ఒడి బియ్యం


Sun,December 15, 2019 02:14 AM

రాత్రి ఏడుగంటల సమయానికే ఊరు ఊరంతా దాదాపు నిశ్శబ్దంగా మారిపోయింది. పది సంవత్సరాల క్రితం వరకయితే ఈ సమయానికే ఊరు సందడిగా, అల్లరల్లరిగా ఉండేది. ఇప్పుడు అందరూ టీవీ సీరియల్లు చూడడానికై పొలాల నుండి ఆరు గంటలకే వచ్చేసి టీవీలకు అతుక్కుపోతున్నారు.ఆ ఊరిలోని తన ఇంట్లో యాదమ్మ ఒక్కతే కూర్చొని తను కూడా సీరియల్ చూస్తూందే కానీ మనసు మాత్రం జడ్చర్లకు వెళ్లిన భర్త సాంబశివుని రాకకోసం ఎదురుచూస్తున్నది. సీరియల్‌లోని సంభాషణలు చెవికెక్కడం లేదు, అవి బస్సు వస్తున్న శబ్దం వినడం కోసం అప్రమత్తంగా ఉన్నాయి.మరో పదినిమిషాల తర్వాత ఆమె నిరీక్షణ ఫలించింది. బస్సు వచ్చి ఆగి మళ్లీ కదిలి వెళ్లిన శబ్దం వినిపించింది. లేచి ఇంటి బయటకు వచ్చింది. అప్పటికే ఇంటి సమీపానికి వచ్చేశాడు సాంబశివుడు.మొహం వేలాడేసుకొని, నీరసంగా నడిచి వస్తూన్న భర్తని చూడగానే యాదమ్మ ప్రాణం ఉసూరుమంది. భర్త వెళ్లిన పని సఫలం కాలేదని అర్థమైపోయింది.పోయిన పని ఉత్తదైనట్లుందే ఆత్రుతను చంపుకోలేక అడిగింది యాదమ్మ భర్త చేతిలోంచి సంచిని అందుకుంటూ.
అవునన్నట్లుగా తల ఊపుతూ జీవం లేని నవ్వొకటి నవ్వాడు సాంబశివుడు.
Vadi-beeyam

పొద్దుగాలనంగ తిని పోయినవు, ఆకలయితుండొచ్చు, కాళ్లూ చేతులు కడుక్కొచ్చుకో పో, వడ్డిస్తా అవునే పచ్చినీళ్లు కూడా ముట్టలే. మస్తు ఆకలయితాంది.గా ఢిల్లీవాలా వోటల్ల పూరన్నా తిని రాగూడదా, అంత ఆకలితోని ఎందుకు మాడాలె ఈ పనికి పగటంబలన్నట్లు, ఎల్లిన పనే కానప్పుడు ఇరవై రూపాయలు పెట్టి పూరెట్ల తినబుద్దయితది అంటూ పెరట్లోకి వెళ్లి మొహం కడుక్కొని వచ్చాడు.పది నిమిషాల్లో భోజనం చేసి ఇద్దరు బయటకు వచ్చి అరుగు మీద కూర్చున్నారు. ఆకాశంలో అర్ధచంద్రుడు ఉండడం వల్ల చీకటి ప్రభావం అంత గాఢంగా లేదు. శ్రావణమాసం వచ్చి వారం దాటినా భారీవర్షాలు లేనందున వాతావరణం పొడిగానే ఉంది. పంటలు ఎండిపోతున్నాయనే ఆవేదన కంటే ప్రస్తుతానికి పదివేల రూపాయల అప్పు ఎవరిస్తారనే ఆలోచనే ఇద్దరి మనసులనూ తొలుస్తున్నది.వారికి ఇద్దరు సంతానం. అమ్మాయి మల్లిక పెద్దది. ఆయిదేళ్ల క్రితం పెండ్లిచేసి అత్తారింటికి పంపించారు. రెండవ సంతానమైన అబ్బాయి మహబూబ్‌నగర్‌లో పాలిటెక్నిక్ చదువుతున్నాడు.

పంతులు చెప్పిన మంచి రోజెప్పుడు.. మల్లికకు ఒడిబియ్యం పోయ్యనీకే ఓ పదిహేను రోజుల టైముందని తెలుసు కానీ ఖచ్చితమైన రోజు గురించి మర్చిపోయాడతను.ఇప్పుడొచ్చే అయితారంగాకుండా మళ్లొచ్చే అయితారం ఇయ్యాల బుధవారం, అంటే పదిహేను రోజులు కూడా లేదన్న మాట. ఎంతలేదన్నా ఈ శనివారమో అయితారమో పోయి మల్లికకూ అల్లునికీ పైసలిచ్చిరావాలెఅట్లియ్యకపోతే బట్టలు తెచ్చుకొని కుట్టించుకోనికే టైం సరిపోదుకదా అంది యాదమ్మ.తెలంగాణ ప్రాంతంలో ఆడపడచులకు పుట్టింటి నుంచి లభించే అపురూపమైన గౌరవం ఒడిబియ్యం. పెండ్లయిన ఒక సంవత్సరంలోపు ఈ ఒడిబియ్యం పెట్టిన తరువాత అయిదు, తొమ్మిది, పదకొండు సంవత్సరాలలోపు తప్పనిసరిగా పుట్టింటివారు ఈ ఒడిబియ్యం పెడుతారు.సాంబశివుడు, యాదమ్మ దంపతుల కూతురయిన మల్లికకు కూడా ఈ అయిదేళ్లలోపు ఒడిబియ్యంకు గడువు ఈ పదిహేను రోజుల్లో ముగిసిపోతుంది. అందుకే కొత్తబట్టలు పెట్టడం, దగ్గరి చుట్టాలకు భోజనాలు పెట్టడం లాంటి ఖర్చుల కోసం దాదాపు పదివేల రూపాయలు కావాలి. శ్రావణమాసంలో ఏ రైతు దగ్గరా అదనపు ఖర్చులకు డబ్బులుండవు. అలాగే సాంబశివుని దగ్గరా లేవు. ఆ డబ్బు అప్పుగా తెద్దామని తెలిసిన వారి దగ్గరా, జడ్చర్ల సేటు దగ్గరా నాలుగు రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ. ఫలితం శూన్యం.ఏమన్నడు సేటు, రేపటెల్లుండయిన ఇస్తన్నడా? తిరిగి యాదమ్మనే మాట్లాడింది, భర్త జడ్చర్ల వెళ్లిన సంగతి గురించి ఆరా తీస్తూ.కట్టెకొట్టినట్లు ఇయ్యనని చెప్పేసినాడే ఈడికే మన పాత బాకీ మిత్తితో శానా అయిందట. పదివేలు కాదు కదా అయిదు వేలు కూడా ఇయ్యనన్నాడు బదులిచ్చాడు సాంబశివుడు.మనకు ఎరువు సంచులు, చేన్ల మందులు ఇచ్చే రాంబాబును కూడా అడిగి చూడరాదూ, ఎట్లయిన అయితారం వారంకల్లా పదివేల రూపాయలు కావాలి మరిఅవునే మంచి ఐడియానే ఇచ్చినవు. రేపు మళ్లపోత జడ్చర్లకు అన్నాడు సాంబశివుడు.

అప్పుడే పక్కింటి గేటు తీసిన చప్పుడయితే ఇద్దరూ తల తిప్పి చూశారు. అది సాంబశివుడు తమ్ముడు నారాయణ ఇల్లు. నారాయణే గేటు తీసుకొని తన ఇంట్లోకి వెళ్తున్నాడు.ఏడికోయిండో మీ తమ్ముడు, ఇంత రాత్రప్పుడు వస్తున్నాడు సాలోచనగా అంది యాదమ్మ.వాడు కూడా నాలాగనే పైసల కొరకు తిరుగుతున్నట్లున్నడే. నేను సేటు షాపు నుండి బయటకు వస్తుంటే వీడు లోపలికి పోతున్నాడప్పుడుఎందుకయుంటదీ అంటూ ఓ అరనిమిషం పాటు ఆలోచించి వాళ్ల బిడ్డ సుమతికి కూడా ఒడిబియ్యం పోసే గడువు వచ్చిందనుకుంటా. ఎందుకంటే నిరుడు శావన మాసం ఎళ్లినంకనే పెండ్లి అయింది కదా అంది యాదమ్మ.సరిపోయింది అంటూ నవ్వాడు సాంబశివుడు.సరిగ్గా ఆ సమయంలో పక్కింటిలో నారాయణ భార్య అంజలమ్మ భర్తను అడుగుతున్నది సేటు పైసలిచ్చిండా అని. లేదన్నట్లుగా నారాయణ తల అడ్డంగా ఊపి జీవం లేని నవ్వొకటి నవ్వి ఆకలయితాంది, అన్నం పెట్టు అని పెరట్లోకి వెళ్లాడు.

ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ వ్యాపారం చేసే రాంబాబు దుకాణం బిజినేపల్లిలో ఉంది. జడ్చర్లకయితే ఆ ఊరి నుండి డైరెక్టు బస్సు ఉంది, కానీ బిజినేపల్లికి లేదు. అందుకే తిమ్మాజిపేట దాకా షేర్ ఆటోలో వెళ్లి అక్కడి నుండి బిజినేపల్లికి వెళ్లాలి.మరునాడు ఉదయం సాంబశివుడు కడుపునిండా అన్నం తిని మనసులోనే దేవునికి మొక్కుకొని బిజినేపల్లికి బయలుదేరాడు. ఓ గంటన్నర తరువాత అక్కడికి చేరుకున్నాడు.షాపు తెరిచే ఉంది. కానీ, రాంబాబు లేడు. ఓ కుర్రాడు కూర్చొని ఉన్నాడు. ఆ కుర్రాని మాటల ప్రకారం రాంబాబు మహబూబ్‌నగర్ వెళ్లాడట. మధ్యాహ్నం వరకు గాని రాడట.ఈసురోమని షాపు ముందరే కూర్చుండి పోయాడు సాంబశివుడు. మధ్యాహ్నానికి వస్తాడని చెప్పిన రాంబాబు రావడమైతే వచ్చాడు గానీ షాపుకు రాకుండా ఇంటికి వెల్లి భోంచేసి, హాయిగా నిద్రపోయి సాయంత్రం నాలుగు గంటల తరువాత వచ్చాడు.సాంబశివుడు అవసరాన్ని వివరించి గంటసేపు ప్రాధేయపడినా రాంబాబు మనసు కరగలేదు. డబ్బు ఇవ్వలేనని ఖరాఖండిగా చెప్పేశాడు.మళ్లీ మొహం వెళ్లాడేసుకొని కాళ్లీడ్చుకుంటూ బస్టాండుకు చేరుకున్నాడు. అతడు ఇల్లు చేరుకునేసరికి తన భార్య, తమ్ముని భార్యా తీవ్రంగా గొడవ పడుతుండడం కనిపించింది. శాతగాకున్నా బర్రెదూడని ఎందుకు పెంచుకోవాల్నో పెంచుకున్నోల్లు మంది చేన్లల్ల పడకుండా దగ్గరుండి మేపుకోవాలే అరుస్తున్నట్లుగా అంటున్నది యాదమ్మ.

మా బర్రె దూడని చూసినప్పుడల్లా కండ్లల్ల నిప్పులు పోసుకుంటవు కద తల్లీ నీవు. ఎంత బస్టుదానవే. నా మొగడు ఊల్ల లేడు కాబట్టి తప్పిపోయి నీ చేన్ల రెండు మొక్కల్ని కొరికిందేమో. గాయింతదానికి నీ సొమ్మంత తిన్నట్లు అరుస్తున్నవేంది తోడికోడలికన్నా ఎక్కువ గొంతుతో జవాబిస్తున్నది నారాయణ భార్య అంజలమ్మ.గొడవకి కారణం తెలిసిపోయింది సాంబశివునికి. తన తమ్ముడు నారాయణకున్న ఒక బర్రెదూడ తమ మొక్కజొన్న చేన్లో పడి కొన్ని మొక్కల్ని తినేసింది. అది చూసిన వాళ్లెవరో యాదమ్మ చెవిన ఊదేసి వెళ్లారు. ఇంకేముంది, అసలే తోడికోడళ్లిద్దరి మధ్యా పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది.

రెండు మొక్కలు కాదంట తల్లీ, ఓ పెద్దమడంత సేను మేసిందంట.ఎవరో చెప్పిన మాటలు విని నోటికొచ్చినట్లు మాట్లాడకమ్మా.. అంటూ ఇంకా ఏదో అనబోయిన అంజలమ్మ బావ సాంబశివుని రాకను చూసి యుద్ధాన్ని మధ్యలోనే ఆపేసి గబాలున లోపలికి వెళ్లిపోయింది.తన భర్తకు తోటికోడలు ఆ మాత్రం గౌరవం ఇచ్చినందుకు యాదమ్మ మనసు కొంత శాంతించింది.చిన్న చిన్న విషయాలకు బజారుకెక్కుతరేందే మీరు అని భార్యపైన విసుక్కుంటూ ఇంట్లోకి వెళ్లాడు సాంబశివుడు. తప్పు దాని దిక్కున పెట్టుకొని మాటకు మాట అంటున్నది చూడు, ఆ టెంపరుముండ అంటూ భర్తను అనుసరించింది.ఆ రాంబాబు కూడా ఉత్తిచేయి చూయించిండే భార్య అడగక ముందే తనే చెప్పాడు.అయ్యో భగవంతుడా మళ్లెట్టా దిగులుగా అంది. నీవన్నట్లు ఆ దేవుడే దిక్కు ఇంక మనకు. ఇంక మూడు రోజుల టైముంది. అంతదాక ఏదయిన తొవ్వ చూపిస్తడేమోఅప్పుడే పక్కింటి గేటు చప్పుడయింది. నారాయణ కూడా నీరసంగానే ఇంట్లోకి ప్రవేశించాడు.అంజలమ్మకు స్పష్టంగా తెలిసిపోయింది. ఈ రోజు కూడా భర్త వెళ్లిన పని సానుకూలం కాలేదని.

షాద్‌నగర్‌లో ఉండే నారాయణ బావమరిది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. తనెన్నడు అతన్ని చేయిచాచి అడగలేదు. కాబట్టి తనడిగిన డబ్బు తప్పక ఇస్తాడని ఎంతో ఆశతో వెళ్లాడు. కానీ, లాభం లేకపోయింది. ఏవో కారణాలు చెప్పి తప్పించుకున్నాడా బావమరిది.అయ్యోదేవుడా, ఏదయిన తొవ్వ చూపించు సామీఅవునింక మనకు ఆ దేవుడే దిక్కుఆ తరువాత తమ బర్రెదూడ వల్ల తోడికోడలుతో జరిగిన గొడవ గురించి చెప్పింది అంజలమ్మ భర్తతో.నేను పొద్దుగాల షాద్‌నగర్‌కు పోయేముందు గట్టిగనే గుంజకు కట్టేసి పోయిన, ఎట్ల ఇడుసుకున్నదో మరి. ఇయ్యాల జరిగిన దాంతోని ఈడికి మూడుసార్లాయే ఈ బర్రెదూడ వల్ల మా వదినతోని మాటలు పడడం.అవునవును అంది అంజలమ్మ.

మరునాడు, శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వంట చేస్తున్న యాదమ్మకు ఓ యాదక్కా అనే పిలుపు వినబడడంతో బయటకు వచ్చింది. రెండు వీధుల అవతల ఉండే శాంతమ్మ నిలబడి ఉంది.ఏంది శాంతక్కా, ఇట్లొచ్చినవు?గోవర్థన్‌రెడ్డి పటేలు బిడ్డకు తొలిసారె పెడ్తున్నరు. నిన్ను మీ యారాల్ని భోజనానికి రమ్మని చెప్పమంది పటేలమ్మగోవర్థన్‌రెడ్డి పొలాన్ని శాంతమ్మ కుటుంబం కౌలుకు చేస్తున్నది.ఆల్ల బిడ్డకు పెండ్లయి అప్పుడే యాడాదాయనా? అని ఆశ్చర్యం ప్రకటించి.. నేనయితే వస్తగానీ మా యారాలు సంగతి నన్నడగకు. దానికీ నాకూ మాటల్లేవు విసురుగా అంది యాదమ్మ.నీవయితే పదకొండు గంటల వరకల్లా రా. అంజలమ్మకు నేను చెప్తలే అంటూ పక్కింటికి వెళ్లిపోయింది శాంతమ్మ. భోంచేసి సాంబశివుడు మళ్లీ అప్పు వేటకు వెళ్లిపోయిన తరువాత గోవర్థన్‌రెడ్డి ఇంటికి బయలుదేరింది యాదమ్మ.ఆమె వెళ్లేసరికి చాలామంది ముత్తయిదువలు వచ్చి కూర్చొని ఉన్నారు. అంజలమ్మ కూడా అప్పటికే వచ్చి ఉంది. కూర్చున్న వారి పాదాలకు ఒకామె పసుపు రాస్తున్నది.

గోవర్థన్‌రెడ్డి జడ్చర్లలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బాగా సంపాదించాడు. కూతురి పెళ్లికి ముందే బ్రహ్మాండమయిన ఇల్లు కూడా కట్టుకున్నాడు.పెండ్లి తరువాత కూతురికి పెడుతున్న ఒడిబియ్యం కాబట్టి అంగరంగ వైభవంగా చేస్తున్నాడు. అమ్మాయి అత్తగారింటి వాళ్లతో బాటు తన బంధువులను కూడా పిలుచుకున్నాడు కాబోలు ఇల్లు బంధుజనంతో కిటకిటలాడుతూ కళకళ్లాడుతున్నది.హాలులో చాపలు పరచి మధ్యలో రెండు పీటలు వేశారు. కూతురూ, అల్లుడూ కూర్చోవడానికి ఎదురుగా పసుపు కలిపిన బియ్యంతో పాటు అందంగా అలంకరించిన సారెపెట్టే, ఫలహారాల బుట్టలూ, శుభప్రదమైన పసుపు కుంకుమా, కొబ్బరి గిన్నెలూ తమలపాకుల లాంటి వన్నీ ఉన్నాయి.గోవర్థన్‌రెడ్డి దంపతులు మొదట కూతురూ అల్లుడికీ కొత్త బట్టలు పెట్టారు. నవదంపతులు కొత్తబట్టలు ధరించి రాగానే తొలుత గోవర్థన్‌రెడ్డి భార్య కూతురికి ఒడిబియ్యం పోయడం ప్రారంభించింది. అందుకు అయిదు దోసిల్ల బియ్యం అమ్మాయి ఒడిలో పోయాలి. తొలి దోసిలి కొబ్బరి గిన్నెలు రెండు తమలపాకులు, వక్కలు కలిపిన బియ్యంతో పోసి, రెండవ దోసిలి ఒక రూపాయి నాణెంతో పోసింది. మూడవ దోసిలి దానిమ్మపండుతో పోస్తే నాలుగవ దోసిలి బియ్యం ఎండు ఖర్జూర పండుతో కలిపి పోసింది. అయిదో దోసిలి బియ్యం వెల్లుల్లిగడ్డతో పోసింది.

ఆమె తరువాత మరో నలుగురు ముత్తయిదువలు అలాగే ఒడిబియ్యం పోశారు.ఇదంతా యాదమ్మ కళ్లార్పకుండా చూస్తున్నది. ముఖ్యంగా ఆ అమ్మాయి కట్టుకున్న చీర చూస్తుంటే యాదమ్మకే కాదు అక్కడున్న వాళ్లందరికీ కండ్లు చెదిరాయి. పదివేలపైనే ఉంటుందీ చీర అనుకుంటూ ఎంతయినా డబ్బున్న మా రాజులు అని నిట్టూర్చింది.తొలిసారె తరువాత ప్రతి అయిదేండ్లకోమారు ఒడిబియ్యం ఇంటి ఆడపడచుకు పెట్టడం తెలంగాణ సంస్కృతిలో భాగం. అదేగాక పుట్టింటి వారింట్లో పెండ్లిళ్లు అయినప్పుడు కూడా ఈ ఒడిబియ్యం ఇంటి ఆడపడచుకు పెడతారు. అలాగే అమ్మాయి నూతన గృహప్రవేశం చేస్తున్నప్పుడు కూడా పుట్టింటివారు ఒడిబియ్యం పోయడం అనేది ఆనవాయితీ. అ అయిదేండ్లలోపు లెక్క అనేది ఏ సందర్భంలో పెట్టినా, చివరిసారిగా పెట్టినప్పుటి నుండే ప్రారంభమవుతుంది.

ఒడిబియ్యం పెట్టుకున్న అమ్మాయి అత్తారింటికి వెళ్లి మంచిరోజు చూసుకొని, అత్తారింటి వారు ఆ బియ్యాన్ని వండి అందరికి విందు భోజనం పెడతారు. ఓ ఆడపిల్ల పసుపు కుంకాలతో పిల్లా పాపలతో సంతోషంగా కాపురం చేయాలనే పుట్టింటి వారి ఆకాంక్షల వల్ల ఏర్పడింది ఈ ఆచారం. గోవర్థన్‌రెడ్డి ఇంట్లో కూతురికి ఒడిబియ్యం కార్యక్రమం పూర్తయింది. ముగింపుగా మంగళహారతి పాట పాడాలి. పాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నీవు పాడు, నీవు పాడు అని ప్రతి ఒక్కరూ పక్కవాళ్లతో అంటున్నారు.
ఒకామె ధైర్యం చేసి వచ్చి పాడింది. కానీ, ఆమె ఏమి పాడిందో పక్కనున్నామెకు కూడా వినిపించలేదు. మరొకామె కీచుగొంతుతో ఏదో పాడింది. కానీ, ఎవరికీ అర్థం కాలేదు ఆమె ఏమి పాడిందో.ఇంకా బాగా పాడే వాళ్లెవరూ లేరా? అడిగారెవరో, యాదమ్మకు ఇక ఊరుకో బుద్ధికాలేదు. తల్లి దగ్గర తను చిన్నప్పుడు నేర్చుకున్న పాట జ్ఞాపకం వచ్చి ముందుకు వెళ్లింది.హారతి గైకొనుమా.. సీతమ్మ తల్లీ.. మంగళ హారతి గైకొనుమా.. సీతమ్మ తల్లీ.. ఒడినిండి నీకు వరాలు కురువంగా..ఆమెది శ్రావ్యమైన స్వరం కావడంతో అందరికీ పాట వినబడీ, అర్థమయీ మంత్రముగ్ధులైపోయారు. పాట పూర్తవగానే అందరూ అప్రయత్నంగా చప్పట్లు కొట్టి మెచ్చుకుంటుంటే నిజంగానే సిగ్గుపడింది యాదమ్మ.విందు భోజనాలు పూర్తయి అందరూ వెళ్లిపోవడం ప్రారంభించారు. యాదమ్మ బయటకు వస్తుంటే సురేందర్‌గౌడ్ భార్య భాగ్యమ్మ వచ్చి కలిసింది. తను రావడమేగాకుండా రావే అంజలమ్మ నేను అంటువైపే వస్తున్నా, కలిసిపోదాం అంటూ అంజలమ్మను కూడా కలుపుకొంది భాగ్యమ్మ.

యాదమ్మా మంగళహారతి పాట భలేబాగా పాడినవురా అంది భాగ్యమ్మ.ఏదో సిన్నప్పుడు నేర్చుకున్నది పాడినగాని అందరు ఇంత మెచ్చుకుంటరనుకోలేరేపు మా కోడలు ఒడిబియ్యం పెట్టుకొస్తున్నది. ఎల్లుండి అయితారం వండుతున్నం. మీరిద్దరు యారాల్లు తప్పకుండా రావాలే ఆహ్వానించింది భాగ్యమ్మ.వస్తంలే అక్కా అని ఇద్దరూ ఒప్పుకున్నారు.భాగ్యక్కా నీ బిడ్డకు నిరుడు మా సుమతి పెండ్లికంటే ముందే పెండ్లి జేస్తివి. మరి తొలిసారె పెట్టినవా అడిగింది అంజలమ్మ.పోయిన్నెలనే పెట్టేదుండే కానీ అప్పటికే నెల తప్పినట్లు తెలిసింది. అందుకే పెట్టలే. మల్లి కన్నంక ఏడాది లోపల ఒడిబియ్యం పోయ్యాలెఅయితే అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు ఒడిబియ్యం పోయగూడదా అక్కా అడిగింది అంజలమ్మ.అవును, పోయగూడదు అంటూ ఆగి నేనిట్ల పోత, మీరిద్దరూ ఎల్లుండి మధ్యాహ్నం మరచిపోకుండా రండి అని మరోసారి ఆహ్వానించి పక్కకు మళ్లిపోయింది భాగ్యమ్మ. తోటికోడళ్లిద్దరూ కలిసి ముందుకు నడక కొనసాగించారే గానీ ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంది.నిజంగానే నీవు శాన బాగా పాడినవక్కా నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ మెచ్చుకుంటూ మాట కలిపింది అంజలమ్మ. నీక్కూడా నా పాట నచ్చిందా, అయితే మీ సుమతికి రేపటెల్లుండి ఒడిబియ్యం పోస్తవు కద, నేనొచ్చి మంగలారతి పాట పాడ్తలే నవ్వుతూ అంది యాదమ్మ. ఇన్ని రోజులుగా కొట్లాడుతూ ఎడమొగం పెడమొగంగా ఉన్న తోటికోడలు మాటలు కలిపేసరికి ఉప్పొంగిపోయి, నిండు మనసుతో మాట ఇచ్చేసింది.ఏమో అక్కా, సుమతికి ఈ పదిహేను రోజుల్లోనే ఒడిబియ్యం పొయ్యాలెగాని పైసలు లేవు. మీ మరిది రా గాడిదీ పో గాడిదీ లాగ తిరుగుతున్నడు గానీ పైసలెవరిస్తలేరు. ఎట్లయితదో ఏమో విచారంగా అంది అంజలమ్మ.మా మల్లికకు కూడా ఈ అయితారం గాకుండా మల్లొచ్చే అయితారం ఒడిబియ్యం పొయ్యాలని పంతులు సెప్పిండు. మీ బావ కూడా రోజూ ఈ ఊరికి ఆ ఊరికి తిరుగుతున్నడు గానీ ఉత్త చేతులూపుకంటునే వస్తున్నడు ఏం జేయాల్నో ఏమో నిరాశానిస్పృహలు నిండిన స్వరంతో దిగులుగా అంది యాదమ్మ.ఫికరు చేయకక్కా, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నడు తోటికోడలికి ధైర్యం చెప్పింది అంజలమ్మ.తమ మధ్య మాటలు కలిసినవన్న ఆనందం ఆ ఇద్దరి మనసుల్ని తేలికపరచడంతో కించిత్తు ఆనందంతో తమ తమ ఇళ్లకు చేరుకున్నారు వారివురు.

ఆదివారం ఉదయం పదిగంటలవుతుండగా సాంబశివుడూ యాదమ్మా ఇంటి బయట అరుగుపై కూర్చొని ఉన్నారు. డబ్బు దొరక్కపోవడంతో మనసు బాగోలేక వంట కూడా చేయాలనిపించడం లేదామెకు.ఉన్న రెండు తులాల బంగారం బ్యాంకుల పెడ్తిమి. ఇంక ఎక్కడి నుంచి తెస్తం పైసలు విచారంగా అన్నది యాదమ్మ.అవునే అదే సమజయితలేదు దిగులుగా ఆకాశం వంక చూస్తూ అన్నాడు సాంబశివుడు.పరిష్కార మార్గమేదీ తోచక శూన్యంగా తయారయిన మనసులతో మౌనంగా ఆ దంపతులిద్దరూ అలానే కూర్చుండిపోయారు.

ఓ పదినిమిషాల తరువాత ఏదో అలికిడయితే ఇద్దరూ తలలు తిప్పి చూశారు. ఒక్క క్షణం పాటు ఆశ్చర్యచకితులయ్యారు. వస్తున్నది నారాయణా అంజలమ్మ దంపతులు!తమ కూతురికి ఒడిబియ్యం పోస్తున్నామని చెప్పి ఆహ్వానించడానికి వస్తున్నారేమోననే ఆలోచన వీళ్లిద్దరిలోనూ కలిగింది.రా, రా.. నారాయణా అంటూ తమ్మున్ని ఆహ్వానించాడు. తోటికోడల్ని చూసి యాదమ్మ కూడా మొహం మీదికి చిరునవ్వుని తెచ్చుకుంది. నారాయణయితే అన్న పక్కన కూర్చున్నాడు. కానీ, అంజలమ్మ మాత్రం బావ ముందు అరుగుపై కూర్చోవడానికి మొహమాటపడి యాదమ్మ పక్కన నిలబడిపోయింది. మల్లికకు బియ్యం పోయడానికి పైసల కొరకు తిరుగుతున్నవంట, మీ మరదలు చెప్పింది. మరి దొరికినయా? అడిగాడు నారాయణ అన్నను.లేదురా, దొరుకలే. అదే ఫికరు జేసుకుంట ఇట్లా కూసున్నం. ఏం జేయాల్నో సమజయితలేదుఇవిగో అన్నా, ఈ పన్నెండు వేలు తెచ్చిన తీసుకో అంటూ నారాయణ తన జేబులోంచి డబ్బుతీసి అన్న చేతికి అందించాడు.ఒక్క క్షణం అక్కడ కాలం స్తంభించి పోయినట్లుగా, అది కలా, నిజమా అన్నట్లుగా, ఎవరో దేవతలు తమ మీద పూలవాన కురిపిస్తున్నట్లుగా, జీవితంలో ఎన్నడూ చూడని ఏదో అద్భుత దృశ్యాన్ని చూస్తున్నట్లుగా, ఎన్నడూ వినని శ్రావ్యమైన సంగీతమేదో వినిపిస్తున్నట్లుగా సాంబశివుడు దంపతులు సంభ్రమాశ్చర్యాలకు లోనయి నిర్విణ్ణులయ్యారు.ఓ నిమిషం తరువాత తేరుకొని నీవు కూడా నా లెక్కనే పైసల కొరకు తిరుగుతున్నవని మీ వదిన చెప్పింది. మరి నీకెవరు ఇచ్చినార్రా? ఆశ్చర్యంగా అడిగాడు సాంబశివుడు.

మనలాంటోల్లకు ఎవరిస్తరన్నా, ఎవ్వరియ్యలే. అందుకే మా బర్రెదూడను నిన్న శనివారం కావురం పేట సంతకు తీస్కపోయి అమ్మినఈ మాటతో యాదమ్మయితే మరీ నిర్ఘాంతపోయింది. కించిత్తు సిగ్గుపడింది కూడా. తమ చేన్లో పడి మేసిందని ఆ బర్రెదూడ కోసం అంజలమ్మతో మూడు నాల్గుసార్లు జగడం చేసింది. అదే బర్రెదూడను అమ్మి వచ్చిన డబ్బును తమకు సహాయంగా ఇస్తున్న అంజలమ్మ దంపతుల ముందు తలెత్తుకోలేకపోతున్నది యాదమ్మ.మరి మీ సుమతికి కూడా ఒడిబియ్యం పొయ్యాలంట కదా, బర్రెదూడకు అంత ఎక్కువ డబ్బు వచ్చి ఉండదు కదామా సుమతి నెల తప్పిందంట బావా. రాత్రి ఫోన్ చేసి చెప్పింది. కడుపుతో ఉన్నప్పుడు ఒడిబియ్యం పోయగూడదంట అంది అంజలమ్మఇక యాదమ్మ తట్టుకోలేకపోయింది. గబాలున లేచి అంజలమ్మను కౌగిలించుకొని ఎంత పెద్ద మనసు సెల్లా నీది, నేనే బస్టుముండను, నన్ను చమించు. నీ కాళ్లు మొక్కి నా కండ్లనీళ్లతో కడగాలనుంది. కానీ, నీవు నా కన్నా చిన్నదానివయినవు.. గొంతు గద్గదమయి ఆమెకు ఇక మాటలు పెగల్లేదు. కండ్లు మాత్రం వర్షిస్తున్నాయి. అటువైపు సాంబశివుని పరిస్థితి కూడా దాదాపు తన భార్య పరిస్థితిలానే ఉంది. ఉబికి వస్తూన్న కన్నీటిని ఆపుకొంటూ తమ్ముని చేతులు తన చేతుల్లోకి తీసుకొని కృతజ్ఞతాపూర్వకంగా తన ఎదకేసి హత్తుకున్నాడు.నారాయణా అంజలమ్మల దంపతులకు కూడా కండ్లు చెమ్మగిల్లాయి. సంతోషకరమైన సంతృప్తితో అంతవరకు ఆనుభవంలోకి రాని అనిర్వచనీయమైన ఆనందం కూడా వారికప్పుడు కలిగింది.

రచయిత పరిచయం

గంగుల నర్సింహారెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విశ్రాంత ఉద్యోగి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని వెదిరేపల్లి ఈయన గ్రామం. హైదరాబాద్‌లో చదువుకున్నారు. ఎస్‌బీఐలో క్లర్క్‌గా చేరి ఆఫీసర్ స్థాయి ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. అభిరుచిగా రచనలు చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ కథలు, నవలలు రాశారు. ఈయన రాసిన 20 కథలు వివిధ పోటీల్లో బహుమతులు అందుకున్నాయి. మూడు నవలలకు స్వాతి మాసపత్రిక ప్రథమ బహుమతి ఇచ్చింది.

-గంగుల నరసింహారెడ్డి,సెల్: 90102 84700

1124
Tags

More News

VIRAL NEWS