e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home బతుకమ్మ పాటల తిరు‘నగ’రి..

పాటల తిరు‘నగ’రి..

పాటల తిరు‘నగ’రి..

ఆయన పాటల్లో లలితమైన పదబంధాలు పరుగులెత్తుతాయి. కవితల్లో కమనీయమైన భావాలు ఉరకలేస్తాయి. ఆయన ప్రసంగధారల్లో శబ్ద సౌకుమార్యం, భావసౌందర్యం తరగలెత్తి కనిపిస్తాయి. తను రాసిందల్లా కవితగా, పలికిందల్లా పాటగా అందించగల నేర్పరి.. ప్రముఖకవి,సినీగేయ రచయిత తిరునగరి శ్రీనివాసస్వామి.

కవిగా, సినీ గేయరచయితగా సుపరిచితులు తిరునగరి శ్రీనివాసస్వామి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోరుట్ల సమీపంలోని గుమ్లాపూర్‌ వీరి స్వస్థలం. తల్లిదండ్రులు లక్ష్మి, రామానుజస్వామి. 1969 జనవరి 15న జన్మించిన శ్రీనివాసస్వామి మోహన్‌రావుపేటలో పాఠశాల విద్యనభ్యసించారు. ధర్మపురిలోని శ్రీలక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ.(తెలుగు) పట్టా పుచ్చుకున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తులో పండిత శిక్షణ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం కోరుట్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే కవితలు, గేయాలు రాశారు. ఇప్పటి వరకూ 500లకు పైగా ప్రైవేటు గీతాలు వెలువరించారు.

స్త్రీ జాతికి సందేశాన్నిస్తూ..
2008లో చిత్రసీమలోకి అడుగుపెట్టారు శ్రీనివాసస్వామి. పులి అమృత్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ తీర్పు ఇల్లాలిది’ సినిమాకోసం తన మొదటి సినీ గేయాన్ని అందించారు. ‘మమతకోసం కరిగి నీరై సాగే ఓ మహిళా! మనసు లేని మృగాల వైనం ఇంకా సహింతువా?’ అంటూ స్త్రీజాతికి విలువైన సందేశాన్నిచ్చారు.

విమర్శకులచేతా‘శభాష్‌’ అనిపించుకున్నారు. కష్టాల కడలిని ఈదుకుంటూ, కన్నీటితోనే కడుపు నింపుకుంటూ, అవమానాలు, అపనిందలతో బతుకీడ్చుకుంటూ సాగే మహిళలకు మనోధైర్యాన్ని కలిగించేలా ఈ పాట సాగుతుంది. ‘ఎడారిలోన సుమాలు పూచే సమయమొస్తుందీ.. దిగులు లేని బతుకు నీకు సొంతమౌతుందీ..’ అనే పంక్తులద్వారా కష్టాల వెనుకే సుఖముంటుందనీ, దిగులు పడొద్దనీ ధైర్యాన్ని కల్పిస్తారు శ్రీనివాసస్వామి. ‘సమాజమందున అమానుషత్వం పెరిగే పోయిందీ.. పిడుగులలాంటి అడుగులె వేస్తే పరుగే తీస్తుందీ..’ అన్న పదునైన వాక్యాలతో పిడుగుల్లాంటి అడుగులతో ముందుకు సాగమని స్త్రీ జాతికి హితబోధ చేశారు.

స్నేహం విలువ చాటేలా..
2010లో వచ్చిన ‘లెనిన్‌’ సినిమాకోసం స్నేహం విలువను చాటేలా మరో సందేశాత్మక గీతం రాశారు. ‘ఈనాటి అనుబంధమేనాటిదో.. విధి ఎందుకు మాయ చేసెనో’ అంటూ స్నేహం గొప్పదనాన్ని అద్భుతంగా కవిత్వీకరించారు. పరిస్థితుల ప్రభావాలతో విడిపోయిన స్నేహితుల మనసుల్లో చెలరేగే వింత అలజడిని, ఆవేదనను ఎంతో హృద్యంగా వివరించారీ పాటలో. ‘కలవరాల సుస్వరాలు స్నేహంలో ఉన్నవీ.. అలకలోని పులకింతలు ఎన్నో దాగున్నవీ..’ అని స్నేహ బంధంలోని కలవరింతలను, ఆటపాటల్లోని అలకలను, ఆ అలకల్లోని పులకరింతలను భావయుక్తంగా చెప్పారు. ‘స్వర్గమే సరిరాదు స్నేహానికీ.. కరుణయే లేదాయే దైవానికీ’ అనే పంక్తుల్లో స్వర్గం కంటే స్నేహం మిన్న అనీ, ఇలా ప్రాణస్నేహితుల్ని విడదీసిన ఆ దైవానికి కరుణ లేదని సన్నివేశానుగుణంగా స్పష్టం చేశారు శ్రీనివాసస్వామి.

చదువుల తల్లిని కొలుస్తూ..
తాను భక్తిగీతాలనూ సునాయసంగా రాయగలరని 2013లో వచ్చిన ‘శ్రీ బాసర సరస్వతీ మహాత్మ్యం’ సినిమాద్వారా రుజువు చేశారు శ్రీనివాసస్వామి. ఇందులో ‘ఇదే ఇదే బాసరా.. పలుకులమ్మ శ్వాసరా’ అంటూ బాసర క్షేత్ర మాహాత్మ్యాన్ని వెండితెర వేదికగా తెలియజేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర అమ్మవారి మహిమను దశదిశలా వినిపించారు. ‘గోదావరి తరంగాల ఘోషరా.. వేదాలే నాదాలై వెలసెరా’ అంటూ బాసరలోని గోదావరి అలల సవ్వడిని, అక్కడి రాళ్లలో వినిపించే నాద మహిమనూ మహోన్నతంగా చెప్పారు. ఆ నాదాలనే వేదాలుగా భావించిన తీరు మరీ ప్రశంసనీయం. ‘విద్యా కుసుమాల తోరణాల మాల బాసర..’ అనే పంక్తిలో బాసర, విద్యార్థుల పాలిట విద్యావనమై విలసిల్లుతున్నదని కీర్తించారు. ఇదే సినిమాలో ‘శ్రీవాణీ నిను కొలిచితిమమ్మా.. సద్గతినీయమ్మా..’ అని సరస్వతీదేవిని కీర్తిస్తూ మరోపాట రాశారు. బాసరను దర్శించడానికి వచ్చే భక్తకోటిని అనుగ్రహించమనీ, చల్లని చూపులతో కరుణించమని దేవిని ప్రార్థించడం ఈ పాటలో కనిపిస్తుంది. ఇందులో ‘అక్షరాలనే మాలలు గట్టీ అలంకరించెదము.. ఇక్షురసాల పాటలతోటి అభిషేకించెదము..’ అంటూ వాగ్దేవిని అక్షరమాలలతో అర్చిస్తామని, ఇక్షుధారలు కురిసే పాటలతో అభిషేకిస్తామని చెప్పిన తీరు ఎంతో హృదయంగమంగా ఉంది.

ప్రేమ పాటల్లోనూ..
ప్రేమగీతాలనూ రమణీయంగా రాస్తారు శ్రీనివాసస్వామి. ‘అందాల చంద్రుడు’(2009) సినిమాకోసం ‘నీతో ఉంటా నిజంగా.. నీ ప్రేమే ఒక వరంగా..’ అని ప్రేమికుల మనసుల్లోని వలపుల సందడిని మనోహరంగా అభివర్ణించారు. ఈ పాటలోని ‘అందాల హరివిల్లయ్‌.. నీ ముంగిలిలోకొస్తా.. మందార మాలికనై నీ జడలో విరబూస్తా..’ వంటి పంక్తుల్లో ప్రేయసి చెంత ప్రణయ సౌగంధమై పరిమళించాలన్న తపనతో ప్రియుడు ఉన్నాడనీ, ఆమె ప్రేమను పొందాలని ఆరాట పడుతున్నాడనే భావన స్ఫురిస్తుంది. వీటితోపాటు 30కి పైగా సినిమా పాటలను రాసి, అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. 2004లో విజయవాడలో విజ్ఞానసుధ వారి ఉత్తమ కవితా పురస్కారాన్ని దక్కించుకున్నారు. 2018లో రాష్ట్రస్థాయి సినారె పురస్కారం, 2019లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతోపాటు అనేక గౌరవ సత్కారాలు పొందారు. అటు కవిత్వాన్ని, ఇటు సినిమా పాటల్ని సమస్థితిలో మేళవించుకొని, పదునైన పాటల కిరణంలా ప్రసరిస్తూ, దూసుకెళ్తున్నారు శ్రీనివాసస్వామి. చక్కని సాహిత్యం, లోతైన భావం ఆయన కలంనిండా పొంగిపొర్లుతూ ఉంటుంది. కాబట్టే, ప్రతి పాటా జనం నోళ్లలో నానుతూనే ఉంది.

-తిరునగరి శరత్‌ చంద్ర ,6309873682

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పాటల తిరు‘నగ’రి..

ట్రెండింగ్‌

Advertisement