ఎక్కడ ఏలాడో..అక్కడే వేలాడి..


Sun,November 10, 2019 03:27 AM

MUSOLINI
నియంతల మరణం అంటే అదే.. ప్రజలకు స్వేచ్ఛ. ప్రజాస్వామ్యానికి రక్ష. ఇటాలియన్ రాజుకు విధేయులైనా బలగాలు ముస్సోలినిని బంధించాయి. జైలులో పెట్టాయి. వారం రోజుల్లోనే అబ్రుజ్జి పర్వతాల్లోని ఒక మారు మూల హోటల్‌లో బంధించారు. విషయం తెలుసుకున్న హిట్లర్, ముస్సోలినిని రక్షించాలనుకున్నాడు. వెంటనే జర్మనీ కమాండోలు రంగంలోకి దిగారు. హోటల్‌పై ఓ ైగ్లెడర్ (విమానం)ను దించారు. ముస్సోలినిని గుర్తించి మ్యూనిచ్‌కు విమానంలో తరలించారు. అక్కడ అతను హిట్లర్‌తో సమావేశం అవుతాడు.

1944 నార్త్ ఇటలీ

ప్రభుత్వాన్ని కోల్పోయిన ముస్సోలిని మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. ఉత్తర ఇటలీలో ఫాసిస్ట్ రాజ్యాన్ని స్థాపించాడు. మిలాన్ కేంద్రంగా తన నిరంకుశత్వాన్ని ప్రారంభించాడు. మ్యూనిచ్‌లో హిట్లర్‌తో జరిగిన సమావేశ సారాంశం ఇదే. ఉత్తర ఇటలీ ద్వారా ఆధిపత్యాన్ని కొనసాగించడంతో హిట్లర్, ముస్సోలిని మిత్రుత్వం కొనసాగింది. ఉత్తర ఇటలీలో ముస్సోలినీ ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతున్నది. బ్లాక్ షార్ట్స్ బృందం ఇటలీ వీధుల్లో విధ్వంసం సృష్టిస్తున్నది. ఇటలీకాని వారందరినీ తన్ని తరిమేస్తున్నారు. ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను కాల్చి చంపుతున్నారు. ప్రశ్నిస్తున్నవాళ్లను ద్రోహులంటున్నారు. సోషిలిస్టు బృందాలను కనిపించనివ్వడం లేదు. 13 ఆగస్టు 1944న 15 మంది ఫాసిస్టు వ్యతిరేకులను మిలాన్‌లో కాల్చిచంపేశారు. తక్షణ ఉరిశిక్ష కింద వాళ్లను మిలాన్ నగరం, పిజాలియా లొరేటో చౌరస్తాలో వేలాడదీశారు. ఇటలీ ప్రజలు ఆ చౌరస్తాను అమరవీరుల స్థూపంగా పిలుస్తారు. ఏడాదిన్నర వరకూ ముస్సోలిని నియంతృత్వం కొనసాగింది.

జర్మనిలో నాజీయిజంతో హిట్లర్ చెలరేగిపోతున్నాడు. అచ్చం అలాగే ముస్సోలిని ఫాసిజంతో ఇటలీలో కూడా విజృంభించాడు. రెండు వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు పార్టీలైనా ఒకే విధానాలు వీళ్లవి. ప్రజలను స్వేచ్ఛకు దూరం చేసి, నియంతృత్వ పోకడలను అవలంభించారు. కొద్ది రోజుల్లోనే ఆ వికృత పోకడలు వారిద్దరి మరణానికి మూలం అయ్యాయి..

25 ఏప్రిల్ 1945 ఉదయం మిలాన్ ప్యాలెస్ .1945 నాటికి ఇటలీలో విచ్ఛిన్న ఛాయలు అలుముకున్నాయి. యుద్ధ కారణాలు, నేపథ్యాలు, ఇతని వైఖరుల కారణంగా ముస్సోలిని బలహీన పడ్డాడు. ఫాసిజాన్ని వ్యతిరేకించే వారితో సమావేశానికి అంగీకరించాడు. ముస్సోలిని లొంగిపోవడానికే జర్మనీ ఈ చర్చలు ప్రారంభించిందనుకున్నాడు. ఇది అతన్ని తీవ్ర కోపానికి గురి చేసింది. ఆలస్యం చేయకుండా అతను ఇటలీని వదిలి వెళ్లిపోదాం అనుకున్నాడు. అతని ప్రియురాలు కార్లా పెటాచీని తీసుకొని పారిపోవడానికి సిద్ధమయ్యాడు. ముస్సోలిని కంటే క్లారా 25 ఏండ్ల చిన్నది. ముస్సోలిని రాచెల్‌ను పెండ్లి చేసుకున్న తర్వాత క్లారాతో సంబంధాలు ఏర్పడ్డాయి. ముస్సోలినితో ఫాసిస్టు నాయకులు, మాజీ మంత్రులు ఉన్నారు. ఒక జంట కాన్వాయ్‌లో స్విస్ సరిహద్దుకు వెళ్లి అక్కడి నుంచి ఉత్తర స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోవాలి. ఇదీ అతని ఆలోచన. 28 ఏప్రిల్ 1945,మిలాన్ ప్యాలెస్ నుంచిశనివారం, సాయంత్రంరాజ్యాంగ హామీలు కాదనీ, ప్రజలను అణచివేసి, స్వేచ్ఛను నాశనం చేశాడు ముస్సోలిని. ఫాసిస్టు పాలనను సృష్టించాడు. దేశానికి తీరని ద్రోహం చేశాడు. అతనిప్పుడు జర్మన్ కాన్వయ్‌లో దేశ సరిహద్దులు దాటడానికి ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యలో ఎవరైనా గుర్తుపట్టే ప్రమాదం ఉందని భావించాడు. అనుకున్నట్టుగానే మారువేషం వేశాడు. జర్మన్ షూట్ ధరించాడు. మిలటరీ హెల్మెట్ పెట్టుకున్నాడు. షూట్‌లోపల 9ఎంఎం, లాంగ్ బారెల్ గ్లిసెంటి అటోమేటిక్ పిస్టల్ దాచుకున్నాడు. చేతిలో రెండు మెషీన్ గన్లు పట్టుకున్నాడు. మీరు ఒంటరిగా వేరే వాహనంలో వెళ్లండి, మేము మిమ్మల్ని అనుసరిస్తాం బృందంలో ఓ సభ్యుడు సలహా ఇచ్చాడు. ప్రియురాలు క్లారా లేకుండా వెళ్లనన్నాడు, అదీ ఆ జర్మనీ షూట్ ధరించి. అతనికి అసహ్యం వేసింది. ఈ అభ్యర్థనను అంగీకరించాలని క్లారా ముస్సోలినిని కోరింది. చివరికి ముస్సోలిని ఒప్పుకోకతప్పలేదు. కాన్వాయ్ నుంచి ఓ ట్రక్కులోకి ఎక్కాడు. ట్రక్కుకు కొంతదూరంలో కాన్వాయ్ ఉంది.

29 ఏప్రిల్ 1945, ఆదివారం

లేక్ కోమో నది, డోంగో పట్టణానికి కొంత దూరం.వేకువజామున 3 గంటలు.ఓ ట్రక్కు నదీతీరం వెంబడి వస్తున్నది. స్థానిక కమ్యూనిస్టు దళం ఆ ట్రక్కును ఆపారు. తనిఖీ చేసి వదిలేశారు. కానీ ఒక ఆస్ట్రియన్ వ్యక్తి అక్కడి కమ్యూనిస్టు బృందానికి సమాచారం ఇచ్చాడు. మీరు సరిగ్గా చూడండి. ఇటాలియన్ ఉన్నాడు. అతను తప్పించుకోవడం న్యాయం కాదు.. మారువేషంలో ఉన్న ముస్సోలిని గురించి చెప్పాడు. దీంతో డోంగోలో ఆ ట్రక్కును మరోసారి ఆపారు.

ఇటాలియన్ నావికాదళంలోని ఒక మాజీ నావికుడు

క్లాగ్‌మేకర్ కమ్యూనిస్టుల దళంలో చేరిన వ్యక్తి. ట్రక్కును మొత్తం శోధించాడు. ట్రక్కు మూలకు ఒకరు పడి ఉన్నారు. తాగినట్టు నటిస్తున్నాడాయన. దగ్గరికి వెళ్లాడు క్లాగ్‌మేకర్. ఆ వ్యక్తి మొఖాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. సహచరున్ని పిలిచాడు. అర్బానో లాజారో అలియాస్ బిల్ ఆ సహచరుని పేరు. ఓహ్.. బిల్.. నేనొక బస్టర్డ్‌ను కనిపెట్టాను. చూస్తే నువ్వూ ఆశ్చర్యపోతావు అన్నాడు క్లాగ్‌మేకర్.నమ్మశక్యం కాని బిల్ ట్రక్కులోకి ఎక్కాడు. ఇంకొంత మంది బృందసభ్యులుకూడా వస్తున్న కాన్వాయ్‌ను కూడా కనిపెట్టారు.క్లాగ్ పక్కకు జరిగాడు.. బిల్ ఆ మూలన ఉన్న వ్యక్తి భుజంపై తట్టాడు.కామ్రేడ్! అని పిలిచాడు. సమాధానం రాలేదు.యువర్ ఎక్సలెన్సీ (అధికారులను పిలిచే గౌరవసూచకం) అన్నాడు గట్టిగా మరొక్కసారి.అయినా నిశ్శబ్దం.. కదలికలు లేవు..బిల్ మూడోసారి ప్రయత్నించాడు.కావలీర్ బెనిటో ముస్సోలిని!.

కాన్వాయ్‌లోని వ్యక్తులను పట్టుకున్నాయి కమ్యూనిస్టు దళాలు. సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక మహిళ. ఆమె క్లారా.

బిల్ అతన్ని గుర్తుపట్టాడు. ఎదుటి వ్యక్తి హెల్మెట్ తీశాడు. బట్టతల కనిపించింది. కండ్లజోడు తీశాడు గోధుమ రంగు కండ్లు. నిర్ధారించుకున్నాడు. రెండు మిషన్ గన్లు తీసుకున్నాడు బిల్. షూట్ తనిఖీ చేశాడు. లాంగ్ బారెల్ గ్లిసెంటి అటోమెటిక్ పిస్టల్ కనబడింది. స్వాధీనం చేసుకున్నాడు. మీ దగ్గర వేరే ఆయుధాలున్నాయా? ప్రశ్నించాడు బిల్.అతను లేచి నిలబడ్డాడు. నేను ముస్సోలినిని. నేను ఎటువంటి ఇబ్బందీ పెట్టను అన్నాడు.

అదుపులోకి తీసుకున్న వారందరిని టౌన్‌హాల్‌కు తరలించారు. ముస్సోలినిని, క్లారాను విల్లా బెల్మోంటే ప్రవేశ ద్వారం దగ్గర గోడకు నిల్చోవాలన్నారు. కొద్దిక్షణాల్లోనే ముస్సోలిని చాతిలోకి బులెట్లు దిగాయి. క్లారాకు కూడా. ఇద్దరూ అక్కడే చనిపోయారు. కాన్వాయ్‌లో పట్టుకున్న వారిలో 16 మందికీ ఇదే పరిస్థితి. మిగిలిన వారిని ఓ రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రానికి రహస్యంగా తరలించారు. ఏప్రిల్ 29, 1945 ఆదివారం.ఉత్తర ఇటలీ, మిలాన్ నగరం, పిజాలియా లొరేటో చౌరస్తా,ఉదయం ఎనిమిది గంటలు.(ఫాసిజాన్ని వ్యతిరేకించిన 15 మందిని విచారణ లేకుండా ముస్సోలిని ఉరితీసిన ప్రాంతం.) ఒక పసుపు రంగు ట్రక్కు చౌరస్తాలోకి వచ్చి ఆగింది.
ట్రక్కులోపలి నుంచి కొందరు ఒక్కో మృతదేహాన్ని బయటకు విసిరేస్తున్నారు. 18 మృతదేహాలు చౌరస్తాలో పడ్డాయి. ముస్సోలిని శరీరం పచ్చికొబ్బరికాయల మీద పడింది. దాని పక్కనే క్లారా మృతదేహం.

ప్రజలు ద్వేషించే రాజు చనిపోయాడు. అతని చావును హీనం చేయడానికి ఇదే సమయం ఉదయంపూటనే ప్రత్యేక ఎడిషన్లతో, రేడియో బులెటిన్లతో మిలాన్ నగరాన్ని వార్త చుట్టుముట్టింది. సరిగ్గా నాలుగు నెలల క్రితం ఆ పౌరుడు అధ్యక్షునిగా ర్యాలీ తీసింది ఈ చౌరస్తాలోనే. దీనికంటే ఏడాది కిందట అతను 15 మంది సామాన్య పౌరులను అధికారమదంతో ఉరితీసిందీ ఈ చౌరస్తాలోనే. కాలచక్రం తిరిగింది. పరిస్థితులు మారాయి. నియంతృత్వాన్ని ఓ సిద్ధాంతం కూకటివేళ్లతో పీకేసింది. అతను చేసిన తప్పులకు శిక్షించే నిర్ణయం ప్రజలకు వదిలేసింది. అందుకే ఇప్పుడతను విగతజీవిగా, హీనంగా చౌరస్తాలో ఉన్నాడు. ప్రజలు భారీ సంఖ్యలో చౌరస్తాలోకి చేరుకున్నారు. 18 మృతదేహాలను తొక్కుకుంటూ వెళ్లడం ప్రారంభించారు.

ఇద్దరు వ్యక్తులు ముస్సోలిని మృతదేహం వద్దకు చేరుకున్నారు. దవడలో తన్నారు. ఒకరు చర్మాన్ని ఒలుస్తున్నారు. కొందరు పిడిగుద్దులు గుద్దుతున్నారు. ఇంతలో ఓ మహిళ వచ్చింది. చేతిలో 9ఎంఎం, లాంగ్ బారెల్ గ్లిసెంటి అటోమేటిక్ పిస్టల్.
గట్టిగా ఊపిరి తీసుకొని నేరుగా ఛాతీలోకి గురిపెట్టింది. వరుసగా ఐదు బుల్లెట్లు పేల్చింది. 1935 నుంచి ముస్సోలిని చేతిలో హత్యకు గురైన ఆమె ఐదుగురి కొడుకులను తల్చుకుంది. ఒక్కో బుల్లెట్‌కు, ఒక్కో కొడుకు చొప్పున ప్రతికారం తీర్చుకుంది.
ముస్సోలిని బాడీ ఛాతీ చీలిపోయింది. మొఖం మీద రక్తం చిట్లింది. ఒకరు వచ్చారు. ముస్సోలిని శరీరం చంకల కింద చేతులు చేర్చి, రోడ్డు మీదే ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. పక్కనే ఉన్న ఓ స్థూపానికి తలకిందులుగా వేలాడదీస్తున్నారు..
ఇంకా పైకి లాగండి.. ఇంకా.. ఇంకా.. మాకు కనిపించడం లేదుఅక్కడున్న అందరి మొఖాల్లో ఎప్పటి నుంచో దాగి ఉన్న ఉద్వేగం, కోపం, ఉద్రేకం అన్నీ కట్టలు తెంచుకున్నాయి. ఎవరో వచ్చి ముఖాన్ని పచ్చడి చేస్తున్నారు. కొద్ది సేపటికే క్లారా మృతదేహం, దాంతోపాటు మరికొన్ని మృతదేహాలు అదే తరహాలో వేలాడాయి.

మధ్యాహ్నం 1: 00 గంట.

5 అడుగుల 6 అంగుళాలు, బరువు 158 పౌండ్లు (72 కిలోలు), దెబ్బతిన్న బట్టతల, బతికి ఉన్నప్పుడు ఎనిమిది బుల్లెట్ గాయాలు, మరణానికి తక్షణ కారణం గుండెదగ్గర 4 షాట్లు. అక్కడికి వచ్చిన మిలాన్ క్యాథలిక్ కార్డినల్, అమెరికన్ మిలటరీ ప్రభుత్వ అధికారి ముస్సోలిని మృతదేహానికి అధికారికంగా పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. అతని మెదడులోని కొంత భాగాన్ని అధ్యయనం కోసం వాషింగ్టన్‌డీసీలోని సెయింట్ ఎలిజబెత్ మానసిక ఆస్పత్రికి అప్పగించారు. నిరసనలను అదుపు చేసి, మృతదేహాలను సాదా చెక్క శవపేటికల్లోకి ఎక్కించారు.

ముస్సోలిని మృతదేహాన్ని మిలాన్‌లోని ముస్సోకో శ్మశానవాటికకు తరలించారు. సెక్షన్ 16, సమాధి 384లో అనామకంగా ఖననం చేశారు. క్లారా మృతదేహాన్ని రీటా కోల్‌ఫోస్కో పేరుతో మిలాన్‌లో ఖననం చేశారు.

చరిత్రలో ముస్సోలిని పేజీ ముగిసింది. ప్రజలకు స్వేచ్ఛ దొరికింది. నియంతల మరణం అంటే అదే..ప్రజలకు స్వేచ్ఛ. ప్రజాస్వామ్యానికి రక్ష.

-వినోద్ మామిడాల, సెల్: 7660066469

684
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles