e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home బతుకమ్మ జబర్దస్త్‌ లొకేషన్‌.. జోగిపేట!

జబర్దస్త్‌ లొకేషన్‌.. జోగిపేట!

జబర్దస్త్‌ లొకేషన్‌.. జోగిపేట!

ఒకప్పుడు సినిమాల్లో హీరో పట్నం వచ్చాడంటే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో నుంచి దిగేవాడు!కథానాయిక సిటీకొచ్చిందంటే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో నుంచి దిగేది!ఇప్పుడు సీన్‌ మారిపోయింది..
హీరో నేపథ్యంగా తెలంగాణ పల్లెను ఎంచుకునే రోజులు వచ్చాయి. హీరోయిన్‌ పుట్టిల్లుగా బాన్సువాడ దగ్గరి ఒక కుగ్రామాన్ని చూపించాలనే ఆలోచన వచ్చింది. ఎట్టకేలకు తెలంగాణ పల్లెలు, చిన్నచిన్న పట్టణాలు తెలుగు సినిమాల్లో అందంగా కనిపించడం మొదలైంది.ఇలా ఇటీవల తెలుగు తెరపై అందంగా, ఆకర్షణీయంగా కనిపించిన మన మరో ఊరు జోగిపేట. ‘జాతిరత్నాలు’ సినిమా కథ మొదలయ్యేది ఈ పట్టణంలోనే.ఇన్నాళ్లూ ఎక్కడుందో కూడా తెలియని ఊరు గురించి.. ‘జోగిపేట ఎక్కడా?’అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు నెటిజన్లు.

చారిత్రక నేపథ్యమున్న చిన్న పట్టణం జోగిపేట. సంగారెడ్డి జిల్లాలో మంజీరానదికి కూతవేటు దూరంలో ఉంటుంది. కులవృత్తులకు అడ్డా, కల్మషం ఎరుగని మనుషులకు చిరునామా. అందోలు కోట ఆనవాళ్లు జోగిపేట వైభవాన్ని నేటికీ చాటిచెబుతుంటాయి. చుట్టూ ఉన్న పంటపొలాలు మంజీర నాదాలకు నర్తిస్తున్నట్టుగా గాలికి ఊయలలూగుతూ దర్శనమిస్తాయి. పెద్దచెరువు జలకళతో అద్భుతంగా ఉంటుంది. పోరాటాల పురిటిగడ్డగా తెలంగాణ ఉద్యమంలో జోగిపేటకు ఉన్నతస్థానం ఉంది. ఇవన్నీ ఒకెత్తు అయితే, జోగిపేట నడిబొడ్డునున్న క్లాక్ టవర్‌ మరో ఎత్తు. నాలుగు వీధుల నడుమ ఠీవిగా నిల్చున్న ఈ టవర్‌ జోగిపేట వాసుల జీవనశైలికి దశాబ్దాల నుంచి సాక్షిగా ఉంటున్నది. క్లాక్‌టవర్‌ నుంచి గౌనీ వరకు దారికి ఇరువైపులా ఉన్న దుకాణాలు, అక్కడ జరిగే షాపింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే! కలివిడి మనుషులు, కలగాపులగం బేరాలు చిత్రంగా అనిపిస్తాయి. వీటన్నిటినీ ‘జాతిరత్నాలు’ సినిమాలో అందంగా చూపించారు దర్శకుడు కేవీ అనుదీప్‌. ఈ యువ దర్శకుడిదీ సంగారెడ్డి జిల్లా కావడం విశేషం.

పక్కా లోకల్‌
చిత్రంలో హీరో పాత్ర జోగిపేట శ్రీకాంత్‌దీ (నవీన్‌ పోలిశెట్టి) ఇదే ఊరు. ఫ్యాన్సీ జనరల్‌ స్టోర్‌ యజమాని కొడుకు. మగువల మేనిఛాయ, దుస్తుల రంగులనుబట్టి ఏ గాజులు వేసుకోవాలో, ఏ బొట్టు పెట్టుకోవాలో ఇట్టే చెప్పేస్తుంటాడు. సినిమాలో చూపించిన ఆయనగారి ఫ్యాన్సీ స్టోర్‌ సెట్టింగ్‌ కాదు. జోగిపేట క్లాక్‌ టవర్‌ వీధిలో కొన్నేండ్లుగా ఉంటున్నదే! చిత్రంలో చూపిన వీధులు, అరుగులు, ఇండ్లు ఏవీ కృత్రిమం కావు. అన్నీ పక్కా జోగిపేటే. అంతేకాదు, పలువురు స్థానికులు సినిమాలో తళుక్కున మెరిసి పాత్రోచితంగా మెప్పించారు కూడా! మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకోవడంతో జోగిపేటవాసులు ఖుషీ అవుతున్నారు. సినిమాను ఒకటికి రెండుసార్లు చూస్తూ రోజూ తాము చూసే క్లాక్‌టవర్‌, దుకాణాలు, మనుషులను వెండితెరపై చూసుకొని మురిసిపోతున్నారు. హీరో స్నేహితులు రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శిలతో అల్లరి చిల్లరిగా తిరిగిన ప్రాంతాలన్నీ ఇప్పుడు హాట్‌ షూటింగ్‌ స్పాట్స్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అందోల్‌ చెరువు కట్ట, చేనేత సహకార సంఘం, చుట్టూ ఉన్న పంటపొలాలు వీటన్నిటి గురించి పరిశ్రమ వర్గాలు ఆరాలు తీయడమూ, లొకేషన్ల కోసం రావడమూ మొదలైపోయింది.

జబర్దస్త్‌ లొకేషన్‌.. జోగిపేట!

వస్తే ఆదరిస్తాం
ఒక్క సినిమాతోనే తమ ఊరి పేరు ఉభయ తెలుగు రాష్ర్టాల్లో మార్మోగుతుండటంతో జోగిపేట వాస్తవ్యులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తమ ప్రాంతంలో అందమైన లొకేషన్లు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్‌కు సమీపమే కావడంతో దూరాభారం కూడా ఉండదంటున్నారు. పచ్చని పంటలు, రాతి కోటలు, పురాతన ఆలయాలు ఇలా ఎలాంటి లొకేషన్‌ అయినా ఇక్కడ ఇట్టే దొరికిపోతుందని చెబుతున్నారు. అన్నిటికీ మించి తమ ప్రాంతంలో షూటింగ్‌కు వచ్చినవారికి సంపూర్ణ సహకారం అందిస్తామంటున్నారు. మరిచిపోలేని ఆతిథ్యం ఇస్తామని ఆహ్వానిస్తున్నారు.

కొత్తగా ఉండాలనే..
కథపై నమ్మకంతో ఈ చిత్రం తీశాను. ప్రేక్షకులు గొప్పగా ఆదరించి ఊహించనంత విజయాన్ని కట్టబెట్టారు. ఈ చిత్ర నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా చిత్ర నిర్మాణంలో సహకరించిన జోగిపేట మిత్రులకు, ప్రజలకు ధన్యవాదాలు. సినిమా నేపథ్యం కొత్తగా ఉండాలని జోగిపేట బ్యాగ్‌డ్రాప్‌ని ఎంచుకున్నా. ఇక్కడ షూటింగ్‌కు అనుకూలమైన అందమైన లొకేషన్లు ఎన్నో ఉన్నాయి. పురాతన కట్టడాలు, ఆహ్లాదకరమైన వాతావరణం సినిమా అందంగా రావడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో మరిన్ని సినిమాలు రూపొందిస్తా. తక్కువ ఖర్చుతో మంచి సినిమా తీసేందుకు అనువైన ప్రదేశం జోగిపేట.
-కేవీ అనుదీప్‌, చిత్ర దర్శకుడు

-తికుమార్‌గౌడ్‌, అందోల్

ఇవీ కూడా చదవండి…

ఇంటికే..‘మందు’!

అగ్గికురుస్తున్నా.. జీవ నదుల్లా

కరీంనగర్‌ రూపు మారింది..

Advertisement
జబర్దస్త్‌ లొకేషన్‌.. జోగిపేట!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement