మిస్టర్ కాడింగ్టన్


Sun,June 9, 2019 01:55 AM

Mistery-kadindan
ఆరెంజ్ బ్లాజమ్ హెయిర్ లోషన్ వాసన సర్. ఈ ఇంట్లో ఏలిస్ తప్ప మరెవరూ దాన్ని వాడరు సార్. హంతకుడు ఎవరో కానీ, తెలివిగా హత్య చేసాడు సర్. నేను ట్రేతో వైన్‌ని ఎప్పుడు తీసుకెళ్తానో అందరికీ తెలుసు. నేను వచ్చే సమయంలో కాడింగ్టన్ దగ్గర వేచి ఉండి, నేను రాగానే చంపి లైట్స్ ఆఫ్ చేసేసారు.

ఆవిశాలమైన గ్రీన్ హౌస్‌లోని లైట్లన్నీ వెలుగుతున్నాయి. గ్లాస్ హౌస్‌లోని ఫౌంటెన్‌లోని నీళ్ళు పైకి ఎగచిమ్మి కిందికి పడిపోతున్నాయి. అక్వేరియంలో రంగురంగుల చేపలు ఈదుతున్నాయి. పంజరంలోని పక్షులు నిద్ర పోతున్నాయి. బయట మంచు కురుస్తున్నది.
ఆ ఇంటి బట్లర్ జేమ్స్, మరణించిన తన ఇంటి యజమాని కుటుంబసభ్యుల వైపు గౌరవంగా చూస్తూ నిలబడ్డాడు. కానీ, అతని కుడిచేతిలో మాత్రం వారికి గురి పెట్టబడ్డ రివాల్వర్ ఉంది.
ఆ ఇంటి యజమాని పెద్ద కొడుకు మధ్యవయస్కుడైన హెర్బర్ట్ పక్కనే ఆలిస్ కూర్చుని ఉంది. ఎరుపు, తెలుపు డ్రెసింగ్ గౌనులోని ఆమె హతుడైన ఆ ఇంటి యజమానికి సెక్రటరీ. ఆమె ఆకర్షణీయంగా ఉంది.
హెర్బర్ట్ తమ్ముడు మేథ్యూ సిగార్ తాగుతూ నేలవంక చూస్తున్నాడు. అతనికి కొద్ది దూరంలో నేలమీద పగిలిన గాజు ముక్కలు, వైన్ సీసా ముక్కలు ఉన్నాయి.
హెర్బర్ట్ ఏదో గొణుగుతూ సోఫాలోంచి లేస్తే బట్లర్ జేమ్స్ తన చేతిలోని రివాల్వర్‌ని అతనివైపు తిప్పి చెప్పాడు.
మిస్టర్ హెర్బర్ట్! నేను ఇప్పటికే అందరికీ చెప్పాను సర్. పోలీసులు వచ్చే దాకా ఇక్కడి నించి ఎవరూ కదలకూడదు. పరిస్థితులు బలవంతం చేయబట్టే నేనీ చర్యని చేపట్టాల్సి వచ్చినందుకు నాకు విచారంగా ఉంది.
వాళ్ళు అరగంట వేచి ఉన్నాక అర్ధరాత్రి పోలీసులు ఆ ఇంటికి వచ్చారు. వారితోపాటు డాక్టర్ కూడా.
నా పేరు మేరన్. నేను డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ను. ఇతను మా కానిస్టేబుల్ జో. ఈయన డాక్టర్ ఫెలిక్స్. ఏం జరిగింది? మీలో నాకు ఫోన్ చేసిన జేమ్స్ ఎవరు?
నేనే. నేనీ ఇంటి బట్లర్. మీతో ఒంటరిగా మాట్లాడాలి జేమ్స్ కోరాడు.
* * *

వాళ్ళిద్దరూ స్టడీ రూంలోకి వెళ్ళాక అతను చెప్పసాగాడు.
ప్రతీ రాత్రి నిద్రపోయే ముందు మా ఇంటి యజమాని మిస్టర్ కాడింగ్టన్ గ్రీన్ హౌస్‌లోకి వెళ్తాడు. ఆయనకి అక్కడ వైన్స్ సర్వ్ చేయడం నాకు అలవాటు. మొక్కల్ని, పక్షుల్ని, చేపలను చూస్తూ తాగాక ఆయన వెళ్ళి పడుకుంటాడు. ఆయనకి అందమైనవి, ఖరీదైనవి అంటే ప్రాణం. ఆయన వాడే గ్లాసులు, ప్లేట్లు, వైన్ అన్నీ ఖరీదైనవి, విలాసవంతమైనవి. పావు తక్కువ పదకొండుకి నేను ఆయన దగ్గరకి ట్రేలో వైన్ సీసా, గ్లాస్‌తో బయలుదేరాను
అయన పిసినారి అని విన్నాను? ఇన్స్‌పెక్టర్ మేరన్ ప్రశ్నించాడు.
అవును. తన డబ్బుని తను తప్ప ఇతరులు అనుభవించకూడదని అనుకుంటాడు. తన కోసం విచ్చలవిడిగా ఎంతైనా ఖర్చు చేస్తాడు కానీ, తన స్వంతవాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాడు. మీరు వాడిన పదం కరెక్ట్ సర్. పిసినారి
తర్వాత...?
నేను గ్రీన్ హౌస్‌లోకి ట్రేతో వెళుతూ, ఆయన ఎవరితోనో పెద్దగా అరిచి మాట్లాడటం వినపడి ఆగిపోయాను. ఆయన ఎవరి మీద అరుస్తున్నాడో ఆ వ్యక్తి నాకు కనపడలేదు. అకస్మాత్తుగా నాకు దెబ్బ కొట్టిన చప్పుడు, ఆయన అరుపు వినిపించాయి. తక్షణం గ్రీన్ హౌస్‌లోని లైట్లు ఆరిపోయాయి. తర్వాత ఆ చీకట్లో ఎవరో లోపల నించి నావైపు పరిగెత్తుకు వచ్చారు. అతను నన్ను గుద్దుకోవడంతో నా చేతిలోని ట్రే కింద పడిపోయింది. నేను అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాను. కానీ, అతను నన్ను విదిలించుకుని వేగంగా ఇంట్లోకి పారిపోయాడు

తర్వాత...?
నేను ఇంట్లోని అందరినీ నిద్ర లేపి గ్రీన్ హౌస్‌లోకి తీసుకు వచ్చాను. ఆ బట్టతల వ్యక్తే హెర్బర్ట్. అతని పక్కన ఉన్నది మిస్ ఏలిస్. మా యజమాని కాడింగ్టన్ సెక్రటరీ. రెండో అతను మేథ్యూ. కుక్ వీకెండ్‌కి వెళ్ళిపోయింది. మేం లైట్ వేసి చూస్తే మా యజమాని తలమీద గాయం నుంచి నెత్తురు కారుతున్నది. ఆయన కపాలం పగిలి మరణించాడని తెలీగానే నేను రివాల్వర్‌తో బెదిరించి, అందర్నీ కదలకుండా లివింగ్ రూంలో కూర్చోబెట్టి మీకు ఫోన్ చేసాను. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవద్దని హెచ్చరించాను
నువ్వు హంతకుడి కోసం ఇంటిని వెదికావా? బయట మంచులో పాదముద్రలు కనపడేవేమో?
అది అనవసరం అనుకున్నాను సర్
ఎందుకని?
నా ఉద్దేశంలో ఇది ఆయన ఇద్దరి కొడుకుల్లో ఒకరి పని సర్

ఎందుకలా అనుకుంటున్నావు?
మాస్టర్ ఆరోగ్యం సరిగ్గా లేదు సర్. ఇక నేను నా ఉద్యోగం నుంచి విరమించుకుంటానని రెండు వారాల క్రితమే చెప్పాను. వచ్చేవారం వెళ్ళిపోవాలి. నా స్వగ్రామానికి వెళ్ళి రిటైర్డ్ జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను. లేదా ఇక్కడే కొనసాగేట్లయితే వాళ్ళని రివాల్వర్‌తో బెదిరించే వాడిని కాను
సరే. ఆ ఇద్దరి కొడుకుల్లో ఎవరికి తన తండ్రిని చంపాల్సిన అవసరం ఉంది? ఇన్స్‌పెక్టర్ అడిగాడు.
అందుకు ఇద్దరికీ అవసరాలున్నాయి సర్. హెర్బర్ట్, మేథ్యూలకి తండ్రి చాలా తక్కువ డబ్బిస్తాడు. వాళ్ళింకా చిన్న పిల్లలే అనుకుంటారు తప్ప, మధ్యవయస్కులయ్యారని ఆయన అనుకోడు. ముఖ్యంగా హెర్బర్ట్‌కి తండ్రినించి ఓ సమస్య ఉంది సార్
ఏమిటా సమస్య?
ఏలిస్‌తో ప్రేమలో పడి హెర్బర్ట్ ఆమెని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ, తండ్రి అందుకు అంగీకరించలేదు. తన మాట వినకుండా చేసుకుంటే, అతనికి తన ఆస్తిలో భాగం ఇవ్వనని చెప్పాడు
ఏలిస్ ఎలాంటిది?
ఆమె ప్రేమించేది ఆస్తిని తప్ప హెర్బర్ట్‌ని కాదని నా అనుమానం సర్. అంటే, తండ్రి మరణిస్తే హెర్బర్ట్‌కి ఆస్తి దక్కుతుంది
ఏలిస్‌ను పెళ్ళి చేసుకోవచ్చు. అవునా?
అవును సర్

సరే. నీ గురించి చెప్పు
నా గురించా సర్?
అవును. పోలీస్ ఆఫీసర్‌గా నేను అందరినీ అనుమానించాలి. మిస్టర్ కాడింగ్టన్ మరణం వల్ల కొడుకులు ఇద్దరికే కాక ఇంకెవరికైనా లాభం కలుగుతుందా?
తన విల్లులో ఆయన నాకు, కుక్‌కు చెరో రెండు వేల పౌన్లు రాసానని చెప్పారు సర్. ఈ ఇల్లు, ఇందులోని వస్తువులను పిల్లలు తన తదనంతరం అమ్మేస్తారని తెలుసు కాబట్టి, పింగాణీ వస్తువులు, గ్లాసులు, వైన్ సీసాలు మాకు చెందాలని రాసారు. తర్వాత మేం హోటల్ పెట్టుకోవాలని అనుకుంటున్నామని ఆయనకి తెలుసు
మాకంటే?
నా భార్య కుక్ సర్. కానీ, ఆయన చాలా సంపన్నుడు కాబట్టి ఇద్దరు కొడుకులకీ పెద్ద ఎత్తున ఆస్తి వస్తుంది సర్. గ్రీన్ హౌస్‌లో లైట్లు ఆరిపోక మునుపు నేను మిస్టర్ కాడింగ్టన్ అరిచే వ్యక్తిని క్షణకాలం చూశాను. అతని నెత్తిమీద జుట్టు కనపడింది
అంటే అది మేథ్యూ పనా?
కాదు సర్

ఎందుకు కాదు? హెర్బర్ట్‌కు బట్టతల కదా? ఇన్‌స్పెక్టర్ అడిగాడు.
జేమ్స్ జేబులోంచి ఓ విగ్ తీసి చూపించి చెప్పాడు. నేను అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాక ఇది నాకు నేలమీద కనిపించింది
అంటే, మేథ్యూలా కనపడాలని అనుకుని దీన్ని పెట్టుకున్నాడంటావా?
అలాగే అనిపిస్తున్నది సర్. విగ్ పెట్టుకుంటే హెర్బర్ట్ మేథ్యూలానే కనిపిస్తాడు
ఇప్పుడు అతను ఈ విగ్ గురించి భయపడుతూండవచ్చు కదా?
అలా అనుకోవచ్చు సర్. కానీ, నిజానికి నా వృత్తిలో అన్నీ గమనిస్తూండాలి తప్ప ఒక్కటీ బయటకి చెప్పకూడదు. ఈ విగ్ లోపలి భాగాన్ని వాసన చూడండి సర్
తియ్యటి సెంట్ వాసన ఇది ఇన్‌స్పెక్టర్ వాసన చూసి చెప్పాడు.
ఆరెంజ్ బ్లాజమ్ హెయిర్ లోషన్ వాసన సర్. ఈ ఇంట్లో ఏలిస్ తప్ప మరెవరూ దాన్ని వాడరు సార్. హంతకుడు ఎవరో కానీ, తెలివిగా హత్య చేసాడు సర్. నేను ట్రేతో వైన్‌ని ఎప్పుడు తీసుకెళ్తానో అందరికీ తెలుసు. నేను వచ్చే సమయంలో కాడింగ్టన్ దగ్గర వేచి ఉండి, నేను రాగానే చంపి లైట్స్ ఆఫ్ చేసేసారు. ముసలివాడినైన నేను వాళ్ళని పట్టుకోలేనని వాళ్ళకి తెలుసు. విగ్‌ని కావాలనే కింద పడేసి వెళ్ళిపోయారు, తన సోదరుడి మీదకి హత్య వెళ్ళాలని. ఇది మేథ్యూ చేసిన పనై ఉండచ్చు. లేదా ఏలిస్ పనై ఉండచ్చు.
* * *

నువ్వు బట్లర్‌గా నీ జీవితాన్ని వృధా చేసుకున్నావు. నువ్వు పోలీస్ శాఖలో చేరి ఉండాల్సింది ఇన్‌స్పెక్టర్ మేరన్ చెప్పాడు.
నిజంగా అంటున్నారా సర్?
అవును. మనిద్దరి వృత్తుల్లో మనుషుల్ని పరిశీలించడం తప్పనిసరి. సరే, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి ఆ ముగ్గురితో మాట్లాడి వస్తాను
కొద్దిసేపటికి ఇన్స్‌పెక్టర్ మళ్ళీ స్టడీ రూంలోకి వస్తే అక్కడ వెండి కప్పులని తుడిచే బట్లర్ కనిపించాడు.
ఎంత తెలివైన వాడైనా హంతకుడు చేసే చిన్న తప్పు వాళ్ళని పట్టిస్తుంది అన్నది నేను అనుభవ పూర్వకంగా నేర్చుకున్నాను ఇన్‌స్పెక్టర్ చెప్పాడు.
మిస్ ఏలిస్‌ని చూస్తే నాకు జాలిగా ఉంది సర్
ఏలిస్‌ని కాదు, నిన్ను చూస్తే నాకు జాలిగా ఉంది
నన్నా? బట్లర్ జేమ్స్ ఆశ్చర్యంగా అడిగాడు.

అవును. నువ్వు దాదాపుగా తప్పించుకున్నావు. నేను గ్రీన్ హౌస్ బయట ట్రేలోంచి జారి పడి పగిలినవి చూసే దాకా. అవి నిన్ను పట్టిచ్చాయి ఇన్‌స్పెక్టర్ పగిలిన గాజు గ్లాస్, వైన్ సీసా ముక్కలని చూపించి చెప్పాడు.
సర్? బట్లర్ అయోమయంగా చూసాడు.
నువ్వు ప్రతీ రాత్రి ట్రేలో గ్లాస్గి, వైన్ బాటిల్‌ని నీ యజమాని దగ్గరకి తీసుకువెళ్తావు. ఆయనకి ఖరీదైనవే ఇష్టం. ప్రతీ రాత్రి నువ్వు వెనిస్ నుంచి దిగుమతి చేసుకున్న కట్ గ్లాస్గి, 1942 చెబర్ వైన్ సీసాని తీసుకెళ్తావని మిస్ ఏలిస్ చెప్పింది. కానీ, ఇవాళ నువ్వు సాధారణ గ్లాస్గి, చవక వైన్‌ని తీసుకెళ్ళావు. నీ యజమాని చూస్తే కోప్పడేవి ఎందుకు తీసుకెళ్ళావు? కారణం ఊహించడం తేలిక. ఆయన వాటిని చూసి నిన్ను కోప్పడడు కాబట్టి. కారణం ఆయన మరణించాడు. ఆయన తదనంతరం గ్లాస్లు, వైన్ సీసాలు నీకే చెందుతాయి కాబట్టి. దాదాపు తొమ్మిది వందల పౌన్ల విలువైన వాటిని నువ్వు పగుల కొట్టదలచుకోలేదు. నీ తెలివైన అల్లిక దీంతో కూలిపోయింది. అవునా?
పూర్తిగా అంగీకరిస్తాను సర్ బట్లర్ వాడిపోయిన మొహంతో చెప్పాడు.
(విక్టర్ కేనింగ్ కథకి స్వేచ్ఛానువాదం)

- మల్లాది వెంకట కృష్ణమూర్తి

179
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles