ప్రపంచాన్నే ఊపేసిన కింగ్స్


Sun,May 19, 2019 01:07 AM

dance
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన డాన్సర్స్‌గా మారుమోగిపోతున్న టీం పేరు ది కింగ్స్ యునైటెడ్. ముంబయికి చెందిన ఈ టీం ప్రపంచ ఫెవరేట్‌గా ఆవిర్భవించింది. సాధారణ వ్యక్తులు మొదలు సినిమా నటుల వరకు అందరూ వీరి డాన్స్ గురించి, సాహసాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే వరల్డ్ ఆఫ్ డాన్స్ ఈవెంట్‌లో విజేతలుగా నిలిచి అందరి హృదయాలను గెలిచిన బృందమే ఈ కింగ్స్ యునైటెడ్. మనదేశం నుండి పోటీల్లో గెలిచిన తొలి బృందం కింగ్స్ యునైటెడ్ కావడం విశేషం. ఫైనల్ రౌండ్‌లో సర్దార్ గబ్బర్‌సింగ్ పాట రీమిక్స్‌కు చేసిన డ్యాన్స్‌కు నూటికి నూరు పాయింట్లు సాధించి మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుని విశ్వవిజేతలుగా నిలిచారు.

ముంబయికి చెందిన హిప్ హాప్ డాన్స్ టీమే ది కింగ్స్ అంటూ పేరు మార్చుకుని అంతర్జాతీయ వేదికలపై సందడి చేస్తున్నది. ది కింగ్స్‌లో 14 మంది సభ్యులు. వీరంతా ముంబయిలోని నాలాసోపర అనే ప్రాంతానికి చెందిన యువకులు. మొదట్లో ఈ బృందం ఫిక్టీషియస్ అనే పేరుతో పోటీల్లో పాల్గొనేవారు. వీరు మొదటి స్టేజ్ షోకు వచ్చిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా 500 రూపాయలు. వాటితోనే వీరి ప్రస్థానం ప్రారంభమయ్యింది. 2009లో సురేష్ ముకుందన్, వెర్నస్ మోంట్రి యో కలిసి ఈ టీంను ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చారు.

స్థానికంగా అనేక స్టేజీ షోలు ఇస్తూనే జాతీ య, అంతర్జాతీయంగా జరిగే పలు ఈవెంట్లలో ఈ టీం పాల్గొంటున్నది. బూగీ ఊగీ, ఎంటర్‌టైన్ మెంట్‌కే లియే కుచ్ బి కరేగా, ఇండియాస్ గాట్ టాలెంట్ తదితర షోలలో ఈ బృందం తన ప్రతిభను ప్రదర్శించింది. 2011లో టాలెంట్ సీజన్ 3లో మొదటి స్థానం దక్కించుకోవడంతో దేశం మొత్తం ఒక్కసారిగా వీరి వైపు తిరిగింది. 2012లో జరిగిన వరల్డ్ హిప్ హాప్ చాంపియన్స్‌లో కింగ్స్ ఫైనల్స్‌కు చేరింది. 2015లో ఇదే పోటీలో కాంస్య పతకం సొంతం చేసుకుంది. 2016 ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో ది కింగ్స్ ఇచ్చిన అద్భుత ప్రదర్శనకు ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టడం విశేషం.

హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపేజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ అనే అమెరికన్ రియాల్టీ షోను నిర్వహిస్తున్నారు. ఈ షో ఇప్పటి వరకూ మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ పోటీలో పాల్గొని విజయం సాధించిన బృందానికి ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందజేస్తారు. జూనియర్, అప్పర్, జూనియర్ టీమ్, అప్పర్ టీమ్ పేర్లతో 4 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఈవెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 బృందాలు పాల్గొన్నాయి. వీటిలో దక్షిణ కొరియాకు చెందిన హీమి యా, లాస్‌ఏంజిల్స్‌కు చెందిన యుని టీ ఎల్‌ఏ, ముంబయికి చెందిన కింగ్స్ యునైటెడ్ ఫైనల్ పోటీల్లో తలపడ్డాయి. న్యాయనిర్ణేతలు పోటీలో పాల్గొనే బృందానికి ఉత్తమ ప్రదర్శనకు 20 పాయింట్లు, టెక్నిక్‌కు 20, కొరియోగ్రఫీకి 20, క్రియేటివిటీకి 20, ప్రెజెంటేషనుకు 20 ఇలా మొత్తం 100 పాయింట్లు నిర్ణయించారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 వరకూ జరిగిన క్వాలిఫయర్ రౌండ్‌లో కింగ్స్ యునైటెడ్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ధక్కా లగా బుక్కా యువ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ పాటకు 97.7 స్కోరు సాధించింది. తర్వాతి రౌండ్‌లో మల్హరి పాటకు గానూ, 99.3, ఆ తర్వాత ఏప్రిల్ 28న జరిగిన మరో పోటీలో అనుపమ యహీ రాత్ పాటకు 99.7 స్కోరు సాధించారు.
dance1
కింగ్స్ ప్రతి ప్రదర్శనలోనూ కొత్తదనాన్ని చూపించేందుకు ప్రయత్నించారు. ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా కష్టపడి అద్బుతమైన బాడీ మూమెంట్స్‌తో గుర్తింపు దక్కించుకున్నారు. మే 6న జరిగిన ఫైనల్ రౌండ్‌లో సర్దార్ గబ్బర్‌సింగ్‌లోని వాడెవడన్నా.. వీడెవడన్నా పాటకు ఇచ్చిన ప్రదర్శనకు గానూ వందకు వంద సాధించి మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీతో పాటు, కోట్లాది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఫైనల్‌లో ది హీమియాకు 100కి 95.3, యునిటీ ఎల్‌ఏకు 96 మార్కులు వచ్చాయి. ఫైనల్లో వీరు చేసిన డ్యాన్సు వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. యూట్యూబ్‌లో ఇప్పటివరకూ దీనిని 6.5 మిలియన్లకు పైగా వీక్షించారు. ఈవెంట్‌కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన జెన్నిఫర్ లోపేజ్, నీ-యో, డెరిక్ హాగ్‌లు వారి డాన్స్ స్టెప్పులను ఎంజాయ్ చేశారు. 500 ప్రైజ్ మనీ దక్కించుకున్న ది కింగ్స్ సరిగ్గా పది సంవత్సరాల్లో ఏకంగా 10 మిలియన్ల డాలర్లు అంటే సుమారు 6 కోట్ల రూపాయలకు పైగా ప్రైజ్ మనీని దక్కించుకున్నారు.

521
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles