అస్థిపంజరాల సరస్సు!


Sun,May 19, 2019 01:54 AM

Lake
అది ఓ రహస్యం. అలాంటి ఇలాంటి రహస్యం కాదు. 1100 ఏండ్లుగా అంతుబట్టకుండా మిగిలిపోయిన ఒక మర్మం. హిమాలయ పర్వత శ్రేణుల మధ్యలో చాలా యేండ్లుగా నిక్షిప్తమైన రహస్యమది. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 600లకుపైగా మనిషి అస్థిపంజరాల తాలూకు కథలను కడుపులో దాచుకున్నది ఆ సరస్సు. ఆ అత్యంత భయానక వాతావరణం ఉన్నది ఎక్కడో కాదు.. మన హిమాలయాల్లోనే.

విశాలమైన హిమాలయ పర్వతాలు.. ఆ పర్వతాల మధ్య ఒక సరస్సు. ఎటుచూసినా ఎముకల గుట్టలు.. పుర్రెల పుట్టలే.. పర్వతారోహకులను ఆకర్షించే అస్థిపంజరాలు. ఆ రహస్యాన్ని ఛేదించేందుకు చాలామంది ప్రయత్నించారు కానీ.. ఎవరి వల్ల కాలేదు. మానవ అస్థిపంజరాల అజ్ఞాత సరస్సు రహస్యం అది.

అస్థిపంజరాల గుట్ట రూప్‌కుండ్!

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో రూప్‌కుండ్ అనే సరస్సు ఉన్నది. ఇది సముద్రమట్టానికి 16,500 అడుగుల ఎత్తులో, హిమాలయాల్లోని నందాదేవీ పర్వతాల మధ్యలో ఉన్నది. ఈ రూప్‌కుండ్ సరస్సు మానవ అస్థిపంజరాలతో నిండిపోయి ఉంటుంది. అక్కడ ఉన్న అస్థిపంజరాలు చూసినవాళ్లెవరూ కూడా జీవితంలో వాటిని మర్చిపోలేరు. 9వ శతాబ్దానికి సంబంధించిన అస్థిపంజరాలుగా వాటిని గుర్తించారు. ఇవి 1100 ఏండ్ల నాటివి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? అసలు అవి ఎవరివి? అనేది అంతు చిక్కని రహస్యం.

భిన్న కథనాలు

రూప్‌కుండ్ అస్థిపంజరాల మిస్టరీపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొంతమంది టిబెట్‌కు చెందిన వ్యాపారుల అస్థిపంజరాలని అన్నారు. మరికొంతమంది యుద్ధ సైనికుల అస్థిపంజరాలని చెబుతారు. ఇంకొంతమంది నందాదేవి దర్శనానికి వచ్చిన భక్తులవని అంటుంటారు. వీటిలో ఏది నిజమో.. ఏది అబద్ధమో ఇప్పటిదాకా ఎవరికీ అంతుబట్టలేదు. ఎవరూ ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. కానీ ఇవి మాత్రం సైనికులవేనని చెప్పడానికి కొన్ని ఆధారాలున్నాయి. ఈ సరస్సుకు దగ్గరలో కొన్నేండ్ల క్రితం సైనికులు వాడిన ఆయుధాలు, వారి దుస్తులు, ఇతర ఆనవాళ్లు పర్వతారోహకులకు దొరికాయి. చరిత్రకారులు కూడా వారివేనని నిర్ధారించారు. 16 వేల అడుగుల ఎత్తున్న ఈ రూప్‌కుండ్ సరస్సును చేరుకోవడమంటే మామూలు విషయం కాదు. ప్రాణాల మీద ఆశ వదులుకునేవాళ్లు మాత్రమే అక్కడకు వెళ్తారు. వెళ్లే ముందుగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. ఒకవేళ వెళ్లినా సాయంత్రం వరకు తిరిగివచ్చేలా ప్లాన్ చేసుకుంటారు.
Lake1

అప్పుడే ప్రపంచానికి తెలిసింది

1942లో తొలిసారిగా రూప్‌కుండ్ అస్థిపంజరాల సరస్సు గురించి తెలిసింది. బ్రిటిన్‌కు చెందిన ఫారెస్ట్ గార్డ్ రేంజర్ మధ్వాల్ మొట్టమొదటిసారిగా నందాదేవి పర్వతంపై ట్రెక్కింగ్‌కు వచ్చారు. అప్పుడే వీటిని తొలిసారిగా గుర్తించారు. ఆయన ద్వారా ఒకే చోట 600కిపైగా మానవ అస్థిపంజరాలు ఉన్నాయి అనే వార్త ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత 1957లో ఈ మర్మాన్ని ఛేదించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ అస్థిపంజరాలు ఎవరివి? అవి ఎంత పురాతనమైనవి? సరస్సులోకి ఒకేసారి ఇన్ని అస్థిపంజరాలు ఎలా వచ్చాయి? అనే అంశాన్ని శోధించేందుకు అన్వేషణ మొదలైంది. అందుకోసం 2003, 2004లో ఇండియా, యూరప్ దేశాలకు చెందిన పలు బృందాలు అక్కడకు వెళ్లాయి. అస్థిపంజరాలు 8, 9వ శతాబ్దాల మధ్యకాలానికి చెందినవిగా తేల్చారు.

ప్రకృతి వైపరీత్యమే కారణమా?

రూప్‌కుండ్ అస్థిపంజరాల వయసు తెలిసింది కానీ.. అవి ఎవరివి అనే విషయాన్ని తెలుసుకునేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అవి మహారాష్ట్రకు చెందిన వారివిగా తేలింది. ఒక సరస్సు ఒకేసారి 600 మంది ప్రాణాలను ఎలా బలితీసుకున్నది? అంతమంది ఒకేసారి ఎలా చనిపోయారు? ఇంకేమయినా కారణముందా? కొన్నేండ్లపాటు ఈ అస్థిపంజరాలపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు చివరకు ఓ అంచనాకు వచ్చారు. ప్రకృతి వైపరీత్యం వల్లే వీళ్లంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని తేల్చారు. అయితే ఆయుధాలతో దాడులు చేసినట్టుగా పుర్రెలపై కొన్ని గుర్తులున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఖచ్చితంగా ఇదీ కారణం అని మాత్రం ఎవరూ తేల్చలేకపోయారు. ఇంతమంది ఈ సరస్సు వద్దకు రావాల్సిన కారణాన్ని, చనిపోయిన పరిస్థ్ధితులను అంచనా వేయలేకపోతున్నారు. దీంతో 1100 ఏండ్ల నాటి రహస్యం ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది.
Lake2

మంచు తుపానే బలితీసుకుందా?

అంతుబట్టని రూప్‌కుండ్ శోధనకు 2013 ఏడాదిలో తెరదించారు పరిశోధకులు. 9వ శతాబ్దంలో భారత్‌కు చెందిన ఒక తెగవాళ్లే మంచు తుఫానులో చనిపోయినట్టు నిర్ధారించారు. వాళ్ల పుర్రెలపై ఉన్న గుర్తుల ఆధారంగా వారిని గుర్తించారు. ఇటీవల రూప్‌కుండ్ సరస్సులో అస్థిపంజరాలు మాయమవుతున్నాయి. వందల ఏండ్ల్లనాటి ఈ అస్థిపంజరాలను ఎవరు తీసుకెళ్తున్నారు? ఎందుకు తీసుకెళ్తున్నారు? వాటితో ఏం చేస్తున్నారు? తాంత్రికమైన పనులకోసం వాటిని చోరీ చేస్తున్నారా? లేదా ఇంకేదైనా కారణముందా? అనేది తెలియరాలేదు. చాలాకాలం క్రితమే ఉత్తరాఖండ్ సర్కార్ కూడా అస్థిపంజరాలు మాయమవుతున్నాయన్న విషయాన్ని ధ్రువీకరించింది. గతంలో 600లకుపైగా ఉన్న వాటిలో.. ఇప్పుడు మొత్తం కలిపి 200ల అస్థిపంజరాలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. మంచుకొండలు, అతిశీతల వాతావరణ పరిస్థ్ధితుల కారణంగా కొంతమేర గతంలోలా మంచులో కూరుకుపోయి ఉంటాయన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

309
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles