పిల్లల్ని చదువుదామా..


Sun,December 15, 2019 01:08 AM

ఏం చేస్తున్నాం మనం? నిజం చెప్పండి.. మనం పొద్దట్నుంచి రాత్రి దాక ఇంటర్నెట్‌తో కాపురం చేయడం లేదా? పైకి ఉద్యోగం.. వ్యాపారం అంటూ అస్తమానం బిజీ.. బిజీ. ఏది మంచో.. ఏది చెడో.. ఏం చేయాలో పిల్లలకు ఎవరు చెప్పాలి? సమాజం గురించి వారికెలా తెలుస్తుంది? పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్లే ఉంది మన కథ. అవును.. మనం.. మనం చేసే పనులు.. పరిస్థితులు పిల్లల్ని బాగా ప్రభావితం చేస్తాయి. మనం మంచిని పెంచి పోషిస్తే.. పిల్లలూ అదే పాటిస్తారు. అందుకే వాళ్లేం చేస్తున్నారో.. మనల్ని వాళ్లెంత ఫాలో అవుతున్నారో.. ఆ ప్రభావం వారిపై ఎంత పడుతున్నదో ఒకసారి మనం వాళ్లను పూర్తిగా చదువుదాం. మంచి భవిష్యత్ కోసం నిత్య అధ్యయనం చేద్దాం.

-పడమటింటి రవికుమార్, సెల్: 99483 93391

మనం బాధ్యతగా ఉంటే పిల్లలు దానిని వారసత్వ సంపదగా పొంది.. పెంచి పోషించి తర్వాతి తరాలకు పంచుతారు. సో.. జీవితమనే చౌరస్తా మీదుగా సాగుతున్న రాంగ్ రూట్ ప్రయాణాన్ని అర్ధాంతరంగా ఆపేసి.. పిల్లలను రైట్ రూట్‌లో తీసుకెళ్లాల్సిన అవసరం అందరికీ ఉంది. చూశారుగా నిన్నా మొన్న ఏం జరిగిందో? వరుసగా జరిగిన దారుణాల్లో అంతా ఇరవైయేండ్ల లోపువాళ్లే ఉన్నారు. కథ అంతా అయిపోయినప్పటికీ ఇక్కడ చర్చకొచ్చింది మాత్రం కుటుంబాల పరిస్థితులపైనే. ఆ పరిస్థితుల్లో పేరెంటింగ్ కూడా భాగమే అని మనం గ్రహించాలి. చాలామంది పేరెంట్స్ ఈ సందర్భంగా తమ బాధ్యతల గురించి.. బాధ్యతారాహిత్యాల గురించి చెప్పుకున్నారు. పిల్లలతో ఎలా ఉండాలి? మనల్ని పిల్లలు ఎలా ఫాలో అవుతుంటారు వంటి సున్నితమైన విషయాలు కూడా పాయింట్‌కు వచ్చాయి.
ఒక తల్లి.. నా కూతుర్ని మృగాల బారిన పడకుండా పెంచడంతో పాటు నా కొడుకు మూలంగా ఏ ఆడపిల్ల బాధ పడకుండా చూడగలిగినప్పుడే నా మాతృత్వానికి సార్థకత అని తన మనసులోని మాట ఘాటుగా.. భావోద్వేగంగా చెప్పింది. ఈ విషయమే కాదు. మనం తినే తిండి అయినా.. కట్టుకునే బట్ట అయినా.. వ్యవహారమేదైనా పిల్లల్ని దృష్టిలో ఉంచుకొనే చేయాల్సిన అవసరం ప్రతీ తల్లిదండ్రికీ ఉన్నది. లేకపోతే వాళ్లు రాంగ్‌రూట్లో వెళ్లే ప్రమాదముంది. ఇక్కడొక ఉదాహరణ చూద్దాం.. అది ఓ మధ్యతరగతి కుటుంబం. కూలీనాలీ చేసి కొడుకు, కూతురును చదివిస్తున్నారు. రెండ్రోజులు కాలేజీకెళ్లనన్నందుకు ఓ బైక్ కొనిచ్చారు. ఆ అబ్బాయి బండి రూపురేఖలు మార్చేశాడు. బండి డూమ్‌ని డేంజర్ ఆకారంలోకి మార్చేశాడు. పెద్ద శబ్దం చేస్తూ ఊళ్లో బలాదూర్‌గా తిరిగేవాడు. ఈ విషయమై ఎన్నోసార్లు చుట్టుపక్కల వాళ్లు తల్లిదండ్రుల్ని నిలదీశారు. వయసులో ఉన్నప్పుడు ఆ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాడండీ.. అంటూ ఆ తల్లిదండ్రులు సమాధానమిచ్చేవారు. ఆరోజు ఎప్పటిలాగే బైక్ వేసుకొని కాలేజీకెళ్లాడా యువకుడు. ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.ఈ కథలో తప్పెవరిది? లైసెన్స్, హెల్మెట్ లేకుండా బండి నడిపిన యువకుడిదా?చుట్టుపక్కల వాళ్లు చెప్పినా పట్టించుకోని తల్లిదండ్రులదా?
CoverStory

గర్భస్థం నుంచే గమనిస్తుండాలి..

కాలితో పెడేల్ పెడేల్‌మని కడుపులో తన్నాడు బాబు. తల్లి నొప్పి భరించలేకపోయింది. ఇంకెన్ని రోజులు కన్నా.. త్వరగా బయటకు రారా.. అంటూ ప్రేమగా తన పొట్టను నిమురుకుంది. అలా పుట్టకముందే పొట్టలో తన్నిన కొడుకు రేపు పెద్దయ్యాక తన్నడని గ్యారెంటీ ఏంటి? అందుకే బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచే తల్లిదండ్రులు సరైన శ్రద్ధవహించాలి. సరైన ఆహారం అందించాలి. గర్భవతిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు, మానసిక పరిస్థితుల ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుంది. అప్పటి నుంచే తల్లిదండ్రులు గొడవలకు దూరంగా ప్రశాంతంగా ఉంటే ప్రశాంతత శిశువులకూ అలవడుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో గడిపితే చిన్నారులకు ఆధ్యాత్మికత అలవడుతుంది. సీతమ్మ గర్భంతో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగింది. పురాతన గ్రంథాలు కంఠస్థం చేసింది. అవన్నీ కడుపులోనే ఉండి విన్న శిశువులు లవకుశులకు ఆ తర్వాత ఎంతో ఉపయోగపడ్డాయి. సన్మార్గమే అలవడింది.

కుటుంబ వ్యవస్థ

పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. (ఇప్పటికీ అక్కడక్కడా కొన్ని ఉన్నాయి.) ఉమ్మడి కుటుంబాల్లో తాత, నానమ్మ, పిన్ని, చిన్నాన్న మేనత్త ఇలా అనేక బంధుత్వాలతో కలిసి పెరగడం వల్ల పిల్లలపై ఎవరో ఒకరు శ్రద్ధ వహించేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యింది. ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే తపనతో తల్లిదండ్రులు పిల్లలను డేకేర్ సెంటర్లలో వదిలేసి ఉద్యోగాలకు వెళ్తున్నారు. వారు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో వదిలేసి ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. అంటే చిన్నప్పుడు మనం ఎలా వారిని ట్రీట్ చేశామో వారూ అదే మాదిరిగా ట్రీట్ చేస్తున్నారన్న మాట.
CoverStory1

అతడు కడుపులో ఉండగానే తండ్రి చనిపోయాడు. తల్లి రెండో పెండ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు విడాకులు తీసుకుంది. మద్యానికి బానిసైంది. కొత్త కొత్త పరిచయాలతో రోజూ ఇంటికి వస్తుండేది. అదంతా గమనించిన కొడుకు కమ్యూనిజంపై ఆసక్తి పెంచుకున్నాడు. రష్యా వెళ్లి అక్కడి సార్జెంట్‌ను కొట్టి శిక్ష అనుభవించాడు. అడవిలో అనవసరంగా కాల్పులు జరిపాడు. అందుకూ శిక్ష అనుభవించాడు. తన 23వ ఏట అమెరికన్ ప్రెసిడెంట్ కెన్నెడీని హత్య చేశాడు. ఆపై అతడూ అతి కిరాతకంగా కాల్చివేతకు గురయ్యాడు. అతడే లీ- ఆస్వాల్డ్.

అతడి చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. పోలియో వచ్చి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. తల్లి అండగా నిలబడింది. ఉన్నత చదువుల కోసం ఉన్న వంద ఎకరాల భూమి, రెండు భవంతుల్ని అమ్మేసింది. అతడితో పాటే పట్నం వచ్చి చిన్న గదిలో ఉండి అతడిని చదివించింది. ఆమె ఇచ్చిన మానసిక ైస్థెర్యంతో అతడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. అతడే ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్.

పిల్లలను విజేతలుగా, విలన్‌గా పరిచయం చేయాలన్నా ఈ రెండు ఉదాహరణలు చాలు.

మాటే మంత్రం

వాడికేంటి మగాడు ఎలాగైనా బతుకుతాడు అని చిన్నతనంలోనే ఓ బీజం నాటుతుంటారు. నువ్వు ఆడపిల్లవు.. ఇది నీకు చేత కాదు. ఈ పని చేయాలి ఇది చేయకూడదు అంటూ ఆడపిల్లల్ని ఎక్కువగా ఆలోచించనివ్వరు. ఇక్కడే పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది. శారీరకంగా ఎదిగినప్పటికీ మానసికంగా వారి స్థితి అలాగే ఉంటుంది. పిల్లలు నేరస్తులు కాదు. వారిని మాటలతోనే మార్చాలి. చెప్పింది వినట్లేదని ఇష్టమొచ్చినట్లు కొడితే చివరికి వాళ్లు మొండిగా తయారవుతారు. దెబ్బలు తినీ తినీ శరీరంపై వ్యామోహం వదిలేస్తుంటారు. పిల్లల విషయంలో మాటే మంత్రం. కథల రూపంలోనో.. కవితల రూపంలోనో.. పాటల రూపంలోనో ఎలా చెబితే అర్థం చేసుకుంటారో అలా చెప్పాలి.
CoverStory2

ఫోన్ రక్కసి..

మన పని పూర్తవడం కోసం పిల్లలకు మొబైల్ ఇస్తుంటాం. వాళ్లు అల్లరి చేస్తున్నా. ఏడుస్తున్నా. తినకపోయినా. ఇలా కారణమేదైనా ఫోన్ ఇచ్చి మన పని పూర్తి చేసుకుంటుంటాం. కానీ చిన్నారులకు అదే అలవాటుగా మారుతుంది. చివరికి ఫోన్ ఇస్తేనే అన్నం తింటాను అనే వరకు తీసుకెళ్తుంది. సెల్‌ఫోన్ రిసీవ్ చేసుకునే సిగ్నల్స్ నుండి వచ్చే రేడియో ధార్మికత వల్ల చిన్న పిల్లల్లో మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇటీవల బ్రిటన్ హెల్త్ ప్రొడక్షన్ ఏజెన్సీకి చెందిన సర్ విలియం స్టీవార్ట్ జరిపిన పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లలు సెల్‌ఫోన్ వాడకం వల్ల వారి మానసిక స్థితిపై ప్రభావం పడుతుందట. ఆకలి మందగించడం, ఒత్తిడికి గురై సరిగ్గా చదవలేకపోవడం, తలనొప్పి, కంటి చూపు కోల్పోవడం, మెల్ల కన్ను రావడం వంటివి ఎదురవుతాయని పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన అనంతరం ఆస్ట్రేలియా మెడికల్ అసోసియేషన్ పాఠశాలలు మ్యూజిక్ సిస్టమ్స్, సెల్‌ఫోన్ వాడకాన్ని నిషేధించాయి.
CoverStory3

ఇంట్లో వాళ్లదే హీరో పాత్ర

పిల్లలు చాలా విషయాల్ని గమనిస్తుంటారు. మనం అవేమీ పట్టించుకోం. మన పనేదో మనం చేసుకుంటూ వెళ్లిపోతుంటాం. కానీ వాళ్లు ఇంట్ల్లో ఎవరినో ఒకరిని ఇమిటేట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఎవరిలానో ఉండాలని ప్రయత్నిస్తుంటారు. అందుకని పిల్లల ఎదుట ఇంట్లో వాళ్లంతా మంచినే ప్రదర్శించాలి. పిల్లలకు ఏదైనా నేర్పించాలన్నా కేవలం చెప్పకుండా మనం ఆచరించి చూపాలంటారు నిపుణులు. ఎందుకంటే పిల్లలు సహజంగా పెద్దవాళ్లను అనుసరిస్తుంటారు. ఒక వేళ మనం చెప్పే విషయానికి ఆచరించే విధానానికి తేడా ఉంటే అది వారిని సందేహంలో పడేస్తుంది. ఆ సందేహం అయోమయంలా మారి చివరికి పిల్లలు మనం చెప్తే వినని స్థితికి వచ్చేస్తారు. పిల్లల ప్రవర్తన, వారి వ్యక్తిత్వంపై తల్లిదండ్రుల ప్రభావం అధికంగా ఉంటుంది. పిల్లలు సమయపాలన నేర్చుకోవాలంటే వారికి చెప్తే సరిపోదు. మనం ఆచరించి చూపించే విషయాన్నే పిల్లలు అనుసరిస్తారు. చిన్నపిల్లల అల్లరిని పొరపాట్లను చూసీ చూడనట్లుగా వదిలెయ్యాలి. ప్రతి విషయానికీ రియాక్ట్ కాకుండా ఉండాలి. పిల్లలపై ప్రేమ చూపించడమంటే కేవలం మాటల్లో చూపించడం కంటే మన చేతల్లో దాన్ని వ్యక్తం చేస్తే వాళ్లు మరింత ఆనందంగా ఫీలవుతుంటారు. ఉదాహరణకు వాళ్లను దగ్గరకు తీసుకోవడం, గట్టిగా పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివి పిల్లలకు ఎక్కువ ఆనందాన్నిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోయే సమయంలో కథలు, కబుర్లు, పాటలు వంటివి పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతాయి. వాళ్లు వినకపోయినా మంచి విషయాలను ఒకటికి రెండు సార్లు చెప్పాలి. మంచి అలవాట్లు చేయించాలి.
CoverStory4

టెక్ ఫ్రీ జోన్స్

3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలకు ఫోన్ ఇవ్వకూడదు. అలా అలవాటు చేస్తే 12 ఏండ్ల తర్వాత పిల్లలు ఫోన్ వాడమన్నా వాడరు. ప్రస్తుతం ఇండ్లల్లో టెక్ ఫ్రీ జోన్స్ అని ఏర్పాటు చేస్తున్నారు. టెక్‌ఫ్రీజోన్స్ అంటే ఈ పరిధిలో ఫోన్ వాడకూడదు అనర్థం. బెడ్ రూంలో, డైనింగ్ టేబుల్ దగ్గర, కారులో డ్రైవర్ సీటు దగ్గర అట్టముక్కలపై రాసి అంటిస్తున్నారు. ముబైల్ వాడకం వల్ల అనర్థాలు రాసి పెట్టడం వల్ల ఫోన్‌కు దూరం ఉంటున్నారు.

విజ్ఞాన పుస్తకాలు:
1. ఇప్పుడే చెప్పు
2. నా శరీరం చెప్పేది వినండి
3. పెళ్లికి ప్రయాణం
4. ఎత్తుగా ఎగురుతూ
5. ఇంటికి వెళ్లడం
6. మనమంతా జంతువులం
7. దారంతో ఆటలు
8. చిట్టి విజ్ఞానం
CoverStory5

పిల్లలు.. అద్దం

అద్దం ప్రతిబింబాన్ని చూపించే పరికరం. అలాగే పిల్లలు కూడా. తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తుంటారు. తల్లిదండ్రులు ఉదయాన్నే నిద్రలేస్తే పిల్లలు లేస్తారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు జాగింగ్, వాకింగ్‌కు వెళ్తే తామూ వెళ్తామంటారు. ఇలా పేరెంట్స్ అభిరుచులు, అలవాట్లు ఎక్కువ శాతం పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. అందుకని తల్లిదండ్రులు బాధ్యతతో నడుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వారి ముందు అబద్ధ్దాలు చెప్పొద్దని, చెడు అలవాట్లను ప్రదర్శించవద్దని నిపుణులు చెబుతున్నారు. మనం ఏది చేస్తే పిల్లలు అది అనుసరిస్తారు. అందుకని పిల్లలకు మంచి చెప్పే ముందు వారు పాటించాలని నిపుణులంటున్నారు.
CoverStory6

పిల్లల కోసం ఆన్‌లైన్‌లో కొన్ని అద్భుతమైన పుస్తకాలుసైన్స్ పుస్తకాలు:
1. రోదసి
2. సూక్ష్మక్రిములు
3. భూమి గుండ్రంగా ఉంది
4. కొవ్వొత్తి రసాయన చరిత్ర
5. నేర్చుకోవడం పిల్లల నైజం
6. ఆటల సరదాలో
CoverStory7

మేధస్సు పెంచే యాప్స్

ఒకవేళ చిన్నారులు మొబైల్‌కు అడిక్ట్ అయినా.. ఆ అలవాటు ద్వారా మంచి జరిగేట్లు చేయాలి. అందుకోసం చిన్నారుల మేధస్సును పెంచే యాప్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కిడోస్మార్ట్ ఈ యాప్ 2 ఏండ్ల నుంచి 12 ఏండ్ల వయసు గల పిల్లల మేధస్సును పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో సుమారు 50 వరకు కార్యక్రమాలు ఉంటాయి. పలురకాల వీడియోలు, గేమ్స్ ద్వారా ఆకట్టుకునే రీతిలో పాఠ్యాంశాలు రూపొందించారు. తల్లిదండ్రులు సైతం ఈ యాప్ ద్వారా చిన్నారుల్లో వచ్చే అభివృద్ధిని ఎప్పటికప్పుడు గమనించవచ్చు. హోంవర్క్ ఆన్ బింగ్ ఈ యాప్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఎంబెడెడ్ బింగ్ ఇంజిన్ ద్వారా చిన్నారుల మేధాశక్తికి పదును పెట్టవచ్చు. ఇందులో పలు రకాల పదశోధన, స్పెల్లింగ్, వ్యాకరణం, క్యాలెండర్, గడియారం, గణిత హోంవర్క్ అంశాలు అందుబాటులో ఉన్నాయి. పాకెట్ మ్యాథమేటిక్స్ ఈ యాప్‌లో గణితాన్ని సులభంగా చేసేందుకు అవసరమైన అన్ని సూత్రాలు చిత్రాలతో అందుబాటులో ఉంటాయి. కిడ్స్ ట్యూబ్ చిన్నారులకు పాఠ్యాంశాలను ఆసక్తికరంగా అందించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇందులో పాఠ్యాంశాలను వీడియో ద్వారా చూడవచ్చు. ఈ వీడియోలను వినోదాన్ని పంచేలా డిస్నీ, మిక్కిమౌస్ కార్టూన్లతో రూపొందించారు. ఫ్రెష్ పెయింట్స్ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇందులో ఫొటోలను అద్భుత పెయింటింగ్స్‌గా తయారు చేయవచ్చు. స్పెల్లింగ్‌ట్యూటర్ యాప్ ద్వారా చిన్నారులకు పద ఉచ్ఛారణ సులభమవుతుంది. మాతృభాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ పదాలు అందుబాటులో ఉంటాయి. మడగాస్కర్ మ్యాథ్స్ ఈ యాప్‌లో ప్రత్యేకంగా రూపొందించిన గేమ్‌లు ఉంటాయి. వీటితో గణిత పాఠ్యాంశాలకు సంబంధించిన పలురకాల సాధనలు చేయవచ్చు. గేమ్స్ ఆడుతూనే గణితంపై పట్టు సాధించవచ్చు. ఇలా పిల్లలకు ఉపయోగపడే మరెన్నో యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో రెడీగా ఉన్నాయి. పిల్లలు ఏం చేస్తున్నారు. ఏం చూస్తున్నారు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పేరెంటల్ కంట్రోల్ యాప్స్ ఉపయోగపడుతాయి. కిడ్స్‌లాంచర్, స్క్రీన్ టైం, కిడ్స్ ప్లేస్ పేరెంటల్ కంట్రోల్, బేబీ బిట్ వంటి యాప్స్ తల్లిదండ్రులకు ఉపయోగపడుతాయి.
CoverStory8

సమయాన్ని పెట్టుబడి పెట్టాలి..

పిల్లల కోసం తల్లిదండ్రులు డబ్బును పెట్టుబడిగా పెడుతుంటారు. కానీ సమయన్ని పెట్టుబడిగా పెట్టాలి. ఎక్కువ సమయం వాళ్ల కోసం కేటాయించాలి. ముఖ్యంగా మనం చేయలేని పనులు, మన లక్ష్యాలను పిల్లలపై రుద్దొద్దు. ఇంటిని టెక్‌ఫ్రీజోన్‌గా మార్చుకోవాలి. పిల్లల పెంపకం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు పదో తరగతి వచ్చేవరకు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు జాబ్ చేయకుండా పిల్లల కోసం వెచ్చించగలిగితే అద్భుతమైన యువతరాన్ని దేశానికి అందించవచ్చు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేయాల్సి వస్తే తాతయ్య, నానమ్మ, కుటుంబీకుల మధ్యలో పిల్లలు పెరిగేట్లుగా చూడాలి. ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పే బదులు వాటివల్ల వచ్చే అనర్థాలు చెప్పగలిగితే పిల్లలు తప్పు చేయడానికి భయపడుతారు.
- హిప్నో పద్మాకమలాకర్, సైకాలజిస్టు

ఇవి గమనించండి..

-పిల్లల పెంపకం అంటే ఓ బాధ్యత. దాన్ని మరీ మిలటరీ ట్రైనింగ్‌లా కాకుండా ఆడుతూ పాడుతూ ఉండేలా జాగ్రత్త పడాలి. మనం వారి రూట్‌లోనే వెళ్తూ మంచి ఏదో చెడు ఏదో చెప్పాలి.
-ప్రతి విషయంలో పిల్లలకు పాజిటివ్ థింకింగ్ ఉండేలా చూడాలి.
-సమయానుసారంగా ప్రవర్తించేలా పిల్లలను పెంచాలి. చిన్నప్పటి నుంచే ప్రేమ, బాధ్యత వంటి వాటి గురించి తెలియజేస్తూ ఉండాలి. అప్పుడే వారి భవిష్యత్ బాగుంటుంది.
-పిల్లలు పెరిగే కొద్దీ కొంత స్వేచ్ఛను కోరుకుంటారు. వాళ్లు కోరుకున్నట్లుగానే వారికి స్వేచ్ఛనివ్వడం మంచిదే. కానీ వారిని ఓ కంట కనిపెట్టుకొని ఉండడం మంచిది.
-కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛనిస్తుంటారు. తల్లిదండ్రులు చూపించే ప్రేమ వారిని పాడు చేసేలా ఉండకూడదు.
-డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుకోవడం, పిల్లల ముందు అబద్ధం చెప్పడం ఎంతమాత్రం మంచిది కాదు. అది వారి జీవితంపై ప్రభావం చూపుతుందన్న విషయం మరిచిపోవద్దు.
-కొన్ని విషయాలు పిల్లల ముందు చర్చించకపోవడం మంచిది. ఆర్థిక సంబంధమైన లావాదేవీలు, అప్పులు వంటివి పిల్లల చదువుపై ప్రభావం చూపిస్తాయి.
-ఇది చేయకూడదు. ఇది మంచిది కాదు.. అని పిల్లలతో తరచూ అంటుంటాం. కానీ ఆ పని చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి? నష్టాలు ఏంటో వివరంగా చెప్పగలగాలి. నిప్పును ముట్టుకోవద్దు అని చెప్పే బదులు. ముట్టుకుంటే కాలుతుంది అది దాని స్వభావం అని చెప్పగలగాలి.
-తల్లిదండ్రులు పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపాలి. అప్పుడు టీవీ లాంటివి లేకుండా వారికి దగ్గరగా కూర్చొని కబుర్లు చెబుతూ వారితో మమేకమైపోవాలి. పిల్లలు యంత్రాలు కాదన్న విషయం గుర్తించాలి. ఎప్పుడూ చదువని వెంటాడకుండా ఆటపాటలకు, చదువుకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి.
-సేవాభావం అలవర్చాలి. అందుకు మాటల్లో కాకుండా ఇరుగు పొరుగు వారికి సాయం చేస్తే వారు ఎంత సంతోషపడుతారో మనం చేసి చూపించాలి. సాయం చేయడాన్నే హ్యాబీగా మార్చాలి.
CoverStory9

1039
Tags

More News

VIRAL NEWS