e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home బతుకమ్మ వర్తకుల కల్పవల్లిమోటుపల్లి!

వర్తకుల కల్పవల్లిమోటుపల్లి!

వర్తకుల కల్పవల్లిమోటుపల్లి!

‘సూయజ్‌ కాలువ’లో ‘ఎవర్‌ గివెన్‌’ నౌక ఇరుక్కుపోవడంతో ప్రపంచ వాణిజ్యమే స్తంభించింది. ఈ ఘటనతో తమ దేశానికి వాటిల్లిన రూ.7,500 కోట్ల నష్టాన్ని చెల్లించాలంటూ ఈజిప్ట్‌ కోర్టు ఆదేశించింది. అప్పటి వరకూ నౌకను విడుదల చేయకూడదని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వాణిజ్య నౌకలు, వ్యాపారులకు అభయ హస్తాన్ని అందిస్తూ, సరిగ్గా 777 సంవత్సరాల క్రితం క్రీస్తుశకం 1244లో కాకతీయ గణపతి దేవుడు వేయించిన ‘మోటుపల్లి వర్తక అభయ శాసనం’ ప్రస్తావనీయం.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన వేటపాలెం మండలంలో మోటుపల్లి ఉన్నది. ఇది రెండువేల సంవత్సరాల క్రితమే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ ఓడరేవుగా విరాజిల్లింది. కాకతీయ సామ్రాజ్యంలో మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవుల ద్వారా సముద్ర వ్యాపారం ఎక్కువగా జరిగేది. నిత్యం వచ్చీపోయే ఓడలతో మోటుపల్లి రేవు ఎప్పుడూ రద్దీగా ఉండేదని పలువురు విదేశీ చరిత్రకారులు తమ రచనల్లో ప్రస్తావించారు. కాకతీయ గణపతి దేవుడికాలంలో సముద్ర వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది. సహజ సిద్ధమైన ఓడరేవుగా ప్రసిద్ధి చెందిన మోటుపల్లి కేంద్రంగా అరబ్‌, చైనా దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు విస్తృతంగా జరిగేవి. తూర్పు దీవులతోపాటు పశ్చిమ ప్రాంతాల నుంచీ నౌకలద్వారా అనేక వస్తువులు కాకతీయ సామ్రాజ్యంలోకి వచ్చేవి. ఈ క్రమంలో గణపతిదేవ మహారాజు వివిధ ఖండాలు, ద్వీపాలనుంచి సముద్రం మీదుగా వచ్చే వర్తకుల భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చాడు. సముద్రపు దొంగల బారినుంచి వ్యాపారులను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు దేశ, విదేశీ వర్తకులకు ప్రమాదబీమానూ కల్పించాడు. ఈ మేరకు మోటుపల్లి సముద్రతీరంలో ఉన్న వీరభద్రస్వామి ఆలయ మండపంలో తెలుగు, సంస్కృత భాషల్లో ‘అభయ శాసనం’ వేయించాడు.

వర్తకం వర్ధిల్లాలని..
మోటుపల్లి ఓడరేవుద్వారా వారానికి కోటి వరహాల వర్తకం జరిగేదని విదేశీ చరిత్రకారులు పేర్కొన్నారు. ఇక్కడినుంచి శ్రీగంధం, పచ్చకర్పూరం, చీనీ కర్పూరం, రత్నాలు, ముత్యాలు, రవ సెల్లాలు, పన్నీరు, దంతాలు, కర్పూర తైలం, రాగి, సీసం, తగరం, పట్టు, పగడం, నార, సుగంధ ద్రవ్యాలు, సన్నని వస్ర్తాలు, ధాన్యాలు.. ఇలా ఎన్నెన్నో వస్తువులు అరేబియా, ఈజిప్ట్‌, ఇటలీ, గ్రీసు, జర్మనీ, రొమేనియా, జపాన్‌, చీనా, బర్మా, సుమత్ర, జావా, బోర్నియో, సింహళం లాంటి దేశాలకు ఎగుమతి అయ్యేది. ఆయా దేశాల నుంచీ వస్తువులు దిగుమతి అయ్యేవి. వర్తకం వర్ధిల్లితేనే రాజ్యానికి ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని గణపతి దేవుడు భావించాడు. అందుకోసమే దేశ, విదేశీ వర్తక వాణిజ్యాలకు సమప్రాధాన్యమిచ్చాడు. ప్రాణాలకు తెగించి నెలలకొద్దీ సముద్రాలపై ప్రయాణించి వచ్చి మరీ, వ్యాపారం చేసే నౌకా వ్యాపారుల కష్టాలను గుర్తించాడు. ప్రకృతి వైపరీత్యాలు, సముద్ర దొంగల దోపిడితో వ్యాపారులు బాగా నష్టపోయేవారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, తుపానులవల్ల ఏవైనా నౌకలు ఇతర రాజ్యాల తీరాలకు వెళ్లినప్పుడు అక్కడి పాలకులు నిర్దయగా ప్రవర్తించేవారు. ఆ నౌకల్లోని సరుకుల్ని బలవంతంగా జప్తు చేసి వారి ప్రభుత్వ ఖాతాలో జమ చేసేవారు. ఈ విధానానికి గణపతిదేవుడు స్వస్తి పలికాడు. న్యాయబద్ధమైన నిర్ణీత సుంకాన్నే వసూలు చేసి, మొత్తం సరుకులను యథాతథంగా వాటి యజమానులకు అందించేవాడు.

శాసన విశేషాలు
సాధారణ దాన శాసనాలకు భిన్నంగా ఈ శాసనం సాధారణ సుంకం రేటును ప్రస్తావించింది. ప్రత్యేకంగా పేర్కొన్న వస్తువులు తప్ప, తక్కిన వాటిపై 1/30 వంతు సుంకం విధించేవారు. ఉదా॥కు 30 ఏనుగులు ఎగుమతి చేస్తే ఒక ఏనుగును సుంకంగా చెల్లించాల్సి ఉంటుంది.
కాకతీయుల కాలంలో ఎగుమతి, దిగుమతుల సమయంలో పన్నులను వసూలు చేసే రేవు పట్టణాలను ‘కర పట్టణాలు’గా వ్యవహరించేవారు. మోటుపల్లి కూడా అలాంటి ఓ పట్టణమే. ఆ రోజుల్లో ఓ వెలుగు వెలిగింది.

మార్కోపోలో కితాబు
మోటుపల్లి ఓడరేవు గురించి సుప్రసిద్ధ ఇటలీ యాత్రికుడు మార్కోపోలో ప్రస్తావించాడు. 13వ శతాబ్దంలో రాణి రుద్రమదేవి పాలనాకాలంలో మోటుపల్లిని సందర్శించాడు. ఈ ఓడరేవునుండి తూర్పు పశ్చిమదేశాలకు వజ్రాలు, సాలెపురుగు జాలిలా ఉండే అతివిలువైన సన్నని వస్ర్తాలు ఎగుమతి అయ్యేవనీ, ‘వీటిని ధరించని రాజుగానీ, రాణిగానీ, కుబేరులు కానీ ప్రపంచంలో ఉండరని’ కాకతీయకాలం నాటి వస్ర్తాల ప్రత్యేకతనూ కొనియాడాడు. అంతేకాకుండా, ఎన్నో దేవాలయాలు కలిగిన పట్టణంగా పేరొందిన మోటుపల్లి ప్రముఖ యాత్రాకేంద్రంగా ప్రసిద్ధి పొందిందని తెలిపాడు. అక్కడి విలాసాలనూ ప్రస్తావించాడు.

-అరవింద్‌ ఆర్య ,7997 270 270

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వర్తకుల కల్పవల్లిమోటుపల్లి!

ట్రెండింగ్‌

Advertisement