ప్రకృతి అందాల నెలవు ముదుమలై అభయారణ్యం


Sun,November 17, 2019 01:14 AM

VIharam
ముదుమలై అడవులు కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ర్టాలు కలిసే చోట దట్టమైన నీలగిరి అడవుల్లో ఉన్నది. దక్షిణ భారత దేశంలోనే పెద్దదిగా ముద్రపడ్డ ఈ అభయారణ్యం ప్రపంచంలోనే పేరెన్నిక కలది. దేశంలో తరిగిపోతున్న విస్తారమైన వృక్ష సంపద, జంతుసంపదను సంరక్షించటానికి క్రీ.శ. 1940 వ సంవత్సరంలో ముదుమలై ఏర్పాటుచేశారు. ఈ అడవుల్లో అరుదైన పక్షి జాతులతో పాటు అంతరించిపోతున్న వృక్షాజాతులు, పలు రకాల జంతువులు కలగలసి ముదుమలై అభయారణ్యం ప్రకృతి అందాల కలగూరగంపగా పేరుగాంచింది.

ఈ అడవిలో ఏనుగుల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసారు. దీన్ని తెప్పకడు ఏనుగుల శిబిరం అంటారు. ఈ శిబిరంలో ప్రస్తుతం 25 పై చిలుకు ఏనుగులు ఉన్నాయి. ప్రతి రోజు ఒక ఏనుగుల జంట అక్కడి వినాయకుడికి పూజలు చేస్తాయి. ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ఏనుగుల రైడ్ జరుగుతుంది. సాయంత్రం ఏనుగులు మేతకు వెళ్లే సమయం, పర్యాటకులు చూడదగింది. ఠీవిగా నడుస్తూ వెళ్లే ఏనుగుల గుంపు కనువిందు చేస్తుంది. ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ శిబిరాన్ని సందర్శించవచ్చు. ఇందులో ప్రవేశానికి 20 రూపాయలు వసూలు చేస్తారు.ఇక అన్ని రకాల జంతువులను దగ్గరగా చూడాలంటే మోయర్ నది సమీపానికి వెళ్లాల్సిందే. ఈ నది ముదుమలై అభయారణ్యం గుండా ప్రవహిస్తుంది. ఈ నది వద్దకు అడవి జంతువులు వచ్చి తమ దాహార్తి తీర్చుకుంటుంటాయి. వీటిని చూడటానికి ఇదే సరైన స్థలం. మీ వద్ద కెమెరా ఉన్నట్లయితే ఫొటోలు తీసి ఆనందించండి. జంతువులను గమనించే మరికొన్ని ప్రదేశాలు, పధాన రహదారిపై ఉన్న వంతెన అనేక రకాల పక్షులు, జంతువులూ కనిపించే గొప్ప ప్రదేశం. కల్లట్టీ జలపాతం, మోయర్ నది వద్ద అనేక జంతువులు దాహం తీర్చుకోవడానికి రావడాన్ని చూడవచ్చు, అందువల్ల ఈ ప్రదేశంలో కూడా జంతువులను తిలకించాలని అనుకునేవారికి మరో మంచి ప్రదేశం.ముదుమలైకు సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇక్కడి మ్యూజియంలో ప్రదర్శించబడుతుంటాయి. అడవులలో నివసిస్తున్న గిరిజన తెగల సంస్కృతి - సాంప్రదాయాలు ఇక్కడ గమనించవచ్చు.ముదుమలై పరిసరాలు, ఇక్కడి ప్రకృతి అందాలు, పర్వతారోహణ, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలు, ముదుమలైలో కుటుంబంతో సహా ఒక్క రోజు పర్యటన చేయటానికి అనుకూలమైన అంశాలు.పాపం పసివాడు సినిమా గుర్తుందా..? అమ్మా... చూడాలి.. నిన్నూ నాన్నను చూడాలి అనే పాట అందరికీ గుర్తుందా? ఆ పాట ఆ సినిమా లోనిదే. ఆ సినిమాలో దాదాపు అడవి సన్నివేశాలన్నీ కేరళ ,తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ముదుమలై అడవుల్లో చిత్రీకరించారు.
Animals

ముదుమలై ఎలా చేరుకోవాలి?

ముదుమలై చేరుకోవటానికి రోడ్డు, రైలు, వాయుమార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాయు మార్గం పీలమేడు వద్ద ఉన్న కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ముదుమలైకి సమీపంలోనిది. ఇది ముదుమలై నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుండి విమానాలు అందుబాటులో ఉన్నాయి. ట్యాక్సీ లేదా క్యాబ్‌ల మీదుగా ముదుమలై చేరుకోవచ్చు. రైలు మార్గం ఉదగమండలం/ఊటీ ముదుమలై కి సమీప రైల్వే స్టేషన్. ఇది ముదుమలై నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదగమండలం స్టేషన్‌నుండి ముదుమలైకి టాక్సీ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలాగే కోయంబత్తూర్ రైల్వేస్టేషన్ కూడా సమీపంలో ఉన్న మరొక ప్రధాన రైల్వేస్టేషన్. ఇది ముదుమలై నుండి 82 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డుమార్గంలో ముదుమలై వన్యప్రాణుల అభయారణ్యానికి సమీపంలో ఉన్న పట్టణం గుడలుర్. ఇది ఉదగమండలం -మైసూర్ జాతీయ రహదారిపై 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదగమండలం, మైసూర్, సమీప పట్టణాల నుండి ముదుమలై వన్యప్రాణుల అభయారణ్యానికి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అనేక మలుపుల వంపులు ఉంటాయి. అందువల్ల ఈ ప్రాంతంలో డ్రైవింగ్ చేసేటపుడు జాగ్రత్తగా ఉండడంతో పాటు అప్రమత్తంగా ఉండడం అవసరం.
Animals1

ముదుమలై అభయారణ్యంలో అటవీశాఖ వారు నిర్వహించే జంగిల్ సఫారీలు నిజంగా చూడదగినవి. పక్షి ప్రేమికులకు ఈ పార్కు స్వర్గసీమే అని చెప్పాలి. ఇక్కడ వెరైటీ రకాల జాతులకు చెందిన పక్షులను చూడవచ్చు. జంతు జాతుల్లో మానిటర్ బల్లులు, హయనాలు, తోడేళ్ళు, జింకలు, చిరుతపులులు, పులులతో పాటుగా అంతరించిపోతున్న వృక్షాలూ గమనించవచ్చు. ఏడు వందల పై చిలుకు ఏనుగులకు ఈ అభయారణ్యం స్థావరంగా ఉన్నది.
Elephants

266
Tags

More News

VIRAL NEWS