తులసమ్మ బతికింది!


Sun,January 12, 2020 12:36 AM

Tulasamma
చావు.. ప్రతి మనిషి జీవితానికి ముగింపు అయితే, ఈ కథకి ఇదే మొదలు..! పుట్టిన ప్రతి మనిషికీ - తప్పని చివరి మజిలీ..!! పుట్టిన క్షణం తొలిశ్వాస పీల్చుకోవడం నుంచి అనుక్షణం మృత్యువుతో పోరాడుతూనే ఉంటాం..! అసలు బతకటం అంటేనే.. ప్రతి క్షణం మృత్యువుని ఓడించి, మనం గెలవడం..! ఎంతటి ధీరుడైనా, వీరుడైనా, శూరుడైనా.. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో గెలుపొందిన వారైనా.. చివరికి మృత్యుకౌగిలిలో ఓడిపోక తప్పదు..! మృత్యువు చేతిలో ఓడిపోయిన మరుక్షణం.. మనిషి జీవితానికి ముగింపు..! అలాంటి ముగింపుతో మొదలవుతున్న ఈ కథ రేపటి తరానికి.. తరతరాలకి.. అంతం కాదు ఆరంభం..!

చుట్టూ కొండల మధ్య..

దాదాపు వెయ్యికి పైగా గడప ఉన్న ఆ తెలంగాణ పల్లెటూరిలో.. కోడి కూయకముందే.. తులసమ్మ నిద్ర లేచేది. ఇంటిముందు పేడతో కల్లాపి జల్లి, రంగురంగుల అందమైన ముగ్గులు పెట్టేది. పెందలాడనే ముస్తాబైన ఆ ఇంటిని చూసి, అప్పుడే ఉదయించిన సూర్యుడు తన లేలేత కిరణాలతో రంగవల్లులను ముద్దాడుతుంటే, తులసమ్మ మనసు పరవశించిపోయేది. ప్రత్యక్ష దైవంలా ప్రతి రోజూ దర్శనమిస్తున్న సూర్యభగవానుడంటే తులసమ్మకు అమితమైన భక్తి. అందుకే, ప్రతిరోజూ సూర్యుడుదయించక ముందే ఇంటిని తీర్చిదిద్దుకొని, సున్నుపిండి పెట్టుకొని స్నానం చేసి, మడి కట్టుకునేది. ఇంటి ముందున్న తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేసి, సూర్యనారాయణునికి ఆర్ఘ్యపాదాలిచ్చి.. అప్పుడే పొడసూపుతున్న ఉదయభానుని తనవితీరా దర్శించుకొని నమస్కరించి.. తులసితీర్థం పుచ్చుకొని, భక్తిపారవశ్యంతో పరవశించిపోయేది. అలాంటి తులసమ్మ.. ఆ రోజు ఇంటి ముందు కల్లాపి జల్లలేదు..! ముగ్గులు పెట్టలేదు..!! తెల్లవారితే తన బతుకు తెల్లారిపోతుందని తెలియని తులసమ్మ.. ఆ రాత్రి నిద్రలోనే మెల్లిగా జారుకుంది ఈ లోకం నుంచి శాశ్వతంగా..!!

సుమారు ఎనిమిది పదుల వయసులో.. ఎన్ని వసంతాలను చవిచూసిందో.. ఎన్ని గ్రీష్మాలను తట్టుకుందో.. ఎన్ని హేమంతాలను శ్రీమంతంగా తన్మయత్వం చెందిందో.. కానీ, ఎవరితోనూ సేవ చేయించుకోకుండా, ఎవరినీ నొప్పించకుండా, ఏ సడీసప్పుడు లేకుండా.. నిద్రలోనే ప్రశాంతంగా శాశ్వతనిద్రలోకి జారుకుంది..! చివరిసారి తులసితీర్థం పుచ్చుకోవడానికన్నట్లు.. తులసమ్మ నోరు తెరిచేవుంది..!ఆ రాత్రి ఎప్పుడో, ఏ వేళనో.. తెరిచిన నోటి నుంచి జీవం వెళ్లిపోయింది..!!

చీకటి తెరలను తొలగించుకుంటూ దినకరుడు మెలి.. మె.. ల్లి.. గా.. తులసమ్మ వాకిట్లోకి తొంగిచూశాడు. తాను ఉదయించక ముందే తన భక్తురాలు అస్తమించిందని తెలిసి, తట్టుకోలేని వేదనతో మబ్బుల చాటుకు వొరిగిపోయాడు..! అందరికీ తలలో నాలుకలా ఉంటూ.. ఆప్యాయంగా పలకరించే తులసమ్మ విగత జీవురాలయిందని తెలిసి, విలవిలలాడి పోయారు ఆ పల్లెజనం. ఆ ఊరిలో ఒక్కొక్కరు నిద్ర నుంచి కళ్లు తెరిచే సరికి, తులసమ్మ కన్ను మూసిందనే చేదువార్త చెవిన పడింది..! కొద్దిసేపట్లోనే ఈ విషయం దావానలంలా.. ఊరూ, వాడా, దేశ విదేశాల్లో ఉన్న బంధుమిత్రులకు తెలిసిపోయింది..!

రాజధాని నగరంలో ఉంటున్న డాక్టర్ ఆదిత్య.. తన అమ్మమ్మ తులసమ్మ మరణవార్త విని, ఫ్యామిలీతో సహా హడావుడిగా కారులో బయలుదేరాడు. తండ్రికి ఫోన్ చేసి, తాను బయలుదేరి వస్తున్నట్లు.. సమాచారమిచ్చాడు ఆదిత్య. వెంటవెంటనే ఇక్కడి అంత్యక్రియల ఏర్పాట్ల విషయాలు తెలుసుకుంటున్నాడు. ఈ హడావుడంతా గమనించిన అతని భార్య స్వాతి సెల్‌ఫోన్‌లో మాట్లాడడం తర్వాత.. ముందు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టండి అంది మందలింపుగా. నీకు తెలుసా..! మన పెండ్లికి నిన్ను ప్రపోజల్ చేసింది మా అమ్మమ్మనే. తను చెప్పకపోతే, ఈ సంబంధం కుదిరేది కాదు నీకు నేను దొరికేవాణ్ని కాదు.. అన్నాడు ఆదిత్య ఉడికిస్తున్నట్లుగా. మమ్మీని డాడీకి ఇంట్రడ్యూస్ చేసిన గ్రాండ్‌మా డెత్ అయిందా..? ఓ బ్యాడ్.. అన్నాడు చిన్నారి కౌస్తభ్. కొడుకు స్పందనకి ముగ్ధుడైన ఆదిత్య ముచ్చటపడుతూ లాలనగా కౌస్తభ్ తల నిమిరాడు.

అది చూసి స్వాతి రుసరుసలాడుతూ మిమ్మల్ని నాకు అంటగట్టి, మహాపుణ్యమే చేసిందిలెండి. మీరు పెండ్లి చేసుకోకపోతే, బ్రహ్మచారిణిలా ఒంటిరిగా ఉండేదాన్ని కావచ్చు.. అంది ఎద్దేవాగా. ఆ మాటతో చిన్నగా నవ్వుకున్నాడు ఆదిత్య. మళ్లీ అమ్మమ్మ జ్ఞాపకాల్లోకి వెళుతూ.. నాకు ఆదిత్య అని మా అమ్మమ్మే పేరు పెట్టింది. అమ్మమ్మకిష్టమైన సూర్యభగవానుని పేరు. ప్రతిరోజూ ఆదిత్య హృదయం చదువుకోవాలని ఆ చిన్నప్పుడే కంఠస్థం చేయించింది చెప్పాడు ఆదిత్య ఉద్వేగంగా. వాట్ డాడ్..! ఆదితియా హ్రుద్‌యమ్.. కంటస్‌తమ్..? వాట్ ద మీన్స్..?? అడిగేడు కౌస్తభ్ ఆ పదాలకి అర్థం తెలియక. నేటి ఇంగ్లీష్ మీడియం చదువుల పరిస్థితి తలచుకొని, చిన్నగా నవ్వుకుంటూ చెప్పేడు ఆదిత్య దట్ మీన్స్.. ఎర్లీ మార్నింగ్ సన్ ప్రేయర్..! కంఠస్థం అంటే బైహాట్.. సరే.. సరే.. ముందు రోడ్ చూడండి.. అంటూ మందలించింది స్వాతి. కారు శరవేగంతో దూసుకొస్తున్నది.

ఇక్కడ అంత్యక్రియలకు కావల్సిన ఏర్పాట్లను చూసుకుంటున్నారు దగ్గరి బంధువులు. ఇంతకాలం తమతో కలివిడిగా ఉన్న తులసమ్మ.. ఇప్పుడు కళ్ల ముందు అచేతనంగా పడివుండటం చూసి, భోరున విలపిస్తున్నారు. తులసమ్మ మరణవార్త తెలిసిన వెంటనే దిగులుపడుతూ ఆ ఇంటికి వచ్చిన వాళ్లు.. తులసమ్మతో తమకున్న అనుబంధాన్ని, ఆమె తాలూకు జ్ఞాపకాలను స్ఫురణకు తెచ్చుకుంటున్నారు. ఆరుబయట గుంపులు గుంపులుగా ఉన్న జనం గుండెల్లో తులసమ్మ జ్ఞాపకాలు అలలై ఎగిసిపడుతుంటే, అక్కడి వారి కళ్లు శ్రావణమేఘాలయ్యాయి..! నోళ్లు గండిపడిన చెరువు లయ్యాయి..!! ఒక్కొక్కరిది ఒక్కో అనుబంధం.. ఒక్కొక్కరిది ఒక్కో విధమైన అనుభవం.. తులసక్క పేరుకు తగ్గట్టు పవిత్రమైన తులసిమొక్కే అనుకో.. అంది పెద్దవయసులో ఉన్న సీతారత్నమ్మ. నిజమేనమ్మా.. అందరి గురించి పట్టించుకునేది.. ఎదుటి మనిషి బాధని తన బాధగా అనుకుని, చేతనైనంత సాయం చేసేది. కులం, మతం అనే పట్టింపు లేకుండా ఆపదలో వున్నవాళ్లని ఆదుకునేది అంది మరో పెద్దావిడ అనసూయమ్మ. ఇంటావిడ ఎసొంటిదో ఇల్లు చెపుతుందంటరు. సీకటి మస్కుల కోడి కూయకుండనే నిద్దర లేచేది. పొద్దు పొడేసేసరికల్లా వాకిట్ల కల్లాపు జల్లి, ముగ్గులెట్టేది.. చెప్పింది రాంబాయమ్మ. ఔ నిజంగనే.. రోజుకొక్క తరీక ముగ్గులెట్టేది. కొత్తకొత్త ముగ్గుల్ని జూసి, ఊర్లో ఉన్న ఆడపిల్లలందరూ నోటు పుత్తకాలల్ల రాసుకునేటోళ్లు.. అంది సావిత్రక్క గతాన్ని గుర్తు చేసుకుంటూ. ఓ రోజు.. పట్నంలో ఉండే మా పెద్ద మనవరాలొచ్చింది. తలంటు పోసుకోవడానికి కిరాణ షాపుకెళ్లి, షాంపులు కొనుక్కొని వస్తుంటే చూసి, వాటికంటె కుంకుడుకాయలు పెట్టుకుంటే మంచిదని పిడికెడు కుంకుడుకాయలు ఇచ్చిందట. ఈ కాలం పిల్లలకు ఇవేం తెలుసు. అవన్నీ తీసుకొచ్చి నాకిచ్చింది మా మనవరాలు. అప్పుడ్నేను తులసక్క చెప్పిందే.. కుంకుడుకాయలు వాడితే జుత్తు ఎలా నిగనిగలాడుతుందో చెప్పి, తలంటు చేయించాను. ఆ తరువాత మా మనవరాలు పట్నం వెళ్లినా.. ఇప్పటికీ కుంకుడుకాయలతోనే తలంటు పోసుకుంటుంది.

మా మనవరాలు ఫోన్ చేసినప్పుడల్లా కుంకుడుకాయల అమ్మమ్మ బాగుందా..? అని అడుగుతుంటుంది పిచ్చిపిల్ల.. గుర్తు చేసుకుంది సీతారత్నమ్మ. గంతే కాదు వదినెమ్మ. గీ సబ్బులు, పౌడర్లు.. పెయ్యికి రుద్దుకోవద్దనేది.. సున్నుపిండన్నా, నలుగుపిండన్నా పెట్టుకుంటే.. మంచిగుంటదని చెప్పేది. తులసత్తమ్మ చెప్పిన కాన్నుంచీ.. నేనైతే ఇప్పటికీ సబ్బుముక్క ముట్టలేదమ్మా ఒట్టు.. తలపై చేయి పెట్టుకొని, ఒట్టేసి మరీ చెప్పింది సావిత్రక్క. ఆ పక్కనే నిటారుగా నిలబడిపోయి, అంతవరకు దిగులుగా వింటున్న పూలమొక్కలు.. ఇక తమకి నీళ్లు పెట్టేవారే లేరని తలలు వాల్చేశాయి. పువ్వుగా వికసించి, పరిమళాలు వెదజల్లుతూ.. తులసమ్మ చేతుల మీదుగా దేవుడి అలకరణకు నోచుకునే భాగ్యం ఇకపై తమకి లేదని విప్పారిన పూలు బిక్కమొహంతో ముడుసుకున్నాయి.

నేనైతే అన్నింటికీ పెద్దమ్మనే అడిగేదాన్ని. పండుగలకీ, పబ్బాలకీ, పూజలకి.. ఎప్పుడేం చేయాలో అడిగి తెలుసుకునేదాన్ని. ఏ దేవునికి ఏ నైవేద్యం ఎలా పెట్టాలో, ఏ నూనెతో దీపం వెలిగించాలో.. అన్నీ వివరంగా చెప్పేది. ఇతరులకు చెప్పడమే కాదు, తాను కూడా ప్రతిరోజూ పూజ చేసేది. మడిగా వంట వండేది. ప్రతిరోజూ పూజ కాకుండా పచ్చి గంగకూడా ముట్టుకునేది కాదు. దేవుడంటే అంత భక్తి. గుడికి వెళ్లినా, ఫంక్షన్లకి వెళ్లినా.. తన నిష్ఠ తనదే తులసమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది సుశీల.
ఒకవైపు ఆడవాళ్లు ఇలా మాట్లాడుకుంటుంటే.. మగవాళ్లు కూడా తులసమ్మ జ్ఞాపకాలలో మునిగిపోయారు. నా సిన్నప్పుడు మా అవ్వకు పాల్లేకపోతే, డబ్బాపాలు పట్టిందంట. ఆ పాలుపడక నాకు వాంతులయ్యాయంట. అప్పుడు గీ పెద్దవ్వనే చనుపాలిచ్చి, ఆల్ల కొడుకు లెక్కనే నన్నుగూడా సూస్కుంది. ఆల్లకంటె తక్కువ కులపోణ్నని సిన్నచూపు చూడకుండ తల్లి లెక్క సాకింది కన్నీరు మున్నీరయ్యాడు యాదగిరి. చంటిపొరగాళ్లకి తల్లిపాలే పట్టించాలని, గట్లయితే.. పెద్దగైనంక రోగాల్రావని సెప్తుండేది. గిప్పుడున్న ఆడోళ్లు అందంగుండాలని పిల్లగాల్లకి పాలియ్యకుంటే, లొల్లివెట్టి పాలిచ్చేదాన్క ఇడ్సిపెట్టేదిగాదు.. అన్నాడు కొండన్న. గదొక్కటేనా..? నడిత్తే పానం మంచిగుంటదని, బాలింతరాల్లని కూడా నడిపించింది. గట్లయితే, ఆపరేసన్ లేకుండా పొరగాల్లు పుడతరని సెప్పుకొచ్చేది అన్నాడు యాదగిరి.

ఔమల్ల.. రోజురోజు నడుసుకుంటనే ఊరంత తిర్గేది. అందర్ని పేరెట్టి పిలిచేది. కనపడినోళ్లనే గాదు.. ఆల్ల అత్తమామ బాగున్నరా.. అయ్యాఅవ్వా మంచిగున్నరా.. అని యాద్జేసేది. ఆల్లకేదన్న తక్లిబుంటే.. దయిర్నంసెప్పి, చాతనైనకాడికి సాయం సేసేది చెప్పాడు ఎంకట్రాములు. మడిసిని మడిసిగా సూడాల. ఔస్రమైతే పానం పెట్టాల. మనందరం ఒక్కింటోళ్లమేనన్న తీరంగ కలిసుండాలె అని సెపుతుండేది అన్నాడు కొండన్న. గట్ల మడిసిలెక్క ఆలోసిత్తదనే గా తల్లిని అందరు దేవత తీరంగ జూత్తరు. గంత దూరంల కనపడంగనే దండాలు పెడతరు. గసోంటి తల్లి పాయె.. గీ ఊరికే పెద్దదిక్కు పాయె.. బాధపడ్డాడు ఎంకట్రాములు. పెండ్లిండ్లయి అత్తారింటికోయినోళ్లకు.. సదుకోకపోయిన ఉత్తరమ్ముక్క రాయించేది. అక్కడెట్లున్నరు..? మాటిమాటికి లొల్లి పెట్టుకోకుండా సక్కంగుండుండ్రని చెప్పేది. ఉత్తరం ముట్టంగనే ఎంబటే ఉత్తరం రాయిండ్రని సెప్పేది. ఆల్ల ఉత్తరాల కోస్రం ఎదురుసూసేది. ఉత్తరం రాంగనే చదువుకున్నోల్లని పిలిచి చదివించుకునేది. గాల్లింటి పిల్ల నాకుత్తరం రాసిందని సంబరపడి ఊళ్లున్నోల్లకి సెప్పుకునేది. ఉత్తరాలన్ని తీగెలకు గుచ్చి బద్రంగా దాచిపెట్టుకునేది అన్నాడు సాంబయ్య. ఇలా.. వింటూవుంటే ఒక్కొక్కరిది ఒక్కో జ్ఞాపకం..

చేదు మిగిల్చిన తీపిజ్ఞాపకాలు..!
చెదిరిపోని ఆకుపచ్చని జ్ఞాపకాలు..!!
పండుగలు, ఫంక్షన్‌లు వచ్చాయంటే.. తులసమ్మ ఇంట సందడే సందడి. ఏ కార్యక్రమమైనా చుట్టాలందర్ని పిలిచేది. వారి పుట్టినరోజులు, తిథివారాలు, జన్మనక్షత్రాలు గుర్తుపెట్టుకొని.. కానుకలు ఇచ్చేది. ఆడపిల్లల జుత్తుకు నూనె రాసి, జడలల్లి జడగంటలు కట్టేది. చేతికి గాజులు వేసి, కాళ్లకు పసుపు రాసేది. బర్త్‌డే నాడు క్యాండిల్స్ ఆర్పివేయకూడదని, గుడిలో దీపాలు వెలిగించాలని గుడికి తీసుకెళ్లేది. అర్చన చేయించేది. ఆషాఢమాసం వచ్చిందంటే.. ఆ ఊరంతా పండుగలా ఉండేది. చెట్టుతీర్థాలు, బోనాలు, పట్నాలు.. అంటూ ఆచారవ్యవహారాలతో నెలరోజులపాటు ఊరిలో వేడుకలు జరిగేవి. అలా.. ఆ ఊరికే జేజమ్మలా అన్నీ తానై చూసుకునే తులసమ్మ ఆ రోజు ఉదయం చనిపోయి, వారి జ్ఞాపకాలలో బతుకుతున్నది..!

ఊరులోకి కారు ప్రవేశిస్తుంటే, విండోలోంచి రివ్వున వీచిన గాలితో ఏదో తెలియని ఆత్మీయపరిమళం మనసుకు తాకినట్టనిపించింది ఆదిత్యకు. ఎంతో సందడిగా ఉండే ఆ పల్లెటూరి జనం.. మౌనంగా విచారవదనాలతో దిగులుగా మాట్లాడుకుంటున్నారు. తులసమ్మ మరణంతో పల్లె మొత్తం శోకసముద్రంలో మునిగి పోయింది..! కారుకు ఎదురుగా వచ్చిన వ్యక్తి ఆదిత్యను గుర్తుపట్టి, పలకరింపుగా రెండు చేతులతో దండం పెడుతూ బాబూ.. అచ్చినవా..? నీకోస్రమే సూత్తున్నరయ్యా.. తులసమ్మగోరూ మనందర్ని డ్సిపెట్టిపోయిందయ్యా.. అంటూ భోరున విలపించాడతను. ఎగిసివస్తున్న దుఃఖాన్ని మునిపంట ఆపుకుంటూ, మెల్లిగా కారు డ్రైవ్ చేస్తున్నాడు ఆదిత్య. ఆదిత్యను చూసి దూరం నుంచే పలకరింపుగా నమస్కరిస్తున్నారు కొందరు. నేటి తరంవాళ్లలా.. మనుషులను వాడుకొని, వస్తువులతో గడిపేయకుండా.. తులసమ్మ మార్గదర్శకంలో.. వస్తువులను వాడుకొంటూ, మనుషులతో గడిపిన వాళ్లు మూగవోయి చూస్తున్నారు. తులసమ్మతోపాటు పెరిగిన తరం అంటే మనుషులతో, మానవత్వంతో మెదిలిన తరం. సంతోషంగా, స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపిన తరం. కల్లాకపటం ఎరుగని తరం. ఉన్నది ఉన్నట్లుగా నిర్మొహమాటంగా, ధైర్యంగా తెలియజెప్పిన తరం. ద్వేషం, మోసం, ఈర్ష్య, అసూయ తెలియని తరం. భయభక్తులతో గడిపిన తరం. ఆ తరం అంటే మనందరికి మార్గదర్శకం.

ఆనాటి తరం నుండి వారసత్వంగా పెరుగుతున్న మనం.. ఆ తరం సంస్కృతీ సంప్రదాయాలను తు.చ. తప్పక పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది అనుక్షణం గుర్తుంచుకోవాల్సిన సత్యం. ఈ నిన్నటి తరపు సత్యాన్ని రేపటి తరానికి అందివ్వడానికి నేటితరం నాయకుడిలా.. డా॥ ఆదిత్య కారు ఇంటిదగ్గరకొచ్చి ఆగింది. ఆ వెనకాలే వచ్చిన వ్యాన్ పక్కనే ఆగింది. కన్నీటి బిందువులు జలజలా రాలుతుంటే ఆదిత్య.. గుండె దిటువు చేసుకొని, కారు దిగాడు. వెనకాలే.. స్వాతి, కౌస్తభ్ కారు దిగి, లోపలికి నడిచారు దిగులుగా.

ఆదిత్యను చూడగానే.. అంతవరకు మౌనంగా రోదిస్తున్న తులసమ్మ భర్త వీరభద్రయ్య గుండె కన్నీటితో ఉప్పొంగింది. అది గమనించి ఆతృతగా తాతయ్య దగ్గరకు పరుగున వచ్చాడు ఆదిత్య. అక్షరాలకందని అశృవులు.. వాక్యాలకందని వేదన.. భావాలకందని బాధ.. ఉబ్బితబ్బిబ్బై గుండె గొంతుకలోకి ఎగిసివస్తుంటే.. ఏం మాట్లాడాలో తెలియని అయోమయస్థితిలో.. ఉద్విగ్నతతో.. ఉద్వేగంతో.. నిస్తేజంతో.. ఒకరినొకరు గుండెలకు హత్తుకుపోయారు చాలాసేపు. ఆ మౌన రోదన.. అంతర్గత వేదన.. ఆ రెండు గుండెలకే తెలుసు..! తాతామనవళ్ల అనుబంధం ఎంత గొప్పదో.. ఆ క్షణం ఆదిత్య, వీరభద్రయ్యల గాఢ కౌగిలికే ఎరుక..!!

దాదాపుగా బంధుమిత్రులందరూ వచ్చి, తులసమ్మని కడసారిచూపు చూసుకున్నారని భావించిన పెద్దలు.. శవయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ముత్తయిదువలు మెల్లిగా తులసమ్మ శవాన్ని పైకి లేపి, కుర్చీలో కూర్చొబెట్టారు. ప్రతిరోజూ రవిబింబంలా.. తులసమ్మ నుదుటిన వెలిగిన రూపాయిబిళ్లంత బొట్టును తుడిచేసింది పెద్దావిడ. అది చూసిన అక్కడి ఆడవాళ్లు ఒక్కసారిగా బిగ్గరగా ఏడవటం మొదలెట్టారు. తులసమ్మ రెండు చేతులను పట్టుకొని, ఒకదానిపై ఒకటి కొడుతూ.. చేతి గాజులను పగులగొట్టారు. మరుక్షణంలో ఆడవారి రోదనలు తారాస్థాయికి చేరుకున్నాయి.. చిన్నకొడుకు రవిబాబు తలారా స్నానం చేసి, కుండలో తెచ్చిన నీటితో.. తులసమ్మకి తలపైనుంచి నీళ్లు పోసి, స్నానం చేయించారు. ఆడవాళ్లంతా చుట్టూ గుమిగూడి తడిసిన చీరె, బ్లౌజ్‌లను తీసేసి.. కొత్త చీరె, కొత్త బ్లౌజ్ కట్టారు. నిండు ముత్తయిదువగా మరణం పొందిందని.. కడసారి అలంకరణగా నుదుటిన కుంకుమబొట్టు, చేతికి కొత్త గాజులు, జడలో పూలు.. అలంకరించారు. తులసమ్మకి ఎంతో ఇష్టమైంది తులసితీర్థం..! కుటుంబసభ్యులు, బంధుమిత్రులు.. ఒక్కొక్కరుగా వచ్చి, తులసమ్మ నోట్లో తులసితీర్థం పోస్తున్నారు.. మొదట ఆమె భర్త వీరభద్రయ్య.. పెద్దకొడుకు సూర్యనారాయణ..కూతురు.. ఆదిత్య తల్లి కిరణ్మయి..చిన్నకొడుకు కర్మకాండ జరిపించే రవిబాబు.. కూతురు.. కోడళ్లు.. మనవలు.. మనవరాళ్లు... బంధువులు.. మిత్రులు...
ప్రతిరోజు ఇష్టంగా సేవించిన తులసితీర్థం.. చివరిసారిగా ఎంతమంది ఆత్మీయులు పోసినా.. మింగలేకపోయింది తులసమ్మ..! తెరిచిన నోరు నిండిపోయి, తీర్థం కారిపోయింది.. ప్రాణం వెళ్లిపోయిన శరీరం శవంగా మారిపోయి, అంతిమయాత్రకు అడుగులు వేయబోతున్నది..!
వాకిట్లో వెదురు బొంగులతో తయారుచేసిన పాడె దగ్గరకు తులసమ్మ శవాన్ని తీసుకెళ్లడానికి పైకెత్తారు.

అంతే..! న్నో.. స్టాపిట్..! ఆపండీ.. బిగ్గరగా అరిచాడు ఆదిత్య..!! అక్కడివారందరూ నిర్ఘాంతపోయి చూస్తుండిపోయారు చాలాసేపు..!! మరుక్షణం అందరూ అలెర్ట్ అయ్యారు. ఏం జరుగుతుందోనని ఆతృతగా చూస్తున్నారు. ఆదిత్య ఎందుకలా అరిచాడో అర్థంకాక విప్పారిన కళ్లతో, రిక్కించిన చెవులతో.. తేరిపారా చూస్తున్నారు. ఆదిత్య ఒక్క క్షణం.. తన ఉద్విగ్నతను అదిమిపట్టుకొని, చెప్పటం మొదలెట్టాడు. ప్లీజ్.. అర్థం చేసుకోండి. మా అమ్మమ్మ తులసమ్మంటే మీ అందరికీ.. ప్రేమ, గౌరవం, అభిమానం పుష్కలంగా ఉన్నాయి. అమ్మమ్మ చనిపోయిందనే వార్త మాతోపాటు మిమ్మల్నందరినీ కలిచివేసిందని తెలుసు. మీరందరూ ఎంతగానో బాధపడుతున్నారు. మీ వేదనను అర్థం చేసుకోగలను. ఇదే సమయంలో.. మా అమ్మమ్మ కోరికను కూడా తీర్చాలి. అది మనందరి బాధ్యతగా ఫీలవ్వాలి. ప్లీజ్.. అని ఒక్క క్షణం ఆగాడు ఆదిత్య. అందరూ శ్రద్ధగా వింటున్నారు. తులసమ్మ కోరిక ఏమిటి..? అందరి క్షేమం కోరే దేవతలాంటి తులసమ్మ కోరికను తప్పక తీర్చాలి..!ఇంతకీ ఆ కోరిక ఏంటీ..?? అందుకే.. మా అమ్మమ్మ కోరిక తీర్చడం కోసం.. ఈ అంత్యక్రియలు జరపడం లేదు.. అన్నాడు ఆదిత్య. పక్కనే బాంబు పేలినట్టు.. ఉలిక్కిపడ్డారు..! గుండెల్లో వేల డైనమెట్ల విస్ఫోటనం..!! అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు..!! బతికున్నంత కాలం ఎలాంటి సాయం చేసిందో మీ అందరికీ తెలుసు. చనిపోయిన తర్వాత కూడా.. తన శరీరాన్ని డొనెట్ చేసి, మనతోపాటే బతికే ఉండాలనుకుంటుంది. మా అమ్మమ్మ కోరిక తీరుద్దాం. తన కళ్లను హైదరాబాద్‌లోని ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్సిట్యూట్‌కి, తన శరీరాన్ని కానీ, శరీరంలో ప్రతి అవయవాన్ని కానీ.. పరీక్షించుకోవచ్చని నిజాం మెడికల్ ల్యాబ్ వాళ్లకు దానం చేసింది. ఇదుగోండి ఆమె వేలిముద్ర వేసిన కాగితాలు.. వివరంగా చెప్పాడు ఆదిత్య. మీరు ఒప్పుకుంటే, తులసమ్మ కోరిక తీర్చడానికి రెడీగా ఉన్నాం.. అన్నారు అప్పటికే వ్యాన్‌లో వచ్చి ఉన్న డాక్టర్స్.

అందరూ దయచేసి, అర్థంచేసుకొని.. సహకరించండి..! మీ అందరి మనసుల్లో గూడు కట్టుకున్న ప్రేమానురాగాల్ని చూసి, ఈ విషయం చెప్పలేక తాతయ్య, నాన్న.. ఇంతసేపు తటపటాయించారు. ప్లీజ్.. కోఆపరేట్ చేయండి.. అంటూ కన్నీటితో వేడుకున్నాడు ఆదిత్య.
అది విన్న ఆ ఊరిజనం కళ్లల్లో నీరు.. పెదిమలపై చిరునవ్వు..!!
ఏదో తెలియని అద్వితీయ భావన..! మాటలకందని మౌనరోదన..!
పరోపకారార్థయ మిదం శరీరమ్ అన్నారు. చదువుకోకపోయినా సంస్కారం కలిగిన వ్యక్తిగా.. మానవతామూర్తిగా.. బతికినంత కాలం ఊరంతా ఉమ్మడి కుటుంబంలా భావించి, అందరి యోగక్షేమాలు తెలుసుకుంటూ.. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించి సహకరించే తులసమ్మ.. మరణించిన తరువాత కూడా తన నేత్రదానం, అవయవదానాలతో.. తిరిగి బతికింది..! అవును.. తులసమ్మ బతికింది..! మరికొందరికి బతుకునివ్వటం కోసం తులసమ్మ బతికింది. అనారోగ్యాల బారినపడుతున్న వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలందించే మెడికల్ ల్యాబ్‌కు తన శరీరాన్నే దానం చేసి, తులసమ్మ బతికింది..!!

తులసమ్మ మరణించిన మూడో రోజు...

వీరభద్రయ్యకు గుండెలో నొప్పిగా ఉందనటంతో కంగారుపడిపోయారందరూ. హైదరాబాద్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళదామంటే.. వద్దని వారించాడు వీరభద్రయ్య. తాతయ్య ఎట్లుంది..? దగ్గరగా వచ్చి కూర్చొని, అడిగాడు ఆదిత్య. ఏ నిమిసెం ఎట్లుంటనో తెల్వదు.. ఇంతకాలం ఈడనే బతికినా.. గీ ఊరిడ్సి పెట్టి పోలేను.. అన్నాడు వీరభద్రయ్య. సరేలే తాతయ్య.. అవన్నీ ఇప్పుడెందుకు ఆలోచిస్తావు..? ధైర్యంగా ఉండు.. అన్నాడు ఆదిత్య. నా తులసెళ్లిపోయి.. నన్ను వొంటరోణ్ని సేసింది. ఇక ఉన్నా, పోయినా.. ఒకటే..! అది బతికినప్పుడు ఏంసేసినా.. పోన్లే అనుకున్నగనీ, గిట్ల.. గింతమంది గుండెల్లో బతికుంట దనుకోలే..! దానికోస్రమైనా.. ఏదోకటి సెయ్యాల.. నాత్రంతా సొంశాయించినా.. ఎదవ బుర్రకి ఏదీ తట్టలే.. ఆయాసంతో ఒక్కక్షణం ఆగాడు వీరభద్రయ్య. ఏం చెప్పదలచుకున్నాడోనని అతృతగా చూస్తున్నాడు ఆదిత్య. మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు వీరభద్రయ్య తెల్లారు జూముట్ల.. అదే కనిపించింది. ఒక పెద్ద దవఖాన కట్టిన్నంట.. దాంట్ల తులసీ.. అటుఇటు తిరుగుతున్నది.. తాతయ్యకు వచ్చిన కల అర్థమైంది ఆదిత్యకు. మనవడా.. నువ్ ఏంజేస్తవో నాక్తెల్వదు.. నాకున్న ఆరెకరాల జాగా రాసిస్తా. దాంట్ల పే.. ద్ద.. దవఖాన కట్టించు అన్నాడు వీరభద్రయ్య. అలాగే.. తాతయ్య.. అంటూ వీరభద్రయ్య చేతిలో చేయ్యేసి, మాటిచ్చాడు ఆదిత్య. ఆ క్షణం.. ఆదిత్య కళ్ల ముందు తులసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూపుదిద్దు కుంటున్నది..!
తాతయ్య చేయి పట్టుకొని ఉన్న ఆదిత్యకు ఆ క్షణం.. ఏదో తేడా కనిపించింది. చేయి చల్లబడడం గమనించాడు. కంగారుగా తాతయ్య చేయి కదిపి చూశాడు.. పిలిచాడు..తాతయ్యలో ఉలుకు లేదు.. పలుకూ లేదు..! పట్టణానికి దూరంగా.. కొండల నడుమ ఉన్న ఆ పల్లెటూరిలో అతిత్వరలో నిర్మించబోతున్న ఉచిత వైద్యశాలను చూడకుండానే, వీరభద్రయ్య కన్నుమూశాడు..! తులసమ్మ అందించే సహాయాన్ని, ఇంకా కొనసాగిస్తున్నానని.. అందుకు ఈ ఊరిలో హాస్పిటల్ కట్టిస్తున్నానని చెప్పడానికి తులసమ్మ దగ్గరకు వెళ్లిపోయాడు వీరభద్రయ్య..!!

రచయిత పరిచయం

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పుల రాజ లింగమూర్తి (ఉలి) రచయితగా, కార్టూనిస్టుగా, నాటికా దర్శకునిగా ప్రాచుర్యం పొందారు. 1987 నుంచి రచనారంగంలో ఉన్నారు. ఈయన రాసిన నాటికలు వివిధ భారతి రేడియోలో ప్రసారమయ్యాయి. దూరదర్శన్‌తో పాటు వివిధ చానళ్లలో స్క్రిప్ట్ రైటర్‌గా, ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈయన రచన, దర్శకత్వంలో రూపొందిన నీ ప్రేమ కోసం అనే సినిమా 2018లో విడుదలైంది.

-ఉలి, సెల్: 99630 03033

618
Tags

More News

VIRAL NEWS