పద్య రత్నాలు-28


Sun,November 17, 2019 12:50 AM

తెలివైన కోడలు

పెనిమిటి వలదని చెప్పిన
పని యెన్నడు జేయరాదు బావల కెదుటన్
గనపడగ రాదు కోపము
మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!!
- కుమారీ శతకం
Telivaina
తాత్పర్యం:ప్రతి మహిళా పుట్టినింటి గౌరవాన్ని నిలుపుతూ, మెట్టినింటి మేలు కోసం పాటుపడాలి. భర్త వద్దని చెప్పిన పని ఎప్పుడూ చేయకూడదు. బావల ముందు అర్థం పర్థం లేకుండా తిరుగకూడదు. చీటికి మాటికి కోపాన్ని ప్రదర్శించకుండా మనసులో కల్మషం లేకుండా మెలగాలి. అలాంటి కోడలును ఆ అత్తింటి వారు కన్నకూతురు వలె చూసుకోకుండా ఉంటారా!

మోక్ష మార్గం

చిలుకనొక రమణి ముద్దులు
చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా!!

- శ్రీ కృష్ణ శతకం
moksha-margam

తాత్పర్యం:
శ్రీ కృష్ణ పరమాత్మ ఎంత దయామయుడంటే, తన నామాన్ని తలచిన వారికి తప్పక మోక్షమిస్తాడు. ఒక చిలుకకు శ్రీరామ అని పేరు పెట్టుకొన్న ఓ స్త్రీ, ఆ మేరకు నిత్యం ఆ పేరుతో దానిని పిలిచినందుకే ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. అటువంటిది ఏకంగా ఆయన పేరు తలచిన జనులకు ఎవరికైనా మోక్షాన్ని ఇవ్వకుండా ఉంటాడా!

అసలు మూలం

నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు దీయు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినురవేమ!
- వేమన శతకం
Asalu-moolam

తాత్పర్యం:నీళ్లలో ఉన్నంత సేపే మొసలి శక్తి పనిచేస్తుంది. ఏనుగును సైతం నీళ్లలో ఉండి పట్టిందంటే ఎట్టి పరిస్థితుల్లో అది విడువదు. అదే నేలపైకి వచ్చిందా అంతటి మొసలికి కూడా శక్తి క్షీణించినట్లే. ఆఖరకు కుక్కతోకూడా దానికి భంగపాటు తప్పదు. ఎందుకంటే, ఎవరి బలానికైనా అసలు మూలం స్థానవిలువనుబట్టే అని తెలుసుకోవాలి.

ఎవరు శ్రేష్ఠుడు?

పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక పరులకు హితుడై
పరుల దనుబొగడ నెగడక
పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ!
- సుమతీ శతకం
Evaru-Srestudu

తాత్పర్యం: పరస్త్రీలపట్ల సోదరుడిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఎంతమాత్రం ఆశపడకూడదు. తోటివారంతా తనను ఇష్టపడేలా ప్రవర్తించాలి. ఎదుటివారు పొగుడుతుంటే ఉప్పొంగిపోకూడదు. ఎవరైనా కోపగించుకొన్నప్పుడు తాను కూడా అదే పంథాలో ఆగ్రహాన్ని ప్రదర్శించరాదు. ఇలాంటి ఉత్తమగుణాలను కలిగివున్నవాడే శ్రేష్ఠుడుగా గుర్తింపబడతాడు.

292
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles