నిప్పుకోసం వెతుకులాట


Sun,December 15, 2019 01:50 AM

సూరదాసు ఆ గ్రామానికి కాపలాదారు. రాత్రిళ్ళు ఆ గ్రామంలో తిరుగుతూ చేతికట్టెను కొట్టి శబ్దం చేస్తూ దొంగల భయం లేకుండా కాపలా కాసేవాడు. సూరదాసు ఎప్పుడూ తప్పనిసరిగా తన డ్యూటీ చేస్తాడని కాదు, నిద్ర రానప్పుడు చేస్తాడు. లేదా డ్యూటీ చేస్తూ మధ్యలో ఎక్కడో ఒకచోట కూర్చొని కునుకు కూడా తీస్తాడు.అది చలికాలం. ఎవరికైనా వెచ్చగా దుప్పటి కప్పుకుని ముడుచుకొని పడుకోవాలనే ఉంటుంది. సూరదాసుకు కూడా అటువంటి కోరికే ఉంది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఆ ప్రాంతం జమిందారు ఆ గ్రామానికి వచ్చి విడిది చేశాడు.
Marmika

అందుకని చలికాలమైనా డ్యూటీ చెయ్యాల్సి వచ్చింది.జమీందారు జమాబందీ చూసుకోవడానికి వచ్చాడు. అట్లాగే గ్రామంలో పేదవాళ్ళకు ఆయన ఉన్నన్నాళ్ళూ అన్నదానం కూడా చేస్తాడు.కాపలాదారుకు హుక్కా తాగే అలవాటుంది. తనతో పాటు హుక్కా మోసుకెళతాడు. హుక్కాలో పొగాకు దట్టించాడు. ఇక నిప్పుపెట్టి పీల్చడమే తరువాయి. జేబులు తడుముకున్నాడు. అగ్గిపెట్టే లేదు. రాత్రి పదిగంటలు కావస్తున్నది. గ్రామం కాబట్టి అందరూ నిద్రపోయారు.సూరదాసు నిప్పు ఎట్లా సంపాదించాలి? అన్న ఆలోచనలో పడ్డాడు. దగ్గరే ఒక ముసలావిడ ఉంటుంది. ఆవిడ గుడిసెకు వెళ్ళి అడుగుదామనుకున్నాడు.వెళ్ళి తలుపు తట్టాడు. ఒక వృద్ధురాలు తన వెదురు తలుపు తీసి సూరదాసును చూసి గుర్తుపట్టి ఏం కావాలి సూరదాసు? అని అడిగింది.సూరదాసు అవ్వా! నేను హుక్కా పీల్చాలి. సమయానికి నా దగ్గర అగ్గిపెట్టె లేదు. కాస్త నిప్పుంటే ఇస్తావా? అని అడిగాడు.ముసలావిడ నాయనా! నేను పొయ్యి వెలిగించి చాలా రోజులయింది. పైగా జమిందారు అన్నదానం చేస్తున్నాడు కదా అక్కడికి వెళ్ళి భోంచేసి వస్తున్నా. కొన్నిసార్లు గుడిలో పెట్టే ప్రసాదంతో కడుపు నింపుకుంటున్నా. అందువల్ల ఎప్పుడో కానీ పొయ్యి మంటెయ్యను అంది.

సూరదాసు పక్కింటికి వెళ్ళి తలుపుతట్టి నిప్పు అడిగాడు. పక్కింటతను. అయ్యో! వంటచేసి మా ఆవిడ నిప్పుల మీద నీళ్ళు చల్లేసింది. అగ్గిపెట్టె లేక పక్కింట్లో నిప్పును అరువు తెచ్చుకుంది అన్నాడు.సూరదాసు ఆ పక్కింటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఎంతకొట్టినా ఎవరూ తలుపు తియ్యలేదు. జమీందారు అన్నదానం చేసే విడిది గృహం దగ్గర తప్పక తనకు నిప్పు దొరుకుతుందని అక్కడికి వెళ్ళాడు. అక్కడ చాలామంది మేలుకునే ఉన్నారు. జమీందారు మేనేజరు కూడా ఉన్నాడు. సూరదాసు మేనేజరుకు నమస్కరించి స్వామీ! ఇంకా పడుకోలేదా? అన్నాడు.చాలా పనులున్నాయి. అందుకే ఆలస్యమైంది. ఏమి ఇటుగా వచ్చావు. కాసేపు పడుకుంటావా? అన్నాడు.అయ్యో స్వామి! నేను మీ నౌకరును. డ్యూటీ చేస్తూ వచ్చాను. హుక్కాకు నిప్పుకోసం ఇక్కడికి వచ్చాను అన్నాడు.మేనేజర్ నువ్వు హుక్కాకు నిప్పుకోసం వచ్చావా? అవునూ. నీ చేతిలో లాంతరు పట్టుకొని తిరుగుతున్నావు. నిప్పు కోసం ఇంత దూరం రావాలా? అన్నాడు.సూరదాసు తన చేతిలో ఉన్న లాంతరును చూసి నాలుక కరుచుకొని అక్కడ్నుంచి వెళ్ళాడు.మేనేజర్, పనివాళ్ళు నవ్వుకున్నారు.మన సత్యాన్వేషణ కూడా అలాంటిదే. దేవుడు మనతోనే, మనలోనే ఉన్నాడు. ఇంకెక్కడో ఉన్నాడని మనం భ్రమపడి వెతుకుతూ ఉంటాం. మనిషి బయటకాదు, దైవాన్ని తనలోనే వెతకాలి.

-సౌభాగ్య

348
Tags

More News

VIRAL NEWS