e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home బతుకమ్మ సినీ పాటల ‘బండి’!

సినీ పాటల ‘బండి’!

సినీ పాటల ‘బండి’!

బండి సత్యం.. తన పాటల పల్లకిలోతెలుగు శ్రోతల్ని ఊరేగిస్తున్న సినీకవి.ఆయన రాసిన ప్రతీ గీతం.. సాహిత్య పరిమళాలను వెదజల్లుతుంది. అందులో అద్భుతమైన పదాల సొబగు కనిపిస్తుంది.ఆణిముత్యాల్లాంటి ఎన్నో పాటల్ని చిత్రసీమకు అందించిన బండి సత్యం.. నిజంగానే ఓ పాటల సింగిడి.

సినీపాటల తోటలో విరిసిన పారిజాతం బండి సత్యం. ఉమ్మడి వరంగల్‌ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె ఈయన స్వగ్రామం. తల్లిదండ్రులు బండి రాజమౌళి, వనమాల. 1981 డిసెంబర్‌ 12న జన్మించారు. సత్యం చిన్నప్పటి నుంచే పాటలపై మక్కువ పెంచుకున్నారు. హన్మకొండలో డిగ్రీ చేశారు. సినీకవి చంద్రబోస్‌దీ ఇదే గ్రామం కావడంతో ఆయనను ఆదర్శంగా తీసుకొన్నారు బండి సత్యం. చిత్రసీమలో నిలదొక్కుకోవడమే లక్ష్యంగా భాగ్యనగరంలో అడుగుపెట్టారు. సినిమాలకు పాటలు రాయాలనే పట్టుదలతో పరిశ్రమలో పరిచయాలు పెంచుకున్నారు.

‘సండే’తో ఎంట్రీ
2003లో ‘సండే’ సినిమాద్వారా సినీపాటల రచయితగా అవకాశం దక్కించుకున్నారు. ఇందులో ‘ఎన్ని జన్మలెత్తాలి చెలియా.. నీ చిన్ని మనసు తెలియా’ గీతం ద్వారా ప్రేమలో పడ్డ యువకుడి మనస్సును ఆవిష్కరించారు. తేలికైన పదాల్లోనే నిండైన భావాలను పొదిగి చెప్పారు. ఆ తర్వాత ‘బ్యాక్‌ పాకెట్‌'(2003) సినిమాలో ‘గుమ్మడి పూలు తెస్తానులే.. మల్లెపూలు ఇస్తానులే.. చెలియా నమ్మరాదటే..’ అంటూ మరో ప్రేమగీతం రాశారు. ప్రేయసీ ప్రియుల మధ్య ప్రేమ అలకలో కూడా ఎంత బలంగా ఉంటుందో ఈ పాటద్వారా చెప్పారు. ఇదే సినిమాలో, ‘గోల గోలగుంది’ అంటూ మరో పాటా రాశారు బండి సత్యం.

ప్రణయం.. చైతన్యం..
‘కాలింగ్‌ బెల్‌'(2013)లో ‘ఓ సరసముని నా సొగసుగని.. చేరుకోరా నా ఎదని..’ అనే ప్రణయగీతాన్ని ఆవిష్కరించారు. ఇందులో ఆయన రాసిన ‘బిడియాలగడి తీసి ఒడిని చేరుకోరాదా! సరసాలసడి చేసి మదిని మీటి పోరాదా!’లాంటి పంక్తులు, అనిర్వచనీయమైన ప్రణయావేశాన్ని నిర్వచిస్తున్నాయి. బిడియాలగడి, సరసాలసడి.. వంటి వినూత్న ప్రయోగాలు బండి సత్యం కలానికున్న వాడిదనాన్ని, వేడిదనాన్ని చాటుతున్నాయి. ‘C/O గోదావరి’(2016) సినిమా కోసం ‘పదరా ప్రతి అడుగై.. పరుగై.. నిశిలో నువు చిచ్చరపిడుగై..’ అనే చైతన్య గీతం రాశారు బండి. అలుపులేని పయనానికి గెలుపు బాటను చూపించే పాట ఇది. ఇందులోని ‘చదివేయ్‌ ఈ లోకం తీరుని.. వడబోయ్‌ నీ శోకం నీరుని’ అనే పంక్తుల్ని పాడుతుంటే, ప్రతి ఒక్కరిలోనూ అంతఃచేతన ప్రజ్వలిస్తుంది. శ్రమ, సహనం, ఆత్మశక్తి, దృఢ సంకల్పం.. ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ ఈ పాటద్వారా హితబోధ చేశారు. శ్రమనే ఆయుధంగా చేసుకొనిసాగిపొమ్మని యువ తరానికి ప్రబోధించారు.

విరహ గీతాల్లోనూ..
ప్రేమికుల మధ్య ప్రణయాన్ని తెలిపే విరహగీతాలు రాయడంలోనూ బండి సత్యం ముందున్నారు. ‘పంచముఖి’(2009)లో ఈయన రాసిన ‘మదనా మదనా మదనా.. నా వయసే దోచే మదనా’ అనే శృంగారగీతం, అద్భుతమైన భావుకతతో సాగుతుంది. ‘చలిగిలిలో చెక్కిలిగిలిగా చుట్టేయ్‌ నన్నే, చిరు చెమటై ముచ్చెమటల్లో ముంచేయ్‌ నన్నే’ అనే వాక్యాలు విరహాగ్నిలో కాగుతున్న యవ్వనానికి తెరతీస్తున్న సందర్భంలా కనిపిస్తాయి. ‘వాలంటైన్‌'(2009) చిత్రంలోనూ ‘దేవతల్లే వరములిస్తివే నిను చేరలేక దూరమైతినే’ అంటూ ప్రియుడి విరహవేదనను ఆవిష్కరించారు. ‘నీ జ్ఞాపకాలేమో వెంటాడుతుంటే..’ అంటూ చెలి జ్ఞాపకాల సన్నిధిలో బతికే ప్రియుడిని చూపించారు.

తొలిప్రేమ పాఠాలు..
‘సరదాగా అమ్మాయితో..’(2013) సినిమాలో సత్యం రాసిన టైటిల్‌ సాంగ్‌ యువతరాన్ని బాగా ఆకర్షించింది. ఇందులో ‘సరదాగా అమ్మాయితో ఓ కాఫీ తాగొచ్చు, సరదాగా అమ్మాయితో ఒక సినిమా చూడొచ్చు’ అంటూ కుర్రకారుకి తొలిప్రేమ పాఠాలు నేర్పించారు. అమ్మాయిలతో ప్రేమను ఎలా పంచుకోవాలో, వారితో ఎలా స్నేహం చేయాలో తెలియజేశారు. దీంతోపాటు ‘శత్రువు’(2012) చిత్రంలోనూ ‘జాబిలి జానే జిగర్‌ తు జావలీ నా చెలి’ అంటూ మరో ప్రణయగీతం రాశారు. ‘నా ప్రేమలో..’ సినిమాలోనూ ‘ఏసీ కూలర్‌ తీసేయ్‌.. ఏకాంతంలోనే దూకేయ్‌’ అంటూ యువతను ఉరకలెత్తించారు. అందరి మనసుల్ని హత్తుకునే హుషారు పాటను అందించారు.

లక్ష్యం వైపు సాగేలా..
ప్రేమపాటలు, ప్రణయగీతాలే కాదు, మనిషికి జీవితం విలువను తెలిపి, ఉన్నత లక్ష్యం వైపు నడిపించే స్ఫూర్తిదాయక పాటలనూ అందించారు. ‘క్షేమం’ సినిమాలో ఆయన రాసిన ‘జీవితం ఒక పయనం.. యవ్వనం ఒక పవనం’ పాట ఎంతో అద్భుతంగా సాగుతుంది. ఇందులోని ‘గడిచిన క్షణం నీది కాదురా.. భవితకు ముందొక బాట వేయరా.. అలసట తీరక పరుగు తీయరా.. గెలుపు శోధన మొదలుపెట్టరా’ వంటి వాక్యాలు బండి సత్యం కలానికున్న పదునును చూపిస్తాయి. విజయం వరించేదాకా వెనుకడుగు వేయరాదన్న సంకల్పాన్ని రగిలిస్తాయి.

సీరియళ్ల కోసం..
బుల్లితెరకూ తన పాటల పరిమళాల్ని అందించారు సత్యం. దూరదర్శన్‌లో వచ్చిన ఊహల పల్లకి, ఓ అమ్మకథ, అనురాగ ధార మొదలైన సీరియల్స్‌కు పాటలు రాశారు. మాటీవీలో వచ్చిన ‘గుర్తుకొస్తున్నాయ్‌’ షోకోసం ఓ అద్భుతమైన పాటను అందించారు. వీటితోపాటు దొరకడు, రిపోర్టర్‌, దొంగప్రేమ, ప్రేమకు దారేది.. మొదలైన సినిమాలకు పనిచేశారు. ‘ఆనంది’ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి, తన సంగీత ప్రతిభను చాటుకున్నారు. సినీ పరిశ్రమలో 100కు పై చిలుకు పాటలను అందించిన బండి సత్యం, 200కి పైగా ప్రైవేటు గీతాలనూ రాశారు.

-తిరునగరి శరత్‌ చంద్ర , 6309873682

ఇవీ కూడా చదవండి…

ప్యాకింగ్‌చూడు గురూ..!

పేదరాలి బయోపిక్‌!

కళలే ప్రాణంగా..

Advertisement
సినీ పాటల ‘బండి’!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement