మన తెలంగాణ ఘన తెలంగాణ


Sun,June 2, 2019 02:34 AM

తెలంగాణ వస్తే ఏమొస్తది? తెలంగాణ మనకు ఏమిస్తది? అనుకున్నం. ఏమొచ్చిందో కండ్లారా చూస్తున్నం. ఏమిచ్చిందో మనసారా ఆస్వాదిస్తున్నం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. మెట్టు మెట్టుకో ప్రగతి సాధిస్తూ బంగారు తెలంగాణ కోసం బారులు తీరుతున్నం. తెలంగాణ వస్తే ఏమొస్తది? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ.. మన భాష మనం సగర్వంగా మాట్లాడుకుంటున్నం. సినిమాలల్ల మన భాషకు పట్టాభిషేకం చేస్తున్నం. ఇయ్యాల మన కట్టు బొట్టుకే కాదు.. మన భాష.. యాసకు కూడా అందరూ ఫిదా అవుతున్నరు. తెలంగాణ స్టయిల్‌లో మాట్లాడటం ఇప్పుడొక ట్రెండ్. తెలంగాణ వేషధారణలో కనిపించడం ఇప్పుడొక ప్యాషన్. తెలంగాణ వంటకాల రుచి చూసి.. వాటి గురించి చెప్పుకోవడం ఇప్పుడొక హాబీ. తెలంగాణల అంతా మారుతున్నది. అట్లనే పండుగలు కూడా. పండుగలు.. జాతరలు.. కళలు పూర్వ వైభవం చాటుతున్నయి. ఉత్సవాలకు.. బ్రహ్మోత్సవాలకు.. జాతరలకు ఐకాన్‌గా తెలంగాణ మారుతున్నది. వాటితో అనుబంధం పెనవేసుకున్న కళలు ఊపిరి పోసుకుంటున్నయి. మన కళల వెంట.. చారిత్రక కథల వెంట అందర్నీ తిప్పించుకుంటుంది తెలంగాణ. మన చరిత్ర అధ్యయనమంటే ఒక ప్రత్యేకాసక్తి ఏర్పడుతున్నది. మన సంస్కృతి.. సాంప్రదాయాలు.. కళలు ఊపిరి పోసుకొని ఉత్సాహాన్ని పంచుతున్నయి. సామాజిక ఉత్తేజాన్ని కలిగిస్తున్నయి. ఈ ఐదేండ్లలో ఇది సాధ్యమైందంటే మీరు.. మేము.. మనం అందరమూ గర్వించదగ్గదే. ఆర్థికంగా.. సాంస్కృతికంగా.. సామాజికంగా.. ప్రగతి సాధిస్తూ ఆరో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా మన తెలంగాణ గురించి.. మన బతుకమ్మ ముఖచిత్ర కథనం.
TelanganaDay

Content: టీం బతుకమ్మ

Cover Image Courtesy: అనీష్ పెంటి

వైభవంగా మన పండుగలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత స్వపరిపాలనలో తిరిగి పూర్వ వైభవం సంతరించుకొనే దిశగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. కాకతీయ తోరణం, చార్మినార్ సౌందర్య మెరుగులు, అతిపెద్ద జాతీయ జెండావిష్కరణ, లవ్ హైదరాబాద్ వంటి స్వల్ప మార్పులు చేస్తూనే బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగలుగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. అధికారికంగా వీటిని నిర్వహించేందుకు నిధులు మంజూరు చేసింది. రంజాన్, క్రిస్మస్ పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ పండుగ కానుకలు కూడా ప్రదానం చేస్తూ వస్తున్నది.

యూనివర్సల్ రికార్డులోకి బోనం

ఐదేండ్లుగా బోనాలు వైభవోపేతంగా.. శోభాయమానంగా జరుగుతున్నాయి. గత ఏడాది జులై 15వ తేదీన బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జులై 29వ తేదిన మహంకాళి అమ్మవారి బోనాలు అట్టహాసంగా నిర్వహించారు. రూ. కోటి వ్యయంతో 3.80 కిలోల బంగారంతో అమ్మవారికి బోనం సమర్పించారు. జంటనగరాల్లోని 145 ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బతుకమ్మ యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి కూడా ఎక్కింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించిన బంగారు బోనంతో పాటు 1008 బోనాలు కూడా సమర్పించారు. దీనికి యూనివర్సల్ రికార్డు సొంతం అయ్యింది.
TelanganaDay2

గిన్నిస్ రికార్డులోకి బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల అంశం ప్రస్తావనకు వస్తే అన్నింటికంటే ముందుగా అందరినీ కదిలిస్తుంది బతుకమ్మ. తెలంగాణ వచ్చిన తర్వాతే ఈ వైభవం ఊపందుకుంది. 2016 అక్టోబర్ 8న హైదరాబాద్ లాల్‌బహుదూర్ స్టేడియం సాక్షిగా.. 20 అడుగుల ఎత్తయిన బతుకమ్మ చుట్టూ.. 9292 మంది ఆడబిడ్డలు బతుకమ్మ ఆడిపాడంగా బతుకమ్మ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఓనం పండుగ పేరిట ఉన్న రికార్డు బతుకమ్మ సొంతం చేసుకుంది. గత ఏడాది అక్టోబర్ 9 నుంచి 17 వరకు బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. అక్టోబర్ 17న సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి.
TelanganaDay1

బతుకమ్మ చీర

దసరా మనకు పెద్ద పండుగ. ముఖ్యంగా మహిళలు కొత్త చీరకు ప్రాధాన్యం ఇస్తుంటారు. పుట్టింటి వాళ్లు ఆడబిడ్డను పిలిపించి కొత్త చీరె.. సారె పెడుతారు. ఆ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది. దసరా ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత దసరా సందర్భంగా కోటి చీరల్ని పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. అందుకోసం 80 రకాలైన రంగుల్లో జరీ అంచుతో పాలిస్టర్ చీరల్ని తయారుచేశారు. ఒక్కో చీర ఖరీదు రూ.290లు. అక్టోబర్ 12 నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెండు నెలల తర్వాత పంపిణీ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 222 కోట్లు ఖర్చు చేసింది.

రంజాన్ గిఫ్ట్‌ప్యాక్

రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు పంపిణీ చేసేందుకు ఈ సంవత్సరం 4.50 లక్షల గిఫ్ట్ ప్యాకులను అధికార యంత్రాంగం సిద్ధంచేసింది. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ద్వారా బట్టలు తయారుచేయించి ముస్లీంలకు పంపిణీ చేసేందుకు గిఫ్ట్‌ప్యాక్ తయారుచేసింది. మే 18వ తేదీ నుంచి జిల్లాల్లో.. 20వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పంపిణీ ప్రారంభించి రాష్ట్రమంతటా మే 25 కల్లా పూర్తిచేశారు. ఈ గిఫ్ట్‌ప్యాక్‌లో ఒక చీర, సల్వార్ కమీజ్, కుర్తా పైజామా, ఒక బ్యాగు ఉన్నాయి. ఒక్కో మసీదు ద్వారా 500 మందికి చొప్పున జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎంపిక చేసిన 448 మసీదుల్లో మొత్తం 2.24 లక్షల గిఫ్ట్ ప్యాకులను పంపిణీ చేశారు.

క్రిస్మస్ గిఫ్ట్‌ప్యాక్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అన్ని మతాల ప్రధాన పండుగలనూ అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గిఫ్ట్ ప్యాక్‌లు పంపీణీ చేస్తున్నది. గత క్రిస్మస్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 295 సొసైటీల ద్వారా ఈ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 200 సొసైటీలు, జిల్లాల్లో 95 సొసైటీల ద్వారా వీటిని అందించారు. నిర్వహణ ఖర్చుల కింద జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్కొక్క సొసైటీకి రూ.లక్ష చొప్పున.. జిల్లాల్లో రూ. 2 లక్షల చొప్పున అందించింది. ఒక్కో సొసైటీకి 500 గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఉత్సవాల యాదగిరులు

ప్రపంచ వ్యాప్త ఘనతను సాధిస్తూ యాదాద్రి అభివృద్ధిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. యాదాద్రికి వందకోట్ల రూపాయలు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు కూడా. వైటీడీఏ ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఆలయ అభివృద్ధి ప్రణాళికకు రూ.50 కోట్లు వెచ్చించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. విమాన రాజగోపురం, ధ్వజస్తంభానికి రూ.35 కోట్లు, ద్వారాలు, బలిపీఠానికి రూ.15 కోట్లు వెచ్చించనున్నారు. యాదాద్రి దేవస్థానంలో ప్రస్తుతం సుమారు 10 కిలోల బంగారం, సుమారు 1,600 కేజీల వెండి ఉంది. కాగా, విమాన రాజగోపురానికి సుమారు 30 కేజీల బంగారం, ధ్వజస్తంభానికి సుమారు 10 కేజీల బంగారం, ఆలయ ద్వారాలు, బలిపీఠానికి తొడుగులకోసం సుమారు 2 వేల కేజీల వెండి అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

గ్రామీణ సాంస్కృతిక ప్రతీకలు

తెలంగాణలో పండుగలు జీవన సంస్కృతికి అద్దం పట్టేవి మాత్రమే కాదు, అవి ప్రజల ఆశలు, ఆశయాల ప్రతీకలు. బతుకమ్మ, దసరా, పీర్లపండుగలనే తీసుకుంటే.. అవి కేవలం మతం పునాదిగా వచ్చినవి కాదు. వ్యవసాయ సాంస్కృతిక జీవనంలో తరతరాల ప్రజా జీవనంలో కలెగలిసి పోయిన ఒక ప్రత్యేక గ్రామీణ జీవన సంస్కృతికి ప్రతీకలు. దసరా పండుగకు సంబంధించి పురాణ, ఇతిహాసాల నేపథ్యంలోంచి చెడుపై మంచికి దక్కిన విజయానికి సంకేతంగా రావణ దహనం.. సమ్మక్క, సారక్క జాతరలు.. జోడేఘాట్ భూంకాల్ ఉత్సవం, నాగోబా జాతర దాకా ఇలా చాలా ఉన్నాయి.

తెలంగాణ సినిమా

నాది తెలంగాణ అని చెప్పుకోవడానికి సంకోచించిన దర్శకులు సైతం నేడు ముందుకొచ్చి నాది తెలంగాణ, నేను తెలంగాణోన్ని అని చెప్పుకోవడం ఇప్పుడు గౌరవంగా భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక ఈ ప్రాంతం నుంచి వచ్చిన దర్శకుల వల్ల, ఈ ప్రాంతానికి సంబంధించిన కథలు విజయం సాధించాయి. కారణం ఇక్కడి కథల్లో జీవం ఉంటుంది. జీవితాలు ఉంటాయి.

తెలంగాణ సినిమా.. సినీ పరిశ్రమకు దిక్సూచిగా మారుతున్నది. ఒకనాడు విలన్లకు.. కమెడియన్లకు మాత్రమే పరిమితమైన తెలంగాణ భాష ఇప్పుడు అగ్రహీరోలకు అగ్ర తాంబూలమవుతున్నది. వాస్తవిక కథా వస్తువు అవుతున్నది. ఎన్నో కథనాలకు దిక్సూచి అవుతున్నది. మన నేటివిటీని ఏదో నామమాత్రంగా కొన్ని సన్నివేశాల్లో మాత్రమే చొప్పించే పరిస్థితి నుంచి ఇప్పుడు మన నేటివిటీ నామస్మరణ చేసేదాక మన సినిమా వెళ్లింది. అది భారీ బడ్జెట్ సినిమా అయినా.. భారీ బ్యానర్ సినిమా అయినా.. ఇంకేదైనా కావచ్చు. ఇన్నేళ్ల కాలంలో తెలుగు సినిమాలో తెలంగాణ భాగం కాలేకపోయింది. అలా కానీయకుండా చేశారు కొందరు. ఇప్పుడున్న తెలుగు సినిమా తెలంగాణ సినిమా కానేకాదు. ఎందుకంటే ఇక్కడి తెలంగాణ ప్రజల మనోభావాలు వీళ్లకు అవసరం లేదు. చారిత్రక వాస్తవిక గాథలు ఏనాడు కథావస్తువుగా చూడలేదు. సినిమాలుగా నిర్మించలేదు. అలా చేస్తున్న సినిమాలన్ని హిట్టవుతున్నాయి. అవి తీస్తున్నది మనోళ్లే.కథలు, మాటలు, కథనాలు మేకింగ్ అన్నీ మారాయి కోటి రూపాయలతో వచ్చిన సినిమా 70 కోట్లకు అమ్ముడుపోయింది. కథలో ఉన్న దమ్ము, పాత్రల్లో ఉన్న రియాలిటీ అలాంటిది. నాది తెలంగాణ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే దర్శకులు సైతం ముందుకొచ్చి నాది తెలంగాణ, నేను తెలంగాణోన్ని అని చెప్పుకొనేందుకు ముందుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక ఈ ప్రాంతం నుంచి వచ్చిన దర్శకులు, ఈ ప్రాంతానికి సంబంధించిన కథలు విజయం సాధించాయి. కారణం ఇక్కడి కథల్లో జీవితాలు ఉంటాయి.
TelanganaDay3

-తెలంగాణ అర్బన్ భాషలో ఓ సాధారణ తెలంగాణ కథ పెళ్లిచూపులుగా వచ్చింది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది తరుణ్ భాస్కర్. వరంగల్‌కు చెందిన తరుణ్ తక్కువ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని రూపొందించాడు. మేకింగ్, కథ, ప్రాంతీయత అంతా కొత్తగా అనిపించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తరుణ్ భాస్కర్‌కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
-అర్జున్‌రెడ్డి సినిమా వచ్చాక తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతకు ముందు, ఆ తర్వాత అన్నట్టు అయింది. సినిమా ఇలా కూడా తీయొచ్చు అని నిరూపించాడు సందీప్‌రెడ్డి వంగ. వరంగల్‌కు చెందిన సందీప్ మూస ధోరణిని పక్కన పెట్టి తనదైన శైలిలో సినిమా తీసి నేటితరం దర్శకులకు ఆదర్శంగా నిలిచాడు. ముఖ్యంగా ఈ సినిమాలో తెలంగాణ భాష, మాండలికం ఎక్కువ గుర్తింపు పొందాయి. సందీప్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించింది.
-2014లో అప్పట్లో ఒకడుండే వాడు అనే చిత్రం వచ్చింది. నల్గొండకు చెందిన సాగర్ చంద్ర దీనికి దర్శకత్వం వహించారు. నీది నాది ఒకే కథ అనే సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకొని భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు ఊడుగుల వరంగల్ వ్యక్తి. శేఖర్ కమ్ముల ఫిదా సినిమా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఇతివృత్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఘాజీ, అంతరిక్షం వంటి చిత్రాలను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన చిత్రాలకు దర్శకత్వం వహించింది సంకల్ప్ రెడ్డి. ఆయన కూడా తెలంగాణ బిడ్డ. తెలంగాణ కథలకు, ఇక్కడి మాటలకు అంత డిమాండ్ ఉన్నది. సరైన వేదిక లేక స్వరాష్ట్రం వచ్చాక దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కేవలం దర్శకులు, కథలే కాదు. నటీనటులు కూడా రొమ్ము విరిచి మరీ నాది తెలంగాణ జాతి అని చాటుకుంటున్నారు.
TelanganaDay4

పర్యాటక ప్రగతి!

ప్రఖ్యాతిగాంచిన కట్టడాలకు నిలయం తెలంగాణ. ముక్కోటి దేవతలు కొలువైన తెలుగు నేల. చారిత్రాత్మక, వారసత్వ సంపదలకు నెలవు తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత పర్యాటక రంగానికి పెద్ద పీట వేశారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఐదు వసంతాలను పూర్తి చేసుకొని ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్నది. ఈ ఐదేండ్లలో తెలంగాణ పర్యాటకంలో సాధించిన విజయాలు ఇవీ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన అనేక చర్యలు చేపట్టింది. క్రియాశీలక చర్యలతో రాష్ట్రంలో పర్యాటకుల తాకిడి పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు హైదరాబాద్ నగరం వేదికయింది. అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదికైన మహానగరం విశ్వనగరంగా గుర్తింపు పొందింది. 31జిల్లాల్లో ఉన్న ముఖ్య పర్యాటక కేంద్రాల్లో హరిత హోటళ్లను ఏర్పాటు చేసింది. పర్యాటక ప్యాకేజీలతో దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు పలు చర్యలు చేపట్టింది. కొత్తగా గుర్తించిన పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కోసం రూ.99కోట్లు వెచ్చాంచారు. తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 200లకుపైగా పర్యాటక ప్రాంతాలున్నాయి. 2017లో పర్యాటక శాఖ సహకారంతో 40 మందితో కూడిన నెటిజన్ బృందం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పరిశోధన యాత్ర నిర్వహించింది. ఈ యాత్ర ద్వారా మరుగున పడిన పలు పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను వెలుగులోకి తీసుకువచ్చారు.

కొత్త శోభ

2015లో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగం 20శాతం వృద్ధిని సాధించింది. ఐదేండ్లలో హైదరాబాద్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరిగింది. అంతకుముందు 40,000 మాత్రమే ఉన్న పర్యాటకుల సంఖ్య 4లక్షలకు చేరింది. 2014లో తెలంగాణ పర్యాటక ప్రదేశాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అంతగా ఆదరణ ఉండేది. కాదు. ఇప్పుడు స్వరాష్ట్రం వచ్చాక పర్యాటకులకు అన్ని వసతులు కల్పించి ఆయా ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నది తెలంగాణ సర్కారు. హైదరాబాద్ మహా నగరంలోని చారిత్రాత్మక వారసత్వ కట్టడాలను సంరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భాగ్యనగర అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు హెలీ టూరిజంను ప్రవేశపెట్టారు. సామాన్యులకు సైతం హెలికాఫ్టర్‌లో పర్యటించే అవకాశం ఇచ్చేలా కేవలం రూ.3,500కే అందించారు. హెలీటూరిజంతో హైదరాబాద్ నగర పర్యాటకానికి కొత్త శోభను తీసుకువచ్చారు. ప్రకృతి అందాలకు ప్రతీకలైన జలపాతాలను మరింత సుందరంగా తీర్చి దిద్దేందుకు తెలంగాణ పర్యాటక శాఖ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసింది. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న జలపాతాలను పర్యాటక ప్రాంతాలుగా మార్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్నవరం చెరువును సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ట్రెక్కింగ్, సైక్లింగ్, రాక్ ైక్లెంబింగ్, జంగల్ సఫారీతోపాటు బోటు వసతి కూడా కల్పించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు లక్షలాది మొక్కలు నాటారు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి కోట్ల మంది పర్యాటకులకు సేవలందించారు. రాష్ట్రంలోని 31జిల్లాల్లోని 477 ప్రాంతాలను పర్యటక శాఖ అభివృద్ధిచేయనున్నది. ఇందుకోసం 2018లో రూ.7.33కోట్లు వెచ్చించింది. కుంతాల జలపాతంతోపాటు ఇతర జలపాతాలను కూడా ఆధునీకరించారు. రాష్ట్ర టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు 2016-17 బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.100కోట్లు కేటాయించారు. హెలీటూరిజం, సోమశిలటూరిజం, నాగార్జునసాగర్‌బోటింగ్, హుస్సేన్ సాగర్ బోటింగ్ వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలనివ్వడంతో మరికొన్ని నూతన ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధమవుతున్నది పర్యాటక శాఖ.
TelanganaDay5

చరిత్ర అన్వేషణ

వరంగల్ జిల్లా రేగొండ మండలం రావులపల్లె పాండవులగుట్ట, జయశంకర్ జిల్లా గణపురం మండలంలోని మైలారం నల్లగుట్ట అడవుల్లో ఆదిమానవుడి ఆనవాళ్లు, సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆకృతి, గణపురం కోటగుళ్లు, తాడ్వాయి మండలం దామరవాయిలోని ఆదిమానవుల సమాధులు, మల్లూరు కోట, హేమాచల లక్ష్మీనర్సింహ స్వామి విగ్రహం ఇప్పటి వరకు వెలుగు చూడని చరిత్ర నెటిజన్ బృందం పరిశోధన యాత్రలో బయటకు వచ్చాయి. తెలంగాణ చరిత్రగతిని మలుపు తిప్పే అనేక ఆసక్తికరమైన ప్రదేశాలు, విశేషాలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో ఇంచు ఇంచుకూ చారిత్రక ప్రదేశాలు.. కట్టడాలు ఉన్నాయి. ఎన్నో వేల ఏండ్ల.. వందల ఏండ్ల నేపథ్యం వాటిది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉదాహరణకు బుద్ధవనం. నాగార్జున సాగర్ ఎడమకాలువ సమీపంలో 274 ఎకరాల విస్తీర్ణంలో 8 సెగ్మెంట్‌లలో బుద్ధవనం కోసం రూ. 25 కోట్లు కేటాయించింది. అలాగే ములుగు జిల్లాలో దామరవాయి ఆదిమానవుల సమాధుల అభివృద్ధికి రూ. 4 కోట్లు. కాకతీయ సైనిక స్థావరాలతో పాటు, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఆదిమానవులు సమాధులు, మహబూబ్‌నగర్ జిల్లాలో గొంతెమ్మ గుట్ట వంటివి బయల్పడ్డాయి. వీటితో పాటు వరంగల్ ఉన్న చాలా మెట్ల బావులకు అభివృద్ధి మోక్షం కలిగింది.
TelanganaDay6

ఆలయాలకు పూర్వ వైభవం

తెలంగాణ ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు. కాకతీయుల కాలం నాటి నుంచి అనేక ప్రసిద్ధి చెందిన ఆలయాలు తెలంగాణలో ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యంతో నిత్య పూజలు కరువై నిరాదరణకు గురయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి నిధులు కేటాయించి పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నది.

