ఒక్క ఫోన్ కాల్...


Sun,June 9, 2019 01:31 AM

phone
వెయ్యి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అతడి ప్రయాణం కూడా ఒక్క వినూత్న ఆలోచనతోనే ప్రారంభమైంది. బాల్యం నుంచి అంతర్జాతీయ వ్యవహారాలను రేడియోల్లో శ్రద్ధగా వినేవాడు. కొత్తదనం కోసం కలలు కనేవాడు. స్నేహితులంతా మూకుమ్మడిగా డిగ్రీలు, పీజీల వెంట పరిగెడితే.. అతడు మాత్రం చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అనేక ఎత్తుపల్లాలను అధిగమించి 1996లో జస్ట్ డయల్ స్టార్టప్‌ను ప్రారంభించాడు. ఆ ఒక్క ఫోన్ కాల్ ఐడియానే అతని జీవితాన్ని మార్చేసింది. అతడే వీఎస్‌ఎస్ మణి (వెంకటాచలం స్థాను సుబ్రమణి) ఆయన విజయ ప్రస్థానమిది.

వీఎస్‌ఎస్ మణి కోల్‌కతాలో జన్మించాడు. స్థానికంగా చార్టెడ్ అకౌంటెన్సీ పూర్తి చేశాడు. ఢిల్లీలో ఉన్నత చదువులు చదివేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆర్థిక స్తోమత లేక 1987లో యునైటెడ్ డాటాబేస్ ఇండియా కంపెనీలో పనిచేశాడు. అప్పట్లో 888 8888 888 నంబరు ముంబైలోని కాండీవాలి ఎక్సేంజీకి సంబంధించినది. కాలక్రమేణ ఈ నంబరును మణి సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ నంబర్‌ను ఉపయోగించి వినూత్నంగా ఏమైనా చేయాలనుకున్నాడు. 1987లో వీఎస్‌ఎస్ మణికి అధిక వేతనం లభించినా మనసులో ఇంకేదో చేయాలనే నిరాశ. ఇంకేదో సాధించాలని ఉండేది. ఆ ఆలోచనతోనే ఢిల్లీకి గుడ్‌బై చెప్పి ముంబై బాటపట్టాడు. వెడ్డింగ్ సెర్మనీ పేరుతో మ్యారేజీ బ్యూరో ఏర్పాటు చేశాడు. నిర్వహణ కష్టం కావడం, నమ్మిన వాళ్లు మోసం చేయడంతో అమూల్యమైన కాలాన్ని నష్టపోయాడు. 1994లో ముంబై కేంద్రంగా స్టార్టప్ ప్రారంభించాలనుకున్నాడు. ఉద్యోగం లేదు. వ్యాపార ప్రయత్నం వికటించింది. ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ఒక అట్లాస్ సైకిల్ తప్ప తనకంటూ ఏమీ మిగలలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తనను నమ్మి ఎవరు డబ్బులిస్తారు. తన కల ఎలా సాకారమవుతుందని ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆ సమయంలోనే అతడి కల నెరవేర్చుకునేందుకు ఒక సాహసోపేతమైన ఐడియా వచ్చింది.
phone1

భార్య నగలు అమ్మి..

తాను ప్రారంభించబోయే స్టార్టప్‌కు ముందస్తుగానే కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తన వ్యాపారానికి రూ. 50 వేలు పెట్టుబడి అవసరం. 1990లలో యాభై వేలంటే చాలా పెద్దమొత్తమే. ఉద్యోగం లేదు. ఇంట్లో వాళ్లను అడిగే పరిస్థితి లేదు. పోనీ బంధువులను అడుగుదామా అంటే అప్పటికే పనీ పాట లేక తిరుగుతున్నాడు అని సూటిపోటి మాటలన్నారు. మళ్లీ ఏదో ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరు.. వచ్చిన వేతనంతో హాయిగా కుటుంబంతో గడపవచ్చు అని ఉచిత సలహాలు ఇస్తూనే ఉన్నారు. అయినా ఆయనలోని దృఢ సంకల్పం మరో సాహసానికి తెర తీసింది. తాను ప్రారంభించబోయే కంపెనీకి మూలధనం కోసం భార్య ఒంటిపై నగలన్నీ అమ్మేశాడు. డబ్బులు చేతికొచ్చిన వెంటనే ప్రయత్నాల్ని ముమ్మరం చేశాడు.

ఆరుగురితో..

ముంబైలో డిగ్రీ చదువుతున్న కొంతమంది విద్యార్థులతో తన ఆలోచనను పంచుకున్నాడు. వారిలో మెరికల్లాంటి ఆరుగురిని ఎంపిక చేసుకున్నాడు మణి. 1994 - 1995 రెండేళ్లు వారికి నెల నెలా జీతాలు చెల్లించాడు. ఉద్యోగంలో చేరిన ఆరుగురు ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ముంబైలో ప్రతీ తలుపును తట్టేవారు. ఇంటింటికీ పూర్తి వివరాలు, ఫోన్ నంబరు సేకరించేవారు. ఇలా రెండేండ్ల అనంతరం 1996లో వీఎస్‌ఎస్ మణి చిన్న గ్యారేజీని అద్దెకు తీసుకున్నాడు. కొన్ని కంప్యూటర్లను అందులోకి అమర్చాడు. ఆరుగురితో జస్ట్ డయల్ సంస్థను ప్రారంభించాడు.

నేను మీకు ఏ విధంగా సాయపడగలను!

అప్పటిదాకా ఎవరిదైనా అడ్రస్, ఫోన్ నంబర్ కావాలంటే టెలిఫోన్ డైరెక్టరీలతో పోటీపడి పెద్ద పెద్ద గ్రంథాలు తిరగేసే వారు జనాలు. జస్ట్ డయల్ వచ్చాక ఆ సమస్య నుంచి ప్రజలు బయటపడ్డారు. ప్రారంభంలో వినియోగదారులు 888 8888 888 హాట్ లైన్ నంబరుకు కాల్ చేసి వారు ఏ సేవ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెబితే ఆపరేటర్లు దాని గురించి చెప్పేవారు. మెయిల్ ద్వారా కూడా సమాచారం పొందేవారు. ఆసుపత్రులు, ప్రముఖ ప్రదేశాలు, దూరం, వాటికి సంబంధించిన ఫోన్ నంబర్లు, అడ్రస్ చెప్పేవారు.ప్రారంభంలో పూర్తిగా ల్యాండ్ లైన్ మీద ఆధారపడే పరిస్థితి ఉండేది. వినియోగదారులకు ఫోన్ బిల్లు భారమవుతుందని తెలిసి www.justdail.com వెబ్‌సైట్‌ను మణి ప్రారంభించారు. అప్పటి నుంచి ఎవరికి కావాల్సిన సమాచారాన్ని వారు జస్ట్ డయల్‌ను శోధించి తెలుసుకుంటున్నారు.

విస్తరణ..

2019 జనవరి నాటికి కంపెనీ నికర ఆదాయం 900.13 కోట్లు. ప్రస్తుతం సంస్థలో 12 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాల్లో జస్ట్ డయల్ సేవలు అందిస్తున్నది. జస్ట్ డయల్ కేవలం సమాచారాన్ని మాత్రమే పంచకుండా ఈ కామర్స్‌పై దృష్టిపెట్టారు మణి. త్వరలో జస్ట్ డయల్ పేరిట క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నారు. ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆన్‌లైన్ బేస్‌డ్ బిజినెస్ ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నేండ్లలో ఎవ్వరికీ లంచాలు ఇవ్వకుండా.. ఎంతో మంది బెదిరించినా, నోటీసులు పంపించినా ఎదుర్కొంటూ అంతర్జాతీయ స్థాయిలో జస్ట్ డయల్‌కు గుర్తింపు తెచ్చారు మణి. ఆయన ఒక్కడి ఆలోచన వేలాది మందికి ఉపాధినిస్తున్నది. లక్షలాది మందికి సమాచారాన్ని పంచుతున్నది.
phone2

విజయ రహస్యం

ఒకప్పుడు తానొక్కడు ఉపాధి పొందడమే కష్టంగా మారిన మణి ప్రస్తుతం ఎన్నో వేల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఒకప్పుడు సైకిల్‌పై తిరిగిన మణి ప్రస్తుతం బీఎండబ్ల్యూ 7, ఆడీ క్యూ 7 కార్లలో తిరుగుతున్నాడు. ఎవరైనా మీ విజయ రహస్యం ఏంటని మణిని అడిగితే ఒక్కసారి చేసిన తప్పును జీవితంలో మళ్లీ చేయను. ఇదే నా జీవిత రహస్యం అంటుంటారు మణి. కాలం మారుతున్న కొద్దీ తాను మారుతూ జస్ట్ డయల్ సేవల్ని విస్తరిస్తూ ముందు కు సాగుతున్నానని, ఇదే తన విజయ రహస్యమని మణి చెబుతుంటారు.

199
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles