హై-ఫై Tea


Sun,December 15, 2019 01:34 AM

ఉదయాన్నే లేవగానే టీ తాగందే ఏమీ తోచదు కొందరికి. ఒత్తిడిగా ఉన్నా, ఆలోచనలు తట్టకపోయినా.. తలనొప్పిగా ఉన్నా ముందు వెళ్లేది టీ కొట్టుకే. ఇలా బ్రిటీష్ వాళ్లు అలవాటు చేసిన టీ.. మన దినచర్యలోనూ ఓ భాగమైంది. నేడు అనేక రకాల్లో లభ్యమవుతున్న టీలో అత్యంత ఖరీదైనవి కూడా ఉన్నాయి తెలుసా? డిసెంబర్ 15న ప్రంపచ టీ దినోత్సవం సందర్భంగా ఈ దునియాలోనే అత్యంత ఖరీదైన పది రకాల టీలను పరిచయం చేస్తున్నాం.
Tea

డా-హాంగ్ పావో టీ

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ. కిలో టీ పొడి అక్షరాల 7,16,89,593 రూపాయలు. ఈ డా-హాంగ్ పావో టీ చైనాలో అరుదుగా దొరుకుతుంది. ఈ రకం టీ పొడిని చైనా ప్రభుత్వం జాతీయ నిధిగా ప్రకటించింది. చైనాలోని మింగ్ రాజవంశం నాటి నుంచి ఈ పొడికి ప్రత్యేక గుర్తింపు లభిస్తూనే ఉన్నది. డా-హాంగ్ పావో రకం తేయాకు నాటు, పెంపకం, కోత ప్రక్రియ అంతా అత్యంత రహస్యంగా ఉంటుంది. ధరకే ఏడు కోట్ల రూపాయలు ఉందంటే.. ఆ టీ రుచి ఇంకెలా ఉంటుందో కదా! చైనాను సందర్శించే ప్రముఖులు, గౌరవప్రదమైన వ్యక్తులకు మాత్రమే ఈ టీపొడిని బహుమతిగా ఇస్తుంటారు.
Da-Hong-Pao-Tea

వింటేజ్ నార్కిసస్

ఇది ఊలాంగ్ అనే నల్లని తేయాకు రకానికి చెందిన టీ. అరుదైన రకాల్లో ఇది ఒకటి. ఈ రకమైన ఊలాంగ్ తేయాకును చైనాలోని వుయ్ పర్వతంపై పండిస్తారు. మంచు ప్రదేశంలో పండే ఈ తేయాకు సున్నితమైంది. వీటి ఆకులు 60శాతం వరకు ఆక్సీకరణం చెందుతాయి. ఈ ఆకులు చాక్లెట్, పూలు, సుంగంధ పరిమళాలను వెదజల్లుతుంటాయి. ఇటువంటి అరుదైన టీ కొనడానికి కిలోకు రూ.4,65,052 ఖర్చు పెట్టాలి.
Vintage-Narcissus-Tea

పీజీ టిప్స్ డైమండ్ టీ బ్యాగ్

ఈ ఒక్క టీ బ్యాగ్ ఖరీదు రూ.10,73,197. ఈ టీ పొడి ఇంత ఖరీదవడానికి కారణాలు రెండు. వాటిల్లో ఒకటి ఈ టీపొడిలో సిల్వర్ టిప్స్ ఇంపీరియల్ అనే అరుదైన రకం ఫ్లేవర్ ఉంటుంది. రెండవది టీబ్యాగు 280 వజ్రాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ టీ బ్యాగ్‌ను బూడిల్స్ అనే జ్యువెలరీ సంస్థ ప్రత్యేకంగా తయారు చేసింది. పీజీ టిప్స్ సంస్థ 75వ వార్షికోత్సవం స్మారకార్థంగా ఈ అరుదైన టీబ్యాగులు విడుదల చేసింది.
PG-Tips-Diamond-Tea-Bag

పాండా డంగ్ టీ

ఇదొక భిన్నమైన టీ. ఎందుకంటే ఇది పాండాల పేడ నుంచి తయారు చేస్తారు. ప్రత్యేకంగా కొన్ని పాండాలను టీ ఎస్టేట్‌లో పెంచుతారు. వెదురు రెమ్మలు, తేయాకులే వాటికి ఆహారం. మరే విధమైన ఆహారం వాటికి అందకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. అలా పాండాల పేడను సేకరించి ఫిల్టర్ చేసి టీపొడిని తయారు చేస్తారు. ఈ విభిన్న టీలో అధికంగా పోషకాలు ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది. అందుకే పాండా డంగ్ టీ పొడి కిలో 50,08,255 రూపాయలు.
Panda-Dung-Tea

టైగుయానిన్ టీ

ఇది ఊలాంగ్ అనే నలుపురంగు తేయాకుకు చెందిన టీ. ఇది చైనాలో మాత్రమే పండుతుంది. దీనికి ఐరన్ గాడ్సెస్ ఆఫ్ మెర్సీ అనే బౌద్ధదేవత పేరు కూడా ఉంది. ఇది బ్లాక్, గ్రీన్ టీల కలయితో విలక్షణమైన రుచిని అందిస్తుంది. ఒకసారి టీకి ఉపయోగించిన ఈ ఊలాంగ్ తేయాకును మరలా వేడిచేసి ఏడుసార్లు టీ కాచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇదే ఈ తేయాకు ప్రత్యేకత. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని ఎత్తయిన పర్వతంపై ఈ తేయాకు చెట్లను పెంచుతారు. ఈ టైగుయానిన్ తేయాకు కిలో 2,14,531 రూపాయలు.
Tieguanyin-Tea

ఎల్లో గోల్డ్ టీ బడ్స్

టైగుయానిన్ టీ మాదిరిగానే ఎల్లో గోల్డ్ టీ బడ్స్ టీపొడి కూడా చాలా ఖరీదైంది. ఒక కిలో టీ పొడి ఖరీదు రూ. 2,14,531. ఎందుకింత ధర పలుకుతుందంటే.. 24 క్యారెట్ల బంగారు రసాన్ని ఈ తేయాకులపై చల్లుతారు. ఆ బంగారు రసాయనం ఆకులకు పట్టేవరకూ వేచి చూసి, ఏడాదికి ఒకసారి మాత్రమే తేయాకులు బంగారు కత్తెరలతో కట్ చేస్తారు. అందువల్ల ఈ తేయాకుతో చేసిన టీ రుచి విభిన్నంగా ఉంటుంది. బంగారు వర్ణం నింపుకున్న ఆకులు కూడా.. తళతళ మెరుస్తుంటాయి కూడా. అందుకే ఈ టీకి అంత రేటు.
Yellow-Gold-Tea-Buds

పో పో పూ-ఎర్హ్ టీ

ఈ రకమైన తేయాకును 18వ శతాబ్దంలో చైనాలో కనుగొన్నారు. దీనిని ఇది మొదట చైనీస్ చక్రవర్తి కియాన్‌లాంగ్‌కు బహుమతిగా ఇచ్చినట్లు ఆధారాలున్నాయి. పేరుకు తగ్గట్లుగానే ఈ టీపొడిని పురుగుల విసర్జితం నుంచి తయారు చేస్తారు. టీ ఎస్టేట్స్‌లో కార్మికులు తెంపిన ఆకులను శుద్ధి చేసి, వాటిల్లో పురుగులను వదులుతారు. ఆ ఆకులను తిన్న పురుగుల విసర్జితాన్ని ఉపయోగించి టీపొడి చేస్తారు. అది ఆరోగ్యానికి ఎంతోమంచిదని చైనీయుల నమ్మకం. ఈ పోపో పూ-ఎర్హ్ టీ తాగాలంటే కిలోకు రూ.71, 510 ఖర్చు చేయాల్సిందే.
Poo-Poo-Pu-Erh-Tea

జ్యోకురో టీ

జపాన్‌లోని ఉజి జిల్లాలో విరివిగా లభించే ఈ జ్యోకురో టీకి చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ తేయాకు నాటడం నుంచి పంట కోసే వరకూ విభిన్న పద్ధతులు అవలంభిస్తారు. ఈ తేయాకు కోయడానికి 20 రోజుల ముందు ప్రత్యేకంగా షేడ్‌నెట్‌ను ఆకులపై కప్పుతారు. దీనివల్ల ఆకుల్లో అమైనో ఆమ్లం పెరుగుతుంది. అంతేకాదు టీకి ప్రత్యేకమైన సుగంధం, తీపి వస్తుంది. ఈ ప్రత్యేకమైన టీపొడి కిలో 46,481 రూపాయలు.
Gyokuro-Tea

గోరియానా-బ్రోకెన్ లీఫ్ బ్లాక్ టీ

యూరప్ ఖండంలో లభించే పురాతన తేయాకు గోరియానా. యూరప్‌లో అనేక రకాల టీని ఉత్పత్తి చేస్తారు. వాటిల్లో గోరియానా బ్రోకెన్ లీఫ్‌కు చాలా ప్రత్యేకం. ఎందుకంటే తేయాకు కాండం నుంచి కేవలం మూడో ఆకును మాత్రమే కట్ చేసి టీకి ఉపయోగిస్తారు. ఇలా ప్రత్యేకంగా తయారు చేసిన టీ రాగి రంగును పోలి ఉంటుంది. అంతేకాదు ఈ బ్రోకెన్ లీఫ్ వాసన కూడా విలక్షణమైంది. ఈ ప్రత్యేక టీని తాగాలంటే కిలోకు 28,961 రూపాయలు ఖర్చు చేయాల్సిందే.
BrokenTea

సిల్వర్ టిప్స్ ఇంపీరియల్ టీ

మన దేశంలో హిమాలయాల్లో దొరికే ఖరీదైన తేయాకు ఇది. ప్రత్యేకమైన రుచితో పాటు.. టీ తాగిన వారికి ఎనర్జీని ఇస్తుంది. రంగు, రుచి, చిక్కదనానికి సిల్వర్ టిప్స్ ఇంపీరియల్ టీ పెట్టింది పేరు. ఈ తేయాకు మొక్కలను హిమాలయాలలో సముద్ర మట్టానికి 8,000 అడుగుల ఎత్తులో సాగు చేస్తారు. టీ ఆకులు కోసిన తర్వాత, వాటిని ప్రపంచంలోని మొట్టమొదటి టీ ఫ్యాక్టరీ.. భారతదేశంలోని డార్జిలింగ్‌లో ఉన్న మకైబారి టీ ఎస్టేట్‌కు పంపుతారు. ఇక్కడ ప్రత్యేక పద్ధతులతో టీపొడిని తయారు చేస్తారు. ఈ టీపొడి కిలో ధర 28,604 రూపాయలు.
Silver-Tips-Imperial-Tea

345
Tags

More News

VIRAL NEWS