ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధక్షేత్రం


Sun,October 13, 2019 03:07 AM

సియాచిన్‌ను చూసొద్దామా?

india
సియాచిన్ గ్లేసియర్.. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం. 13 ఏప్రిల్ 1984.. అంటే సరిగ్గా 34 ఏండ్ల క్రితం భారత సైనికులు అక్కడ తొలిసారిగా పాగావేశారు. అప్పట్నుంచీ అత్యంత కఠినతర పరిస్థితులను ఎదుర్కొంటున్న సైన్యం, ప్రాణాలొడ్డి మరీ ఆ ప్రాంతంలో పహారా కాస్తున్నారు. సియాచిన్ అంటే గులాబీల లోయ అని అర్థం. కానీ సైనికులకు ఆ గులాబీలే ముళ్లయి గుచ్చుకుంటున్నాయి. మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలతో రక్తం సైతం గడ్డకట్టేంత చలిలో వేలాది మంది సైనికులు ఏడాది పొడవునా కాపలా కాసే ప్రాంతం. అటువంటి ప్రమాదకర ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలని సైన్యం యోచిస్తున్నది. ఇప్పటికే దేశంలోని పలు సైనిక శిక్షణ కేంద్రాలు, సంస్థల సందర్శనకు ప్రజలను ఆర్మీ అనుమతిస్తున్నది. సరిహద్దులోని కీలక సైనిక శిబిరాల సందర్శనకూ పౌరులను అనుమతిస్తే వారిలో జాతీయ సమగ్రతా భావన పెంపొందుతుందని ఆర్మీ
అభిప్రాయపడుతున్నది.పర్యాటకుల ఆసక్తి

భారత్-పాకిస్థాన్‌కు సరిహద్దుగా ఉన్న సియాచిన్ ప్రాంతం ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం. దీన్ని మృత్యుక్షేత్రమని కూడా అంటారు. ఎందుకంటే వందలాది మంది సైనికులను పొట్టనపెట్టుకుంది ఈ సియాచిన్ గ్లేసియర్. దాదాపు 22వేల అడుగుల ఎత్తైన మంచుశిఖరం సియాచిన్. ఎముకలే కాదు రక్తమూ గడ్డకట్టుకుపోయే చలి. ప్రతికూల పరిస్థితులకు పరాకాష్ట. సియాచిన్ అత్యంత డేంజరస్ ఏరియా బేస్‌క్యాంప్. ఎప్పుడు మంచు చరియలు విరిగిపడతాయో తెలీదు. ఎప్పుడు మంచు తుపాను చెలరేగుతుందో తెలీదు. నిత్యం మారే వాతావరణం. అయినా ప్రాణాలు పణంగాపెట్టి, దేశం కోసం పహారా కాస్తుంటారు జవాన్లు. లడఖ్‌తో పాటు సమీప ప్రాంతాలను సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులు.. పాకిస్థాన్ ఆర్మీతో భారత సైన్యం తలపడిన కార్గిల్ హిల్స్, టైగర్ హిల్స్ సందర్శన కోసం ఆర్మీ అనుమతి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సియాచిన్, కార్గిల్‌లోని భారత సైనిక శిబిరాలను సందర్శించాలన్న దేశ ప్రజల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని పర్యాటకులు పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్మీ ప్లాన్ చేస్తున్నది. లొకేషన్లు గుర్తించే పనిలో పడింది. ఒకప్పుడు జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో భాగమైన సియాచిన్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లోఅంతర్భాగమైంది.

india2

ఇప్పటికే దేశంలోని పలు సైనిక శిక్షణ కేంద్రాలు, సంస్థల సందర్శనకు ప్రజలను ఆర్మీ అనుమతిస్తున్నది. సరిహద్దులోని కీలక సైనిక శిబిరాల సందర్శనకూ పౌరులను అనుమతిస్తే వారిలో జాతీయ సమగ్రత భావన పెంపొందుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే పర్యాటకులను ఏయే ప్రాంతాల సందర్శనకు అనుమతించాలన్న దానిపై సైన్యం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది.

అసలేం జరిగిందంటే..

