అలసితి..


Sun,May 19, 2019 12:26 AM

ALASITHI
డా॥ ప్రభాకర్ జైనీ
సెల్: 7989825420


అనేక ఈతిబాధలల్ల ఉండి, నా నాన్న చనిపోయిన బాధల ఉన్న నాకు, ప్రేమరాహిత్యంల కొట్టుకపోతున్న నాకు నా కాబోయేటి భార్య నుండి ఉత్తరం రావడం చాలా ఉత్సాహాన్ని కలిగించింది. సినిమాలల్ల, కథలల్ల మాత్రమే జరిగేటువంటి సంఘటన నా జీవితంల నిజంగగ జరిగేసరికి నా మనసు ఉప్పొంగి పోయింది. గా ఉత్తరాన్ని ఎన్నిసార్లు చదువుకున్ననొ నాకే తెల్వదు. చాల రోజులు నా ప్యాంటు జేబులనె పెట్టుకుని తిరిగిన.

మనసేం బాగలేదు.
దానికి తగ్గట్టు, ఆకాశం మబ్బులు పట్టి, చికాకుగున్నది. వర్షం పడ్తలేదు. ఉబ్బరం తగ్గుతలేదు.
నా భార్య అనారోగ్యంతోటి మంచంల ఉన్నది. మందులు ఇప్పిస్తున్నం గనీ, గదేం మాయరోగమో తగ్గుతనే లేదు. ఒంటి నొప్పులతోటి అడుగుతీసి అడుగు వెయ్యలేకపోతాంది. నొప్పులు భరించలేక, కండ్ల నీళ్ళు పెట్టుకుంటాంటె, ఆమెనట్ల మంచంల చూస్తాంటె, నా గుండె తరుక్కపోతాంది.
ఎన్నో రకాల మందులు వాడినం. అల్లోపతి, హోమియోపతి, ఆక్యుపంక్చర్ విధానాలల్ల గూడా ఏ మాత్రం లాభం లేకుండపాయె. పైసలకేం కొదవలేదు. ఎక్కడ చికిత్స ఉన్నదంటె, అక్కడికి పోయినం. గా డాక్టరు కాకుంటె, గీ డాక్టరంటె, ప్రతీ డాక్టరు చుట్టూ తిరిగినం. ఇంటి నిండ పనిమనుషులున్నరు. కనీ, ఇంటి ఇల్లాలు, మంచంల ఉంటే, ఆ ఇంటికి శోభే ఉండదు.

డాక్టర్లేమో, వయస్సుతోటి వొచ్చే రోగాలు తొందరగ తగ్గవండీ! అంటరు.
తన అవస్థను చూస్తాంటె, అరే, గిదేంది? మేమున్నదేం పల్లెటూరు కాదు. హైద్రాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నం. పైసలకేం ఇబ్బంది లేదు. గీ ఇరవయ్యొకటో శతాబ్దంల మందులకు లొంగని నొప్పులుంటయా? అని గొంతెత్తి మొత్తుకోవాలనిపిస్తాంటది నాకు.
గందుకె మనసు బాగలేదు. తనకేమో నేను తన దగ్గర కూర్చోని తనతోటి ముచ్చట్లు పెట్టాలనుంటది. నాకేమో, మొదటినుంచి అట్ల యిష్టముండదు. ఎవ్వరైనా పక్కన కూర్చోని సానుభూతి వాక్యాలు పలుకుతాంటె, వ్యాధి తగ్గదని నా అభిప్రాయం.
ప్లేసిబో ఎఫెక్ట్ అనేది వ్యాధి చికిత్సలో ఒక భాగం. ఏ రకమైన మందైనా మన శరీరం మీద కొంత మేరకే ప్రభావం చూపించి, మన ఒంట్లె ఉన్న రోగాన్ని తగ్గిస్తదని, మన శరీరం ఒక గొప్ప అద్భుతమైన నిర్మాణమని, దానికి తనను తాను రిపేర్ చేసుకునే శక్తి ఉంటదని, అందుకోసం మనం మానసికంగ బలంగ ఉండి, నాకేం కాలేదు, నేను తొందర్లనె, మల్ల ఆరోగ్యంగ తయారయిత అని మనకు మనమె సెల్ఫ్ సజెషన్స్ యిచ్చుకోవాలని నేను చెప్తనే ఉంట. కనీ, నొప్పుల బాధల ఆమె గా విషయాన్ని పట్టించుకోదు. నేను తన పక్కనే కూచోవాలంటది. అది ఎందుకో నాకు ఎబ్బెట్టుగనిపిస్తది.

ఒక్కొక్కరోజు, నొప్పులు లేకుంటే, హుషారుగుంటది. అప్పుడు, మా ఇంటినిండ సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్టు, హరివిల్లులు మాకోసమె విరిసినట్టు అనిపిస్తది. తను పకపక నవ్వితె, మా ఇంట్ల స్వరరాగ గంగా ప్రవాహమె.
కనీ, ఇయ్యాల పొద్దటినుంచి పడుకోనే ఉన్నది. తనట్ల ఉంటె నా గుండె గొంతుకల తన్నుకున్నట్టయితది. కని, నా బాధను ఆమె ముందట ప్రదర్శించలేక, అందరి లెక్క సానుభూతి మాటలు మాట్లాడలేక, నేను ఉక్కిరిబిక్కిరయిత.
ఆమె బాధను చూడలేను. చూస్కుంట ఉండలేను. చూడకుండగూడ ఉండలేను. తన పక్కన కూర్చోని, అందరి లెక్క, ఓదార్చలేకపోతున్నందుకు, నాక్కూడా ఆ రోజంత బాధగ, మనసు నిండ మబ్బులు కమ్ముకున్నట్టుంటది.
నా భార్యకు కూడ నా సంగతి తెలుసు. కనీ, అనారోగ్యంగ ఉన్నప్పుడైన దగ్గరుంటె బాగుండునని తను అనుకుంటదని నేనూహించగలను.
అందుకనె, ఇంగ నేను ఇంట్ల ఉండలేక బయటకు పోదామని చెప్పులు తొడుక్కుంటాంటె, నా భార్య,
వానొచ్చెటట్టుంది. ఇప్పుడు బయటికెందుకండి? అన్నది.

నేను, నీరసంగ, బలహీనపడిన తన చెంపలు నిమిరి,
ఇప్పుడే వస్త! అని బయటకు నడుస్తుంటె, నా చేతిల ఒక కవరు పెట్టింది. నేను ఆశ్చర్యంగ చూసిన.
వీలైనప్పుడు చదవండి! అన్నది. నేను విస్తుపోయి, ఆ కవరును చూస్తె, దాంట్ల చాలా పేజీలున్నట్టు అనిపించింది. గిన్ని పేజీలు ఎప్పుడు రాసిందానని? నేను మస్తు ఆశ్చర్యపోయిన.
పోర్టికోల కారు దగ్గరున్న డ్రైవరు కారు తీయబోయిండు. నేను వద్దని వారించి, బయటకు నడిచిన.
ఆకాశమూ, మనసూ మబ్బు పట్టినట్టే ఉన్నయి. నడుస్తుంటే, పాయింట్ జేబుల ఉన్న ఉత్తరం చేతులకు తగులుతాంది. నా భార్య ఉత్తరం ఎందుకు రాసిందా? అన్న అనుమానం నన్ను పీడిస్తాంది. తొందరతొందరగ పోయి ఎక్కణ్ణన్న కూర్చోని ప్రశాంతంగ, ఆ ఉత్తరం చదవాలె అని అనుకుని, ఇందిరా పార్కు దిక్కు వడివడిగ అడుగులేసిన.

సముద్రంల అలలు ఉధృతంగ ఉన్నప్పుడు, పడవ నడిపే సరంగు వేసిన లంగరు, పడవను ముందుకు పోనియకుండ, సముద్రం లోతుల్లకు, అడుగుదాక పోయి, సముద్ర గర్భంల ఏదో ఒక ఆధారాన్ని దొర్కబట్టుకొని, నిశ్చలంగ స్థిరపడ్తది. గట్లనే నా మనసు కూడ, లంగరు లెక్క, జేబుల ఉన్న ఉత్తరం దిక్కే లాగుతాంది. తొందరగ తెరిచి చదవాలని మనసు ఉవ్విళ్ళూరుతాంది.
నా భార్య ఉత్తరంల ఏం రాసి ఉంటది? నాకైతే తన దగ్గర కూర్చోని మాట్లాడడం రాదు. కనీ, తను రోజు నాతోటి మాట్లాడుతనే ఉంటది గద. మల్ల ఉత్తరం ఎందుకు రాసింది? ఉత్తరం కూడ చిన్నగా లేదు, నాలుగైదు పేజీలున్నట్టున్నది? గంత ఘనం రాసే విశేషాలేముంటయి? నా మనసు నిజంగనె, లంగరు దించిన సముద్రం లెక్క, గీ ఆలోచనలతోటి, అల్లకల్లోలంగ మారింది.
మనసు ఉత్తరం తెరవమని పోరు పెడుతాన్నా, నాకు దాన్ని చేతుల్లోకి తీసుకోవాల్నంటెనే భయమైతాంది. ఉత్తరం తెరిస్తే, అందుల ఏముంటదోనని గుబులుగ ఉన్నది.
ఇందిరా పార్కుల ఒక బెంచీ మీద కూర్చున్ననన్న మాటనేగని మనసు ఎక్కడెక్కడ్నో విహరిస్తాంది. ఇటువంటి ఉత్తరాలు, మేం చిన్నప్పుడు, అంటే పెండ్లి కానప్పుడు రాసుకునేటోళ్ళం.

అప్పట్ల, వాల్లది పల్లెటూరు కాబట్టి వాళ్లింట్ల ఫోన్ సౌకర్యం లేదు. మేం అప్పట్ల వరంగల్లుల ఉన్నా, మాయి మధ్యతరగతి బతుకులు కాబట్టి, మా యింట్ల కూడా ఫోన్ లేదు. ఇంట్ల ఫోనుంటె, ఆ రోజుల్లో చాల గొప్ప. సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు భవిష్యత్తుల వొస్తయని కూడ ఊహించని రోజులవి. కేవలం ఉత్తరాలే సమాచార సాధనాలుగా ఉండేటియి.
మా ఇద్దరి పెండ్లి నిశ్చయమైనాక కూడా, వాల్లింట్ల ఆస్తుల తగాదాలతోటి, మా పెండ్లి దాదాపు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వొచ్చింది. మేమిద్దరం తల్లడిల్లిపోయినం. మాదేం ప్రేమ వివాహం కాదు. పెండ్లిచూపులల్ల తప్ప అంతకు ముందు మేము ఒకరినొకరం చూసుకోను కూడ లేదు. కని ఎందుకో తనను చూడంగనె, తను నా కోసమే పుట్టినట్టనిపించింది. అందుకే, మేము పెండ్లికి ఒప్పుకున్నా, వాండ్లు పెండ్లి జరపడానికి సిద్ధంగా లేకపోవడంతోటి, వేరే సంబంధం చూసుకుందామని మా ఇంట్ల ప్రయత్నాలు మొదలుపెట్టిన్రు. నేను తీవ్రంగా వ్యతిరేకించిన.

దాంతోటి, గా విషయం తెల్సిన కాబోయేటి నా భార్య, భయపడి నాకు ఉత్తరం రాసింది. గా ఉత్తరం అందుకున్న రోజున ఊహల్లో తేలిపోయిన. అనేక ఈతిబాధలల్ల ఉండి, నా నాన్న చనిపోయిన బాధల ఉన్న నాకు, ప్రేమరాహిత్యంల కొట్టుకపోతున్న నాకు నా కాబోయేటి భార్య నుండి ఉత్తరం రావడం చాలా ఉత్సాహాన్ని కలిగించింది.
సినిమాలల్ల, కథలల్ల మాత్రమే జరిగేటువంటి సంఘటన నా జీవితంల నిజంగగ జరిగేసరికి నా మనసు ఉప్పొంగి పోయింది. గా ఉత్తరాన్ని ఎన్నిసార్లు చదువుకున్ననొ నాకే తెల్వదు. చాల రోజులు నా ప్యాంటు జేబులనె పెట్టుకుని తిరిగిన. గా ఉత్తరం చినిగిపోయేటంత వరకు జేబుల పెట్టుకుని తర్వాత తీసి దాచి పెట్టిన. గా ఉత్తరం ఇప్పటికి నా బీర్వాల భద్రంగ ఉన్నది.
ఓ గది ఇప్పటి ముచ్చట గాదు. నలభై మూడేండ్ల కిందటి, 1976 మార్చి, ఏప్రిల్ నాటి ముచ్చట.

నేను కూడ మంచి ప్రేమ కవిత్వం జోడించి సమాధానం రాసిన. పెండ్లిచూపుల నాడు, నేను తీస్కపోయిన కెమెరా తోటి వాండ్ల పెరట్ల, బాయి పక్కన తీసిన ఆమె ఫోటో కూడ, గదే కవర్ల పెట్టి పంపిన.
గా తర్వాత ప్రపంచంల ఉన్న ఎన్నో సుందర ప్రదేశాలల్ల తను ఫొటోలు దిగింది గని - జొన్నల మల్యాలల, గడ్డీగాదంతో నిండిన వాండ్ల పెరట్ల, కూలిపోతున్న బాయి ముందు తీసిన గా బ్లాక్ అండ్ వైట్ ఫొటో ముందు గవన్ని బలాదూరే. గా ఫొటోల యవ్వన సౌందర్యంతోటి మిసమిసలాడుతున్న నా భార్య ముఖంల ఒక అతిశయం, ఒక మెరుపు, ఇప్పటికీ కనబడుతయి నాకు.
ఇప్పుడు సినిమాలకు కెమెరాలు రెంటుకిచ్చే బిజినెస్సులో నేను పార్ట్నర్ను. ప్రపంచంల ఎక్కడ ఏ కొత్త కెమెరా రిలీజయిన, అది మేం కొనే ప్రయత్నం చేస్తాము. గా కెమెరాలు కొనమని, ఆర్రీ (Arri), రెడ్ (Red) కంపెనీల ప్రతినిధులు మా వెంట పడుతుంటరు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలల్ల నిర్మించే సినిమాలన్నీ మా కెమెరాలతోటే, షూటింగు జరుపుకుంటాయి. దేశవిదేశాలకు మా కెమెరాలు, మా అసిస్టెంట్లు పోతుంటరు.
ఒక్కో కెమెరా ఖరీదు కోట్ల రూపాయలల్ల ఉంటది. వాటికి అమర్చే లెన్సుల ఖరీదు కూడ కోట్ల రూపాయలల్ల ఉంటది.

టెక్నికల్ గ, ఇంత అత్యాధునిక కెమెరాలు నా దగ్గర ఉన్నంక కూడ, నాకు నా పెండ్లిచూపుల నాడు, నేను, నా దోస్తు దగ్గర అడిగి తీస్కపోయిన బ్లాక్ అండ్ వైట్ కెమెరాతోటి తీసిన, గా పాత ఫొటోనే నాకు బాగ నచ్చుతది. చాల్రోజుల పాటు నా పర్సులనె పెట్టుకున్న. కానీ, ముడుతలు పడి చినిగిపోయే దశకు చేరుకున్నంక, లోపల బీర్వాల దాచిపెట్టిన.
గట్ల మా మధ్యన ఉత్తరాల పరంపర కొనసాగింది. ఎన్నో అవాంతరాలు, గండాలు దాటి, ఒక ఏడాది తర్వాత, మా పెండ్లి జరిగింది. తర్వాత, ఒక సుదీర్ఘ, సుందర ప్రేమ కావ్యం లెక్క మా నలభై రెండేండ్ల వివాహ జీవితం గడిచింది.
నా భార్య నా జీవితంలకు అడుగు పెట్టిన వేళా విశేషం ఏందో గని, జీవితంల అనేక పోరాటాలు చేసినం. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్నం. కష్టసుఖాలను పంచుకున్నం. జీవితపు ఉన్నతశిఖరాలనధిరోహించినం. పిల్లలు పెద్దోళ్ళయిన్రు. పెండ్లిల్లయినయి. ఎవరి కాపురాలు వాండ్లు చేసుకుంటాన్రు.

ఆమెకు ఒక్క గీ అనారోగ్యమే లేకపోతే మేమిద్దరం పరిపూర్ణమైన జీవితం అనుభవించనట్టే లెక్క. గందుకె, మా జీవితాల సంధ్యా సమయంల, ఆమె రాసిన ఉత్తరం తెర్వాలంటెనే నాకు భయమైతాంది. కని తెరవకా తప్పదు. చదవకా తప్పదు.
చేతులు వొణుకుతాంటే కవర్ల ఉన్న కాయితాలు బయటకు తీసిన. అండ్ల నేననుకున్నట్టు ఆమె రాసిన పెద్ద ఉత్తరమేమీ లేదు. ఆ కాగితాలల్ల, పెండ్లిచూపుల నాడు నేను తీసిన తన ఫొటో, తను నాకు రాసిన మొట్టమొదటి ప్రేమలేఖ, దానికి నేను రాసిన సమాధానం ఉన్నాయి. వాటన్నింటి పైన, తను రాసిన ఒక చిన్న ఉత్తరం ఉన్నది అండ్ల.
ఏమండీ! ఎంత అందమైన, అద్భుతమైన జీవితమండీ మనది. నాకేం కాదు. ఒకవేళ ఏమైనా అయినా బాధపడకండి. నాకే కోరికా లేదు, మీరెట్లుంటరన్న బెంగ తప్ప. మీరు నాకే లోటు చేయలేదు. కానీ... స్వామీ! అలసిపోయిన... ఇట్లు.. మీ పాద దాసి అని రాసి ఉంది.

ఆ చిన్ని ఉత్తరంల రాసినదాని కన్న, దాంతోని పెట్టిన ఫోటో, మా ఇద్దరి ఉత్తరాల వల్ల నేను తన మనసు గ్రహించిన.
అవి చదివిన నాకు గుండెల్లోతుల్ల నుంచి దుఃఖం పొంగుకొచ్చింది. మా సుదీర్ఘ ప్రేమ ప్రయాణం నా కండ్ల ముందు గిర్రున తిరిగినట్టయింది. భోరున ఏడ్చిన. చుట్టుపక్కలోళ్ళు నా వైపు ఆశ్చర్యంగ చూస్తుండంగనే, నా బాధను చూసిందేమో, ఆకాశం బద్దలైంది. నా ఏడుపుతో వర్షం జతకలిసింది. ఆకాశమూ, నేనూ కలిసి దుఃఖించినం చాలా సేపు. పొద్దటి నుంచి బరువుగ ఉన్న ఆకాశమూ, నా మనసూ అల్కగైనంక నేను లేచి, కొత్త ఆలోచనతోటి ఇంటిదారి పట్టిన.
ఇంట్లకొచ్చి నా భార్య పక్కన కూర్చొని తన చేతిని నా చేతిలకు తీసుకున్న. ఆమె నన్ను చూసి నవ్వింది. ఆ నవ్వుల నాకు ఎన్నో అమృత సందేశాలు గోచరించినయి. ఆత్మీయుల స్పర్శల, అనునయంల, ఆప్యాయతల కూడ ప్లేసిబో ఎఫెక్ట్ ఉంటదని నాకు ఙ్ఞానోదయమయింది. తనకు తప్పక నయమయితదని, ఆ క్షణంల నాకనిపించింది.

306
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles