ఆర్మూర్‌లో వెలసిన ఆలయం నవనాథుల సిద్ధులగుట్ట


Sun,December 1, 2019 02:40 AM

mumbai
నాలుగు వందల సంవత్సరాల క్రితం తొమ్మిది మంది సిద్ధులు తపస్సు చేసిన పుణ్యస్థలం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని నవనాథ సిద్ధ్దులగుట్ట. తొమ్మిది మంది సిద్ధ్దులు నడియాడిన నేల కావటంతో నవ సిద్ధ్దులగుట్ట అనే నామకరణం జరిగింది. త్రేతాయుగంలో గుట్టపై వెలసిన స్వయం భూశివలింగం ఆనాటి నుంచి నేటివరకు భక్తులతో పూజలందుకుంటున్నది. దినదినాభివృద్ధి చెందుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందుతున్నది.

ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఒకదానితో ఒకటి పేర్చినట్లుగా నల్లని రాళ్లతో విస్తరించి, చారిత్రాత్మక ప్రాశస్త్యాన్ని సంతరించుకుంటున్నది ఆర్మూర్‌ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్ట. సహజసిద్ధంగా ఏర్పడిన గుట్టపై సువిశాలమైన స్థలంలో ప్రకృతి రమణీయత మధ్య నిర్మితమైన ఆలయాలు, ప్రకృతి వింతలు చూపరులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. గుట్టపైన ఉన్న రామాలయం, శివాలయం, జీవకోనేరు, ఏకశిలతో నిర్మాణమైన ధ్వజస్తంభాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. నల్లని రాళ్ల మధ్య శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు గుహలోనుంచి వెళ్లేదారి చూడముచ్చటగా ఉంటుంది.
పురాతన కాలంలోని మహర్షులు నిర్మించిన ఈ మందిరాలు ఆధ్యాత్మిక శోభను హృదయానికి హత్తుకునే వాతావరణాన్ని ఏర్పరిచాయి.

ఇలా చేరుకోవాలి

గతంలో పట్టణంలోని గోల్‌బంగ్లా నుంచి మెట్ల దారిలో ప్రజలు గుట్టపైకి నడుచుకుంటూ వచ్చేవారు. పదిహేనేళ్ల క్రితం గుట్ట వెనుకభాగం నుంచి ఘాట్‌రోడ్డు నిర్మించటంతో గుట్టపై వరకు భక్తులు నేరుగా వెళ్లే సౌకర్యం కలిగింది. గుహలో ఉన్న శివలింగం చుట్టూ గ్రానైట్‌, మార్బల్స్‌తో అందంగా తీర్చిదిద్దారు. శ్రీ సోమవంశీయ సహస్రార్జున మందిర నిర్మాణం చేశారు. గుట్టపై చిల్డ్రన్స్‌ పార్క్‌ ఏర్పాటు చేశారు. గుట్టపైకి కాలినడకన రావాలనుకున్న భక్తులు గోల్‌బంగ్లాకు, అక్కడి నుంచి మెట్లమార్గంలో నేరుగా శివాలయం వద్దకు చేరుకోవచ్చు. ఘాట్‌రోడ్డులో వాహన మార్గం లో వచ్చే వారు గుట్టకిందినుంచి ఘాట్‌రోడ్డు మీదుగా వాహనాల్లో నేరుగా గుట్టపైకి చేరుకోవచ్చు.

mumbai1

ఎన్నో ఆకర్షణలు

సిద్ధులగుట్టను కిందినుంచి చూస్తే కేవలం రాళ్లు మాత్రమే కనిపించినా గుట్ట పైకి వెళ్లి చూస్తే సువిశాలమైన భూభాగం కనిపిస్తుంది. రాళ్ల మధ్యలో సువిశాలమైన స్థలంలో పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లు నయనానందాన్ని కలిగిస్తాయి. నవనాథులు పూజించిన సిద్ధేశ్వరుని లింగాన్ని రాళ్ల గుహలో నుంచి వెళ్లి దర్శించుకోవడం ఒక చక్కని అనుభూతిగా ఉంటుంది. అంత ఎత్తయిన రాళ్ల గుట్టపై నిత్యం నీరుండేలా కోనేరును ఏర్పాటు చేయగా రామాలయం ఎదురుగానే తవ్విన బావిలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం నిత్యం నీళ్లు అందుబాటులో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. గుహల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన పాలగుండం, నీటి గుండం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రాతియుగం కాలంలో గుట్టకు దక్షిణం వైపున ఆర్మూర్‌ పట్టణ ప్రజలకు కనింపిచేలా ఏకశిల స్థూపాన్ని నిర్మించారు. అది ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దీనిపై రూపాయి కాయిన్‌ వేస్తే అది స్థూపంపైనే పడితే మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే ప్రచారం ఉంది. గుట్టపై ఉన్న సువిశాల స్థలంలో ఆలయ పూజారులు, స్వాములు పలు కూరగాయలు, పంటలను సైతం పండిస్తుంటారు.

mumbai1

పేరెలా వచ్చిందంటే

వందల ఏండ్ల క్రితం దేశం నలుమూలల నుంచి నవనథులైన గోరఖ్‌నాథ్‌, జలంధర్‌నాథ్‌, చరఫట్‌నాథ్‌, అపభంగనాథ్‌, కానీషనాథ్‌, మచ్చీంద్రనాథ్‌, చౌరంగీనాథ్‌, రేవనాథ్‌, బర్తరినాథ్‌ గుట్టపై ఉన్న ఒక ఇరుకైన గుహలో తమ ఇష్టదైవమైన సిద్ధేశ్వరున్ని ప్రతిష్టించి పూజలు చేశారని ప్రతీతి. దీంతో గుట్టకు సిద్ధులగుట్టగా పేరు వచ్చింది. ఈ నవనాథుల పేరునే గుట్టను ఆనుకొని ఉన్న గ్రామానికి నవనాథపురంగా నామకరణం చే
శారు. కాలక్రమంలో ఈ తొమ్మిది మంది స్వాములలో ఆరుగురు ఇక్కడి నుంచి వెళ్లిపోగా ముగ్గురు ఇక్కడే ఉండి పూజలు చేయడంతో ఆరు.. మూరు.. అంటూ కాలక్రమంలో ఆర్మూర్‌గా పేరు స్థిరపడిందని చెబుతారు. మరికొందరు పెద్దలు ఆర్మూర్‌ అనే పదం ఆరావం అనే పదం నుంచి వచ్చిందని చెబుతుంటారు. గుట్టపై విశ్రాంతికి అనువైన వాతావరణం ఉన్నందున గుట్టను ఆనుకొని ఏర్పడిన గ్రామాన్ని ఆర్మూర్‌ అనే పేరుతో పిలువడం ప్రారంభించినట్లు చెబుతారు.

429
Tags

More News

VIRAL NEWS