కాలుష్యం


Sun,December 1, 2019 04:25 AM

ప్రపంచానికి పెనుసవాలు కాలుష్యం
polution
మనిషి తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు. ఆ వనరుల దుర్వినియోగంతో మితిమీరుతున్న కాలుష్యం మనుషుల ఆయువును హరించివేస్తున్నది. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం అన్నీ కలుషితమై మనిషి మనుగడను ప్రశ్నిస్తున్నాయి. అభివృద్ధి కొరకు మనిషి సాధించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమే నేడు ప్రకృతి కాలుష్యానికి కారణమవుతున్నది. మనుషుల నిర్లక్ష్యం ఫలితంగా నీరూ నేలా కలుషితమై వాయు, జల కాలుష్యం పెరిగి మానవ జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విష వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతున్నది. తద్వారా పుడమితల్లి పురిటి నొప్పుల పాలవుతున్నది. లక్షలమరణాలకు
కారణమవుతున్నది. డిసెంబర్‌2న‘జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం’ సందర్భంగా మనిషి జీవన గమనాన్ని ప్రశ్నిస్తున్న కాలుష్యంపై ముఖచిత్ర కథనం.

polution3
భారతదేశం పుణ్యభూమి, వేదభూమి, ధన్యభూమి, కర్మభూమి అని ఎంతో గర్వంగా చెప్పుకుంటుంటాం. ఇప్పుడు కాలుష్యభూమి అని కూడా చెప్పుకోవాలి. వినడానికి కొంత ఇబ్బందిగా ఉన్నా ఇది అక్షరాల నిజం. ప్రపంచంలోనే 20 అత్యంత కాలుష్యపూరిత నగరాల వివరాలు చూస్తే భారత్‌లో కాలుష్యం ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థమవుతున్నది. టాప్‌ 20 అత్యంత కాలుష్యపూరిత నగరాలలో 15 భారత్‌లోనే ఉండటం గమనార్హం. ఎయిర్‌ విజువల్‌, ఎన్జీవో గ్రీన్‌పీస్‌ సంస్థలు చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యా యి. పీఎమ్‌(పర్టిక్యులేట్మాస్‌పిటర్‌) 2.5 ఆధారంగా నగరాల కాలుష్యాన్ని వెల్లడించారు. మరోవైపు 2018లో గ్రీన్‌పీస్‌ అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోని 30 అత్యంత కలుషితమైన నగరాల్లో 22 భారత్‌లోనే ఉన్నాయి. ఈ నగరాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సురక్షితంగా భావించే దానికంటే అత్యంత ఎక్కువ విషపూరితమైన మూలకాలతో కూడిన పీఎం 2.5 అని పిలిచే ప్రమాదకరమైన కాలుష్య కణాలు గాలిలో ఉన్నాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది. 2017కు గానూ టాప్‌ 20లో 14 భారత నగరాలుండగా, 2018 ఏడాదికిగానూ మరో నగరం చేరి ఆ సంఖ్య 15కు చేరడం ఆందోళనకు గురిచేస్తున్నది. అత్యంత కాలుష్య రాజధానులలో భారత రాజధాని ఢిల్లీ 113.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా, అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

polution1

‘గాలి’లో ప్రాణాలు

మానవ జీవన మనుగడకు గాలి అత్యంతవసరం. కానీ ఆ గాలే మనిషి మరణానికి కారణమైతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ప్రాణాలు కాపాడాల్సిన గాలి తన స్వచ్ఛతను కోల్పోతున్నది. అయినా పీల్చక తప్పని పరిస్థితి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణమన్నట్లు అన్ని దేశాలదీ ఇదే పరిస్థితి. ఒక సర్వే ప్రకారం ప్రపంచ మొత్తం జనాభాలో తొంభైశాతం మంది పీల్చేది అక్షరాల కాలుష్యంతో నిండిన గాలే. ఒకప్పుడు ఈ సమస్య కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేది కానీ మారిన పరిస్థితుల మూలంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ స్వచ్ఛమైన గాలి కరువైందనేది వాస్తవం. 2015లో వాయు కాలుష్యంతో 25 లక్షల మంది మృతి చెందారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2015లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 90 లక్షల మరణాలు కాలుష్యం ఫలితంగా జరిగినవేనని లాన్సెట్‌ నివేదిక వెల్లడించింది. అంటే ప్రతి ఆరుగురిలో ఒకరు వాయు కాలుష్యానికి బలవుతున్నారని అర్థం. పేద, మధ్య స్థాయి ఆదాయాలు గల దేశాల్లోనే కాలుష్యం ఎక్కువ మందిని బలిగొంటున్నదని ఈ నివేదిక తెలిపింది. వాయు కాలుష్యంలో బంగ్లాదేశ్‌, సోమాలియా అగ్రస్థానంలో ఉన్నాయి. వీటికి భిన్నంగా బ్రూనై, స్వీడన్‌లలో గాలి కాస్త స్వచ్ఛంగా ఉందని లాన్సెట్‌ నివేదిక తెలిపింది. వాయు కాలుష్యంలో ఈ దేశాలు చిట్టచివరన ఉన్నాయి. కాలుష్యం వల్ల మరణిస్తున్న వారిలో రెంటింట మూడొంతులు వాయు కాలుష్యం వల్లే చనిపోతున్నారు. కలుషిత గాలి పీల్చడం వల్ల గుండెజబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. మానవాళి మనుగడకు వాతావరణ మార్పుల కంటే వాయు కాలుష్యమే పెను సవాలు విసురుతున్నదని న్యూయార్క్‌లోని ఇకాహ్న్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఫ్రొఫెసర్‌ ఫిలిప్‌ లాండిగ్గాన్‌ అన్నారు. వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 60లక్షల మంది అర్ధాంతరంగా చనిపోతున్నారు.

మరణాల్లోనూ మనమే

కాలుష్యం కారణంగా పేద దేశాల్లోనే 92 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. అనేక రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిన భారతదేశం కాలుష్య మరణాల సంఖ్యలోనూ అగ్రస్థానంలోనే ఉంది.188 దేశాల జాబితాలో భారత్‌ ఐదో స్థానంలో నిలిచింది. 2015లో భారతదేశంలో 25 లక్షల మంది కాలుష్యం మూలంగా చనిపోయినట్లు లాన్సెట్‌ నివేదిక తేల్చింది.భారత్‌కంటే చైనా మెరుగైన స్థితిలో ఉంది. ఈ జాబితాలో చైనా దేశానిది 16వ స్థానం.బ్రిటన్‌లో వాయు కాలుష్యం కారణంగా ఏటా 50 వేల మంది చనిపోతున్నారని అంచనా. ఈ జాబితాలో బ్రిటన్‌ 55వ స్థానంలో ఉంది. అమెరికా, యూరప్‌ దేశాల కంటే బ్రిటన్‌లో ఎక్కువ వాయు కాలుష్యం ఉంది. వాయు కాలు ష్యం ప్రమాదకర స్థితికి చేరిందని బ్రిటిష్‌ లంగ్‌ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్‌ పెన్నీ వుడ్స్‌ చెప్పారు. అమెరికా, పశ్చిమ యూరప్‌ దేశాల కంటే బ్రిటన్‌లో పరిస్థితి తీవ్రంగా ఉందని ఆయన తెలిపారు. డీజిల్‌ వాహనాల వినియోగం, విష వాయువుల వల్ల గాలి కాలుష్యం మరింత తీవ్రమవుతున్నది. ఫలితంగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఊపిరితిత్తుల వ్యాధులు పెరుగుతున్నాయి. పొగాకు కంటే ఇప్పుడు వాయు కాలుష్యమే దేశంలో ఎక్కువ వ్యాధులకు కారణమవుతున్నది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల సమస్యలు, గుండెపోటు, మధుమేహం లాంటి సమస్యలకు అది దారితీస్తున్నది. దేశంలో 77శాతం మంది ప్రజలు సాధారణ స్థాయికంటే ఎక్కువ కాలుష్యం బారిన పడుతున్నారు. ఉత్తర భారతంలో ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సంభవించే మొత్తం ప్రిమెచ్యుర్‌ మరణాల్లో 26శాతం భారత్‌లోనే నమోదవుతున్నాయి. ప్రపంచ జనాభాలో భారత్‌ వాటా 18 శాతం. మన దేశంలో 56 శాతం ప్రజలు కట్టెల పొయ్యిలపై ఆధారపడే వంట చేశారు. క్రమంగా ఈ వినియోగం తగ్గుతున్నది. గాలి నాణ్యత మెరుగవ్వాలంటే ఈ పరిస్థితి మెరుగుపడాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు. వాహనాలు, నిర్మాణాలు, పరిశ్రమలు, విద్యుత్‌ కేంద్రా లు, వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడం, డీజిల్‌ జనరేటర్లు లాంటి వాటిని నియంత్రించగలిగితే వాయు కాలుష్యానికి పరిష్కారం కనుగొనవచ్చు.
image

కాలుష్య నగరాలు

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో గురుగ్రామ్‌ (135.8) తొలి స్థానంలో నిలువగా, ఘజియాబాద్‌ (135.2) రెండో స్థానంలో ఉంది. పాక్‌ నగరం ఫైసలాబాద్‌ (130.4), ఫరీదాబాద్‌ (129.1), భివాడి (125.4) టాప్‌ స్థానాల్లో నిలిచాయి. కాలుష్యపూరిత నగరాల జాబితాలో టాప్‌ 5లో 4 భారత నగరాలుండగా, టాప్‌ 10 విషయానికొస్తే మొత్తంగా 7 భారత నగరాలు జాబితాలో ఉన్నాయి. టాప్‌ 10లో చైనా నుంచి హోతాన్‌ (8), పాక్‌ నుంచి ఫైసలాబాద్‌తో పాటు లాహోర్‌ (10వ స్థానం) ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంలో చిక్కుకున్న దేశ రాజధాని మనదే. మరో నాలుగు ఎన్సీఆర్‌ నగరాలు (ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌, భీవడి, నోయిడా) కూడా టాప్‌ 10 కాలుష్య నగరాల్లో ఉన్నాయి. ఐక్యూఎయిర్‌ ఎయిర్‌ విజువల్‌ అండ్‌ గ్రీన్‌పీస్‌ అనే ఎన్జీవో చేసిన సర్వే నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 3 వేల నగరాల్లో పీఎం 2.5 స్థాయిని బట్టి కాలుష్యాన్ని అంచనా వేసింది. 2018కి సంబంధించి ఆయా దేశాల ప్రభుత్వ గణాంకాల ఆధారంగా ఈ సంస్థ సర్వే చేసింది. దీని ప్రకారం టాప్‌-10లో ఏడు ఇండియన్‌ సిటీలు, ఒక చైనా నగరం, రెండు పాకిస్థాన్‌ సిటీలు ఉన్నా యి. మొత్తం 3000 సిటీల్లో 64 శాతం అంటే 1920 నగరాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన సేఫ్టీ స్టాండర్డ్‌కు మించి కాలుష్యంలోజీవిస్తున్నట్లు తేలింది. అలాగే దక్షిణాసియాలోని 99 నగరాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలిపింది.

polution7

రాజధానిని వణికిస్తున్న కాలుష్యం

మోస్ట్‌ పొల్యూటెడ్‌ రాజధానిగా ఢిల్లీ అతలాకుతలమైపోతున్నది. పొగ మంచు, వాయు కాలుష్యంతో రాజధాని పౌరులు పీల్చే గాలి విషమయంగా మారిపోయింది. పీఎం 2.5 కాలుష్యం పెరిగిపోయింది. దీనివల్ల చిన్నా పెద్ద అని వయసు తేడా లేకుండా ఆస్తమా వంటి శ్వాస కోశ సంబంధ వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల కేన్సర్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండెపోటు లాంటి జబ్బుల బారిన పడుతున్నారు. చలికాలంలో చాలాసార్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ విధించిన పరిమితుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా దిల్లీలో కాలుష్యం నమోదైంది. వైద్యులు ఏకంగా నగరంలో ‘మెడికల్‌ ఎమర్జెన్సీ’ ప్రకటించారు. గాలిలో ఒక క్యుబిక్‌ మీటర్‌ పరిధిలో పీఎం 2.5 అనే కణరూప ద్రవ్య పదార్థాలు 25 మైక్రోగ్రాములకు మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది. కానీ, దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వాటి పరిమితి ఏకంగా క్యుబిక్‌ మీటరుకు 700 మైక్రోగ్రాముల వరకు చేరింది. ఢిల్లీ కాలుష్యానికి అనేక ఇతర కారణాలు ఉన్నప్పటికీ పంటల నుంచి వెలువడే పొగకూడా ఎక్కువ నష్టం కలిగిస్తున్నది.ఉత్తర భారతంలో ఏటా చలికాలంలో దాదాపు 20లక్షల మంది రైతులు 23 మిలియన్‌ టన్నుల పంట వ్యర్థాలను 80 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో తగులబెడతారు. దాన్నుంచి వెలువడే పొగలో నైట్రోజన్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌ లాంటి అనేక రకాల హానికారక పదార్థాలు కలిసుంటాయి. మరోవైపు వాహనకాలుష్యమూ పెరిగింది. ఢిల్లీలో ప్రతిరోజూ 30 లక్షల వాహనాలు తిరుగుతున్నాయని, ఉద్ఘారాల తగ్గింపునకు సరి-బేసి విధానాన్ని అనుసరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.ఇలా చేయ డం వల్ల రోడ్డు మీదకు వచ్చే వాహనాల సంఖ్యను 15లక్షలకు తగ్గించామని ఢిల్లీ ప్రభుత్వం చెబుతున్న ది.అయితే, 2016 నుంచి గమనిస్తే దేశంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. 2016లో దేశం మొత్తంలో రోడ్లపైకి 20 కోట్ల వాహనాలు వస్తే, ఇప్పుడా సంఖ్య భారీగా పెరిగింది.

polution5

హైదాబాద్‌లోనూ..

మన మహానగరంలోనూ కాలుష్య తీవ్రత పెరుగుతున్నది. గాలిలో నాణ్యత తగ్గుతున్నది. పరిస్థితి ఇలానే ఉంటే ఢిల్లీ తరహాలో కాలుష్యం ఇక్కడా పెరుగుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌లోని ఆరు ప్రాంతాల్లో ప్రస్తుతం గాలి నాణ్యత సూచిక నమోదవుతున్నది. ఇప్పటివరకు జూపార్కు వద్ద అత్యధికంగా 159 ఎంజీక్యూఎంగా గాలి నాణ్యత నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో పరిశ్రమలు ఉన్న సనత్‌నగర్‌ 158, అత్యల్పంగా పటాన్‌చెరులో 75ఎంజీక్యూఎంగా గాలి నాణ్యత ఉంది. పరిస్థితి ఇలానే ఉంటే మున్ముందు ఢిల్లీస్థాయిలో కాలు ష్యం ఇక్కడా పెరుగుతుందని పర్యావరణవేత్తలు అంటు న్నారు. ఇటీవల ఢిల్లీలో గాలి నాణ్యత 400ఎంజీక్యూఎం దాటిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి 2019 మే వరకు హైదరాబాద్‌లో అత్యధిక వాయుకాలుష్యం నమోదయ్యిందని ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించాయి.

నివారణ చర్యలు

: కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. కాలుష్య నివారణకు కాలుష్య నియంత్రణ మండలి పలు చట్టాలను, నిబంధనలను అమలుపరుస్తున్నది. జల కాలుష్యం, వాయుకాలుష్యం నివారించడం, నియంత్రించడానికి, హానికర వ్యర్థ పదార్థాల తరలింపు, నిర్వహణకు, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ, నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల నిర్వహణ,ఇ- వ్యర్థాల నిర్హణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను కఠినతరంగా అమలు పరుస్తున్నది. శబ్దకాలుష్యాన్ని క్రమబద్ధీకరించడానికి, నియంత్రించడానికి సంబంధించిన చట్టాలను కూడా అమలుచేస్తున్నది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జాతీయ జల నాణ్యతా పరిశీలన కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రంలోని నదులు, ఉపనదులు, సరస్సులు, చెరువులు, భూగర్భ జలాలు, మురికికాల్వలపై రాష్ట్రవ్యాప్తంగా 160 కేంద్రాలలో పరిశీలన జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 29 మురుగు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. ఇవి రోజుకు సుమారు 769 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధిచేస్తాయి. వీటిలో జి.హెచ్‌.ఎం.సి పరిధిలో ఉన్న 20 కర్మాగారాలు రోజుకు 728 లీటర్లు శుద్ధిచేస్తాయి. ఈ విధంగా నీరు వృధాకాకుండా మురుగునీటిని శుద్ధిచేసి, వివిధ అవసరాలకు సద్వినియోగం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న ఈ కృషికితోడు ప్రజలు కూడా అవగాహనతో మసలుకోవాలి. కాలుష్యనివారణకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే మనం ఆశించిన కాలుష్య రహిత రాష్ర్టాన్ని సాధించగలం.

polution6

జలకాలుష్యం

పీల్చేగాలే కాదు తాగే నీరూ కలుషితమే. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి వాసన ఉండవు. కానీ మానవుడికి అందుబాటులో ఉన్న ఒక శాతం నీటిలో అనేక పదార్థాలు కలిసి నీటి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. సాధారణంగా భూమి ఉపరితలం పైన, భూగర్భంలో అనేక కారణాల వల్ల నీటి కాలుష్యం జరిగి అది తాగడానికి, సాగు చేయడానికి ఉపయోగపడటం లేదు. గ్రామాల నుంచి నగరాల వరకు ఇళ్లల్లోని వివిధ అవసరాలకు వాడిన నీటిలో వ్యర్థాలు, మానవ విసర్జితాలు, కాగితాలు, దుస్తులు, సబ్బులు, డిటర్జెంట్లు మొదలైనవి కలిసి మురుగునీరుగా మారుతుంది. శుద్ధి చేసిన/శుద్ధి చేయని మురుగు.. చెరువులు, సరస్సులు, నదులు తదితర జలాశయాల్లోకి చేరడం వల్ల నీరు కలుషితమవుతున్నది. వ్యవసాయంలో వాడే ఎరువులు, క్రిమి సంహారక మందులు, ఇతర రసాయనాలు జలాశయాల్లో చేరి ఉపరితల, భూగర్భ జలాలు తీవ్రంగా కాలుష్యానికి గురవుతున్నాయి. ఔషధాలను తయారుచేసే పరిశ్రమలు, బట్టలు, కాగితపు మిల్లు లు, రసాయనాలు, ఎరువులు, పురుగు మందులు, ప్లాస్టిక్‌, అద్దకపు రంగులు మొదలైనవాటిని తయారుచేసే పరిశ్రమలు, బొగ్గు గనులు, ఉక్కు కర్మాగారాలు, నూనె శుద్ధి కర్మాగారాలు, సిమెంట్‌ పరిశ్రమలు మొదలైన వాటి నుంచి వెలువడే పదార్థాల్లోని విష రసాయనాలు, జీవక్షయం పొందని కర్బన మూలక రసాయనాలు, తైల స్వభావం గల పదార్థాలు, రేడియో ధార్మిక పదార్థాలు జలాశయాల్లోకి చేరడం వల్ల నీరు కలుషితమై మానవులకు, ఇతర జీవరాశులకు పనికిరాకుండా పోతున్నది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ఎక్కువగా బొగ్గును ఉపయోగిస్తున్నారు. ఈ శిలాజ ఇంధనం దహనం చెందినప్పుడు వెలువడిన బూడిద రేణువులు తొలుత వాతావరణంలోకి తర్వాత జలాశయాల్లోకి చేరి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. మనదేశంలోని ఎన్నో నదులు, సరస్సులు, వాగులు, ఇతర జలాశయాలు ఇలాంటి కాలుష్యానికి నిరంతరం గురవుతున్నాయి. ప్రపంచంలో అణు ఇంధనాలను ఉపయోగిం చే దేశాలు అణు వ్యర్థాలను సముద్ర గర్భంలో, భూగర్భంలో నిక్షిప్తం చేయడం వల్ల ఈ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయి. ఇది దీర్ఘకాలంగా ఉండటమే కాకుండా మానవుడికి, జలచరాలకు ఎక్కువ ప్రమాదం కలిగిస్తుంది.భారీ వర్షాల వల్ల ఏర్పడే వరదల్లో కొట్టుకొచ్చిన వ్యర్థాలు జలాశయాల్లో కలవడం వల్ల, భార లోహాలు నీటిలోకి చేరడం వల్ల జల కాలుష్యానికి, మానవుడి అనారోగ్యానికి కారణమవుతున్నా యి. కలుషిత నీరు తాగడం వల్ల సుమారు ఏటా18లక్షల మంది మరణిస్తున్నారు.

polution7

ఆక్సిజన్‌ బార్‌లు

ఢిల్లీలో గాలి కాలుష్యం ఎంత స్ధాయికి చేరిందంటే ఊపిరి పీల్చుకోవడానికి కృత్రిమ గాలిని కొనుక్కునేంత. అవును ఊపిరాడనివ్వని పరిస్థితులను తట్టుకోవడానికి గాలిని కొనుక్కోవలసిన పరిస్థితి ఢిల్లీ వాసులకు తప్పలేదు. హస్తినలో ‘ఆక్సిజన్‌ ప్యూర్‌' పేరుతో స్వచ్ఛమైన గాలిని (ఆక్సిజన్‌) అమ్మే బార్‌ ఓపెన్‌ అయింది. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో ఇలాంటి దుకాణం ప్రారంభం పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించే అంశమేం కాదు. కాకపోతే ఏటా రూ.10 కోట్ల నుంచి 15 కోట్లు వరకు టర్నోవర్‌ లక్ష్యంగా ఈ స్టాల్‌ ఏర్పాటు చేయడమే ఒక రకంగా చర్చ. అంటే గాలి మనిషికి ఎంత అవసరమో ఇది చెప్పకనే చెప్పింది. ఏడెనిమిది రకాల పరిమళాలతో కూడిన ఆక్సిజన్‌ను ఇక్కడ పీల్చి వెళ్లొచ్చు. పావుగంటకు దాదాపు రూ. 300 వసూలు చేస్తారు. ఢిల్లీతో ఆగబోమని, దేశంలో కాలుష్యం కమ్మేసిన నగరాల్లో 50 యూనిట్లు ఏర్పాటు చేస్తామని వారు ధీమాగా చెబుతున్నారు.

polution8

తెలుగు రాష్ర్టాల పరిస్థితి ఇది

మనం పీల్చే గాలిలో కంటికి కనిపించని మృత్యువు దాగుంది. దాని వల్ల దేశంలో ఏటా దాదాపు 12.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ర్టాల్లో ఆ సంఖ్య 71వేల పైమాటే. ఆ మృత్యువు పేరే వాయు కాలుష్యం. ఉత్తరాది రాష్ర్టాలతో పోలిస్తే గాలి నాణ్యత విషయంలో తెలుగు రాష్ర్టాలు మెరుగ్గానే ఉన్నా, వాయు కాలుష్యం సంబంధిత మరణాల సంఖ్య మాత్రం ఆందోళనకరంగానే ఉంది.దేశంలో ప్రజల మరణాలు, ఆరోగ్యం, ఆయుర్థాయంపై వాయు కాలుష్యం ప్రభావం గురించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌), పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా (పీహెచ్‌ఎఫ్‌ఐ), ఇన్సిటిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవొల్యూషన్‌ (ఐహెచ్‌ఎంఈ)లు సమగ్ర అధ్యయనం నిర్వహించాయి.ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా గాలి కాలుష్యం కారణంగా ప్రజలు ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారనే విషయాన్ని ఆ అధ్యయన నివేదిక చర్చించింది.ఆ నివేదిక ప్రకారం వాయు కాలుష్యం కారణంగా 2017లో ఆంధ్రప్రదేశ్‌లో 45,525 మంది ప్రాణాలు కోల్పోగా, తెలంగాణలో 26 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే గతేడాది ఆంధ్రప్రదేశ్‌లోచనిపోయిన 70ఏళ్ల లోపు వ్యక్తుల్లో 48.7శాతం మరణాలకు ఏదో ఒక రూపంలో గాలి కాలుష్యమే కారణమైంది. తెలంగాణలో ఆ సంఖ్య 50.4శాతంగా ఉంది. నగరాల్లో పరిశ్రమలు, వాహనాలు తదితర కారణాల వల్ల విడుదలయ్యే కాలుష్యం స్థాయిలోనే గ్రామాల్లో వంట చెరకు వల్ల వ్యాపించే కాలుష్యం కూడా ఉంటున్నది. గతేడాది అలా ఇంట్లో నుంచి విడుదలయ్యే (ప్రధానంగా కట్టెల పొయ్యి) కాలుష్యం కారణంగా ఆంధ్ర ప్రదేశ్‌లో 19,345మంది చనిపోతే, తెలంగాణలో 8,789 మంది చనిపోయారు.
polution9


431
Tags

More News

VIRAL NEWS