అర్ధాంతరంగా ముగిసిన జీవితం వెండితెర ఐటమ్‌గర్ల్ సిల్క్‌స్మిత


Sun,May 19, 2019 01:16 AM

Silk-Smitha
తన నటనతో, కుర్రకారుని మత్తెక్కించే అందాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ పరిశ్రమలో తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. ఐటెం పాటలకు కొత్త ఒరవడిని ఆపాదించింది. బావలు సయ్యా.. మరదలు సయ్యా.. అన్న పాట వింటే ఎవరికైనా సరే ఆమె కళ్ళముందు డ్యాన్స్ చేసినట్టే ఉంటుంది. ఆమె పేరు వింటేనే ప్రేక్షకుల మదిలో మెరుపు... ఆమె డ్యాన్స్ చూస్తే జనం మైమరచిపోతారు.. చిన్న వయసులోనే వెండితెరపై కాలుపెట్టి ఎన్నో చిత్రాలలో నటించింది. ప్రేక్షక జనాలకు మరదలు పిల్లగా దగ్గరైంది. నటిగా మంచి స్థితిలో ఉన్న సమయంలోనే ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది. అర్థాంతరంగా జీవితాన్ని ముగించుకున్న ఐటమ్‌గల్ సిల్క్‌స్మిత చివరిపేజి.

మధుకర్ వైద్యుల, సెల్: 9182777409


అది 1960 డిసెంబర్ 2. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని దెందులూరు మండ లం కొవ్వలి గ్రామం. ఆ గ్రామానికి చెందిన వడ్లపట్ల శ్రీరామ్మూర్తి, నర్సమ్మ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. మిగతా పిల్లలతో పోలిస్తే ఆ పాపలో ఏదో తెలియని ఆకర్షణ. పుట్టినప్పటి నుంచే చలాకీగా ఉండడంతో పాటు ఆమె మాటతీరు చూపరులను ఆకర్షించేది. నిరుపేద కుటుంబం. ఆమె పుట్టుకతోనైన తమ కుటుంబంలో మార్పు వస్తుందన్న నమ్మకంతో ఆమెకు విజయలక్ష్మి అని పేరు పెట్టే లా చేశాయి. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ గడిపే ఆమెకు చదువంటే అంతగా ఆసక్తి లేకపోవడంతో నాలుగవ తరగతితోఫుల్‌స్టాప్ పడింది. వయస్సు పెరుగుతుంది. ఎదిగిన ఆడపిల్లకు పెండ్లి చేయాలని ప్రతి తల్లిదండ్రి అనుకుంటారు. కానీ ఆ అమ్మాయికి అదేం ఇష్టం లేదు. దీంతో చేసేదిలేక ఆమెను మద్రాస్‌లో ఉండే ఆమె అత్త అన్నపూర్ణమ్మ ఇంటికి పంపించారు. అప్పటికీ ఆమె వయస్సు కేవలం పదిహేను సంవత్సరాలు.

1975వ సంవత్సరం. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న మద్రాస్ నగరం (చెన్నై). వెండితెర మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఎందరో ఆశావాదులు ఆ నగర వీధుల్లో సంచరిస్తున్న రోజులవి. ఎందరో ఆశావహులు సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతూ తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. విజయలక్ష్మి కూడా సినిమాల్లో అవకాశాలకోసం చేయని ప్రయత్నం లేదు. ఆమె ప్రయత్నాలు ఫలించి తొలిసారిగా 1978లో బేడీ అనే ఓ కన్నడ చిత్రంలో చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. తరువాత 1980లో వండిచక్కరమ్ అనే తమిళ చిత్రంలోనూ నటించింది. ఇందులో ఆమె పాత్ర పేరు సిల్క్. 1981లో ఇనయె తెడి చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. కొంటె చూపులు, ఠక్కున ఆకర్షించే రూపంతో సినీ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. రచయిత విను చక్రవర్తి ఆమెలోని నటనను గుర్తించి ట్రైన్ చేశారు. విజయలక్ష్మి పేరుని ఆయనే స్మితగా మార్చారు. చక్రవర్తి భార్య స్మితకు డాన్సు నేర్పించింది. ఆమె డాన్సు చేస్తుంటే రొమాంటిక్‌గా ఉండడంతో ప్రత్యేక పాటల్లో ఎక్కువగా అవకాశాలొచ్చాయి. తనకు పేరు తెచ్చిన సిల్క్ పాత్రతో పాటు తన సినిమా పేరు కలసి సిల్క్‌స్మితగా వెండితెర మీద ముద్రించుకుంది. ఆయా సినిమాల్లో ఆమె ప్రదర్శించిన నటనకు వరుస అవకాశాలు రావడానికి మార్గం ఏర్పడింది. ఇలా ఆమె పలు సినిమాల్లో పాత్రలు నటిస్తూ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుంది.
Silk-Smitha1
1981లో భారతీరాజా దర్శకుడుగా సీతాకోకచిలుక చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అన్వేషణ సాగిస్తున్న తరుణంలో సిల్క్‌స్మిత గురించి ఆయనకు ఎవరో చెప్పారు. తన చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రకోసం ఆమెను ఎంపిక చేసుకున్నారు. అందులో హీరోయిన్ ముచ్చర్ల అరుణ. ఆమెకు వదినగా, శరత్‌బాబుకు భార్య గా స్మిత నటించింది. అప్పటి వరకు డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఈ చిత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చింది. అవకాశం వస్తే తను ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలనని ఈ సినిమా నిరూపించింది. బాలూ మహేంద్ర వంటి దర్శకుడు, పొటో గ్రాఫర్ ఆమెకు మంచి పాత్రలిచ్చి ఆర్టిస్ట్‌గా నిలిపాడు. ఇక వరుసగా ఆమె తెలుగు సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకోగలిగింది. 1982లో యమకింకరుడు, 1983లో ఖైదీ, పాతాళభైరవి, దత్తదర్శనం, 1988లో ఖైదీ నెంబర్ 786, 1989లో గీతాంజలి, 1991లో ఆదిత్య 369, 1993లో బావా బావమరిది, కుంతీపుత్రుడు, 1994లో ఆలీబాబా అరడజను దొంగ లు వంటి సినిమాల్లో ఆమె చక్కటి నటన ప్రదర్శించారు. ఇంకా అనేక తెలుగు, తమిళ, మలయాళంలో మొత్తం మీద 200 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 1996లో విడుదలైన మా ఆవిడ కలెక్టర్ ఆమె చివరి చిత్రం. అదే ఏడాది తమిళ సినిమా తిరుంభపార్ ఆమె నటించిన తమిళ సినిమా రేస్మికిజవానిగా హిందీలో రీమేక్ చేశారు.

కట్‌చేస్తే..

కమల్‌హాసన్, శ్రీదేవి వంటి అగ్రశ్రేణి నటులున్న చిత్రాల్లోనూ స్మితకు ప్రత్యేక సాంగ్ తప్పకుండా ఉండాల్సిందే అనేంత స్థాయిలో ఆమె ఎదిగింది. హిందీ, తెలుగు, తమి ళం, కన్నడ, మలయాళ చిత్రాలన్నింటిలో సిల్క్‌పేరు మారుమోగింది. ఎక్కడో మారుమూల గ్రామం నుండి చిన్న ఇనుపపెట్టెతో మద్రాస్‌లో అడుగుపెట్టిన సిల్క్ జీవి తం పదేళ్లలో గొప్ప మలుపు తిరిగింది. తినడానికి తిండిలేని రోజుల నుంచి కోట్లాది రూపాయలు సంపాదించే స్థాయికి ఆమె ప్రస్థానం కొనసాగింది. డబ్బు, కార్లు, సొంత ఇల్లు, పనివాళ్లు అందరూ ఉన్నారు. కానీ ఏదో వెలితి. తనకంటూ తోడులేదు తనని ప్రేమగా చూసుకునేవారికోసం ఆరాట పడింది. ఇక తన తల్లిదండ్రులను మద్రాస్ తీసుకొచ్చుకుందామనుకుంటున్న సమయం...

అపరిచితుడి ఆగమనం
అటువంటి సమయంలోనే సిల్క్‌స్మిత జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. మొదట అభిమానమన్నాడు. స్నేహమన్నాడు. తరువాత ప్రేమ అన్నాడు. నీవు లేకుంటే బతకలేనన్నాడు. అలా ఆమె ప్రమేయం లేకుండానే ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. అతనికి పెండ్లయిందనీ, పిల్లలున్నారని చెబుతారు. సిల్క్ జీవితంలోకి అడుగుపెట్టిన వ్యక్తి ఒక డాక్టర్ అని చెబుతారు. ఆయన ఎవరో ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఆయన గురించి ఆమె కూడా ఎక్కడా ప్రస్థావించలేదు. అయితే ఆ వ్యక్తి ఎంట్రీతో స్మిత జీవితం అనూ హ్య మలుపులు తిరిగింది. సిల్క్ కెరీర్ మంచి ఊపులో ఉన్నపుడే అతను దగ్గరయ్యాడు. నిజానికి ఆనాడు సిని మా పరిశ్రమలో తమిళ, తెలుగు, కన్నడ సూపర్‌స్టార్లుగా వెలిగిన నటులతో ఆమెకు సాన్నిహిత్యం ఉండేదని చెబుతారు. వారు హీరోలుగా చేసిన ప్రతి సినిమాలో స్మితకు తప్పకుండా అవకాశం ఉండేదట.

Silk-Smitha2
సిల్క్‌స్మితది ఆత్మహత్య కాదన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆమె కడుపులో పాయిజన్ వంటి వేవి లేవని తేల్చారు. అలాగే స్మిత కడుపులో అరటిపండ్లు, చాక్లెట్లు తప్ప ఆహారమేదిలేదని తేల్చారు. దీంతో ఆమె చాలా రోజుల ముందు నుంచే ఆహారం తీసుకోవడం లేదని గుర్తించారు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది నేటికీ తేలని విషయం.

కానీ వారెవ్వరూ ఆమె జీవితంలోకి ప్రవేశించలేదు. తన జీవితంలోకి ప్రవేశించిన వ్యక్తినే పూర్తిగా నమ్మింది. డాన్సర్‌గా మంచి స్థితిలో ఉన్న సమయంలోనే ఆమె నిర్మాతగా మారింది. 1987లో పెన్న్‌సింహమ్ పేరుతో చిత్రాన్ని నిర్మించింది.

అయితే ఆ సినిమా అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. అంతే ఆమె పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా ఆమెను ఆప్పులు చుట్టూ ముట్టా యి. ఆమెతో సినిమాలు తీసి సంపాదించుకున్నవారు కూడా ఆమెకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. అదే సమయంలో ఎవరైనా ఒక కోటి రూపాయలిస్తే తిరిగి నన్ను నేను నిరూపించుకుంటానని బాహటంగానే ప్రకటించినప్పటికీ ఆమెను ఎవరూ ఆదుకోలేదు. అయితే తను ఎవరినైతే నమ్మిందో అతను స్మిత డబ్బును తన గుప్పిట్లోకి తీసుకున్నాడని చెబుతారు. అప్పటికే పూర్తిగా ఆమె జీవితాన్ని అతను చేతుల్లోకి తీసుకున్నారంటారు. దాంతో అతనితో తెగతెంపులు చేసుకోవాలని, తన స్వేఛ్చా ప్రపంచంలోకి తిరిగి వెళ్లిపోవాలని స్మిత చాలా ప్రయత్నించిందంటారు. అదే సమయంలో ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. సినిమా తీసి నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సిల్క్ బలహీనతను క్యాష్ చేసుకోవాలనుకుని ఓ బ్లూఫిల్మ్ మాఫియా ఆమెను కలిసిందట. తమ సినిమాలో నటిస్తే కోరినంత డబ్బు ఇస్తామని ఆశ పెట్టింది.

ఆమె ఉన్న పరిస్థితిని ఉదహరిస్తూ స్మితపై ఒత్తిడి తెచ్చారు. మరోవైపు తనతో ఉన్న వ్యక్తి కూడా డబ్బులకోసం అలా చేయమని చెప్పడం ఆమెను మరింత కుంగదీసింది. అయితే ఆమె నటించిన చిత్రాల్లోని క్లిప్పింగ్‌లను తీసుకుని బ్లూ చిత్రాలు రూపొందించి విడుదల చేయడంతో సిల్క్ డబ్బులకోసం నీలి చిత్రాల్లో నటిస్తుందన్న ప్రచారం జోరందుకుంది. నా అనుకున్నవాడు మోసం చేయడం, ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడం ఆమె తట్టుకోలేకపోయింది. ఇక బతకడం అనవసరం అనుకున్న ఆమె 1996 సెప్టెంబర్ 22న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆమెది ఆత్మహత్య కాదన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆమె కడుపులో పాయిజన్ వంటివేవి లేవని తేల్చారు. అలాగే స్మిత కడుపులో అరటిపండ్లు, చాక్లెట్లు తప్ప ఆహారమేదిలేదని కూడా తేలింది. దీంతో ఆమె చాలా రోజుల ముందు నుంచే ఆహారం తీసుకోవడం లేదని గుర్తించారు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది నేటికీ తేలని విషయం. అంతకు ముందు వారమే తన తల్లిదండ్రులతో మాట్లాడి ఊరిలో పొలాలు కొందామని చెప్పిన ఆమె ఇలా అకస్మాత్తుగా ఆత్మహత్య ఎందుకు చేసుకుందో అంతుపట్టని విషయం.

ఇక తను చనిపోతూ రాసిన సూసైడ్ నోట్‌లో ఆశలన్నీ ఒకరిమీద పెట్టుకున్నాను. అతను మోసం చేశాడు. ఒకపుడు ప్రేమగా చూసుకున్నవాడు ఇప్పుడు కష్టపెడుతున్నాడు. నేను కోరుకున్న ప్రేమ అందడం లేదు. అన్ని రకాలుగా ఒత్తిడులు, చుట్టూ ఉన్నవాళ్లే మన ఃశాంతి లేకుండా చేశారు. ఇంత సాధించినా ప్రశాంతత లేదు. ఇక బతకడం అనవసరం అని రాసిందంటే ఆమె ఎంతటి మానసిక హింసను అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు. నటిగా మంచి స్థితిలో ఉన్న సమయంలో కేవలం 36 ఏళ్లకే తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుని సిల్క్‌స్మిత అందరాని లోకాలకు వెళ్లిపోవడం విచారకరం. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో రూపొందించిన డర్టీ పిక్చర్ సినిమా సూపర్‌హిట్ అయ్యింది.

823
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles