e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home బతుకమ్మ పోలీస్‌ ట్యూషన్‌ అంకుల్స్‌!

పోలీస్‌ ట్యూషన్‌ అంకుల్స్‌!

పోలీస్‌ ట్యూషన్‌ అంకుల్స్‌!

వాళ్లది కటిక పేదరికం. చదువుల్లేవు. ఒకరో ఇద్దరో చదివినా పరీక్షలంటే భయం. ప్రత్యామ్నాయమేదీ ఉండదు. ఉన్న ఒకే ఒక్క అవకాశం మావోయిస్టు శిబిరంలో చేరడం. ఇప్పుడు, ఆ జీవితాల్లోకి పోలీసులు ప్రవేశించారు. చదువుల విషయంలో ధైర్యం చెబుతున్నారు. భవిష్యత్‌ ప్రణాళికపై అవగాహన కల్పిస్తున్నారు.

ఝార్ఖండ్‌లోని షిండేగా జిల్లా. చేతికంది వచ్చిన పిల్లలు తరచూ ఇల్లు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోతుంటారు. చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలనే ఆలోచన షిండేగా దరిదాపుల్లో కూడా కనిపించదు. ఈ పరిస్థితిని పరిశీలించిన పోలీసులు, వారికో మార్గం చూపేందుకు ముందుకొచ్చారు. ఆ దిశగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

చిగురిస్తున్న ఆశలు
షిండేగా గిరిజన ప్రాంతంలో పేదరికమే ప్రధాన సమస్య. ఆ పేదరికానికి కారణం నిరక్షరాస్యత. దీనికితోడు యువతను వేధిస్తున్న ఇంకో సమస్య ఉంది. ఎంతోమంది యువకులు ఏమై పోతున్నారో, ఎటు పోతున్నారో కూడా తెలియదు. ఈ సంక్షోభం గురించి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన పోలీసులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే, ‘పోలీస్‌ అంకుల్‌ ట్యుటోరియల్‌ ఇనీషియేటివ్‌’. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన సంజీవ్‌ కుమార్‌ ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ కార్యక్రమం గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఇప్పుడిప్పుడే మోడువారిన జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

ప్రతిభావంతుల కార్ఖాన
‘పోలీస్‌ అంకుల్‌ ట్యుటోరియల్‌’ ద్వారా జిల్లాలోని పలుచోట్ల ప్రత్యేక కోచింగ్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ పరీక్షలంటేనే భయపడిన విద్యార్థులు శిక్షణ తర్వాత ధైర్యంగా పరీక్షలకు వెళుతున్నారు. ‘పోలీస్‌ అంకుల్‌ ట్యుటోరియల్స్‌’ నేతృత్వంలో 170 మంది నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 19 సెంటర్లను ఏర్పాటుచేశారు. ఇప్పటి వరకు, ఈ కేంద్రాల్లో 1,929 మంది పిల్లలను చేర్పించారు. తరగతులు నిర్వహించడానికి పంచాయతీ ఆఫీసులను ఉపయోగిస్తున్నారు. పదవీ విరమణ చేసిన మేధావుల సేవలను కూడా వాడుకుంటూ, షిండేగా ప్రాంత విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నారు పోలీసులు.

తొలగుతున్న అడ్డంకులు
పదో తరగతి విద్యార్థులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేని గ్రామాలు షిండేగాలో అనేకం. అలాంటి పల్లెలనే లక్ష్యంగా చేసుకొని పోలీస్‌ అంకుల్‌ ట్యుటోరియల్‌ శిబిరం నడుస్తున్నది. ముందుగా, తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేలా అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాల ముగిసిన తర్వాత వలంటీర్లు పంచాయతీ భవనాలలో ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. 2020లో ఈ శిబిరంలో 900 మంది 10వ తరగతి విద్యార్థులు చేరారు. వీరిలో 245 మందికి 60 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. 80 శాతం పైగా విద్యార్థులు పాసయ్యారు.

పోలీస్‌ ట్యూషన్‌ అంకుల్స్‌!

ఎంతో మార్పు
చదువే కాదు, సామాజిక అంశాలు, అభివృద్ధిపట్ల రోజూ రెండు గంటలపాటు వారికి అవగాహన కల్పిస్తున్నారు. బ్యాగులు, నోటు పుస్తకాలు, పెన్నులు, లంచ్‌ బాక్స్‌లు, వాటర్‌ బాటిల్స్‌ వంటి సామగ్రిని అందిస్తున్నారు. ట్యుటోరియల్‌ గురించి అవగాహన కల్పించడానికి, చదువు మానేసిన పిల్లలను గుర్తించడానికి జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఇన్‌చార్జిలను నియమించారు. 2019లో షిండేగాలో అప్పటి ఎస్పీ సంజీవ్‌ కుమార్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ క్యాంప్‌ నిర్వహించారు. హాజరైన వారిలో చాలామందికి కనీస విద్యార్హత లేదు. ‘పోలీస్‌ అంకుల్‌ ట్యుటోరియల్‌’ ఆలోచన అప్పుడే సంజీవ్‌ మనసులో ఊపిరి పోసుకున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పోలీస్‌ ట్యూషన్‌ అంకుల్స్‌!

ట్రెండింగ్‌

Advertisement