నెట్టిల్లు


Sun,June 9, 2019 01:08 AM

సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని లఘు చిత్రాలు రూపొందిస్తున్నారు నేటితరం దర్శకులు. సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా కథలను, కథనాలను రాసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. యూట్యూబ్‌లో ఈవారంలో విడుదలై ఎక్కువ మంది ప్రేక్షకులను మెప్పించిన కొన్ని షార్ట్‌ఫిలిమ్స్ ఇవి.

అమ్మాయి మందు తాగితే
Total views 309,319+
(జూన్ 1 నాటికి) Published on May 25, 2019

దర్శకత్వం: పవన్ ఎనగందుల
నటీనటులు : సోనియాసింగ్, సుష్మ గుప్తా, కిరణ్‌కుమార్ దత్తి

బీటెక్ చదివే అమ్మాయిలు మందు తాగాలనుకుంటారు. ఒకరు తాగితే మంచిది కాదని, ఇంకొకరు పర్లేదు అని కొంతసేపు తటపటాయిస్తారు. మొత్తానికి ఒక వోడ్కా ఫుల్‌బాటిల్ తెచ్చుకొని ధనాధన్ ఎత్తేస్తారు. బాగా తాగాక ఇంకో బాటిల్ కూడా కావాలనిపిస్తుంది. అర్ధరాత్రి మందు ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తుంటే జస్ట్ డయల్‌కు కాల్ చేస్తారు. గట్టిగా మాట్లాడుతుంటే ఒక అబ్బాయి వచ్చి ఏంటని ప్రశ్నిస్తాడు. ఇంకెప్పుడూ తాగమని, అల్లరి అస్సలే చేయమని బతిమిలాడుతారు. అతడు వెళ్లిపోగానే ఒక అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కి కాల్ చేస్తుంది. నిద్రలోంచి లేపి మరీ సతాయిస్తుంది. ఫోన్‌లో ఫుల్ అరుచుకుంటారు. ఇదిలా ఉండగా ఉదయం లేవగానే ఒక ఫోన్‌కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తగానే వాళ్లమ్మ గొంతు వినిపిస్తుంది. రాత్రి ఎందుకు అన్ని సార్లు ఫోన్ చేశావని అడుగుతుంది. ఒక్కొక్కటి గుర్తొస్తుంటే కిక్కొస్తుంది. ఒక్కసారిగా వాట్సప్ మెసేజ్‌లు, మెసెంజర్ మెసేజ్ వచ్చి పడుతుంటాయి. ఇక్కడ ఉండే ట్విస్ట్ బాగుంది. చిన్న అంశాన్ని చక్కగా వివరించాడు దర్శకుడు. తీసిన విధానం కూడా బాగుంది. ప్రతిభను మెచ్చుకోవచ్చు.

నిర్భయ;
Total views 5,724+ (జూన్ 1 నాటికి)
Published on May 30, 2019

దర్శకత్వం: గంటా మనోహరం
నటీనటులు : మనోహర్, ప్రమీల, రమణ, మల్లేష్

ఒక ఫొటో స్టూడియోలో ఫొటోగ్రాఫర్ షూట్ చేస్తుంటాడు. బండిలో పెట్రోల్ అయిపోతే బాటిల్‌లో తెచ్చుకొని బండిలో వేసి ఫొటో స్టూడియోకి వస్తుంది ఒక అమ్మాయి. తనకు ఒక పనిచేసి పెట్టాలని అడుగుతుంది. బీహెచ్‌ఈఎల్ గేటు దగ్గరకు రేపు ఉదయం ఎనిమిది గంటలకు రావాలని చెప్తుంది. ఒక చోటుకు తీసుకెళ్లి ఫొటోలు తీయాలని అంటున్నది. కాలనీలో బండి కడుగుతున్న ఓ అబ్బాయి తలపై బలంగా కొట్టి పరిగెడుతుంది. షాక్‌కు గురయిన ఫొటోగ్రాఫర్ శూన్యంలోకి వెళ్లిపోతాడు. అతణ్ణి కూడా వెంట తీసుకొని పరిగెడుతుంది. తను చెప్పినట్టు వినకపోతే తప్పుడు కేసులు పెట్టి జైలులో వేయిస్తానని భయపెడుతుంది. ఓ పార్కులో కూర్చోబెట్టి జరిగిన కథనంతా అతడికి చెప్తుంది. ఆఫీస్‌లో, ఇంటి దగ్గర తనకు జరుగుతున్న అన్యాయం గురించి వివరిస్తుంది. నిర్భయ క్యారెక్టర్ ధైర్యంగా ఉంటుందని చెప్పడానికి, ధైర్యంగా ఉండాలని చెప్పడానికి ఈ లఘుచిత్రాన్ని నిర్మించినట్టు అనిపించింది.

వస్తా నీ వెనుక
Total views 5,102+ (జూన్ 1 నాటికి)
Published on May 27, 2019

దర్శకత్వం: షో సందీప్ రవి
నటీనటులు : ఫోరెక్స్ చింటు, వాహిద, సాకేత్, శ్రావణ్

ఓపెన్ చేస్తే బార్ సెటప్‌లో షాట్స్ కొడుతూ కూర్చుంటాడు ఓ యువకుడు. మద్యం మత్తులో బ్యాక్‌గ్రౌండ్‌లో అతనికి భగవద్గీతలో పుట్టిన వానికి మరణం తప్పదు అనే లిరిక్స్ వినిపిస్తుంటాయి. తన పక్కన ఇంకా ఇద్దరు మిత్రులు ఉంటారు. వాళ్లు కూడా తాగుతుంటారు. వాళ్లిద్దరికి వినిపించని శబ్దాలు ఆ ఒక్కడికే వినిపిస్తాయి. ఆ ఇద్దరికీ కనిపించని అమ్మాయి ఇతనికి మాత్రమే కనిపిస్తుంది. వాళ్లిద్దరూ క్యాబ్‌లో వెళ్తారు నువ్వు మాత్రమే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తావని అతనికి చెప్తుంది. షాక్‌లో ఏం మాట్లాడాలో అతనికి అర్థం కాదు. పార్టీ అంతా అయిపోతుంది. ఎవరికి వారు వెళ్లిపోతారు. ఇతను మాత్రం తన కారు నడుపుకొంటూ వెళ్తాడు. రోడ్డు ప్రమాదం జరుగుతుంది. మద్యం సేవించి వాహనం నడిపేవారు చావు మీ పక్కనే ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండని సామాజిక బాధ్యతతో తీసిన చిత్రం ఇది. చాలా చిన్న కాన్సెప్ట్ అయినా రిచ్ వ్యాల్యూస్‌తో రూపొందించారు. వస్తా నీ వెనుక అని అన్నది ఎవరో తెలియాలంటే ఈ షార్ట్ ఫిలిం చూడాలి.

లవ్ మీన్స్
Total views 4,239+ (జూన్ 1 నాటికి)
Published on May 25, 2019

దర్శకత్వం: ఏ కృష్ణ ఉప్పాల
నటీనటులు : మనోజ్‌కుమార్ రెడ్డి, లాస్య, మునీర్

ప్రేమ అంటే అర్థం ఏంటి? ప్రేమకు నిర్వచనం ఏంటి? అయినా ప్రేమకు అర్థాలు, నిర్వచనాలు చెప్పుకొంటూ పోతే సమయం సరిపోదు. లవ్ మీన్స్ పేరుతో రూపొందిన ఈ లఘు చిత్రంతో ఏదో సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు. కొన్ని సీన్లు అవసరం లేకున్నా పెట్టారు అనిపిస్తుంది. డైలాగుల విషయంలో ప్రాస కోసం ఎక్కువ ట్రై చేశారు అనిపించింది. నలుగురు ఫ్రెండ్స్ కలిసి తాగుతూ మాట్లాడుకుంటుంటారు. తర్వాత రోజు చేయాల్సిన పనుల గురించి చర్చించుకుంటారు. స్నేహితుడి కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని ఫ్రెండ్‌షిప్ చూపించారు. తను ఇష్టపడ్డ అమ్మాయి రోడ్డు ప్రమాదంలో గాయాలై దవాఖానలో ఉందని తెలిసి వెళ్తాడు. రక్తం అవసరం అయితే ఇస్తాడు. ఆ విషయాన్ని ఓ చిన్నబ్బాయి చెప్తాడు. అప్పుడు రియలైజ్ అవుతుంది. ఎప్పుడో అతడు ఇచ్చిన ప్రేమ లేఖ చదువుతుంది. ఆమెపై అతనికున్న ఇష్టాన్ని తెలుసుకొని తన ప్రేమను వెతుక్కుంటూ వెళ్తుంది. ప్రేమను సాధించడం కోసం త్యాగాలు చెయ్యనవసరం లేదు. నిజాయితీగా ఉంటే చాలు అన్న విషయాన్ని బాగా చెప్పగలిగాడు. కొంత నిడివి ఎక్కువయింది.

- అజహర్ షేక్, సెల్: 9963422160

133
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles