కోరినకోర్కెలు తీర్చే కొంగుబంగారం


Sun,October 20, 2019 02:16 AM

గుంజేడు ముసలమ్మ!
కొండకోనల నడుమ కొలువై కోరిన కోరికలు తీర్చే తల్లిగా వెలుగొందుతున్నది గుంజేడు ముసలమ్మ. కోరిన వారికి కొంగు బంగారమై గిరిజన, గిరిజనేతరుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్నది. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలో ఉన్న ముసలమ్మ తల్లి జాతర ప్రతి రెండు సంవత్సరాలకోసారి జరుగుతుంది. జాతరకు వేలాది సంఖ్యలో గిరిజన, గిరిజనేతర భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

temple
భూపాలపల్లి జిల్లాలోని మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర దేశవ్యాప్తంగా భక్తజనావళిని ఆకర్షిస్తుందో అదే తరహాలో ఏజెన్సీలోని గుంజేడు ముసలమ్మ జాతరకూ పేరుంది. ఒక రకంగా ఇది మేడారం జాతరకు అనుబంధ జాతరగా కొనసాగుతుంది. కొత్తగూడా ఏజెన్సీ పరిధిలో గుంజేడు శివారులో ముసలమ్మ జాతర ప్రతీ రెండు సంవత్సరాలకొకసారి సమ్మక్క జాతర జరిగిన సమయంలోనే రెండు రోజులపాటు జరుగుతుంది. తాతల, ముత్తాతల కాలం నుంచి ఆదివాసీలు ముసలమ్మ దేవతను గిరిజనుల ఆరాధ్యదైవంగా కొలుస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. క్రమంగా గిరిజనేతరులకు సైతం ఇష్ట దేవతగా ముసలమ్మ మారింది. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.

ఇదీ చరిత్ర:

గుంజేడు ముసలమ్మ మేడారం సమ్మక్క అక్కాచెల్లెల్లని గిరిజనులు భావిస్తారు. గుంజేడు ముసలమ్మ సుల్తానులకు కప్పం కట్టడం కోసం ఎడ్లబండ్లపై నగలు, దేవతా గంటలు వేసుకొని దట్టమైన అరణ్య ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు మధ్యలో బండి ఆగిపోయింది. ముసలమ్మ తోలెం వంశీయుల కలలో కనిపించి నేను ఈ గుట్టపైన ఉన్నాను. నాకు జాతర జరిపితే మీకు కావలసిన వరాలు ఇచ్చి కాపాడతానని చెప్తుంది. అందుకే జాతర సమయంలో తోలెం వంశీయులు గిరిజన సాంప్రదాయ రీతిలో ముసలమ్మను గద్దెకు తీసుకువస్తారు.ముసలమ్మ దయ వల్ల సంతానం కలిగిన వారు ఉయ్యాల కట్టి మొక్కు చెల్లించడం ఆనవాయితీ.

గిరిజనులకు ఆరాధ్య దైవం

ముసలమ్మ దేవత మోకాళ్ల వారి ఇంటి ఆడబిడ్డగా జన్మించిందని, తోలెం వారి ఇంట్లో జన్మించిన బంగారి కటోరాతో ముసలమ్మకు వివాహం జరుగగానే కొంత కాలం తర్వాత ఇద్దరూ మాయమై దేవతలుగా మారినట్లు పూర్వీకులు చెబుతున్నారు. కాగా అప్పటినుంచి తోలెం వారి కుటుంబసభ్యులకు ముసలమ్మ దేవతగా అవతరించిందని, పూజలు నిర్వహించాలని కలలో చెప్పిందని, దీంతో గుంజేడు ముసలమ్మవద్ద పూజలు నిర్వహిస్తున్నట్లు తోలెం వంశీయులు చెబుతున్నారు. గుంజేడు గుట్టపై వెలిసిన ముసలమ్మను గిరిజనులు ఆరాధ్యదైవంగా భక్తులు కొలుస్తూ పూజలు చేస్తున్నారు. క్రమంగా ముసలమ్మ జాతర రెండు సంవత్సరాలకోమారు నిర్వహించడమేకాకుండా ప్రతి శుక్రవారం సైతం ఘనంగా జరుగుతున్నది. సంతానం లేని వారికి సంతానం కోసం, పంట పొలాల్లో చక్కగా పంట పండాలని కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడికి వచ్చిన భక్తులు విశ్వాసంతో చెబుతున్నారు.

దేవాదాయల శాఖ ఆధ్వర్యంలో...

1995నుండి జాతర దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చింది. రెండు సంవత్సరాలకు ఒకసారి కాకుండా ప్రతీ శుక్రవారం ఇక్కడకు భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటుండడంతో చిన్న జాతరను తలపింప చేస్తుంది. ఎండోమెంట్‌శాఖద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. భక్తులకు ఏర్పాట్లు చేయడంతో క్రమక్రమంగా అభివృద్ధిని సాధిస్తున్నది. తొలుత రూ.20వేల ఆదాయంతో మొదలై ప్రస్తుతం రూ. 20లక్షలకు పైగా ఆదాయాన్ని ఇస్తుంది. కొబ్బరికాయ, తలనీలాలు, ధాన్యం పోగుచేసుకునే హక్కు తదితర వాటికి టెండర్లు నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పెద్ద ఎత్తున భక్తులు:

జిల్లానుంచే కాకుండా పొరుగు జిల్లాలైన ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల నుండే కాక ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలు నుండీ భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇలా వచ్చినవారు వారం రోజులపాటు ఇక్కడే ప్రశాంతంగా ఉంటారు. గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా పెద్దసంఖ్యలో ఈ జాతరకు వస్తుంటారు. సంతానం కోసం వచ్చేవారు ఇక్కడ నిద్ర చేయడం వల్ల సంతానం కలుగుతుందని నమ్ముతారు.

temple1

జీవకాలువ

ముసలమ్మ సన్నిధిలో ఒక జీవ కాలువ ఉంది. ఆ జీవ కాలువ మండుటెండకాలమైన నీటి ప్రవాహంతో కళకళలాడుతుంది. ఎటు చూసినా ఒక కిలోమీటరే జీవ కాలువ ప్రవహిస్తుంది. ఇక్కడి నీటిని తీసుకుని పంట పొలాల్లో చల్లుకుంటే చీడపీడ రాదని భక్తుల నమ్మకం. ఇక్కడ మొక్కులు చెల్లించేందుకు ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ జాతరకు తోలెం వంశీయులైన పూజారులు తోలెం చిన్న నర్సయ్య, స్వామి, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, సమ్మయ్య, లక్ష్మయ్య, కిరణ్ పూజారులుగా వ్యవహరిస్తున్నారు.

473
Tags

More News

VIRAL NEWS