వాస్తు


Sun,December 15, 2019 12:56 AM

VASTHU

మనిషి జీవితం కర్మబద్ధం అంటారు కదా! వాస్తు ఎలా పని చేస్తుంది? దాని అవసరం ఏముంది? -కోవెల మాధవీలత, వికారాబాద్

కర్మ అంటే ఏ పని చేసినా దానికి ఒక ఫలం (ఫలితం) ఉంటుంది. అది ఆ పని చేసిన వారికే లభిస్తుంది, చెందుతుంది. చెట్టు ఎక్కిన వాడే దిగాల్సి వచ్చినట్టు. అలా జన్మ గతంగా ప్రతి మనిషి తన సహజ వ్యక్తిత్వంతో, ప్రవర్తనతో నడుచుకుంటూ ఉంటాడు. కొన్ని ఇష్టాలను కలిగి ఉంటాడు. అలా వారి వారి అలవాట్ల ప్రకారం ఉంటారు. అవి మంచివి కావచ్చు, చెడువి కావచ్చు. వాటిని నిర్ధారించాలంటే నివారించాలంటే మానవ ప్రయత్నం లేదా శాస్త్ర జ్ఞానం అవసరం. జన్మగత బుద్ధితో ఒక చెడు ఇంటిని ఇష్టపడి దాని ప్రభావానికి లోనవుతాడు. అప్పుడు చెడు ఫలితాలు పొందుతాడు. మట్టి తినే అలవాటును తల్లి మాన్పించినట్టు మంచి గృహానికి మారినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకోవడం తప్పు. మనిషి ప్రయత్నంతో తన వైభవాన్ని నిర్మించుకోవచ్చు. అందుకే వాస్తుశాస్త్రం వెలుగొందుతుంది.

ఇల్లు కట్టే స్థలం మెట్నకు ఉంటే చాలదా? మొత్తం స్థలం కూడా మెట్నకు ఉండాలా? -జయదేవ్, జోగులాంబ గద్వాల

పది, ఇరవై ఎకరాల స్థలం మెట్నకు చేయడం కుదరదు. అలా అంత పెద్ద వ్యవసాయ పొలాలు, క్షేత్రాలు మూలమట్టానికి ఉండాలి అని కూడా శాస్త్రం ఉటంకించలేదు. వండుకునే బియ్యం గాలించుకుని (శుద్ధి చేసి) వండుకున్నట్టు కట్టే భాగం చక్కగా దిశకు కుదిరించుకొని అందులో ఇంటిప్లాన్ చెయ్యాలి. తప్పకుండా గృహ నిర్మాణ స్థలం తొంభై డిగ్రీలకు సరిచేయాలి. అలాగే పెరిగిన భాగాన్ని వదిలి మెట్నకు సెట్ చేయాలి. ఇల్లు కూడా మెట్నకు ఉండాల్సిందే.. అప్పుడే నేలకు పుట్టిన బిడ్డలా అది తనదైన స్వతంత్ర జీవ లక్షణాలతో వర్ధిల్లుతుంది. స్థలం - మెట్న ఈ రెండు ప్రధాన అంశాలు. దీనిని బట్టే శాస్త్రంలో కొలమానం విలువైందిగా పరిగణించబడింది. దిశ - మెట్న - కొలత కుదిరినప్పుడు ఆ స్థలం పూర్ణ శుభలక్షణాలతో ఉంటుంది. ఇక యజమాని చేసుకున్నంత శ్రమకు చేసుకున్నంత అద్భుత ఫలితాలు అందుతుంటాయి. ఏదైనా శ్రద్ధతో చేస్తేనే చేతికి అందుతుంది కదా.

ఆగ్నేయం నుండి నీళ్లు బయటికి వెళ్లొచ్చా? -శ్రీనివాస్ పంతంగి, చేర్యాల

చాలామందికి నీళ్లు బయటికి పోవాలంటే ఈశాన్యం నుండే పోవాలనే భ్రమ ఉంది. ఆగ్నేయంలో వంటగది వచ్చినప్పుడు, వాయవ్యంలో వంటగది వచ్చినప్పుడు నీళ్లు ముందు ఆగ్నేయం వాయవ్యం నుండి పోయే ఏర్పాటు చేసుకోవడం సముచితం. అన్ని ఇండ్లకు ఈశాన్యం గుండా బయటకు నీళ్లు పోయే ఏర్పాటు కుదురదు. అవుతలి పక్క ఇతరుల ఇండ్లు ఉంటాయి. తూర్పు రోడ్డు, ఉత్తరం రోడ్డు లేని గృహాలకు అలాంటి అవకాశం ఉండనే ఉండదు. వాననీరు, వాడుకనీరు ఇంటి ఆవరణలో స్థలం ఉంటే ఇంకుడు గుంతలు తూర్పులో లేదా ఉత్తరంలో ఏర్పాటు చేసుకొని వాటిల్లోకి మళ్లించుకుంటే ఎంతో లాభదాయకం. వాన నీటిని ప్రత్యేక సంపు ఈశాన్యం లేదా ఉత్తరంలో సంపుతో నిలువ చేసుకొని వాడుకోవచ్చు. మీరు దక్షిణ ఆగ్నేయం నుండి పైపు ఏర్పాటు చేసుకొని నీటిని బయటకు పంపండి, ఏ దోషం లేదు.

ఇంట్లో కాక బయట వంటగది ఎక్కడ కడితే మంచిది. పెద్ద వంటలకోసం సెల్లారులో చేయవచ్చా? -రాజశ్రీ, ఆలేరు

అసాధారణ వంటగదులకు ప్రధానంగా గాలి వెలుతురు వచ్చే గదులు అవసరం అవుతాయి. పొగ కమ్ముకునే విధంగా కాక పొయ్యి పెట్టే తూర్పుగోడవైపు కాక చుట్టూ వెలుతురు వచ్చేలా ఉండాలి. ఇంటిచుట్టూ ఆవరణ విశాలంగా ఉంటే.. ఉత్తర వాయవ్యంలో వంటగదిని విశాలంగా కట్టి చుట్టూ జాలీలు అమర్చి అక్కడ విశేష వంటగది నిర్మించవచ్చు. సెల్లార్‌లో వంటగది మంచిదికాదు. సహజంగా అక్కడ చీకటి అధికంగా ఉంటుంది. అనేక క్రిమికీటకాలు ఆవాసం చేస్తుంటాయి. వంటకు ఎండ గాలి వచ్చే అవకాశం ఉంటేనే ఆ చోట శుభ్రమైన ఆహారం సమకూర్చగలం. ఎండ్ల ఏది వచ్చి పడుతదో తెలియదు. మీకు ఏ వీధి ఉన్నది అనేది తెలుపలేదు. పడమర ఉత్తరం వీధి ఉంటే.. ఇంటి ఆవరణలో తూర్పు ఆగ్నేయంలో విశాలమైన పెద్ద వంటగది మరింత సౌకర్యంగా ఉంటుంది.

సుద్దాల సుధాకర్ తేజ
[email protected]
Cell: 7993467678

290
Tags

More News

VIRAL NEWS