e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home బతుకమ్మ భోజనాల వేళ.. బొమ్మిడాల పులుసు!

భోజనాల వేళ.. బొమ్మిడాల పులుసు!

భోజనాల వేళ.. బొమ్మిడాల పులుసు!

‘వండుతుంటే కట్టలు తెగిన చెరువులా వాడకట్టంతా వాసన ప్రవహించే కూర ఏదైనా ఉందా?’ అంటే, అది కచ్చితంగా ‘బొమ్మిడాల పులుసే’! పచ్చి చేపల పులుసు పరిధి పక్కింటోళ్ళ వరకే. ‘బొమ్మిడాల పులుసు’ లిమిట్స్‌ ఊరి బోర్డర్స్‌ వరకూ. వండక ముందు వాసనతో కొంత ఇబ్బంది పెట్టినా, వండాక మాత్రం జిహ్వ చాపల్యం తీర్చి ‘వహ్వా’ అనిపించుకుంటుంది. తినని వాళ్లకేం తెలుసు? బొమ్మిడాల పులుసు!

పేరు చెప్పగానే నోరు చెరువులా ఊరుతుంది. నాలుక అందులో నాట్యం చేస్తుంది. ఆ వాసనలు సోకగానే ముక్కు ఠక్కున మేల్కొంటుంది. చికెన్‌, మటన్‌లకు ఏమాత్రం తీసిపోకుండా నాన్‌వెజ్‌ ప్రియులను ఊరించే వంటకమిది. పచ్చి చేపల పులుసు, ఇగుర్లు ప్రస్తుతం రోజువారీ స్పెషల్స్‌లో భాగమే. కానీ, ‘బొమ్మిడాల పులుసంటే’ మాత్రం అంత సులువు కాదు. అన్నీ కుదిరి, అదిరిపోవాలంటే చేయి తిరిగిన వాళ్లే వండాలి. తేడావస్తే ఇజ్జత్‌ కా సవాల్‌!

ఆంధ్రాలోని గుంటూరు, నెల్లూరు ‘పచ్చి బొమ్మిడాల పులుసు’కు ఫేమస్‌. తెలంగాణలో మాత్రం ‘బొమ్మిడాల పులుసంటే’ ప్రతి పల్లే ఫేమస్‌, ప్రతి ఇల్లూ కేరాఫ్‌ అడ్రస్‌. వర్షకాలంలో ఎక్కువగా వచ్చే చేపలను ఎండబెట్టి, చేపలు ఎక్కువగా దొరకని సమయంలో వాడుకుంటారు. ఎండకాలం వచ్చిందంటే చాలు తెలంగాణ ఆడపడచులు ‘బొమ్మిడాల పులుసు’ను తరచూ వండుతారు.

బొమ్మిడాలను వండే ముందు బాగా వేయిస్తారు. మామూలుగా ఎండు చేపలంటేనే వాసనతో ఇబ్బంది పెడతాయి. ఇక బొమ్మిడాల సంగతి చెప్పక్కర్లేదు. కానీ, కొందరు మాత్రం ఇలా బాగా వేయించిన బొమ్మిడాల ముక్కలను సాంబారులోకి నంజుకుని తింటారు. వీటితో పులుసే కాదు, టమాట కూర, ఉల్లిపాయ ఇగురు కూడా వండుతారు.

పచ్చి చేపల పులుసులానే చేసినా ‘బొమ్మిడాల పులుసు’ పెట్టడంలో మాత్రం ఈతరం అమ్మాయిలకు అమ్మలూ, అత్తమ్మల సలహాలు తప్పనిసరి. దాంట్లో వేసే మెంతి, ధనియాల పొడి, చింతపండు పులుసు, ఉప్పు, కారం కొలతల్లో ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. అందుకే, ‘బొమ్మిడాల పులుసు’ చేసే రోజు దిగ్గజాలు రంగంలో దిగాల్సిందే!

పాత తరం వంటల్లో ‘బొమ్మిడాల పులుసు’ ప్రత్యేకతే వేరు. పెద్దపెద్ద హోటళ్ళలో సైతం ప్రత్యేక వంటకంగా నోరూరిస్తున్నది. సన్నగా, పొడవుగా చూసేందుకు పాముల్లా ఉండే చేపలనే ‘బొమ్మ చేపలు’ అంటారు. వీటినే, ఎండ బెట్టాక ‘బొమ్మిడాయిలు’ అంటారు.

పచ్చివైనా, ఎండినవైనా చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. చేపల్లోని పోషకాలు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. వీటిలో సూక్ష్మపోషకాలు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. చేపల్లో పుష్కలంగా లభించే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. తరచూ చేపలు తినేవాళ్లకు క్యాన్సర్లు, హృద్రోగాలూ, కీళ్ళనొప్పులు వచ్చే ఆస్కారం తక్కువని అంటారు.

చేపల్లోని ఒమేగా ఆమ్లాలు, ట్రై గ్లిజరైడ్లు శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం తగ్గుతుంది. గుండె సంబంధమైన సమస్యలు దరిచేరవు. ‘పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఆమ్లాలు’ బీపీని తగ్గిస్తాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా చేస్తాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు సెటోనిన్‌ను పెంచి డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. వారానికోసారి చేపల్ని తినేవారిలో మతిమరుపు సమస్య ఉండదట.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భోజనాల వేళ.. బొమ్మిడాల పులుసు!

ట్రెండింగ్‌

Advertisement