కొత్త సమస్య


Sun,December 15, 2019 02:19 AM

విలియం పార్కర్ తన ఇంటిముందు పార్క్ చేసిన మెరిసే కొత్త కారుని చూసాడు. అంటే, డాక్టర్ మిల్టన్ తన ఇంటికి వచ్చాడన్న మాట. తలుపు దగ్గరకి వెళ్ళి చుట్టూ చూసి జేబులోంచి తాళం చెవి తీసాడు. తనని తాను సంబాళించుకుంటూ నిశ్శబ్దంగా లోపలకి వెళ్ళాడు.ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. చప్పుడు చేయకుండా కార్పెట్ పరిచిన నేలమీద రెండో అంతస్థులోని బెడ్‌రూంలోకి వెళ్ళాడు. పై మెట్టుమీదకి ఎక్కాక క్రితం రోజు కొన్న 22 కేలిబర్ పిస్టల్‌ని జేబులోంచి తీసాడు. తన బెడ్‌రూం తలుపుని తెరవబోయే ముందు సేఫ్టీకేచ్‌ని ఆన్ పొజిషన్‌కి మార్చాడు. ఊపిరి బిగబట్టి తలుపు తెరిచాడు.డాక్టర్ మిల్టన్ తన తెల్లషర్ట్ గుండీలు పెట్టుకుంటూ కనిపించాడు. పార్కర్ భార్య లేసీ కేవలం పల్చటి హౌస్‌కోట్‌లో మంచం మీద పడుకుని ఉంది. పక్క, ఆమె జుట్టు చెదిరి ఉన్నాయి.తన భర్తని చూడగానే లేసీ నోరు ఆశ్చర్యంగా తెరచుకుంది. డాక్టర్ మిల్టన్ అందమైన చేతులు భయంతో బిగుసుకున్నాయి.పార్కర్! లేసీ ఆశ్చర్యంగా అరిచింది.పార్కర్ ట్రిగర్‌ను నొక్కాడు. ఆ చిన్న పిస్టల్ తక్కువ శబ్దం చేసింది. లేవబోయిన లేసీ వెనక్కి పడిపోయింది. పార్కర్ తన పిస్టల్‌ని మరణించిన భార్యకే గురిపెట్టి నిలబడిపోయాడు.నన్నూ కాలుస్తావా? డాక్టర్ మిల్టన్ షర్ట్ గుండీ పెట్టుకుంటూ అడిగాడు.పార్కర్ సమాధానం చెప్పబోయే ముందు అతని వంక కొద్దిసేపు చూసాడు.లేదు.
Crime-story

షర్ట్‌ని టక్ చేసుకుని మిల్టన్, లేసీ దగ్గరకి వెళ్ళి నాడి పరిశీలించి ఆమె మరణించిందని గ్రహించాడు.మనిద్దరం ఇప్పుడు చిక్కుల్లో పడ్డాం డాక్టర్ మిల్టన్ చెప్పాడు.వెళ్ళు పార్కర్ ఆజ్ఞాపిస్తున్నట్లుగా కాక బతిమాలుతున్నట్లుగా చెప్పాడు.మిల్టన్ కింద ఉన్న సాక్స్, బూట్లు తొడుక్కుంటూ చెప్పాడు. నీ మనసు నాకు అర్థమైంది. లేసీ నా భార్య అయితే నేనూ ఇదే పని చేసేవాడ్ని. ఆమె ఎలాంటిదో మనిద్దరికీ తెలుసు. ఇది జరిగినప్పుడు నేనుండటం నా దురదృష్టం. నీ సమస్య ఎలక్ట్రిక్ ఛెయిర్లో కూర్చోవాల్సి రావడం. నా సమస్య డాక్టర్‌గా నా గౌరవం నాశనమై, నేను ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న హాస్పిటల్ దివాలా తీయడం. నా భార్య ఎడిల్ నా డబ్బు తీసుకుని నన్ను వదిలేస్తుంది.పార్కర్‌కి ఎడిల్ తెలుసు. ఓసారి వాళ్ళింటికి భోజనానికి తన భార్యతో వెళ్ళాడు. ఆమెని చూసాక డబ్బుకోసమే ఆమెని డాక్టర్ పెళ్ళి చేసుకున్నాడని అనుకున్నాడు.

నా కారు దాదాపు గంటనించి ఇంటి బయట పార్క్ చేసి ఉంది. నేను ఇక్కడికి వస్తున్నట్లు నా రిసెప్షనిస్ట్ మార్గరెట్‌కి తెలుసు. పోలీసులు మరణ సమయాన్ని నిర్ణయించాక నాకు ఎలిబీ ఉండదు. కాబట్టి, మనిద్దరం ఒకరికొకరం సహాయం చేసుకోవాలి డాక్టర్ మిల్టన్ చెప్పాడు.ఎలా? పార్కర్ ప్రశ్నించాడు.ఆమె పొరపాటున తనని తను కాల్చుకుందనే ఏర్పాటు చేసి! కాని ఆ కోణంలో తన ఛాతీలోకి కాల్చుకోవడం కుదరదు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పడానికి ఒకే పద్ధతి ఉంది.పార్కర్‌కి లేసీమీద జాలి కాని, సానుభూతి కాని లేవు. డాక్టర్‌మీద కొద్దిగా కోపం కూడా లేదు. లేసీకి చాలామంది రహస్య ప్రియులు ఉన్నారు. అక్కడ అప్పుడు డాక్టర్ మిల్టన్ లేకపోతే మరొకరు ఉండేవారని అతనికి తెలుసు.ఇది ప్రమాదవశాత్తు జరిగింది. ఆ కర్టెన్ రాడ్‌ని చూసావా? దాన్ని గుండు దిగిన గాయంలో ఉంచి, ఆమె దాన్ని అమరుస్తూ కిందపడి అది ఛాతీలో గుచ్చుకుందని అనిపించేలా చేయొచ్చు.గుండు సంగతి? పార్కర్ ప్రశ్నించాడు.దాన్ని నేను తీసేయగలను. నాతో తెచ్చిన బ్యాగ్‌లో సర్జికల్ పరికరాలు ఉన్నాయి. గుండు చుట్టుకొలతకన్నా కర్టెన్ రాడ్ చుట్టుకొలత ఎక్కువ కాబట్టి గుండు దిగిన ఆనవాళ్ళు ఉండవు.మీరు డాక్టర్. దీన్ని ఇంకో డాక్టర్ నమ్ముతాడంటారా? పార్కర్ అడిగాడు.ఆమెని నిశితంగా పరిశీలిస్తే తప్ప.

కానీ, ఈ రాష్ర్టంలోని చట్టాల ప్రకారం పోస్ట్‌మార్టం అవసరం లేదు. ఆమెని అంబులెన్స్‌లో నా క్లినిక్‌కి తరలించి, రాడ్‌ని తొలగించి, ఆమె డెత్ సర్టిఫికేట్ మీద నేను సంతకం చేస్తే అది ఇంట్లో జరిగిన ఓ ప్రమాద మరణం అవుతుంది. ఈ ఊళ్ళో నిత్యం ఇలాంటి ప్రమాదాల్లో అనేకమంది మరణిస్త్తుంటారు. అంతేకాక, దీన్ని ధృవపరిచే ఇద్దరు సాక్షులం మనం. మనిద్దరం పైన ఏదో పడ్డ చప్పుడు, అరుపు విని పైకి వెళ్ళి ఆమె ఛాతీలో దిగిన రాడ్‌ని చూసాం. అంబులెన్స్ వచ్చే లోగా మనం ఆమెని కిందకి తీసుకెళ్ళవచ్చు డాక్టర్ మిల్టన్ సూచించాడు.సరే. ముందుగా మనం ఏం చేయాలి? పార్కర్ అడిగాడు.ముందుగా నా బ్యాగ్ ఇవ్వు ఆమె దగ్గరకి వెళ్తూ చెప్పాడు డాక్టర్ మిల్టన్.ఇరవై నిమిషాల తర్వాత ఏర్పాటు పూర్తయింది. లేసీ ఛాతీలోకి రాడ్ కొంతమేర దిగింది. డాక్టర్ మిల్టన్ తన సెక్రటరీ మార్గరెట్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ అంబులెన్స్‌ని వెంటనే పంపమని చెప్తూంటే అతను మంచినటుడని పార్కర్ అనుకున్నాడు. ఐదు నిమిషాల తర్వాత వాళ్ళకి సైరన్ వినిపించింది.

అంతా వాళ్ళు అనుకున్నట్లుగానే జరిగింది.పార్కర్, డాక్టర్ మిల్టన్‌లు చెప్పిన కథనాలు ఒకేలా ఉన్నాయి. పోలీసుల పరిశోధన రొటీన్‌గా సాగింది. నలభై పైబడ్డ లెఫ్టినెంట్ బిక్స్‌బీ ఆ పరిశోధనని కొంత విసుగ్గా చేసాడు. బిక్స్‌బీ పార్కర్‌కి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసి ఆ కేసుని మూసేశాడు. అంత్యక్రియలు పూర్తయ్యాయి.వారం తర్వాత పార్కర్ తను ఆడిటర్‌గా పనిచేసే గార్సన్ సిమెంట్ కంపెనీలో తిరిగి చేరాడు. అతనికి బాధ బదులు అంతా సక్రమంగా జరగడంతో గర్వంగా అనిపించింది.నెల గడిచింది. అతనికి కొత్త అలవాట్లు, కొత్త మిత్రులు, కొత్త జీవితం. లేసీ ఎవరితో తిరుగుతున్నదా అనే ఒత్తిడి లేదు. మరో వారం తర్వాత డాక్టర్ మిల్టన్ అతని ఇంటికి వచ్చాడు. పార్కర్ ఇచ్చిన నీళ్ళు కలిపిన స్కాచ్‌ని తాగి చెప్పాడు.మళ్ళీ మనం కష్టాల్లో పడినట్లున్నాం.

ఎలాంటి కష్టం? పార్కర్ భయంగా అడిగాడు.నా భార్య ఎడిల్ నాకు లేసీతో అఫైర్ ఉందని అనుమానించింది. ఇంటి పని విషయంలో లేసీ బద్దకస్థురాలని, కర్టెన్స్‌ని స్వయంగా మార్చిందంటే నమ్మలేనని చెప్పింది.ఆమెది కేవలం అనుమానమేగా? అందువల్ల ఇబ్బంది ఏమిటి?ఆమె పోలీసులకి తన అనుమానాన్ని చెప్పాలని అనుకుంటున్నది. వాళ్ళు శవాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం చేయవచ్చు.పార్కర్ భయం రెట్టింపయింది.ఐతే ఏం చేద్దాం?ఒకటే దారి.అంటే... మీ భార్యని...అవును. మనకి అదొక్కటే దారి మిగిలి ఉంది.ఎలా చేద్దామని అనుకుంటున్నారు?ఎడిల్ ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమెది అలాంటి మనస్తత్వమే.కారణం?లేసీ. నాకు అనేకమందితో అక్రమ సంబంధాలు ఉన్నాయని చాలామందికి తెలుసు. అసూయతో ఆత్మహత్య చేసుకుంటుంది.ఎలాగో ఆలోచించారా?అడవిలో మాకో క్యాబిన్ ఉంది. ఎడిల్‌కి క్లోరోఫాం ఇచ్చి అక్కడికి తీసుకెళ్ళి వంటగ్యాస్‌ని ఓపెన్ చేస్తాను. టైప్ చేసిన ఆత్మహత్య లేఖని అక్కడ ఉంచుతాను. ఆ రాత్రంతా నా రిసెప్షనిస్ట్ మార్గరెట్‌తో ఉంటాను. ఆమె నాకు ఎలిబీ. ఆమెకి నేనంటే ఇష్టం.మంచిది. నన్నేం చేయమంటారు?జరిగేది నీకు తెలియాలని చెప్తున్నాను. ఎడెల్ మరణం గురించి తెలిశాక నువ్వు దాన్ని ఆత్మహత్యగానే భావించాలి. ఎందుకైనా మంచిది. నువ్వు కూడా ఎలిబీని ఏర్పాటు చేసుకో. మీ పథకం బావుంది. కానీ, ఆత్మహత్య లేఖమీద ఎడెల్ సంతకం ఎలా తీసుకుంటారు? డాక్టర్ మిల్టన్ జేబులోంచి ఎడెల్ సంతకం ఉన్న ఖాళీ కాగితాన్ని తీసి చూపించాడు.

దీన్ని మీరు ఎలా సంపాదించారు? పార్కర్ అడిగాడు.మీకు తెలుసో, తెలీదో కానీ ఆమె బాగా తాగుతుంది. నిన్న రాత్రి ఆమెకి నేను మందుని స్వల్పంగా ఇచ్చాను. ఆల్కహాల్ కలిసిన ఆ మందువల్ల మెదడు కొద్దిగా మొద్దుబారుతుంది. కొన్ని ఇన్సూరెన్స్ ఫారాల మధ్య తెల్ల కాగితాన్ని ఉంచి అన్నిటి మీదా సంతకాలు తీసుకున్నాను. ఆమె తన హెల్త్ ఇన్సూరెన్స్ కోసం సంతకాలు చేస్తున్నదని అనుకుంది. కానీ, దానికి వ్యతిరేకమైన... ఈ సంతకం సంగతి ఆమెకి గుర్తుకూడా ఉండదు. ఇది కొద్దిగా వణికే వేళ్ళతో చేసినట్లుంది. కాని మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకునేప్పుడు ఇది సహజమే.పార్కర్ మౌనంగా విన్నాడు.నీ ఎలిబీ కోసం గురువారం రాత్రి మిత్రులతో భోజనానికి వెళ్ళడమో ఏదో చెయ్యి. ఆ తర్వాత మనం కష్టాల్లోంచి బయట పడ్డట్లే.

గురువారం పార్కర్ ఆఫీస్‌లో కొద్దిగా భయంగా గడిపాడు. ఆ రాత్రి తొమ్మిదికి ఫోన్ మోగితే రిసీవర్ అందుకున్నాడు. అది డాక్టర్ మిల్టన్ నించి. అతని భయం కొంత నిజమైంది. ఓ పొరపాటు జరిగింది. నీ సహాయం కావాలి డాక్టర్ కంఠం ఆందోళనగా వినిపించింది.ఏం పొరపాటు?అది ఫోన్‌లో చెప్పేది కాదు.మీరు ఎక్కడనుంచి ఫోన్ చేస్తున్నారు?క్యాబిన్‌నుంచి. సాధ్యమైనంత త్వరగా వచ్చి నన్ను క్యాబిన్‌లో కలువు.పార్కర్ తిరస్కరించాలని అనుకున్నాడు. అప్పటికే ఆ వ్యవహారం అతనికి లంపటంగా మారింది. కానీ, తను అందులో ఉన్నాడు కాబట్టి నో అనలేకపోయాడు.మీ క్యాబిన్‌కి ఎలా రావాలి? అడిగాడు.

మిల్టన్ క్యాబిన్ బాగా లోపలకి ఉంది. గంటసేపు కార్లో వెళ్ళాక ఆయన చెప్పిన మట్టిరోడ్‌లోకి హైవేమీంచి ఎక్కి అక్కడికి చేరుకున్నాడు. కారు ఇంజన్ ఆపి కొద్దిసేపు అందులోనే నిశ్శబ్దంగా కూర్చున్నాడు. డాక్టర్ కారు ఓ చోట పార్క్ చేసి ఉంది. క్యాబిన్ అతను అనుకున్న దానికన్నా చిన్నది.కారు దిగి చెక్క మెట్లెక్కి క్యాబిన్ పోర్చ్‌లోకి వెళ్ళాడు. డాక్టర్ తలుపు తెరచి అతన్ని చూసి నవ్వి చెప్పాడు.లోపలకి రా పార్కర్.ఆయన చేతికి సర్జికల్ గ్లవ్స్ ఉన్నాయి.ఎడెల్ ఓ కుర్చీలో కూర్చుని ఉంది. ఆమె కళ్ళు ప్రశాంతంగా మూసుకుని ఉన్నాయి. ఆమెలో క్లోరోఫాం పని చేస్తుందని అనుకున్నాడు. చుట్టూ చూస్తే ఆత్మహత్య లేఖ అద్దం మీద టేప్‌తో అతికించి ఉంది.మీరు ఫోన్‌లో ఏదో సమస్య ఉందన్నారు? పార్కర్ అడిగాడు.ఇంక లేదు డాక్టర్ నవ్వి చెప్పాడు.ఆమె ఎంతసేపు స్పృహలో ఉండదు?శాశ్వతంగా.పార్కర్‌ని దగ్గరకి తీసుకెళ్ళి ఎడెల్ నుదుటిమీది గుండు దిగిన రంధ్రాన్ని చూపించాడు.ఇది కూడా పథకంలో భాగమా? పార్కర్ అనుమానంగా అడిగాడు.డాక్టర్ మిల్టన్ కోటు జేబులోంచి చిన్న రివాల్వర్‌ను తీసాడు.ఎడెల్ తనని తాను కాల్చుకుంది. బుల్లెట్ రంధ్రం చుట్టూ పౌడర్, కాలిన గుర్తులు నువ్వు గమనించావా? పోలీసులు గమనిస్తారు.నిజంగా కాల్చుకుందా? లేక మీరు కాల్చారా?కాల్చుకుంది. ఎందుకంటే, నిన్ను పొందలేక పోయింది కాబట్టి.పార్కర్ అర్థం కానట్లుగా చూసాడు.నిన్ను చంపాక ఆమెలో పశ్చాత్తాపం కలిగి కాల్చుకుంది. నువ్వు, నా భార్య రహస్య ప్రేమమందిరానికి నీ కారులో వచ్చావు. ఎడెల్ ఆత్మహత్యా ఉత్తరం నీ ఇంట్లో నీ టైప్ రైటర్‌లో టైప్ చేశాను. నువ్వా గదిలో లేనప్పుడు ఆమె టైప్ చేసి ఉంటుందని పోలీసులు భావిస్తారు. నువ్వు ఇక్కడికి రాబోయే ముందు దాన్నే అద్దానికి అతికించింది.

పార్కర్ అయోమయంగా అద్దం దగ్గరకి వెళ్ళి దాన్ని చదివాడు.నేను, నా డార్లింగ్ పార్కర్ దూరంగా ఉండే కంటే కలిసి మరణించాలి. ఇది నా హృదయ పూర్వకమైన కోరిక. దీన్ని నేను నిర్వర్తిస్తున్నాను. డాక్టర్ చూపించిన ఎడెల్ సంతకం కింద ఉంది.డాక్టర్ ఓ తాళం చెవిని చూపించి చెప్పాడు.ఇది మీ ఇంటి తాళం చెవి. నీ ప్రియమైన లేటు భార్య లేసీ కొన్ని నెలల క్రితం దీన్ని నా కోసం తయారు చేయించింది. ఎలిబీ కోసం నిన్ను బయటికి పంపిన సమయంలో దీన్ని ఉపయోగించి నీ ఇంట్లోకి వెళ్ళి నీ టైప్ రైటర్‌లో దీన్ని టైప్ చేసాను. పోలీసులు ఈ తాళం చెవిని ఎడెల్ హ్యాండ్‌బ్యాగ్‌లో చూస్తారు. దీన్నించి నువ్వు తప్పించుకోలేరు.కొన్ని నిమిషాల క్రితం ఎడెల్ నిన్ను చంపాక ఈ ఉత్తరాన్ని అద్దానికి అతికించి తనని తను కాల్చుకుంది. నేను విడాకులు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో కాల్చుకుంది. దీనిని అందరూ అర్థం చేసుకోగలరు. గత నెల రోజులుగా నేను నా మిత్రులతో నా భార్యకి, నీకు అక్రమ సంబంధం ఉందని చెప్తున్నాను.డాక్టర్ గ్లవ్స్ చేతిలోని రివాల్వర్ రెండుసార్లు పేలింది. కిందపడ్డ పార్కర్ తల నేలకి బలంగా గుద్దుకుంది. అతనికి అస్పష్టంగా కనిపించిన ఆఖరి దృశ్యం డాక్టర్ వంగుని ఎడెల్ చేతిలో ఆ రివాల్వర్ ఉంచడం.

డాక్టర్ మిల్టన్ తన భార్య మరణం వల్ల కృంగిపోయనట్లుగా కనిపించాడు. అతని స్నేహితులు పార్కర్‌కి తగిన శాస్తి జరిగిందని ఓదార్చారు.మార్గరెట్, డాక్టర్ మిల్టన్ ఆ రాత్రంతా తన అపార్ట్‌మెంట్‌లో తనతో గడిపాడని చెప్పింది. అది అతని క్యారెక్టర్ కాబట్టి అంతా తేలిగ్గా నమ్మారు. డాక్టర్ పథకం ప్రకారమే అంతా జరిగింది ఒక్క చిన్న లోపం తప్ప.ఆశ్చర్యంగా మార్గరెట్ ఓ సమస్యని తెరమీదికి తెచ్చింది. ఆమెకి డాక్టర్ మిల్టన్ ఆస్తిలోని సగం కావాలి. అతను ఇంక ఎప్పటికీ పరాయి స్త్రీవైపు కన్నెత్తి చూడకూడదు. లేదా... ఈ సమస్య గురించి ఏదైనా చేయాలని డాక్టర్ ఆలోచించసాగాడు.
(జాన్ లట్జ్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

707
Tags

More News

VIRAL NEWS