ఆదర్శగ్రామం అంటే ఇదే!


Sun,May 19, 2019 12:37 AM

sarpunch
ఒక గ్రామం అభివృద్ధి పథంలో సాగాలంటే సర్పంచ్ చాలా అవసరం. కానీ అదేంటో..!! స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి ఈ గ్రామానికి సర్పంచ్ అనే వ్యక్తే లేడు. గ్రామ పంచాయతీ ఎన్నికలంటే ఎత్తులు, పై ఎత్తులు, కొట్లాటలు, కుమ్ములాటలంటూ నానా హంగామా ఉంటుంది. కానీ, ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఆ ఎన్నికలే లేవు. అయితే.. ఆ గ్రామంలో అభివృద్ధి ఉండదు అనుకుంటే పొరబడినట్లే. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం ఈ ఊర్లో వెల్లివిరుస్తున్నది. స్వచ్ఛత, పచ్చదనం, అభివృద్ధికి ఆ గ్రామం కేరాఫ్!!

భారత దేశపు ఆత్మ గ్రామాల్లోనే ఉన్నది. దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు అని గాంధీ మహాత్ముడు గ్రామ స్వరాజ్యం గురించి కలలు కన్నారు. మానవుని ఔన్నత్యం, సంపూర్ణ ఉద్యోగిత, శారీరక శ్రమ, సమానత్వం, వికేంద్రీకరణ, స్వయం సమృద్ధి, సహకారం, మతసామరస్యంతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమని బాపూజీ నమ్మాడు. ఈ క్రమంలో స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలైనా చాలా గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. అయితే.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సర్పంచ్ అనే వ్యక్తి లేకుండా ఈ గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. అదే భగువార్ గ్రామం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్ జిల్లా కరేలి మండలంలో ఇది ఉన్నది. ఆధునిక భారతంలో అసంబద్ధ ఒత్తిడులకు లొంగకుండా అభివృద్ధి దిశగా పయనిస్తున్నది.
sarpunch1

సర్పంచ్ లేక 7 దశాబ్దాలు

భగువార్ గ్రామస్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న సైజు అన్నా హజారే అనుకోవాల్సిందే. సర్పంచ్ లేక పోయినా గ్రామ స్వరాజ్యం సాధించడంలో వీరంతా ఉదాహరణగా నిలిచారు. గ్రామం మొత్తం అభివృద్ధిని పరిశీలిస్తే, రాలేగావ్ సిద్ధి, హివారే బజార్ గ్రామాల అభివృద్ధి కంటే ముందంజలో ఉంది భగువార్ గ్రామం. మొదట్లో గ్రామానికి చెందిన నిర్ణయాలు ఆ గ్రామంలోని పెద్ద, మర్యాదస్తుడుగా అందరూ గౌరవించే భయ్యాజీ తీసుకునే వారు. భయ్యాజీ కష్టపడేతత్వం చూసిన గ్రామస్తులు ఆయన అడుగు జాడల్లో నడిచారు. అయితే 2012లో భయ్యాజీ మరణించినా, ఆయన ఆశయ సాధనలోనే గ్రామస్తులు నడుస్తున్నారు.
sarpunch2

అన్నీ ప్రత్యేకతలే!

దేశంలోనే అత్యుత్తమమైన మురుగునీటి వ్యవస్థ ఈ భగువార్ గ్రామంలో ఉన్నది. మురుగునీరు గ్రామంలోని రోడ్లపై పారకుండా భూగర్భ కాలువల వ్యవస్థ ఏర్పాటు చేశారు. వర్షపు నీరు, ఇతర నీరు నిల్వ చేయడానికి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఉన్నాయి. దీంతో ఇక్కడ భూగర్భ జలాలు తగినంత మేర ఉన్నాయి. దేశంలోనే అత్యధిక గోబర్ గ్యాస్ ప్లాంట్‌లు ఉన్న గ్రామంగా భగువార్ నిలిచింది. ఈ గ్రామ జనాభా 1600. ఈ గ్రామంలో 51 గోబర్ గ్యాస్ ప్లాంట్ల ద్వారా వంట గ్యాస్ ఉత్పత్తి చేస్తూ వీధిలైట్లు వెలగడానికి వాడుతున్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం భగువార్ గ్రామంలో నిషేధించారు. చెత్తనంతా సేకరించి ఒకచోట పెద్ద గుంటలో వేసి, ఏడాదికి ఒకసారి వేలం వేస్తారు. ఆ డబ్బును గ్రామ అభివృద్ధి కోసం వినియోగిస్తారు. నిరంతరం అభివృద్ధి సాధించడానికి వనరుల, నిధుల సమీకరణ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు గ్రామస్తులు.

సొంతంగా రహదారులు

భగువార్ గ్రామ ప్రధాన రహదారికి సరైన రోడ్డు మార్గం ఉండేది కాదు. దీంతో గ్రామంలోని యువకులు మూడు కిలోమీటర్ల రోడ్డును సొంతంగా నిర్మించారు. ఈ గ్రామస్తుల ఉక్కు సంకల్పం ముందు తల వంచిన ప్రభుత్వం.. జాతీయ రహదారికి సిమెంటు రోడ్డు నిర్మించింది. భగువార్ గ్రామంలో 35 ట్రాక్టర్లు,75 చెరుకు గడలు ప్రాసెస్ చేసే మిషన్లు, గ్రామస్తులు వాడుకోవడానికి 25 చేతి పంపులు ఉన్నాయి. భగువార్ గ్రామంలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు ఉన్నాయి. గ్రామస్తులు ఏదైనా సమావేశాలప్పుడు వాడుకోవడానికి జనరల్ మరుగుదొడ్డి కూడా ఉన్నది. స్థానిక పాఠశాలలో కులం, మతంతో సంబంధం లేకుండా చదువులు చెబుతారు. మధ్యాహ్న భోజన పథకంలో మంచి రుచికరమైన నాణ్యమైన భోజనం ఉంటుంది. వీటిని ఆయా కమిటీలు పర్యవేక్షిస్తుంటాయి.
sarpunch3

హింసకు చోటు లేదు!

భగువార్ గ్రామంలో ఎలాంటి పనులు జరగాలన్నా అన్నీ గ్రామసభ ద్వారానే జరుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలు కూడా నిజమైన లబ్ధిదారులకు అందుతాయి. ఇక్కడ లంచం, అవినీతి అనే పదాలకు చోటు ఉండదు. అంతా పారదర్శకంగా జరుగుతుంది. ఉద్రిక్తత, హింసకు తావులేని విధంగా తమ గ్రామాన్ని తీర్చిదిద్దుకున్నారు గ్రామస్తులు. ప్రభుత్వ పథకాలు, వాటి నుండి వచ్చే నిధులను ఎలా విడుదల చేయించుకోవాలో వీరికి బాగా తెలుసు. వచ్చిన నిధులకు ప్రాధాన్యరీత్యా ఎలా ఖర్చు చెయ్యాలో కూడా బాగా తెలుసు. అందుకే ఈ భగువార్ గ్రామం అభివృద్ధిలో ముందంజలో ఉన్నది. ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధిపై స్వరాజ్ ముమ్‌కిన్ హై పేరుతో ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీ చాలా అవార్డులు గెలుచుకున్నది.

368
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles