విద్యార్థులకు అండగా కస్తూరి ఫౌండేషన్


Sun,December 15, 2019 02:00 AM

ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులంతా కార్పొరేట్ స్కూల్‌బాట పడుతున్నారు. వందలాదిగా ఉండే విద్యార్థులు పదులసంఖ్యకు చేరారు. ఇలా అయితే ఊరికొకటి ఉన్న స్కూల్స్ ఏమవ్వాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరికి చదువు చెప్పాలని గగ్గోలు పెడుతున్న తరుణంలో కొప్పోలులోని పాఠశాల మాత్రం విద్యార్థులతో కళకళలాడుతున్నది. అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు గ్రామస్తుల సహకారం తోడవడంతో పాఠశాలలో ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. ఈ ఏడాది ఏ ప్రాథమిక పాఠశాలలో లేని విధంగా 185 మంది విద్యార్థులతో ప్రథమస్థానంలో నిలిచింది. దీనికి కారణం కస్తూరి ఫౌండేషన్ అంటున్నారు శ్రీచరణ్.

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. కానీ, శ్రీ చరణ్ మాత్రం విద్యాదానం గొప్పదంటారు. విద్యాబోధన చేయకున్నా విద్యనభ్యసించేవారికి కావాల్సిన సదుపాయాలు అందించడం కూడా గొప్పపనే అంటున్నారు. పోయేటప్పుడు సంపాదించినదంతా మూటకట్టుకొని పోలేరు కదా! బతికినంత కాలం నలుగురికి సాయం చేస్తే పుణ్యం మూటకట్టుకోవచ్చని నమ్మే వ్యక్తి ఆయన. సరస్వతీ కటాక్షం ఉన్న లక్ష్మీ కరుణలేని నిరుపేద విద్యార్థులను చూసి చలించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు స్థాపించి ఆర్థికంగా స్థిరపడ్డ నల్గొండ జిల్లా కొప్పోలుకు చెందిన కస్తూరి శ్రీచరణ్ 2017లో కస్తూరి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. దీనితో ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు.
KasthuriFoundation

ఒకవైపు శ్రీగాయత్రి విద్యాసంస్థలో ఉద్యోగం చేస్తూ తన స్నేహితులతో కలిసి కస్తూరి పౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇందులో తనతోపాటు బాల్యంలో చదువుకొని ఇదే లక్ష్యంతో ఉన్న సుమారు ఇరవైమంది స్నేహితులను సభ్యులుగా చేర్చుకున్నారు. పేదవిద్యార్థులకు ప్రోత్సహక కార్యక్రమాలు చేపడితే మెరికల్లాంటి చురుకైన విద్యార్థులను తయారు చేయవచ్చని భావించారు. అదే తడవుగా కొంత డబ్బు సేకరించి నల్గొండ జిల్లాలో గత ఫ్రిబ్రవరిలో పదోతరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న 5వేల మంది విద్యార్థులకు సుమారు రూ. 20 లక్షల వ్యయంతో స్టడీ మెటీరియల్ అందజేశారు. లక్ష్యం మంచిదైతే నిధులు అవే వస్తాయి. అదేం అంత సమస్య కాదంటున్నారు.

చేపట్టిన కార్యక్రమాలు

శ్రీచరణ్ ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు చేపట్టారు. లచ్చమ్మగూడెంలో విద్యార్థులకు రాత పుస్తకాలు, షూ, టై, బెల్టుతోపాటు పాఠశాలకు 75 డెస్క్‌లు, బెంచీలు, కుర్చీలు, ఫ్యాన్లు అందజేశారు. 2017-18 ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు ముందుగా స్టడీమెటీరియల్, పరీక్ష సామగ్రిని అందజేశారు. రెండేండ్ల క్రితం 10 జీపీఏ సాధించిన 13 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల రోజున ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున నల్గొండలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ చేతులమీదుగా చెక్కులను అందజేశారు. పోయిన ఏడాది 86లో 36 మందికి ప్రధానం చేశారు. ఆ తర్వాత కొప్పోలు ప్రభుత్వ స్కూల్‌లో తరగతి గదులకు మరమ్మతులతోపాటు డెస్క్‌బెంజీలు, ప్రొజెక్టర్, విద్యార్థులకు బ్యాగులు, టై, బెల్టూ, నోట్‌బుక్స్, హైస్కూల్‌లో స్టేజీ నిర్మాణ పనులను చేయించారు. తేరట్‌పల్లి పాఠశాలలకు ప్రొజెక్టర్, విద్యార్థులకు షూ, టైబెల్టు, రాతపుస్తకాలు, మధ్యాహ్న భోజనం ప్లేట్లు అందజేశారు. రాచకొండ పాఠశాలకు డెస్క్‌బెంచీలు, ప్రొజెక్టర్, ప్లేట్లు, రాతపుస్తకాలు, మైక్‌సెట్ అందజేశారు. యాదాద్రి జిల్లా ఆత్మకూర్ జడ్పీ ప్రాథమిక పాఠశాలకు డెస్క్‌బెంచీలు, స్టడీ మెటీరియల్ అందజేశారు. చోటుప్పల్ మండలం పతంగి పాఠశాలకు ప్రొజెక్టర్, విద్యార్థులకు రాత పుస్తకాలు అందజేశారు. వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్ష రాసే దాదాపు 6 వేల మంది విద్యార్థులకు అభ్యాసన సామగ్రి పంపిణీ చేశారు. పలివెల జడ్పీ ఉన్నత పాఠశాలలో స్టడీ హాల్‌లో కిటికీలు, విద్యుత్తు సదుపాయం. గదులకు రంగులు, 70 స్టడీ కుర్చీలు అందజేశారు.
KasthuriFoundation1

నా లక్ష్యం..

ఒకరితో మొదలైన సంస్థకు కొంతమంది ఫ్రెండ్స్ తోడైనారు. ఫండ్స్ వస్తున్నాయి. వాటితో ప్రాథమిక పాఠశాలల పురోగతిని మార్చుతున్నాను. ఎన్జీఓ ద్వారా కనీసం 100 ప్రభుత్వ ప్రాథమిక స్కూల్స్‌ను మోడల్ స్కూల్స్‌గా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. విద్యార్థులు.. అబ్బా! గవర్నమెంట్ స్కూల్‌కి వచ్చామా అన్న ఆలోచన రాకుండా చేయాలనుకుంటున్నాను. పూర్తిగా డిజిటల్ క్లాస్‌రూమ్స్, ఫ్యాన్స్, ట్యూబ్‌లైట్లు అందివ్వాలి. నల్గొండ జిల్లాలో కొన్ని స్కూల్స్‌ను మార్చాం. ఇక్కడి నుంచి మొదలై తెలంగాణ మొత్తం కస్తూరి ఫౌండేషన్ వ్యాపించాలి. ప్రతి క్లాస్ రూంకు 12 నేషనల్ లీడర్స్ ఫొటోలు అందిస్తున్నాం. స్టూడెంట్స్ వీరిని ఆదర్శంగా తీసుకోవడంతోపాటు స్కూల్‌లో జరిగే ఫంక్షన్‌లకు ఇవి ఉపయోగపడుతున్నాయి. ఈ విధంగా ఫొటోలను 500 స్కూల్స్‌కు ఇచ్చాం. వారంలో రెండురోజులు సంస్థకోసం పనిచేస్తాను. అవసరం అయితే లీవ్ పెట్టుకుంటాను. మాది నల్గొండ. నాకు ఇద్దరు పిల్లలు. ఇంటిపేరు కస్తూరినే ఫౌండేషన్‌కు పెట్టాను.
ఫౌండేషన్ వివరాల కోసం https://www. facebook.com/ Kasturifoundation/.

ఫేస్‌బుక్ ద్వారా..

నా పేరు మౌనిక. రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలానికి చెందిన నాకు ఉన్నత చదువు కొసం రూ. 17,700 ఇచ్చారు. తండ్రి కొంతకాలం క్రితం చనిపోయాడు. తల్లి కూలిపని చేస్తుంది. నేను గ్రూప్-2 కోచింగ్ కోసం ఎంతోమందిని సాయం అడిగాను. ఎవరూ స్పందించలేదు. అప్పుడే నాకు ఫేస్‌బుక్‌లో కస్తూరి ఫౌండేషన్ గురించి తెలిసి మెసేజ్ చేశాను. వెంటనే ఫౌండేషన్ చైర్మెన్ శ్రీచరణ్ సర్ స్పందించి చదువుకు కావాల్సిన డబ్బును చెక్కు రూపంలో అందజేశారు.
- మౌనిక, విద్యార్థి

-సరస్వతి వనజ

492
Tags

More News

VIRAL NEWS