సూర్యకాంతిని బట్టి గడియారం తీర్చిదిద్దారు!


Sun,December 15, 2019 12:27 AM

మన అందరి జీవితాల్లో అతి ముఖ్యమైన అంశం కాలం. కాలాన్ని వృథా చేస్తే జీవితం అస్తవ్యస్థమైనట్టే. సో.. ప్రతి మనిషికీ సమయం తెలియాలి. సమయానికున్న అర్థమూ తెలియాలి. కాలం విలువేంటో తెలియాలి. సమయాన్ని ఒడిసిపట్టుకోవాలి. దానికంటూ ఓ కాల పట్టిక.. సమయ సూచిక కావాలి. ఆ అవకాశాలన్నింటినీ గడియారం కల్పిస్తుంది. అంతటి విలువైన గడియారాన్ని ఎవరు రూపొందించారు? ఎలా చేశారు? దాని వెనకాల ఉన్న కారణమేంటి? గడియారాలు ఎన్ని రకాలు తెలుసుకుందాం.

ఇప్పుడంటే రకరకాల గ్యాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి టైం తెలుసుకోవడానికి ఎలాంటి సమస్యా లేదు. కానీ.. ఏ టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడు.. ఏ గ్యాడ్జెట్సూ మార్కెట్లో దొరకనప్పుడు సమయం ఎలా తెలుసుకునేవారు? ఫలానా టైంకు తినాలి.. ఫలానా టైంకు పనికెళ్లాలనే విషయాలు ఎలా తెలిసేవి? పూర్వకాలంలో సమయాన్ని సూర్యుని గమనం ఆధారంగా చెప్పేవారు. నీడ గడియారం, నీటి గడియారం వాడుకలో ఉండేవి. సూర్యకాంతి లేకపోతే కాలాన్ని నిర్ణయించేందుకు ఇసుక గడియారాన్ని వాడేవారు. ఇసుక అందుబాటులో లేనివాళ్లు కొవ్వొత్తి గడియారంతో సమయాన్ని తెలుసుకునేవారు. 13 శతాబ్దంలో యాంత్రిక గడియారాలు అందుబాటులోకి వచ్చాయి. తర్వాత ఎన్నో మార్పులు జరిగి అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఉన్న ప్రదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఎంత సమయం అవుతుందో కూడా తెలుసునే అవకాశం వచ్చింది. నిమిషాలు.. సెకన్లతో కచ్చితమైన సమయాన్ని తెలిపే ఎన్నో సాంకేతిక పరికరాలు వాడుకలోకి వచ్చాయి. గడియారపు ముల్లులు ఎడమ నుంచి కుడికి తిరిగితే క్లాక్ వైజ్ డైరెక్షన్ అని పేర్కొన్నారు. ఓ సాంకేతిక సూత్రం ప్రకారం ఇది పనిచేస్తుంది.
Clock

భూమి ఉత్తరార్ధ గోళంలో కుడి నుంచి ఎడమకు తిరుగుతుంది కదా. దానర్థం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యరశ్మి ఎడమనుంచి కుడికి మారుతూ ఉంటుందన్నమాట. పూర్వకాలంలో కాలాన్ని సూర్యుని గమనం ఆధారంగా నిర్ధారించేవారు కాబట్టి సూర్యకాంతి వల్ల ఎడమనుంచి కుడికి ఏర్పడే నీడను బట్టి సమయాన్ని లెక్కించేవారు. అదే నీడ గడియారం. దీని ఆధారంగానే గడియారపు ముల్లులు ఎడమనుంచి కుడికి తిరుగుతాయి. దీనిని క్లాక్‌వైజ్ అనీ, అపసవ్య దిశలో ముల్లును యాంటీ క్లాక్‌వైజ్ అనీ అంటారు. మరి ఉత్తరార్ధ గోళం కాకుండా దక్షిణార్ధ గోళపు గమనాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? అనే సందేహం రావచ్చు. దానినీ పరిగణనలోకి తీసుకుంటారు. అప్పుడు ముల్లులు కుడి నుంచి ఎడమ వైపునకు తిరుగుతాయి. కానీ భూమి ఉత్తర ధృవం ఆధారంగా 23 డిగ్రీలు వంగి ఉంటుంది కాబట్టి మనం సవ్య దిశకే ప్రాధాన్యం ఇస్తాం.
Clock1

జర్మనీకి చెందిన పీటర్ హెన్లెన్ మొదటిసారి జేబు గడియారాన్ని తయారుచేశారు. మొదట్లో ఇది సమయం తెలుసుకోవడానికి నిత్యావసర వస్తువుగా ఉపయోగపడింది. హెన్లెన్ ఒకసారి వాళ్ల నాన్నతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ వెళ్లిన పని ఆలస్యం అయ్యింది. సూర్యచంద్రుల రాకపోకలను బట్టే అప్పటికి సమయాన్ని లెక్కించేవాళ్లు. నాన్నను అడిగాడు.. నాన్నా మనం ఇంటికి ఎప్పుడు వెళ్లేది? అని. బహుశా ఇంకొంత సమయం పడుతుండొచ్చు.. వేచి చూద్దాం ఆగు అన్నారు. సమయం ఇప్పుడెంత అయింది? అది ఎలా తెలుస్తుంది నాన్నా అని అడిగాడు హెన్లెన్. సమయం అంటే సూర్యుడి కాంతిని బట్టి తెలుస్తుంది అని తండ్రి బదులిచ్చాడు. సూర్యుడు లేకపోతే అని తండ్రిని మళ్లీ అడిగాడు. సూర్యుడు లేకపోతే చంద్రుడొస్తాడు. దానినే రాత్రి సమయం అంటారు అని కొడుకుకి సర్దిచెప్పాడు. వాతావరణంలో మార్పుల వల్ల ఒక్కోసారి సూర్యుడు తొందరగా అస్తమించవచ్చు. అలాంటి సమయాల్లో అది రాత్రా? పగలా? అని తెలుసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి కదా నాన్నా అని అడగ్గానే వాళ్ల నాన్న అవును కదా? అని ఆశ్చర్యపోయాడు.
ఇలా ప్రతీసారి సూర్యకాంతిపైనే ఆధారపడి సమయాన్ని లెక్కించే బదులు ఏదైనా పరికరం ఉంటే బాగుండు అనే ఆశను వ్యక్తం చేశాడు. తండ్రి మాటలు హెన్లెన్‌ను కదిలించాయి. సమయాన్ని నిర్ణయించే.. లెక్కించే సాధనమేదైనా కనుక్కోవాలనే మాట మనసులో ఉండిపోయింది. కొత్తకొత్త పరికరాలు కనుక్కునే ట్రెండ్ నడుస్తున్నది అప్పుడు. అదే సమయాన్ని హెన్లెన్ కూడా ఉపయోగించుకున్నాడు.
Clock2

తండ్రి కోరిక మేరకు ఎంతో కాలం శ్రమించి ఒక పరికరాన్ని తయారుచేశాడు. కానీ అది ఎక్కువ కాలం పని చేయలేదు. పైగా సమయాన్ని నిర్ణయించడంలో విఫలం అయింది. సమయాన్ని నిర్ణయించేంత గొప్పోడివైపోదామనుకున్నావా? అది నిర్ణయించాలంటే నువ్వు కాదు.. నీ తాతలు దిగిరావాలి అని తోటివారు హేళన చేశారు. దీనినే సవాలుగా తీసుకున్నాడు హెన్లెన్.ఎక్కడ ఫెయిల్ అయ్యాడో అక్కడే మొదలు పెట్టాడు. ఈసారి చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. మునుపటికంటే ఎక్కువ కసితో పనిచేశాడు. మొత్తానికి జేబులో పెట్టుకోవడానికి వీలుండే ఒక పరికరం తయారుచేశాడు. అది కూడా సూర్యకాంతి ఆధారంగా పనిచేసేదే. దానినే జేబు గడియారం అన్నారు. తర్వాత వీటిని పోలిన అనేక నమూనాలు వేరే శాస్త్రవేత్తలు రూపొందించారు. ముఖ్యంగా వీటి తయారీ చిన్నదిగా సులువుగా ఉండేది. కాని టెక్నాలజీ అభివృద్ధి చెందినకొద్దీ గడియారం ఆకృతిలో మార్పులు వచ్చాయి. సమయంతోపాటు రోజు.. తేదీ.. నెల.. సంవత్సరం సూచించేలా గడియారాలు మారాయి. ఎక్కువమంది చేతికి పెట్టుకోవడం వల్ల వాటిని చేతిగడియారాలని పిలిచేవాళ్లు. పాతకాలంలో యాంత్రిక గడియారాలు స్ప్రింగ్‌తో తిరిగేవి. వీటికి రోజూ లేదా రెండ్రోజులకోసారి కీ ఇవ్వాల్సి వచ్చేది. ఆధునిక కాలంలో ఇవి బ్యాటరీలతో నడుస్తున్నాయి. కొన్ని గడియారాల్లో మనం ఎప్పుడు అవసరమనుకుంటే అప్పుడు గంట మోగే సదుపాయం కూడా వచ్చింది.

కొవ్వొత్తి గడియారం

సమాన కాలవ్యవధులలో.. సమాన పొడవులో కొవ్వొత్తి (అగరబత్తి కూడా) కాలుతూ ఉంటుంది. దీనిని లెక్కించి గడియారాలు తయారుచేసిన శాస్త్రవేత్తలూ ఉన్నారు. నున్నటి ఇసుక గడియారాన్ని రూపొందించారు క్రీస్తు పూర్వం 16వ శతాబ్దంలో బాబిలోనియా, ఈజిప్టులలో. నీటి గడియారంలో క్లిష్టమైన వేగం మార్చే పరికరాలు అమర్చి ఖచ్చితమైన సమయాన్ని సూచించే విధంగా తయారుచేసారు. క్రీస్తుశకం 1580లో ఇటలీ శాస్త్రవేత్త గెలీలియో గెలీలి లోలకం డోలనాలను లెక్కించి గడియారంలో వాడవచ్చని కనుగొన్నాడు. కానీ ఆయన అలాంటి పరికరం తయారు చేయలేదు. 1656లో డచ్ శాస్రవేత్త క్రిస్టియన్ హైగెన్స్ తొలి లోలకం గడియారాన్ని నిర్మించారు. ఈ గడియారం ఒక రోజులో 1 నిమిషం మాత్రమే సమయాన్ని చూపించేది. 16వ శతాబ్దంలో టైకోబ్రహి గడియారంలో నిమిషాలు, సెకనులు చూపే ఏర్పాటు చేసాడు. రాబర్ట్ హుక్ స్ప్రింగ్ టెంపర్ గల కమ్మీ గడియారాన్ని రూపొందించారు. స్ప్రింగ్ శక్తిని ఉపయోగించి 1675లో హైగెన్స్ బ్యాలెన్స్ వీల్ జేబు గడియారం తయారుచేసాడు. చాలా కాలం ఈ పద్ధతిలోనే సమయం తెలుసుకునేవారు. 1932 లో సీకో కంపెనీ వారు ప్రపంచపు తొలి క్వార్ట్ వాచ్‌ను తయారుచేశారు. 1949లో అటామిక్ గడియారం కనుగొనబడింది. ఇదే ప్రస్తుత ప్రపంచంలో అతి ఖచ్చితమైన సమయం చూపే గడియారం. తర్వాత గోడగడియారాలు.. చేతి గడియారాలు.. స్టాప్ వాచీలు అనేక రూపాల్లో గడియారాలు వచ్చాయి.
Clock3

గడియారం మనకు సమయం తెలుసుకోవడానికి ఉపయోగపడే యంత్రం, నిత్యావసర వస్తువు. పాఠశాల విద్యార్థులు.. రైతులు.. వ్యాపారులకు దశాబ్దం క్రితం గడియారం ఒక నిత్యావసర వస్తువు. ఎండ-నీడల సహాయంతో సమయాన్ని తెలుసుకునేవారు. ఎండ నెత్తిపైకి వస్తే అది మిట్టమధ్యాహ్నం అయినట్లు భావించేవారు. వీటినే సూర్య గడియారంగా పేర్కొంటారు. అంతేకాక ఇసుక గడియారాలు వాడుకలో ఉండేవి. ఈ ఇసుక గడియారాల్లో రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగంలో ఇసుక నింపబడి ఉంటుంది. మొత్తం ఇసుక ఒక భాగం నుండి మరొక భాగానికి రాలడానికి నిర్దిష్టమైన సమయం పడుతుంది. దీన్నే ఇసుక గడియారం అంటారు. టెక్నాలజీ పెరగడంతో ముల్లు, అంకెల గడియారాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అంకెలను డిస్‌ప్లే చేయడానికి ఎలక్ట్రానిక్ లెడ్లను ఉపయోగిస్తారు. వీటికి చాలా తక్కువ విద్యుత్ ఖర్చుతో పాటు సమయాన్ని మాటల్లో చెప్పే సౌకర్యం ఉంటుంది.
Clock4

ఫైనల్‌గా.. పూర్వ కాలంలో ఎవరి చేతికి గడియారాలు లేవు. కాని అందరి దగ్గరా కావలసినంత సమయం ఉండేది. పిల్లలతో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేవారు. ఇప్పుడు అందరి చేతులకు గడియారాలున్నాయి. కానీ ఎవ్వరి దగ్గరా సమయం లేదు. కుటుంబంతో గడపటానికి టైం లేదు. తమ గురించి తాము ఆలోచించడానికీ టైం లేదు. వారు ఎక్కడా ఆగిపోలేదు. మొదటేమో పగలులో కాలాన్ని లెక్కించడానికి సూర్య గడియారాన్ని వాడేవారు. ఒక గోళాకార రాతిపై సూర్యుని నీడనిబట్టి కాలాన్ని లెక్కించేవారు. శాస్త్రీయంగా నిర్మించిన సూర్యగడియారం పగటిలో చాలా ఖచ్చితంగా ప్రాంతీయ సమయాన్ని సూచించడానికి ఉపయోగపడేది. కానీ ఈ గడియారం పనిచేయాలంటే సూర్యుని వెలుగు విధిగా వుండాలి. సూర్యుడే లేనప్పుడు, రాత్రిపూట కూడా సమయాన్ని కొలవటానికి వేరొక సాధనం కావలసి వచ్చింది. తర్వాత వేరొక సాధనం ద్వారా గడియారం తయారుచేసి సమయాన్ని లెక్కిస్తూ వచ్చారు.

624
Tags

More News

VIRAL NEWS