చరిత్రకు సజీవ సాక్ష్యం మెదక్ ఖిల్లా


Sun,December 15, 2019 01:47 AM

శాతవాహనులు, కాకతీయ చక్రవర్తులు నిర్మించిన సామ్రాజ్యాల్లో భాగమే మెదక్ పట్టణానికి పశ్చిమాన 300 అడుగుల ఎత్తున ఉన్న కోట. కాకతీయ చక్రవర్తులు నిర్మించిన ఈ కోట కొంతమేరకు శిథిలం కాగా మరికొంత నిలిచి ఉంది. దీన్ని 16వ శతాబ్దంలో ముస్లిం రాజులు స్వాధీనం చేసుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. మెదక్ పట్టణానికి తలమానికంగా ఉండి శతాబ్దాల చరిత్ర గల కోట(ఖిల్లా)ను సందర్శిస్తే గత చరిత్ర, నాటి రాజ్య నిర్మాణ తీరుతెన్నులు, ఎన్నో విశేషాలు అవగతమవుతాయి.
MedakKhilla

పట్టణానికి పశ్చిమ వైపున సహజ సిద్ధంగా ఏర్పడిన ఎత్తయిన గుట్టపై కాకతీయ సామ్రాజ్య చివరి పాలకుడైన రెండో ప్రతాపరుద్రుడు ఈ కోటను నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది. రాజ్యపాలన వ్యవహారాలు, రక్షణ అవసరాల కోసం సైనిక దుర్గంగా వినియోగించినట్లు కోట నిర్మాణ తీరుతెన్నులను బట్టి తెలుస్తున్నది. ఈ కోటలో ఇత్తడి, పంచలోహాలతో తయారు చేసిన నాలుగు ఫిరంగులు ఉన్నాయి. ఈ కోటలోనే ముబారక్ మహల్ అనే రాజమందిరం ఉంది. ఈ కోట సింహద్వారంపై కాకతీయ సామ్రాజ్య రాజ్యచిహ్నం, రెండు శిరస్సులు గల కబోదం ఉన్నాయి. క్రీస్తుపూర్వం 78వ సంవత్సరం నుంచే ఈ ప్రాంతాన్ని పాలించినట్లు ఆధారాలున్నాయి. కొండాపూర్ శాతవాహన రాజుల టంకశాల నగరమని తెలుస్తున్నది. వారు వ్యవసాయాన్ని, వర్తక వాణిజ్యం సైతం విస్తారంగాఅభివృద్ధి చేశారని చరిత్ర తెలియజేస్తున్నది.

క్రీస్తు శకం 1309లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనా నాయకుడు మాలిక్ కాఫర్ దక్షిణపథంపై దండయాత్ర చేసి మెదక్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఈ సమయంలో మెదక్‌ను వదపూర్, వేదక్ అనే పేరుతో పిలిచేవారు. వేదక్ అనే మాట క్రమంగా మెదక్‌గా మారింది. తరువాత బహమని నవాబులు తెలంగాణ ప్రాంతంపై దండయాత్ర చేసి జయించారు. తరువాత మెదక్ కోట కుతుబ్‌షాహీల వశమైంది. వీరి కాలంలో చెల్లాచెదురైన తెలుగుజాతిని ఒక చోటికి చేర్చి తిరిగి ఐక్య రాజ్యాన్ని స్థాపించడానికి గోల్కొండ నవాబులు మెదక్‌కు గుల్షణాబాద్ అని నామకరణం చేశారు. దోమకొండకు మూడు మైళ్ల దూరంలో ఉన్న బిక్కనవోలు(ప్రస్తుతం బిక్కనూర్) కూడా మెదక్ దుర్గం కింద ఉండేది. సంస్థానాధీశులు స్వయంగా కవులై ఉండి పండితులను పోషించేవారు. పట్టమెట్ట సోమనాథ సోమయాజీ కవి ఆకాలం వాడే. ఎల్లారెడ్డి, మల్లారెడ్డి పేరుగాంచిన కవులు.
MedakKhilla1

కోటకు ఏడు ద్వారాలు

కోటకు ఏడు ద్వారాలు ఉండగా ఇందులో ప్రధానమైంది సింహద్వారం. ఖిల్లా చివరి భాగానికి చేరుకోవాలంటే ఏడు ద్వారాలు దాటుకొని వెళ్లాల్సిందే. అన్ని ద్వారాలు పూర్తిగా రాతితో నిర్మితమైనవే. ఒక్కో ద్వారం పై భాగంలో ఇరువైపులా రాతితో చెక్కిన సింహాలు ఉన్నాయి. అందువల్ల వీటిని సింహద్వారం అంటారు. మరో ద్వారానికి ఇరువైపులా రాతిపై కళాత్మకంగా చెక్కిన ఏనుగు రూపాలు ఉన్నాయి. దీనికి గజ ద్వారం అని అంటారు. ఇతర ద్వారాల్నీ ఏకశీలలు పెద్దపెద్ద బండరాళ్ళు ఉపయోగించి ఎంతో పటిష్ఠంగా నిర్మించారు. ఆయా ద్వారాలపై చక్కని నగిషీలు చెక్కి ఉన్నా యి. కోట చివరి భాగంలో నిర్మించిన మజీద్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ఖిల్లాపై నుంచి 10 కిలోమీటర్ల మేరకు పట్టణ పరిసరాలు కనిపిస్తాయి.

పాల బావి..

ఖిల్లాపై రాజు బావి, రాణి బావి ఉన్నాయి. రాజు బావిని పాలబావిగా పిలుస్తుంటారు. ఎత్తైన ఖిల్లాపై గల ఈ బావిలో వర్షాలు కురువక పోయిన నీరుండటం విశేషం

పోలీస్ వైర్‌లెస్ సెట్

ఖిల్లాపై చివరి భాగానగల మజీద్‌వద్ద పోలీస్‌శాఖ సుమారు 20 సంవత్సరాల క్రితం వైర్‌లెస్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎప్పుడూ పోలీసు బందోబస్తు ఉంటుంది.
MedakKhilla2

హరిత రెస్టారెంట్

ఖిల్లాపై ముభారక్ హాల్‌గా పిలిచే పురాతనమైన భవనాన్ని సుందరంగా తీర్చిదిద్ది హరిత రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 4 సూట్‌లలో ఎసీ గదులతో పాటు హోటల్ ఏర్పాటు చేశారు. సెలవు దినాలతోపాటు క్రిస్మస్ పండుగ రోజుల్లో ఖిల్లాపైకి పర్యాటకులు పెద్ద మొత్తంలో వస్తుంటారు.
-మెదక్, నమస్తే తెలంగాణ

418
Tags

More News

VIRAL NEWS