంజాయ్‌ చేసేవారు. ఆ తర్వాత సీరియస్‌గా సినిమా ప్రయత్నాలు చేస్తూ కృష్ణానగర్‌కు మారిపోయాను.

కథకు తగ్గ క్యాస్టింగ్‌
‘జాతిరత్నాలు’ స్క్రిప్ట్‌ను నాగ్‌ అశ్విన్‌తో కలిసి డెవలప్‌ చేశా. ఆ టైమ్‌లో ఆర్టిస్టులుగా ఎవరినీ అనుకోలేదు. స్క్రిప్ట్‌ ఫైనల్‌ ఔట్‌పుట్‌ చూసి, అందరం చాలా ఎక్సైట్‌ అయ్యాం. ఈ సినిమాను భారీ కాన్వాస్‌లోనే తీయాలని నాగ్‌ అశ్విన్‌ చెప్పారు. స్వప్నదత్‌, ప్రియాంకదత్‌ కూడా కథకు తగినట్లుగా మంచి క్యాస్టింగ్‌ కావాలనుకున్నారు. దాంతో నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రాజెక్ట్‌లోకి ఎంటరయ్యారు.

నవ్వుల థెరపీ..‘జాతిరత్నాలు’

ఇంటెన్సిటీ ఉంటేనే..
దర్శకుడిగా నేను ఏనాడూ ఒత్తిడికి గురికాలేదు. నా తొలి చిత్రం ‘పిట్టగోడ’ ఫ్లాప్‌ అయినా, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ‘జాతిరత్నాలు’ కోసం పని చేశా. ఎలాంటి కథనైనా బలమైన భావోద్వేగాలతో తెరపైన ఆవిష్కరించాలన్నది నా సిద్ధాంతం. వినోదాత్మక కథాంశమైతే పరిపూర్ణంగా నవ్వించగలగాలి. అదే ఒక ఎమోషనల్‌ లవ్‌స్టోరీ అయితే, ప్రతి ఒక్కరి హృదయాల్నీ స్పృశించాలి. యాక్షన్‌ సినిమా అయితే ఆద్యంతం రోమాంచితంగా సాగిపోవాలి.. ఇలా జోనర్‌ ఏదైనా అందులోని కంటెంట్‌ ప్రేక్షకుల్లో ఇంటెన్స్‌ ఫీలింగ్‌ను కలుగజేయాలని కోరుకుంటా. నా తదుపరి సినిమా కోసం మూడు కథల్ని సిద్ధం చేసుకున్నా. అందులో ఒకటి మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్‌టైనర్‌. మరొకటి లవ్‌స్టోరీ. మూడోది మిడిల్‌క్లాస్‌ పెండ్లిళ్ల నేపథ్యంలో సాగే ఫ్యామిలీ కథ. వీటిలో ఏది నా నెక్ట్స్‌ సినిమాగా వస్తుందో ఇంకా ఖరారు కాలేదు. సినిమా సెట్‌ అయిన తర్వాత ఆ వివరాల్ని వెల్లడిస్తా.

వయెలెన్స్‌ వద్దు..
నేను అన్ని జోనర్‌ కథల్ని ఇష్టపడతాను. కామెడీతో పాటు డ్రామాపైనా పట్టుంది. వినోదాత్మక కథతో ఎంతగా నవ్విస్తానో.. డ్రామా జోనర్‌లో ప్రేక్షకుల్ని అంతలా ఎమోషన్‌కు గురిచేయాలని తపిస్తా. అయితే హారర్‌, వయెలెన్స్‌ సినిమాల్ని మాత్రం ఇష్టపడను. ముఖ్యంగా దయ్యాలు, భూతాలు అని చూపించే హారర్‌ సినిమాలకు దూరంగా ఉంటా. ఈ రోజుల్లోనూ మాయలు, మంత్రాలంటూ ప్రజల్లో మూఢనమ్మకాల్ని పెంచొద్దన్నది నా అభిప్రాయం. చిన్నతనం నుంచి దర్శకుడు రాజ్‌కుమార్‌ సంతోషిని బాగా అభిమానించేవాడిని. ఆయన సినిమాలన్నీ చూశా. విభిన్న కథాంశాల్ని ఎంచుకుంటూ అద్భుతమైన సినిమాలు తీసే ఆయన శైలిని ఇష్టపడతా. చార్లీ చాప్లిన్‌, రాజ్‌కపూర్‌లను అభిమానిస్తా.

కామెడీ థెరపీ..
‘జాతిరత్నాలు’ సినిమా విషయంలో అనేక ప్రశంసలొచ్చాయి. వ్యక్తిగత జీవితంలోని విషాదాలు, బాధలతో సతమతమవుతున్న చాలామంది ఈ సినిమా చూసి రెండున్నర గంటల కామెడీ థెరపీ సెషన్‌కు వెళ్లొచ్చామని చెప్పడం బెస్ట్‌ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నా. కొందరైతే గత కొన్నేండ్లలో ఓ సినిమాను చూసి, ఇంత పగలబడి నవ్వలేదని చెబుతున్నారు.

అవే నా డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌ ..
పుస్తకాలు చదవడంతో పాటు డాక్యుమెంటరీలు ఎక్కువగా చూస్తా. నిజ జీవిత సంఘటనలు, నేను చూసిన సినిమాల స్ఫూర్తితో కథల్ని రాసుకుంటా. రంగనాయకమ్మ, ఓషో రచనల్ని బాగా చదువుతా. స్క్రిప్ట్‌ కుదిరితే భారీ తారాగణంతో సినిమాల్ని హ్యాండిల్‌ చేయగలననే నమ్మకముంది. ప్రస్తుతం ఓ మహిళ ప్రధాన పాత్రతో, స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో కథ రాస్తున్నా. అగ్రనాయికతో జాతీయస్థాయిలో ఆ సినిమాను తీయాలనే ప్లాన్‌ ఉంది. ఈ ప్రాజెక్ట్‌ ఏ మేరకు కార్యరూపం దాల్చుతుందో వేచిచూడాలి. దర్శకుడిగా నాకు కొన్ని డ్రీమ్స్‌ ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధకాలంలోని సంఘటనలు, హిట్లర్‌ దురాగతాలకు బలైన ప్రజల కష్టాల కథలు నన్ను బాగా కలచివేశాయి. ఆ నేపథ్యంలో వార్‌ సినిమా చేయాలనే సంకల్పం ఉంది. రెండు దేశాల మధ్య సంఘర్షణలో సాధారణ ప్రజల కష్టనష్టాలు ఎలా ఉంటాయో చూపించాలను కుంటున్నా.

-కళాధర్‌ రావు

ఇవీ కూడా చదవండి…

లోపలంతా పచ్చిదనం..పైనంతా పచ్చదనం

జబర్దస్త్‌ లొకేషన్‌.. జోగిపేట!

ఇంటికే..‘మందు’!

Advertisement
నవ్వుల థెరపీ..‘జాతిరత్నాలు’
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement