మతసామరస్యానికి ప్రతీక ఎలగడప దర్గా


Sun,December 15, 2019 01:39 AM

నాడు కులానికి వెయ్యి గడపలు ఉన్న ప్రాంతం నేడు అంతా కలిసి వెయ్యి కుటుంబాలు లేని గ్రామంగా మారింది. కుటుంబాలు చిన్నాభిన్నమై దూరప్రాంతాలకు వలస వెళ్లగా కాలక్రమేపి ఆ గ్రామం వెయ్యి గడప నుంచి నేడు ఎలగడపగా మారింది. వ్యాపారాల నిమిత్తం వచ్చి ప్రజలకు దగ్గరైన ఐదుగురు అన్నదమ్ములు రాజులుగా వీరమరణం పొంది ఇక్కడి ప్రజలకు దేవుళ్లయ్యారు. ఏళ్లు గడిచినా వారు చేసిన పోరాటాలు, నాటి ఆనవాళ్ల ఆధారంగా నేటికీ ఆ ప్రాంత ప్రజలు వారిని స్మరించుకొంటూ దేవుళ్లుగా కొలుస్తున్నారు.

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఎలగడపకు ఏండ్ల చరిత్ర ఉంది. నిజాం పాలనకు ముందు ఈ ప్రాంతంలో ఒక్కో కులానికి వెయ్యి గడప ఉండేదట. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి శనివారం వారసంత (అంగడి) నిర్వహిస్తే అది ఊరి మొదలు నుంచి చివరకు సాగేదట. అంగడి నిర్వహించే ప్రాంతంలో నేటికి ఓ ఆలయం ఆనవాళ్లుగా నిలిచింది. ఈ ఆలయాన్ని అంగడీశ్వర ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ అంగడి ముగిసిన అనంతరం వెయ్యి ఏనుగులు మోసేంత ఉల్లిగడ్డల పొర వెళ్లేదని పెద్దలు చెబుతుంటారు. ఈ ప్రాంతాన్ని స్థానికులైన రాజులు తోకసారా, కొమ్ముసారా అనే ఇద్దరు అన్నదమ్ములు ప్రజలకు ఏ సమస్యలు దరిచేరకుండా పాలించేవారు. ఈ క్రమంలో ఇదే ప్రాంతానికి వ్యాపారం నిమిత్తం దర్యాబాషా, బురాన్‌బాషా, షాహిత్ అక్బర్, షాహిదే బురాన్, షాహిదే కాశీన్ అనే ఐదుగురు అన్నదమ్ములు వచ్చారు. ఇక్కడి ప్రజలతో మమేకమై ఓ వైపు వ్యాపారాన్ని కొనసాగిస్తూ, ప్రజలకు అత్యంత సన్నిహితులుగా ఉంటూ వారి సాధక బాధకాలను చూసేవారు. ప్రజల మనన్నలు పొందుతూ ఇక్కడి ప్రాంతాన్ని పాలించడాన్ని బాధ్యతగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఎలగడపకు ప్రాతినిధ్యం వహిస్తున్న టోకోసారా, కొమ్ముసారాలకు, వ్యాపారాల నిమిత్తం వచ్చిన ఐదుగురు అన్నదమ్ములకు విభేదాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి పాలనను ఒప్పుకోలేని వీళ్ల మధ్య పోరాటాలు మొదలయ్యాయి. అన్నదమ్ముల్లో మొదటి ఇద్దరు దర్యాబాషా, బురాన్‌బాషా మాసాయిపేట గ్రామ ప్రాంతంలో ఉన్న మసీదులో ప్రార్థన చేస్తున్న సమయంలో సారాల అనుచరులు దాడి చేశారు. వీరోచిత పోరాటం చేసిన దర్యాబాషా, బురాన్‌బాషా నెత్తురోడుతూ ఎలగడప ప్రాంతానికి చేరుకొని ప్రజల సమక్షంలో రానున్న రోజుల్లో మీ ప్రాంతం ఛిన్నాభిన్నమౌతుందని శాపనార్థాలు పెట్టి వీరమరణం చెందారు. వారిని దర్గా ప్రాంతంలోనే సమాధి చేశారు. వీరిలో చివరి ముగ్గురు అన్నదమ్ములు షాహిత్ అక్బర్, షాహిదే బురాన్, షాహిదే కాశీన్‌ను కూడా మాసాయిపేట దర్గా ప్రాంతంలో ఖురాన్ పఠిస్తున్న క్రమంలో దాడి చేసి జీవ సమాధి చేశారని పెద్దలు చెబుతుంటారు.
Majid

వీరికి ఎలగడప గ్రామ సమీపంలో బురుజులు ఏర్పాటు చేసి, వాటి ఎదురుగా వాళ్ల అనుచరుల సమాధులను కూడా ఏర్పాటు చేశారు. రాజుల పాలనలో ఇక్కడ బంగారు అభరణాలు ఉండేవనే కోణంలో కొన్నేండ్ల నుంచి ఇక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. కానీ దర్గా ప్రాంతంలో సమాధి అయిన ఐదుగురు అన్నదమ్ములు మాత్రం నిత్యపూజలు అందుకుంటున్నారు. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన మరో వ్యాపారవేత్త ఇమామ్ వీళ్ల వీరగాధను తెలుసుకొని మాసాయిపేట ప్రాంతంలోని అప్పటి మసీద్ ప్రాంతంలో ప్రస్తుత దర్గా నిర్మాణం పూర్తి చేసినట్లు పెద్దలు చెబుతుంటారు. ఈ ప్రాంతంలో 50 ఎకరాల భూమి ఉండేదని, అది కబ్జాకు గురైందని గ్రామస్తులు అంటున్నారు. ప్రస్తుతం ఖానాపూర్ మండలం బావాపూర్‌లో 12 ఎకరాలు, కడెం మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామంలో 7 ఎకరాలు ఇతర చుట్టు పక్కల గ్రామాల్లో కొంత వరకు భూములుండగా అవి కబ్జాలకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.

మొహర్రం వేడుకలు ప్రత్యేకం..

మాసాయిపేట్ దర్గా ప్రాంతంలో నేటికీ మొహరం పండుగది ప్రత్యేకత. పండుగ సందర్భంగా ప్రతిష్ఠించిన పీరీలకు మండ లం నుండే కాక, జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి పీరీలకు మొక్కులు సమర్పిస్తే వారి కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

అందరికీ సరిపోతుంది

దర్గా ప్రాంగణంలో ఉన్న కిస్తిలో భక్తులు వండిన వంటను వేస్తే వారు వండుకున్న అన్నం అందరికీ సరిపోతుందని భక్తుల నమ్మకం. దర్గాలో పండుగ నిర్వహించే భక్తులు వండిన వంటను ముందుగా ఆ కిస్తీలో వేస్తారు. అనంతరం భక్తులకు వడ్డిస్తారు. అందులో వేసి వడ్డిస్తే అందరికీ సరిపోతుందని వారు చెబుతుంటారు.

200 ఏండ్ల నాటి వేపచెట్టు

దర్గా ప్రాంగణంలోని వేపచెట్టుకు మరో విశిష్టత ఉంది. దీనికి 200 ఎండ్లు ఉంటాయని పెద్దలు చెబుతారు. ఆయుర్వేద డాక్టర్లు ఈ చెట్టు ఆకులను తీసుకెళ్లి వైద్యానికి వాడుతుంటారు.

వేసవిలో కూడా చల్లని నీరు

దర్గా ప్రాంగణంలో ఉన్న బావిలోని నీరు వేసవికాలంలో కూడా ఫ్రిజ్ వాటర్‌ను తలపిస్తాయి. ఆ ప్రాంత ప్రజలంతా స్వచ్ఛమైన నీరుగా భావిస్తారు. =మండుటెండల్లో కూడా బావి ఎండిపోయిన పరిస్థితి ఇప్పటికీ రాలేదు. వేసవి దాహాన్ని తీర్చుకొనేందుకు ఆ ప్రాంత ప్రజలు దర్గాను ఆశ్రయిస్తుంటారు.
-నమస్తే తెలంగాణ. కడెం, నిర్మల్ జిల్లా

201
Tags

More News

VIRAL NEWS