e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home బతుకమ్మ పేరు గంగాధర్‌ఊరు గంగాధర!

పేరు గంగాధర్‌ఊరు గంగాధర!

పేరు గంగాధర్‌ఊరు గంగాధర!

గంగాధర్‌.. గంగారాం.. గంగమల్లు.. గంగరాజం.. గంగయ్య.. ఆ ఊర్లో పేర్లన్నీ గంగతోనే మొదలవుతాయి. ఆడకూతుళ్ల పేర్లకొస్తే గంగ, గంగవ్వ, గంగలక్ష్మి, గంగోత్రి ఇవే! మనుషుల పేర్లలో తరతరాలుగా పేరుకుపోయిన ‘గంగ’ శతాబ్దాల కిందట ఊరిపేరుగా ఉదయించింది. కాకతీయుల కాలంలో పల్లవించిన ‘గంగధర’ వెయ్యేండ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం.

కరీంనగర్‌ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గంగాధర మండల కేంద్రం. క్రీ.శ 1158లో కాకతీయ రాజైన రుద్రదేవుని కొలువులో మంత్రిగా ఉన్న వెల్లంకి గంగాధరుడు అనే మంత్రి ఈ ప్రాంతానికి వచ్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. పచ్చనిపొలాలు, ఆహ్లాదకర పరిసరాలు చూసిన గంగాధరుడు ఇక్కడ ఓ గ్రామ నిర్మాణానికి పునాది వేసినట్లు చెబుతారు. అలా గ్రామానికి ‘గంగాధర’ అనే పేరు స్థిరపడిందని అంటారు. గంగాధరుడు ఈ ఊరినే కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిపాలించినట్లు చరిత్రకారుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి రచనల ద్వారా తెలుస్తున్నది. పేరుకు మంత్రే అయినా రాచదర్పంతో వెలిగేవాడని చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాంతం బాగోగులు, ఇక్కడి ప్రజల యోగక్షేమాలు తనే స్వయంగా విచారించేవాడట గంగాధరుడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడంతో తరాలు మారినా ఆయనపై అభిమానం అలాగే నిలిచిపోయింది. ఓ పాలకుడిని ఇంతగా గుర్తుపెట్టు కోవడం గొప్ప విషయమే.

పేరెందుకంటే?
గంగాధర గ్రామంతో పాటు పరిసర పల్లెవాలసుల పేర్లలోనూ ‘గంగ’ విరివిగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంపై తనదైన ముద్రవేసిన గంగాధరుడి మీద అభిమానంతో ఆయన పేరు వచ్చేలా పిల్లలకు నామకరణం చేసుకునేవారు. తరాలుగా ఆ ఆనవాయితీ అలానే కొనసాగుతున్నది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ గంగాధరకు కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కొలువుదీరిన రాజరాజేశ్వరుడిని ‘గంగాధరుడి’గా కొలుచుకుంటారు భక్తులు. రాజన్న పేరుమీద కూడా ‘గంగ’ శబ్దం వచ్చేలా పేర్లు పెట్టుకుంటారు. అంతేకాకుండా.. గంగాధరకు 50 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి, 40 కిలోమీటర్ల దూరంలో కోటిలింగాల దగ్గర గోదావరి ప్రవహిస్తుంది. ప్రాంతంలో గోదావరిని ‘గంగ’ అని పిలిచే సంప్రదాయం ఉంది. అలా గంగమ్మ గౌరవార్థం కూడా ఆ పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఇదీ గంగాధరవాసుల పేర్ల వెనుకున్న అసలు సంగతి.

శైవ రాజ్యంలో విష్ణుమూర్తి ఆలయం
సాధారణంగా కాకతీయ రాజులు శివభక్తి పరాయణులు. వారు నిర్మించిన వాటిలో శైవ ఆలయాలే ఎక్కవగా కనిపిస్తుంటాయి. గంగాధరుడు విష్ణుభక్తి పరాయణుడు. ఈ కారణంగా తాను నిర్మించిన గంగాధరలో వైష్ణవాలయాన్ని కట్టించాడు. 18 రాతి స్తంభాలతో, చక్కని శిల్పకళతో అలరారే వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఇక్కడ నిర్మించాడు.. హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని సైతం గంగాధరుడే కట్టించారని పరిశోధనలో వెలుగుచూసింది. ఈ ఆధారాలు ఆయనను విష్ణుభక్తుడిగా రుజువు చేస్తున్నాయని చరిత్రకారుల అభిప్రాయం. గంగాధరలోని వేంకటేశ్వరాలయం ముందు భాగంలో ఎత్తయిన రాతి స్తంభం, దాని మీది చిన్న స్తంభాలు, కప్పు ఉండేవట. ఈ స్తంభంపై దీపం వెలిగించేవారని గ్రామస్తులు చెబుతుంటారు. స్తంభం సమీపంలో చింత చెట్టు పెరిగి, ఆ చెట్టు కొమ్మల రాపిడి వల్ల ఆ స్తంభాలు, దానిపైనున్న కప్పు పడిపోయాయని పేర్కొంటారు. ఆలయంలో నిధి నిక్షేపాలున్నాయన్న దురాశతో పలువురు ముష్కరులు ఈ ఆలయంపై దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమం కొంత భాగం శిథిలమైంది. 2011లో ఆలయ పునర్నిర్మాణం కోసం పురాతన ఆలయాన్ని కూల్చేశారు.

పేరు గంగాధర్‌ఊరు గంగాధర!

-బేతి గంగాధర్‌, గంగాధర

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేరు గంగాధర్‌ఊరు గంగాధర!

ట్రెండింగ్‌

Advertisement