వాస్తవానికి స్వాతంత్య్రం తర్వాత, మూడున్నర దశాబ్దాల వరకు సియాచిన్‌లో భయానక వాతావరణం వల్ల సైనికులను గస్తీకి ఉంచలేదు. అయితే పాకిస్థాన్ చొరబాట్లకు ప్రయత్నించడం, యుద్ధ కవ్వింపులు, వ్యూహాత్మక ప్రాంతం నేపథ్యంలో, 1984 నుంచి సియాచిన్‌లో మన సైనికుల కవాతు మొదలైంది. ప్రతి ఏడాది మూడు బెటాలియన్ల నుంచి 3-4 వేలమంది సైనికులు ఇక్కడ భద్రతా సేవలు అందిస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు నెలల వరకు గస్తీ కాస్తుంది. స్వాతంత్య్రం తర్వాత 1949 లో, భారత్,పాక్‌ల మధ్య ఒక సంధి రేఖ ఒడంబడిక కుదిరింది. ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలక బృందం కూడా దాన్ని గుర్తించింది. 1956-58లో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సియాచిన్‌తోపాటు ఇతర హిమనీనదాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రచురించింది. పాకిస్థాన్ వైపు నుండి సియాచిన్ గ్లేసియరుకు జరుగుతున్న చొరబాటు యాత్రలను గమనించిన కల్నల్ నరేంద్ర కుమార్, 1977లో ఒక యాత్ర చేపట్టి పాకిస్థాన్ వారు జరిపిన చొరబాట్లకు ఋజువులుగా వారు వదలిపెట్టిన వస్తువులను తీసుకువచ్చాడు.

1981లో నరేంద్రకుమార్ మరో యాత్ర చేసారు. సియాచెన్‌లోని సియాలా, బిలాఫోండ్‌లాలను ఆక్రమించాలన్న పాకిస్థాన్ ఆలోచనలను భారత్ సైన్యం పసిగట్టింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు భారత సైన్యం నిశ్చయించింది. లడఖ్ స్కౌట్స్, కుమావోన్ రెజిమెంటుకు చెందిన సైనికులు భారత వైమానిక దళం సాయంతో ఏప్రిల్ 13 న బిలాఫోండ్ లా, 14 న సియా లానూ ఆక్రమించారు. హెలికాప్టరు గస్తీలో పాకిస్థాన్ ఈ సంగతిని కనుక్కుంది. 300 పైచిలుకు భారత సైనికులను అక్కడి నుండి ఖాళీ చేయించేందుకు పాకిస్థాన్ సైన్యం తన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, నార్దర్న్ లైట్ ఇన్‌ఫాంట్రీలతో ఒక ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. ఈ చర్య సియాచిన్‌లో తొట్టతొలి సాయుధ ఘర్షణకు 1984 ఏప్రిల్ 25న దారితీసింది. దీన్ని ఆపరేషన్ మేఘదూత్ అంటా రు. ఆ తర్వాత కూడా ఆపరేషన్ రాజీవ్, ఆపరేషన్ వజ్రశక్తి/ఆపరేషన్ కైదత్, ఆపరేషన్ ఐబెక్స్, ఆపరేషన్ త్రిశూల్ వంటి దాడులు చేసింది. ఆ తర్వాత అడపా దడపా దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఇవీ అక్కడి పరిస్థితులు

అక్కడి సైనికుల దినచర్య విషయానికొస్తే... సైనికులు చెక్క బళ్లలపై స్లీపింగ్ బ్యాగ్స్‌తో పడుకుంటారు. కానీ నిద్ర కూడా వాళ్లకు ప్రమాదకరమే. ఆక్సీజన్ తక్కువగా ఉండటంతో ఒక్కోసారి నిద్రలోనే వాళ్లు ప్రాణాలు కోల్పోతారు. ఆ ప్రమాదాన్ని నివారించడానికి సైనికులను గార్డులు మధ్య మధ్యలో మేల్కొలుపుతుంటారు. నిజానికి అంత ఎత్తులో నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఇక స్నానం గురించి ఆలోచించే సాహసం కూడా వారు చేయరు. ఆ వాతావరణానికి చర్మం చాలా సున్నితంగా మారిపోతుంది. షేవింగ్ చేసుకుంటే చర్మం ఊడొచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ పనికి కూడా వాళ్లు దూరంగా ఉంటారు. ఒక్కో సైనికుడికి మూడు నెలల పాటు అక్కడ పోస్టింగ్ వేస్తారు. వాళ్లకు కేటాయించిన ప్రాంతంలో మాత్రమే సైనికులు ఆ మూడు నెలలూ పహారా కాయాల్సి ఉంటుంది. భారత్-పాక్‌లమధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండటంతో సైనికులకు అక్కడ పెద్దగా పనుండదు. ఉన్నంత సేపు ఖాళీగానే సమయాన్ని గడపాల్సి వస్తుంది. సియాచిన్‌ను గస్తీ కాయడంలో వైమానిక దళం కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడ సేవలందించే హెలికాప్టర్ పేరు చీతా.

అంత ఎత్తుకు ఆ హెలికాప్టర్లు మాత్రమే వెళ్లగలవని ఆర్మీ చెబుతున్నది. కాల్పుల విరమణకు ముందు ఒక్కో చెక్ పాయింట్ దగ్గర కేవలం 30 సెకన్లు మాత్రమే అవి ఆగేవి. ప్రత్యర్థులు స్పందించే లోగానే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఇలా చేసేవి. ఇప్పుడు కూడా సైనికులను అన్ని పరిస్థితులకు సమాయత్తం చేసేందుకు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. సైనికులకు అక్కడ వినోదానికి ఎలాంటి సాధనాలూ అందుబాటులో ఉండవు. ఎటు చూసినా తెల్లగా మెరిసే మంచు కొండల మధ్యే నిత్యం అప్రమత్తం గా ఉంటూ కఠిన వాతావరణాన్ని ఎదుర్కొంటూ కాలం గడపాలి. ముందే చెప్పినట్టు సియాచిన్ యుద్ధక్షేత్రమే కాదు, మృత్యుక్షేత్రం కూడా. ఇప్పటివరకూ దాదాపు 900 మంది భారత జవాన్ల వీరమరణం పొందారు. మొన్న లాన్స్ నాయక్ హనుమంతప్ప కూడా ఇలాగే ప్రాణాలు త్యాగం చేశాడు. పొరుగుదేశం కాల్పులే కాదు, విభిన్న వాతావరణ పరిస్థితులు, మంచు చరియలు విరిగిపడటం, ఇలా ఎన్నో కారణాలకు ప్రాణాలు కోల్పోయారు జవాన్లు. అందుకే ప్రపంచంలో అత్యంత భయంకరమైన యుద్ధక్షేత్రాల్లో ఒకటి సియాచిన్ గ్లేసియర్.

పర్యాటకులకు అనుకూలమేనా?

పర్యాటక ఆసక్తి ఉన్న ప్రజలు అన్ని రకాల ప్రాంతాలనూ సందర్శించాలనుకోవడం సహజమే. అయితే సియాచిన్, కార్గిల్ వంటి ప్రాంతాల సందర్శన అంత సులభమేమీ కాదు. నిత్యం శత్రువుల దాడులతోపాటు ప్రతికూల వాతావరణం మూలంగా పర్యాటకులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత సైనికుల మీదా పడుతుంది. అయితే పర్యాటకులను అనుమతించడం వల్ల అక్కడ సైనికులు ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో డ్యూటీ చేస్తున్నారు? వాళ్లకు రోజూ ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? వంటి విషయాలను పర్యాటకులు స్వయంగా చూడగలుగుతారు.తద్వారా జాతీయ సమగ్రతా భావన పెంపొందుతుందన్నది వారి అభిప్రాయం. ఇప్పటికే లడఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పర్యాటనకు అనుమితులిచ్చిన సైన్యం మరిన్ని ప్రాంతాలను పర్యటించేందుకు అనుమతించాలని భావిస్తున్నది. అలాగే సియాచిన్‌లోనూ పర్యాటనకు అనుకూలంగా ఉన్న లొకేషన్లను గుర్తించే పనిలో పడింది.

ఇప్పటికే దేశంలోని పలు సైనిక శిక్షణా కేంద్రాలు, సంస్థల సందర్శనకు ప్రజలను ఆర్మీ అనుమతిస్తున్నది. సరిహద్దులోని కీలక సైనిక శిబిరాల సందర్శనకూ పౌరులను అనుమతిస్తే వారిలో జాతీయ సమగ్రతా భావన పెంపొందుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పర్యాటకులను ఏయే ప్రాంతాల సందర్శనకు అనుమతించాలన్న దానిపై సైన్యం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది. మజానే మజా అన్నీ అనుకూలించి సియాచిన్‌లో సందర్శనకు ప్రజలకు అనుమతిస్తే అక్కడి వాతావరణ పరిస్థితులపై ప్రజల్లో అవగాహన రావడంతోపాటు పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చినట్లవుతుందని సైన్యం భావిస్తున్నది. అదే గనుక సాధ్యమైతే మంచుదుప్పటి కప్పుకున్న సియాచిన్‌ను చూసిన ఆనందం ఒక జీవితకాలం నిలిచిపోతుందని, దేశభక్తి, సైనిక శక్తిని కూడా పెంపొందించినట్లు ఉంటుందన్నది అధికారుల అభిప్రాయం. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో వేచి చూడాల్సిందే.

572
Tags

More News

VIRAL NEWS