యాదాద్రి నుంచి మొదలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి లక్ష్మినరసింహ దేవాలయాన్ని మరో తిరుపతిగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు సీఎం కేసీఆర్. ఆలయానికి రూ.1800 కోట్లు వెచ్చించేందుకు ప్రణాళిక సిద్ధంచేశారు. ఇప్పటివరకు రూ. 1000 కోట్లకు పైగా వెచ్చించి చేసిన అభివృద్ధి పనులు అబ్బురపరుస్తున్నాయి. యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి యాదాద్రి ని దివ్యధామంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. యాదాద్రి చుట్టూ 1000 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నారు. గుట్టపై 15 ఎకరాల స్థలం ఉండగా దీంట్లో 5 ఎకరాల్లో ప్రధాన గుడి, ప్రాకారం, మాడవీధులు, పుష్కరిణి, కళ్యాణకట్ట, అర్చకుల నివాసాలు, క్యూ కాంప్లెక్స్, వీఐపీ అతిథి గృహం, వంటశాల నిర్మిస్తున్నారు.
TelanganaDay7

భద్రాద్రి

కొత్తగూడెం-భద్రాద్రి జిల్లాలోని భద్రాద్రి రామాలయాన్ని భక్తరామదాసు(కంచర్ల గోపన్న) కట్టించిన విషయం విధితమే. భద్రాచలం ఆలయానికున్న ప్రాశస్త్యం, ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామ చంద్రుడికున్న ఆదరణ దృష్ట్యా భద్రాద్రి ఆలయాన్ని దేశంలోనే ఓ అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఆలయాన్ని రూ.100 కోట్లకు మించి ఖర్చుచేసి చరిత్రలో సుప్రసిద్ధ స్థానంగా భద్రాద్రికి ఖ్యాతి అందేలా పటిష్టమైన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారు.

బాసర జ్ఞాన సరస్వతి ఆలయం

ఆదిలాబాద్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం అభివృద్ధికి ముందుగా రూ.50కోట్లు మంజూరు చేశారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంతో పాటు పుణ్యక్షేత్రంలో మార్పులు, చేర్పులు చేయడం. ఇంజినీరింగ్ పనుల కోసం వీటిని కేటాయించారు. రూ.50కోట్లతో ఆలయ అభివృద్ధి, ఇతర నిర్మాణాలు, అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. కొత్తగా 100గదుల నిర్మాణంతోపాటు 10వేల మంది భక్తులకు సరిపడే విధంగా ప్రత్యేక క్యూ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. తాగునీటి వ్యవస్థ మెరుగు పర్చేందుకు కొత్తగా సంపులు, ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేస్తారు. ప్రసాదం తయారీ కోసం అధునాతన వంటశాలతో పాటు, యాగశాల నిర్మాణం చేస్తారు. అక్షరాభ్యాస మండపాన్ని పొడిగించేలా అదనపు నిర్మాణాలు చేయనున్నారు.

రాజన్న ఆలయం

సిరిసిల్లా-రాజన్న జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి మన ప్రభుత్వం రూ. 400కోట్లు కేటాయించింది. వీటిలో ఏటా రూ.100 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దేవాలయ ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు శృంగేరీపీఠం సౌజన్యంతో వేద, సంస్కృత పాఠశాలల ఏర్పాటు, దేవాలయ అభివృద్ధి, ఇతర పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. వేములవాడ అభివృద్ధికోసం వేములవాడ టెంపుల్ అథారిటీని ఏర్పాటు చేసి అభివృద్ధిపనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటారు.
TelanganaDay8

కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర దేవాలయ అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణకు ప్రాణధారమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా మార్చాలని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యం దృష్ట్యా ఈ ప్రాంతానికి ప్రజలు లక్షల సంఖ్యలో తరలివస్తారు. దానికి అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 600 ఎకరాల స్థలాన్ని సేకరించాలని, ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్ స్థలాలను సేకరించాలని, కళ్యాణ మండపంతోపాటు పెద్ద స్వాములు ఎవరైనా వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడానికి వీలుగా ఆలయ నిర్మాణాన్ని విస్తరించనున్నారు.

కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి

సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లన్న దేవస్థానం అభివృద్ధికి సీఎం ప్రత్యేకనిధి నుంచి రూ.10కోట్లు విడుదల చేశారు. వీటితో ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు అవసరమైన వసతులను కల్పించనున్నారు. వీటితో పాటు కొండగట్టుకు రూ.5కోట్లు, వరంగల్ భద్రకాళి ఆలయానికి రూ.3.65 కోట్లు, భిక్కనూర్ వెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.13 కోట్లు, దుబ్బాక వెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.3కోట్లు కేటాయించారు. ఇంకా ఆయా జిల్లాల్లో ప్రసిద్ధ ఆలయాలకు సైతం నిధులు విడుదల చేస్తున్నారు.
TelanganaDay9

ధూపదీప నైవేద్యం కోసం

తెలంగాణలో గతంలో ఆలయాలలో ధూప దీప నైవేద్యం సమర్పించాలంటే భక్తులు వేసే కానుకలే ఆధారంగా ఉండేవి. అయితే ఒక్కొక్కసారి ఆలయంలో దేవునికి ధూపదీప నైవేద్యం సమర్పించటానికి ఇబ్బంది పడేవారు. దీంతో ప్రభుత్వం రాష్ట్రంలో సరైన ఆదాయం లేని దేవాలయాలకు గతంలో రూ.2500 ఇచ్చే మొత్తాన్ని పెంచింది. ఇప్పుడు ధూపదీప నైవేద్యాల కోసం నెలకు రూ.6వేల చొప్పున చెల్లిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 3,645 ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద నిధుల మంజూరీ చేస్తున్నారు. అలాగే అర్చకులకు పీఆర్సీ అమలు చేసి రూ.6వేల వేతనం చెల్లించాలని నిర్ణ యించారు. పెద్ద దేవాలయాల అర్చకులకు 12వేల రూపాయలు ఇవ్వనున్నారు.

ప్రపంచానికే దిక్సూచి.. హైదరాబాద్ అభివృద్ధి

గత ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్న భాగ్యనగరాన్ని వాణిజ్య కేంద్రంగానే వాడుకున్నాయి తప్పా అభివృద్ధికి పెద్దపీట వేయలేకపోయాయి. అంతిమంగా అది నగర ముఖచిత్రంపై ప్రభావం చూపింది. కానీ, తెలంగాణ స్వరాష్ట్రం ఆవిర్భావం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పూర్వ వైభవంతోపాటు, వరల్డ్ క్లాస్ స్మార్ట్ సిటీగా హైదరాబాద్‌ను రూపుదిద్దేందుకు ప్రపంచ స్థాయి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం.
TelanganaDay10

మెట్రో మెరుపులు..

ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పాట్నర్‌షిప్) ప్రాజెక్ట్ మన హైదరాబాద్ మెట్రో. 2012 ఏప్రిల్ 19న పనులు ప్రారంభమైనప్పటికీ స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత పనులు వేగాన్ని అందుకున్నాయి. 2017 నవంబర్ 29 హైదరబాద్ మెట్రో కల సాకారమైంది. అసాధ్యం అనుకున్న ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వ సారథ్యంలో విజయవంతం అవటంతో విమర్శకుల నోట మాట రాలేదు.
TelanganaDay11

తాగునీటికి ఢోకా లేదు..

టీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ప్రజలు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడుతున్నారు. అందుకే పట్టణంలో జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తొలినాటనే జలమండలి అధికారులతో సమావేశమై, నీటి సమస్యను తీర్చడానికి రాబోయే రోజుల్లో తీసుకొనే చర్యలపై విస్తృతంగా చర్చించి, ఎన్ని నిధులైనా భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ తేల్చి చెప్పారు. ముఖ్యమ్రంతి ఆదేశాల మేరకు వాటర్ బోర్డు పటిష్ఠంగా పని చేసింది. ఇప్పటి తాగునీటి వ్యవస్థతో మరో నలభై ఏండ్ల వరకూ నీటిని అందించగలదని నిపుణులు అంటున్నారు.

సొంతిటి కల.. నెరవేరుతున్న వేళ

నగరంలోని పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నది. నగరంలో వివిధ ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించడానికి రూ. 8589 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ డిసెంబర్ నాటికి ఈ నిర్మాణాలు పూర్తి చేసి నగరంలో పేదలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకూ 80 శాతం ఇండ్లు పూర్తి అయ్యాయి. 114 ప్రాంతాల్లో 97వేల 915 డబుల్ ఇండ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఆగకుండా సాగిపోవడమే..

హైదరాబాద్‌లో ఒక ట్రాఫిక్ ప్రధాన సమస్యగా ఉండేది. దీన్ని పూర్తిగా పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేసింది. దానికి సంబంధించిన అనుమతులు, బాధ్యతలు అన్నీ జీహెచ్‌ఎంసీకి ఇచ్చింది. సర్కార్ సహకారంతో బల్దియా ట్రాఫిక్ సమస్యను తొలగించడంలో దూసుకుపోతున్నది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం కింద రూ. 2399 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వీటితో మల్టీలెవెల్ ైఫ్లెఓవర్లు, కారిడార్డు, రోడ్ అండర్ బ్రిడ్జి, కేబుల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు.

సిటీ సిగలో ఐటీ..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ ఐటీ రంగంలో అనూహ్య, అసాధారణ మార్పులొచ్చాయి. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు లక్ష కోట్ల రూపాయల మైలురాయిని దాటాయి. సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో బెంగళూర్ తర్వాత నిలిచిన హైదరాబాద్ వృద్ధిరేటులో మాత్రం ఆ నగరాన్ని మించిపోయింది. 2013-2014లో ఐటీ ఎగుమతులు 57,258 ఉంటే 2018-2019 ఏడాదిలో 1,09,219 కోట్లకు ఎదిగాయి. అట్లనే ఐటీ ఉద్యోగాల్లో కూడా గణనీయమైన మార్పును చూడొచ్చు. 2017లో 4లక్షలా 76 వేలు ఉండగా, 2019నాటికి 5 లక్షలా 44 వేలకు పెరిగింది.

హెచ్‌ఎండీఏ సంస్కరణలు ఎన్నో

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ 2004 నుంచి 2008 మధ్య అభివృద్ధిలో ఉండేది. తర్వాత క్రమంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నది. అవినీతి ముద్ర, అప్పుల భారంతో కునారిల్లిన హెచ్‌ఎండీఏ పరిస్థితిని చక్కదిద్దడానికి సొంత రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిటీని విశ్వనగరంగా మార్చే దీక్షలో అనూహ్య విజయాలు సాధిస్తున్నది. గత ఐదేండ్లలో ఆదాయం రెట్టింపు చేసుకోగలిగింది. 2014-2015 వార్షిక ఆదాయం రూ.250 కోట్లు, 2015-16లో రూ. 365 కోట్లు, 2016-17లో రూ. 400 కోట్లు, 2017-18లో రూ.872 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ప్రస్తుతం వెయ్యి కోట్ల రూపాయలతో వివిధ పథకాలను అమలు చేస్తున్నది.

మన పోలీస్ సూపర్..

హైదరాబాద్‌లో గతంలో పోలిస్తే రాష్ట్ర విభజన తర్వాత 90 శాతం క్రైమ్ కల్చర్ తగ్గింది. షీ టీమ్‌లు, పెట్రోలింగ్ పెరిగిన తర్వాత మహిళలు, సామాన్యులు భయంలేకుండా గడుపుతున్నారు. సిటీలో పేకాటలు, గుడుంబా దందాలను అంతం చేయడంలో సిటీపోలీసులు సఫలీకృతం అయ్యారు. ప్రభుత్వం కావాల్సిన సమయంలో పోలీస్‌స్టేషన్లకు అవసరమైన అత్యాధునికి సౌకర్యాలు కల్పించడం, నిధులు కేటాయించి పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయగలిగింది.

కళలకు జీవం

ఆంధ్రపాలనలో తెలంగాణ ప్రాంతంలో కళలు అంతరించిపోయాయి. కళాకారులకు గుర్తింపు కొరవడింది. ప్రోత్సాహం లేక కళలను వదిలి కళాకారులు కూలీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కళలకు పెద్ద పీట వేసింది. ప్రభుత్వం తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. కళను నమ్ముకొని జీవించే కళాకారులు తల ఎత్తుకునేలా చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. తెలంగాణ సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖ ప్రతీ కళాకారుడికి ప్రాధాన్యం ఇస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన ఈ నాలుగేళ్లలో మన భాష, సాహిత్యం సంస్కృతికి మునుపెన్నడూ లేని విధంగా ఆదరణ పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం భాషా, సాహిత్యాలను వివిధ రూపాలలో ప్రోత్సహిస్తున్నది.
TelanganaDay12

మన భాష: ప్రపంచంలోని తెలుగువారంతా గర్వించేలా ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్ నగరంలో నిర్వహించిన తీరు భాషాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో 42 దేశాలు, 16 రాష్ర్టాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులతో జరిపిన మహాసభలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చొరవతో కవిసమ్మేళనాలు నిర్వహించి కవిత్వాన్ని పుస్తకాల రూపంలో తీసుకురావడంతో కవిత్వానికి శాశ్వతత్వాన్ని అందించింది. ఈ శాఖ ఆధ్వర్యంలో తొలిపొద్దు తంగేడు వనం, మట్టిముద్ర, కొత్తసాలు, తెలంగాణకు హరితహారం, ఆకుపచ్చని పొద్దుపొడుపు, తెలంగాణ తేజోమూర్తులు మొదలైన గ్రంథాలను ప్రచురించారు. భాషా, సాంస్కృతిక శాఖ మహబూబ్‌నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 50 మంది కవులతో నిర్వహించిన కవి సమ్మేళనంలోని కవితలతో ఈ పుస్తకాలు వెలువరించారు.

యాస: మన ఉనికిని తెలిపేది మన యాస. పరాయి పాలనలో మన యాస వివక్షకు గురైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తెలంగాణ యాసను ప్రోత్సహించింది. మన యాసలోనే రచనలు చేసేలా కవులను, రచయితలను ప్రోత్సహించింది. వార్తా పత్రికలు, టీవీ చానెళ్లు, రేడియో మాధ్యమాలు ఇలా ప్రతి ఒక్కటీ తెలంగాణ యాసలోనే వచ్చేలా కృషి చేసి విజయవంతమైంది.

పురస్కారాలు : ఇదివరకు ప్రభుత్వాలు ఆంధ్ర రచయితలకు, ఆంధ్ర కళాకారులకే ప్రాధాన్యం ఇచ్చేవారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో ప్రభుత్వం కవులకు, కళాకారులకు ప్రతి ఏటా పురస్కారాలు అందజేస్తున్నది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. వారి స్మారకార్థం బహుమతులు, అవార్డులు అందజేస్తున్నారు.

కళలు: తెలంగాణకే ప్రత్యేకమైన పేరిణి నృత్యాన్ని 256 మంది కళాకారులతో లలిత కళా తోరణంలో మహా నృత్యంగా ఏర్పాటు చేసి ప్రపంచ దృష్టికి తీసుకు వచ్చింది మన ప్రభుత్వం.
తెలంగాణ కళారాధన పేరుతో జానపద, గిరిజన గ్రామీణ కళారూపాలు ప్రదర్శిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన కోటలు, బురుజులకు ప్రత్యేక నిధులు కేటాయించి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ద్వారా థియేటర్ ఫెస్టివల్ భారత్ రంగ్, ఆదివాసుల కళారూపాలతో కూడిన అధిరంగ్ మహోత్సవం వంటి జాతీయ, అంతర్జాతీయ కళారూపాలను ఏర్పాటు చేసి నాటక కళా ప్రియులకు భాషా, సాంస్కృతిక శాఖ మరింత చేరువయ్యింది.

ఇది కళాకారుల అడ్డా: ఒకప్పుడు నెత్తినెరిసిన ఆంధ్ర కళాకారులతో నిండిపోయిన రవీంధ్రభారతి ఇప్పుడు తెలంగాణ యువకుల ప్రతిభ ప్రదర్శనతో అలరారుతున్నది. ఎందరో కళాకారులకు సాంస్కృతిక శాఖ సినీవారం పేరిట ప్రతీశనివారం యువ దర్శకులు, రచయితలు, నటుల కోసం ఓ కార్యక్రమాన్ని నిర్వహ్తిస్తున్నది. ఇందులో డాక్యుమెంటరీలు, ఫీచర్ ఫిల్మ్‌లు ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. సండే సినిమా పేరుతో ప్రతి ఆదివారం సాయంత్రం ప్రపంచ సినిమాల ప్రదర్శనలతో పాటు ఔత్సాహిక సినీ కాళాకారుల కోసం ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తున్నారు. కళాకారుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడం కోసం పైడి జయరాజ్ థియేటర్‌లో ఈ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు జర్మనీ సినీ ఉత్సవాలను నిర్వహించినట్లు భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. వీటికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖ ద్వారా వేలాది మంది కళాకారులకు పింఛన్లు అందిస్తున్నది. తెలంగాణ వైతాళికుల తైలవర్ణ చిత్ర ప్రదర్శన, కాళోజీ, దాశరథి వంటి ప్రముఖుల జయంతులు, వర్ధంతులు అధికారికంగా నిర్వహిస్తున్నారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సీఎం భాషాభిమాని, కవి, మన సంస్కృతీ సంప్రదాయాలను ఆరాధించే వారు కావడంతో, వారి సలహాలతో భాషా సాంస్కృతిక శాఖ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
TelanganaDay13

ఆన్‌లైన్ గవర్నెన్స్

పాలకులు అంటే పరిపాలించడం వస్తే సరిపోదు. స్పందించే గుణం కూడా ఉండాలి. అది అందరికీ రాదు. కష్టాల్లో ఉన్న ప్రజలను తెలుసుకొని వారి తోడుగా నిలువాలనే సోయి అందరికీ ఉండదు. పాలన దక్షతలో తెలంగాణ ప్రభుత్వం తనదైన ముద్ర వేసుకున్నది. సామాజిక అంశాల ద్వారా సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తున్నది. ఇప్పుడు రాజకీయం అంటే అధికారం ఒక్కటే కాదు.ప్రజల పట్ల బాధ్యతకూడాఅని చాటి చెప్తున్నారు. ఆన్‌లైన్ గవర్నెన్స్‌లో ముందుకు దూసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిలో మచ్చుకు కొన్ని..

ట్విట్టర్ వేదికగా పరిష్కారం

తెలంగాణ బిడ్డలు ఎడారి దేశాలకు వెళ్లి ఎటు కాకుండా పోతున్నారు. అవస్థలు పడి ఆగమాగం అయితున్నరు. ఇటీవల ఆ గోసను కరీంనగర్‌కు చెందిన వ్యక్తి వీడియో రూపంలో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రతీఒక్కరూ అయ్యోపాపం అంటూ జాలి చూపారు. మంత్రి కేటీఆర్ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. దుబాయ్ విదేశాంగ శాఖకు ట్విట్టర్‌లో సమస్య గురించి సమాచారం ఇచ్చారు. వీలైనంత తొందరగా అతన్ని స్వదేశానికి పంపాలని కోరారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ఎలాంటి సమస్య అయినా తన దృష్టికి వస్తే అది ట్విట్టర్‌లో అయినా, వాట్సప్‌లో అయినా వెంటనే పరిష్కరిస్తున్నారు. కేసీఆర్ నుంచి మొదలు, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇలా ప్రజాప్రతినిధులంతా ఎలాంటి సమస్య అయినా ఆన్‌లైన్‌ల ద్వారా అధికారులకు అటాచ్ చేస్తూ నిమిషాల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఉన్న ఊర్ల ఉపాధి లేక, పట్నంలో కొలువులు దొరకక ఎడారి దేశానికి వెళ్లిన వలస జీవుల బతుకులు దుర్భరంగా తయారవుతున్నాయి. కొందరు అక్కడే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకొందరు హత్యలకు గురవుతుంటారు. ఏది ఏమైనా వ్యక్తి చనిపోతే అతని శవం దేశానికి రావడానికి నెలల సమయం పడుతుంది. ఇలాంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందిగా ప్రణాళిక చేసి ఆచరిస్తున్నది. వారం రోజుల లోపు శవాన్ని సొంతింటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నాయి.
TelanganaDay14

వాట్సప్ మెసేజ్‌లకు స్పందన

అనుకోకుండా ఆపద వచ్చింది. గర్భంతో ఉన్న తన సోదరికి నాలుగు లక్షల రూపాయలతో ఆపరేషన్ చేయించాలి.అంత స్థోమత వాళ్లకులేదు. మంత్రి సాయం చేస్తారన్న ఆశతో గుగ్గిళ్ల రాజు అనే యువకుడు మంత్రి కేటీఆర్‌కు వాట్సప్ ద్వారా సందేశం పంపాడు. వాళ్ల నమ్మకం వమ్ము కాలేదు. అరగంటలోపు వాట్సప్‌లో మెసేజ్ చూసిన కేటీఆర్ రిప్లయ్ ఇచ్చాడు. యశోద దవాఖానకు వెళ్లాల్సిందిగా చెప్పాడు. అక్కడి సిబ్బందితో మాట్లాడి ఉచితంగా సర్జరీ చేయించాడు. ఇలా వాట్సాప్ మెసేజ్‌లకు స్పందించడం చిన్న సమస్యలైనా, పెద్ద సమస్యలైనా తమ దృష్టికి వచ్చిన వాటిని పరిష్కరిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు మంత్రులను కలువాలంటే పైరవీలు చేయాల్సి వచ్చేది. రోజుల తరబడి వాళ్ల ఇంటి చుట్టూ తిరిగితే గానీ అపాయింట్‌మెంట్ దొరికేది కాదు. రోజులు మారాయి. పాలన మారింది. మెయిల్ చేస్తే రిప్లయ్ వచ్చేంత, వాట్సాప్ చేస్తే వచ్చి వాలిపోయేంత ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు మన రాష్ట్ర అధికారులు, నాయకులు.
TelanganaDay15

సోషల్‌మీడియా సర్వీస్

తన తండ్రి పేరిట ఉన్న భూమిని అక్రమంగా వేరొకరి పేరుపై మార్చారంటూ మంచిర్యాలకు చెందిన ఓ రైతు అధికారుల చుట్టూ తిరిగాడు. ఎవరూ పట్టించుకోలేదు. తన ఆవేదనను వీడియో రూపంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అది ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. వీడియో చూసిన కేసీఆర్ చలించిపోయారు. సదరు రైతుకు ఫోన్ చేసి సమస్య గురించి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారం త్వరలో జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఇంకేముంటుంది, అధికారం యంత్రాంగంలో కదలిక వచ్చింది. రైతులకు అన్యాయం చేసిన అధికారులను సస్పెండ్ చేశారు. తను రైతు బంధువునని సీఎం నిరూపించుకున్నారు.

దత్తపుత్రికకు ధైర్యం

హైదరాబాద్‌లో సవతి తల్లి చేతిలో చిత్రహింసలు అనుభవించిన ప్రత్యూషను తన దత్త పుత్రికను చేసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మ్తత్యువు అంచువరకు వెళ్లి బతికిన ఆ అమ్మాయిని కేసీఆర్ దత్తత తీసుకొని ఆలనా పాలనా అంతా తానై చూసుకున్నారు. ఇంటికి పిలిపించుకొని కుటుంబ సభ్యులతో భోజనం చేయించి మంచిగా చదుకోవాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి స్పందించి ఆమెకు సహాయ సహకారాలు అందించారు. స్పందించే గుణమున్నది ఈ సంఘటనతో మరోమారు నిరూపించుకున్నారు. పూర్తిగా కోలుకున్న ప్రత్యూషను కేసీఆర్ ప్రభుత్వ ఖర్చులతో చదివిస్తున్నారు. ఓ మెడికల్ కాలేజ్‌లో నర్సింగ్ కోర్సు చేస్తున్న ప్రత్యూష ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నది. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు. వందల ఉదాహరణలున్నాయి. ప్రజల కష్టాలు తమ దృష్టికి రాగానే అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి సేవల్లో ముందుండేలా చేస్తున్నారు. మొన్నటికి మొన్న పక్కరాష్ట్ర ఒడిశాలో వరదలు, తుపాన్ వస్తే ఇక్కడి నుంచి ట్రాన్స్‌కో ఉద్యోగులను పంపి అక్కడి ప్రజల కష్టాలను తీర్చింది.
TelanganaDay16

సంక్షేమ తెలంగాణ

తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అతి తక్కువ కాలంలోనే అనూహ్యమైన ప్రగతిని సాధించింది మన రాష్ట్రం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేతృత్వంలో అన్ని వర్గాలు, రంగాలూ అభివృద్ధిబాట పట్టాయి. అనతికాలంలోనే దేశం గర్వించేస్థాయికి చేరుకున్నది తెలంగాణ. ఈ ఆరేండ్ల కాలంలో 500 సంక్షేమ పథకాలతో దేశం చూపును తనవైపు తిప్పుకునేలా చేసి, బంగారు తెలంగాణ బాటలో పయనిస్తున్నది మన రాష్ట్రం. చరిత్రలో నిలిచిపోయే పథకాలతో సబ్బండ వర్గాలకు అండగా నిలిచింది.

రైతు రాజ్యంగా తెలంగాణ

కోరి తెచ్చుకున్న తెలంగాణ రైతు రాజ్యంగా విరాజిల్లుతున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా పథకాలతో రైతన్నల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. పంట రుణమాఫీ పథకంలో భాగంగా రూ.లక్షన్నర వరకూ రుణాలను మాఫీ చేస్తున్నది ప్రభుత్వం. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా కొనియాడింది. తెలంగాణలో సన్న, చిన్నకారు రైతుల్లో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో పథకం రైతు బీమా. దీని ద్వారా తెలంగాణలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులుకు మేలు జరుగుతున్నది.
TelanganaDay18

కోటి ఎకరాలే లక్ష్యంగా..

తెలంగాణ కోటి ఎకరాల మాగాణం లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చిట్టచివరి భూములకు కూడా నీరందించాలనే సంకల్పంతో.. ప్రాజెక్టుల రీడిజైనింగ్, కొత్త సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది. దీంతో వ్యవసాయరంగం ప్రాణం పోసుకున్నది. దీనికి తోడు రైతులకు ఉచితంగా 24 గంటలూ కరంట్ ఇస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి 90 లక్షల ఎకరాలకు పైగా నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు ద్వారా 20 జిల్లాలకు (13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాలకు కొత్తగా) నీరందడంతో పాటు.. హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరందనున్నది. ఇటీవల ఆరో ప్యాకేజీలో పంపుల పరీక్ష విజయవంతమైంది. ఇక సీతారామ భక్తరామదాసు ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం.. మరికొన్ని భారీ, మధ్య తరహా, చిన్నతరహా ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలతో తెలంగాణను సస్యశ్యామలం కానున్నది. తెలంగాణలో తాగునీటి కొరత ఏర్పడకుండా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను ప్రవేశపెట్టింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. భగీరథ పథకాన్ని రూ .42 వేల కోట్ల అంచనాలతో, 26 ప్యాకేజీలుగా ప్రభుత్వం చేపట్టింది. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నదే ఈ పథకం లక్ష్యం. ప్రస్తుతం తుది దశ పనులు కొనసాగుతున్నాయి.
TelanganaDay17

ఆకుపచ్చ తెలంగాణకు..

స్వరాష్ట్రం పచ్చగా కళకళలాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణలో 33 శాతం పచ్చదనం ఉండాలనే ధ్యేయంతో, 230 కోట్ల మొక్కలను నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నది. గడిచిన నాలుగు విడతల్లో 120 కోట్ల మొక్కలకు పైగా తెలంగాణ వ్యాప్తంగా నాటారు. ఇందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులను, సెలబ్రిటీలను భాగం చేసి విజయవంతమైంది ప్రభుత్వం.

పేదల్లో డబుల్ ఆనందం

తెలంగాణ సర్కారు నిలువనీడ లేని నిరుపేదలకు కలలో కూడా ఊహించని విధంగా ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా సొంతింటి కలను తీర్చాలనే లక్ష్యంతో డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో ఇంటికి సుమారు రూ.6.29 లక్షలు వెచ్చించి ఇండ్లను నిర్మిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం 2,80,616 ఇండ్లను కేటాయించగా వీటిల్లో 2,57,087 ఇండ్లకు పరిపాలనా అనుమతులు జారీ చేశారు. వీటిల్లో 1,72,550 ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఆయా జిల్లాల్లో 80 శాతం పనులు పూర్తిచేశారు. తాజాగా ఇల్లు కట్టుకునేందుకు స్థలం చూపిస్తే, ప్రభుత్వమే రూ.6 లక్షలు వరకు మంజూరు చేయనున్నది.
వీటితో పాటుగా కంటి వెలుగు ద్వారా 1.54 కోట్ల మందికి ఉచితంగా పరీక్షలు చేశారు. త్వరలోనే హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీఎస్ ఐపాస్, సింగిల్ విండో, కొత్త పరిశ్రమలు, రాయితీలతో పారిశ్రామిక విధానానికి ఊపిరులు ఊదింది. రెవెన్యూ శాఖలో ధర్మగంట ద్వారా ప్రక్షాళన మొదలు పెట్టింది. రైతులకు నకిలీ విత్తనాల నుంచి విముక్తి కలిగించేం దుకు చర్యలు తీసుకుంటున్నది. ఆసరా పెన్షన్ పథకం, కుల వృత్తులకు చేయూత, వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 200కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్నది తెలంగాణ. మన క్రీడారంగాన్ని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నది. నిరుద్యోగులకు రూ.3016 భృతి అందిస్తూ.. అగ్ర కులాల్లోని పేదలు, గిరిజనులు, జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తూ.. సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నది.
TelanganaDay19

ఆడబిడ్డకు అండగా..

తెలంగాణ ఆడబిడ్డకు భరోసాగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను చేపట్టింది. ఉన్నత వర్గం నుంచి పేదింటి ఆడిబడ్డ వరకూ అంతా క్షేమంగా ఉండాలని ప్రభుత్వం తలచింది. ఇందుకు ఆర్థిక తోడ్పాటుతో పాటు.. రక్షణ కల్పిస్తూ మహిళా, శిశు సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం.

అమ్మఒడి, కేసీఆర్ కిట్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అమ్మఒడి, కేసీఆర్ కిట్. కేసీఆర్ కిట్ పథకం కింద ఒక్కో గర్భిణికి నాలుగు విడతలుగా 14,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతున్నది. ఆడపిల్ల ప్రసవిస్తే మరో వెయ్యి రూపాయలు అందిస్తారు. రూ.2వేల విలువైన కేసీఆర్ కిట్‌ను ప్రసవానంతరం అందిస్తున్నారు. ఇందులో తల్లికి, బిడ్డకు మూడు నెలలపాటు సరిపడా 16 రకాల వస్తువులు ఉంటాయి. అమ్మ ఒడి పథకంలో భాగంగా గుర్తించిన గర్భిణులను 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చి, ప్రసవానంతరం సురక్షితంగా 102 వాహనంలో ఇంటివద్ద దింపుతున్నారు. ఈ పథకాల వల్ల 53 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రులలోనే జరుగుతున్నాయి. శిశుమరణాల రేటు తగ్గింది.
TelanganaDay20

కల్యాణలక్ష్మి/షాదీముబారక్

పేద కుటుంబాల్లోని యువతులకు భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ప్రవేశపెట్టింది. ఇది విజయవంతం అవడంతో రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తింపజేశారు. ప్రారంభంలో రూ. 51,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రస్తుతం 2018 ఏప్రిల్ 1 నుండి రూ.1,00,116కి పెంచారు. ఈ పథకం ద్వారా మార్చి 2018 నాటికి 3,65,000 మందికి లబ్ధి చేకూరింది. ఈ పథకంతో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. భ్రూణహత్యలు తగ్గాయి.

ఆకతాయిలకు షీ టీమ్స్‌తో చెక్

మహిళలు, యువతులు, విద్యార్థినులపై వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం షీ టీమ్స్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించడం, ఈవ్‌టీజర్ల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం, మళ్లీ పట్టుబడితే నిర్భయ కేసును నమోదు చేయడం షీ టీమ్స్ ముఖ్య నిర్వహణ. తెలంగాణ మొత్తంగా 200 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. షీ టీమ్స్ వచ్చిన తరువాత 20శాతం దాడులు తగ్గాయి. మహిళల కోసం 24 గంటల హెల్ప్‌డెస్క్, 181 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులో ఉన్నది. పోలీసుశాఖలోని అన్ని స్థాయిల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నది ప్రభుత్వం. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కచ్చితంగా మహిళా విభాగం ఏర్పాటు చేసింది.

షీ క్యాబ్స్

నగరంలో మహిళలకు భద్రత కల్పించే విషయంలో తెలంగాణ సర్కార్ ఓ అడుగు ముందుకేసింది. ప్రైవేట్ క్యాబ్‌లలో తరచూ అత్యాచారాలు జరుగుతుండటంతో, హైదరాబాద్‌లో షీ క్యాబ్స్ ను ప్రవేశపెట్టనుంది. అందులో భాగంగా మహిళా డ్రైవర్ల కోసం ఓ కమిటీని వేసింది. ఐటీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో షీ టాక్సీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. జంట కమిషనరేట్ల పరిధిలో ప్రభుత్వం వీటిని ముందుగా ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ, రాయితీలు ఇస్తున్నది.
TelanganaDay21

ఒంటరి మహిళలకు జీవనభృతి

వివిధ కారణాలతో భర్తలను వీడి ఒంటరిగా జీవితం గడుపుతున్న మహిళలకు ఈ జీవనభృతి ఆర్థికంగా ఆసరాగా నిలుస్తున్నది. బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల్లో వీటిని జమ చేస్తున్నారు. పెండ్లయిన భర్తకు కనీసం ఏడాది పాటు దూరంగా ఉన్న మహిళలూ, పెండ్లికాని 30 యేండ్లు పైబడిన యువతులూ పథకం ద్వారా భృతి పొందవచ్చు. ఇటీవల ఈ జీవన భృతిని రూ.1000 నుంచి 2016 రూపాయలకు పెంచారు.

ఆరోగ్య లక్ష్మి

రాష్ట్రంలోని తల్లీబిడ్డల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య లక్ష్మి పథకాన్ని తీర్చిదిద్దారు. రాష్ట్రంలోని 31,897 అంగన్‌వాడీ, 4076 మినీ అంగన్‌వాడీలు, 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ద్వారా నెలకు 30 రోజులపాటు గుడ్లు అందిస్తున్నారు. కోడిగుడ్లతో పాటు గోధుమలు, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెలతో కూడిన రెండున్నర కిలోల ప్యాకెట్‌ను ప్రతినెల మొదటి తేదీన అందిస్తున్నారు. ఈ పథకంద్వారా తెలంగాణలోని 5,90,414 మంది గర్భిణులు, బాలింతలకు, 18,20,901 మంది పిల్లలకు ప్రభుత్వం పోషకాహారం అందిస్తున్నది.
TelanganaDay22

స్త్రీనిధితో భరోసా

స్త్రీనిధి పథకం ద్వారా తెలంగాణలోని స్వయం సహాయక బృందాలకు అండగా నిలుస్తున్నది ప్రభుత్వం. కష్టాల్లో ఉన్న మహిళలకు వ్యాపారం, ఉపాధి కల్పించుకొనే నిమిత్తం స్త్రీనిధి రుణాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్త్రీనిధి రుణాల కింద 50 వేలు, స్వశక్తి సంఘాలకు గ్రూపుల వారీగా 50 వేల నుంచి రూ.10 లక్షల వరకు, స్వశక్తి సంఘాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా 50 వేల నుంచి 3 లక్షల వరకు రుణాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4.6 లక్షల స్వశక్తి సంఘాల్లోని 46 లక్షల మంది మహిళలకు 2015-16 లో 8 వేల కోట్లు, 2017లో రూ.7వేల కోట్లను రుణాలుగా ఇచ్చారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు వడ్డీలేని రుణాలిచ్చి, వ్యాపారంతోపాటు ఆర్థికపరమైన సాయంచేసి, అప్పుల బాధల నుంచి ప్రభుత్వం విముక్తి కల్పించింది.

708
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles