విఫలమైన అద్భుతం


Sun,June 9, 2019 01:24 AM

Viphalamaina-adbutham
- సౌభాగ్య

ఆ ఆకును పిడికిలిలో పట్టుకుని పరుగున నదిని సమీపించి నదిపై నడిచాడు. అతనికి ఎంతో అద్భుతమనిపించింది. సన్యాసి ఎంత గొప్పవాడో అనుకున్నాడు. కాళ్లకు తడి అంటకుండా తనెలా నదిపై నడుస్తున్నాడో అతనికి అంతు బట్టలేదు. పిడికిలిలో ఉన్న ఆకు మీదకి అతని మనసు మళ్లింది. అందులో ఏదో రహస్యముంది. గొప్ప మంత్రముంది. అంతా దాని ప్రభావం అనుకున్నాడు. ఇంకా నాలుగడులు వేస్తే నదిని దాటుతాడు.

జగన్ సాధు సన్యాసుల పట్ల గౌరవ ప్రపత్తులు గలవాడు. వాళ్లని తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి సేవించి తరించేవాడు. వాళ్ల ఆశీర్వాదాల్ని అందుకునే వాడు.
జగన్ నదికి కుడివైపున గ్రామంలో నివసించే వాడు. నదికి ఎడమవైపు కొంత దూరం సాగాక ఒక కొండ గుహ ఉంది. ఆ గుహలో ఒక సన్యాసి నివసించేవాడు. అతను ఆంజనేయుని భక్తుడు. ఎందరో ఆ సన్యాసిని సందర్శించి ఆయన సాధువచనాల్ని విని సంతృప్తిగా తిరిగి వెళ్లేవారు. వాళ్లు ఆయనకు సమర్పించిన వాటిలో పళ్లను మాత్రమే స్వీకరించే వాడు. ఇతర వాటిని ముట్టుకునే వాడు కాదు.
జగన్ ఆ సన్యాసికి భక్తుడయ్యాడు. వీలయినప్పుడల్లా ఆ సన్యాసిని దర్శించేవాడు. ఆయన మాటలపై ఎంతో నమ్మకాన్ని ప్రదర్శించేవాడు.

ఈ క్రమంలో ఒకరోజు జగన్ ఆ సన్యాసిని సందర్శించి, ఆయనకు నమస్కరించి తాను తెచ్చిన ఫలాన్ని సమర్పించాడు. గురువు జగన్‌ను ఆశీర్వదించాడు. సన్యాసి దగ్గర సెలవు తీసుకొని తన గ్రామానికి తిరిగి వెళ్లిడానికి జగన్ నది దగ్గరకు వచ్చాడు. అక్కడికి రావాలంటే పడవలో రావాలి. తిరిగి వెళ్లాలన్నా పడవలోనే తప్పనిసరి. రెండు మూడు గంట క్రితం నదిదాటాడు. అప్పుడు నీళ్లు నిర్మలంగా ఉన్నాయి. పడవలు సజావుగా సాగుతున్నాయి. కానీ ఇంతలో ఎగువ ప్రాంతంలో వర్షం పడినట్టుంది. ప్రవాహ వేగం హెచ్చింది. నది అల్లకల్లోలంగా వుంది. అంత వేగంగా ఉన్న నీళ్లలో పడవలు నడవడం కూడా కష్టంగా ఉంది. పడవలు నడపడం కూడా కష్టమని ఎవరూ ఒప్పుకోరు. పైగా ఎవరి కోసం వెతికినా పడవ వాళ్లు అక్కడ లేరు.
జగన్‌కు ఆ రాత్రికి సన్యాసి గుహలో గడపడానికి ఎట్లాంటి అభ్యంతరం లేదు కానీ ఒక ముఖ్యమయిన పని నిర్వహించాల్సి ఉంది. ఏదో వ్యవహారానికి సంబంధించి దూరం నుంచి వచ్చిన వ్యక్తిని తప్పని సరిగా కలవాల్సి ఉంది. ఇక్కడేమో నదీ ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. నది దాటే మార్గమే కనిపించలేదు. జగన్‌కు ఏం చేయాలో తోచలేదు. ఉన్నట్లుండి జగన్ మనసులో సన్యాసి మెదిలాడు.ఆ సన్యాసి అతీత శక్తులు కలవాడనీ, అద్భుతాలు చెయ్యగలడనీ అందరూ అనుకుంటారు. ఆ సంగతి జగన్‌కు కూడా తెలుసు. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో తనను ఆదుకోవడం ఆయన ఒక్కడివల్లే అవుతుంది అని జగన్ గాఢంగా విశ్వసించాడు..

వెంటనే సన్యాసి గుహకు వెళ్లి తన పరిస్థితి వివరించాడు. నదీ ప్రవాహం గురించి చెప్పాడు.
సన్యాసి.. నిజమే నీకు ముఖ్యమైన పని వుంది. నదీ ప్రవాహం ఉధృతంగా ఉంది. నది దాటించే వాళ్లు లేరు అన్నాడు. అవును స్వామీ! మీరే ఏదో మార్గం చూపించాలి అన్నాడు జగన్. సన్యాసి కాసేపు ధ్యానంలో నిమగ్నమై ఒక ఆకు తీసుకొని దాంట్లో ఏదో రాసి మడిచి జగన్‌కు ఇచ్చి ఈ ఆకును నీ పిడికిలిలో పట్టుకొని వెళ్లు. సునాయాసంగా నువ్వు నదిని దాటగలవు. నదిపై నడిచి పోగలవు. కానీ నదిని దాటిన తరువాతే ఆ ఆకులో ఏం రాసి ఉందో చూడు. మధ్యలో చూస్తే ప్రమాదం. అని ఇచ్చాడు. జగన్ సంతోషంతో సన్యాసికి నమస్కరించి ఆ ఆకును పిడికిలిలో పట్టుకుని పరుగున నదిని సమీపించి నదిపై నడిచాడు. అతనికి ఎంతో అద్భుతమనిపించింది. సన్యాసి ఎంత గొప్పవాడో అనుకున్నాడు. కాళ్లకు తడి అంటకుండా తనెలా నదిపై నడుస్తున్నాడో అతనికి అంతు బట్టలేదు. పిడికిలిలో ఉన్న ఆకు మీదకి అతని మనసు మళ్లింది. అందులో ఏదో రహస్యముంది. గొప్ప మంత్రముంది. అంతా దాని ప్రభావం అనుకున్నాడు. ఇంకా నాలుగడులు వేస్తే నదిని దాటుతాడు. అప్పటిదాకా ఆగలేక పిడికిలి విప్పి ఆకులో రాసిన మాటల్ని చదివాడు.

జై ఆంజనేయ! అని రాసి ఉంది. ఇంతేనా అనుకున్నాడు. ఒక్కసారిగా నదిలో మునిగిపోయాడు. కానీ దగ్గర గట్టుమీద ఉన్న వాళ్లు కష్టపడి బయటకు లాగారు. చావుతప్పి కన్ను లొట్టపోయింది. కోలుకోవడానికి నెల రోజులు పట్టింది.
అద్భుతం అన్నది అక్కడ జరిగింది. కానీ జగన్ అద్భుతంలో చివరిదాకా వుండలేకపోయాడు.


ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.

538
Tags

More News

VIRAL NEWS