కడుపారా ఏడ్పిస్తారు!


Sun,May 19, 2019 01:57 AM

Crying-Clubs
మనిషి జీవితంలో కన్నీళ్లకు చాలా ప్రాధాన్యముంది. అసలు మనిషి పుట్టేదే ఏడుపుతో. అంతెందుకు.. తీవ్రమైన సంతోషం కలిగినప్పుడూ కన్నీటితోనే ఆనందాన్ని వెలిబుచ్చుతాం. అయితే ఏడుపును పిరికితనానికి చిహ్నంగానో, నామోషిగానో భావించటం వల్ల ఇప్పుడు చాలామంది నలుగురిలో ఏడ్వలేకపోతున్నారు. మనసులోని ఆవేదనను, బాధను అలా మోస్తూనే జీవితాలను వెళ్ల్లదీస్తున్నారు. క్రమంగా రోగాల బారిన పడుతున్నారు. తనివితీర ఏడ్వకుండా రోగాలు ఎందుకు తెచ్చుకోవడం. మిమ్మల్నీ మనస్ఫూర్తిగా ఏడ్పిస్తాం రండి అంటున్నాయి క్రయింగ్ క్లబ్‌లు.

జపాన్‌లోని టోక్యో నగరంలో అదొక ఫేమస్ క్లబ్. అక్కడికి మెల్లిమెల్లిగా జనాలు చేరుకుంటున్నారు.. కొందరు తమవారి కోసం ఎదురు చూస్తుండగా.. మరికొందరు ఎంట్రీ ఫీజు చెల్లించి లోపలికి వెళ్తున్నారు. మొత్తంగా 20 మంది వరకు ఆ క్లబ్‌కు చేరుకున్నారు. అందరి ముఖాల్లో ఏదో తెలియని బాధ. చాలా విచారంగా ఉన్నారంతా.

కొద్దిసేపటికే ఓ విషాద గీతం వినపడింది. ఒక్కసారిగా అందరూ భోరుమని ఏడుస్తున్నారు. ఒక్కొక్కరి గుండెల్లోంచి బాధ తన్నుకొస్తున్నది. కొందరు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. కన్నీరు ధారాళంగా కారుతున్నది. కర్చీఫ్‌లు, టిష్యూ పేపర్లు తడిసి ముద్దవుతున్నాయి. ఒకరినొకరు చూసుకుంటూ విలపిస్తున్నారు.

కొద్దిసేపటికి ఓ వ్యక్తి వచ్చి.. ఏదో చెబుతున్నారు. ఆ మాటలు వింటూ వలవల ఏడ్చేస్తున్నారు. ఇంతలో కొందరు వచ్చి.. ఏడుస్తున్నవారిని ఓదార్చుతూ.. కన్నీరు తుడుస్తున్నారు. ప్రేమతో కౌగిలించుకొంటూ ఆప్యాయంగా తడుముతున్నారు. అదేంటో.. బాధగా లోపలికి వెళ్లిన వారంతా సంతోషంగా బయటికొచ్చారు. వారి ముఖాల్లో చిరునవ్వు తొణికిసలాడుతున్నది.

ఏం జరిగిందో అని ఆరా తీస్తే.. అది ఏడ్పించే క్లబ్ అని తెలిసింది.

మారిన జీవిన విధానం, పని ఒత్తిడి కారణంగా మనిషి ప్రశాతంగా నవ్వుకోలేకపోతున్నాడు. దీంతో లాఫింగ్ క్లబ్బులు వెలిశాయి. మరి.. గుండెల్లోని బాధ పోవాలంటే తనివితీర ఏడ్వాల్సిందే. నలుగురిలో నవ్వగలరు కానీ.. ఏడ్వలేరుగా. మనస్ఫూర్తిగా ఏడిస్తే.. భారమంతా దిగిపోయి మనసు కుదుటపడుతుంది. ఆ కాసేపు హాయిగా ఉంటుంది. కొంత ధైర్యమూ వస్తుంది. అందుకే నలుగురిలో ఏడ్వడానికి ఇబ్బందిపడే వారి కోసం క్రయింగ్ క్లబ్‌లు వచ్చేశాయ్. జపాన్‌లో మొదలైన ఈ కొత్త ఒరవడి పేరు రుయి-కత్సు. విచిత్రంగా అనిపించినా జపాన్‌లో ఇలాంటి సామూహిక ఏడ్పు కార్యక్రమాలు బాగా ఆదరణ పొందుతున్నాయి. రుయి-కత్సుగా పేరొందిన ఈ ధోరణి ఎంతోమందికి సాంత్వన కలిగిస్తున్నది. అక్కడ కత్సు అంటే పని అని అర్థం. ఇలాంటి పనుల ప్రేరణతోనే రుయి-కత్సు విధానం పురుడు పోసుకున్నది. ఏడ్పు వచ్చేలా చేయటమే దీని ప్రత్యేకత. దీనికి బీజం వేసింది హిరోకి టెరయి అనే విడాకులిచ్చే పెద్ద మనిషి.

ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..?

జపాన్‌లో పెండ్లి చేసుకునేటప్పుడే కాదు.. విడాకులు తీసుకునే సమయంలోనూ దంపతులు చిట్టచివరిసారిగా కొన్ని వేడుకలు చేసుకుంటారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించటమే హిరోకి టెరయ్ పని. విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నవారికి కూడా సాయం చేస్తుంటాడు. ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా విడిపోయేలా చూడాలన్నదే ఆయన ఉద్దేశం. విడాకుల వేడుకలో చాలామంది దంపతులు ఏడ్చేసేవారు. తాము విడిపోవాల్సి వచ్చినందుకు దుఃఖపడుతూ.. మనసులోని బాధను కొంతైనా దూరం చేసుకునేవారు. చిత్రంగా కొందరైతే తిరిగి కలిసి ఉండాలనీ నిర్ణయించుకునేవారు. ఇదే టెరయ్‌ని ఆలోచించేలా చేసింది. ఏడవడం ద్వారా మనసులోని బాధ, ఒత్తిడి తగ్గుతుందని.. భావోద్వేగాలు ఉపశమిస్తున్నాయని ఆయన గుర్తించారు. వైద్య గ్రంథాలు, పరిశోధనా పత్రాలు కూడా దీన్ని బలపరుస్తున్నాయని తెలుసుకున్నారు. ఏడుపు ద్వారా ప్రయోజనాలను తెలుసుకొని చివరికి రుయి-కత్సు కార్యక్రమాలను ఆరంభించారు. మొదట్లో విడాకులు తీసుకోవాలని భావించేవారి కోసమే వీటిని ఆరంభించారు టెరయ్. తర్వాత ఇతరత్రా బాధలతో సతమతమవుతున్నవారూ వచ్చి చేరటంతో క్రమంగా విస్తరించింది. గుర్తింపు పొందింది.

రోదనతో ప్రయోజనాలెన్నో

రుయి-కత్సు క్రైయింగ్ క్లబ్‌ల పని ఏంటంటే..? విషాద భరిత సినిమాలు చూపిస్తారు. కష్టాలు కడగండ్లతో కూడిన కథలు వినిపిస్తారు. విషాద సంగీతం, కవిత్వం వినిపిస్తారు. ఏది చేసినా కడుపారా ఏడ్చి, కన్నీళ్లు తెప్పించేలా చూడటమే వీరి లక్ష్యం. ఇలా ఏడుస్తున్నప్పుడు ఓదార్చటానికి ప్రత్యేకంగా మనుషులూ ఉంటారు. అసలే బాధల్లో ఉంటే బలవంతంగా ఏడ్వటమెందుకని అనుమానం వస్తుండొచ్చు. ఏడుపుతో చాలా ప్రయోజనాలే ఉన్నాయి. ఏడ్చిన తర్వాత బాధ కరిగిపోతుంది. మనసు తేలికపడుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. స్పష్టంగా ఆలోచించడానికి, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికీ మార్గం సుగమమవుతుంది. ఈ క్రయింగ్ క్లబ్బులకు వెళ్లొచ్చిన తర్వాత ఏడ్వటం ఒక యోగం.. ఏడ్వలేకపోవటం ఒక రోగం అంటున్నారు.
Crying-Clubs1
మారిన జీవిన విధానం, పని ఒత్తిడి కారణంగా మనిషి ప్రశాతంగా నవ్వుకోలేకపోతున్నాడు. దీంతో లాఫింగ్ క్లబ్బులు వెలిశాయి. మరి.. గుండెల్లోని బాధ పోవాలంటే తనివితీర ఏడ్వాల్సిందే. నలుగురిలో నవ్వగలరు కానీ.. ఏడ్వలేరుగా. మనస్ఫూర్తిగా ఏడిస్తే.. భారమంతా దిగిపోయి మనసు కుదుటపడుతుంది.

279
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles