గౌతమేశ్వరుడు


Sun,November 10, 2019 02:41 AM

మహిమాన్విత మహాదేవుడు గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చి శివుడు లింగరూపంలో స్వయంభువుగా వెలసిందే గౌతమేశ్వరదేవాలయం. వేల సంవత్సరాలుగా గౌతమేశ్వరుడిగా అనేక మంది రాజవంశీయులు, భక్తులతో పూజలందుకుంటూ వారి కోర్కెలను నెరవేరుస్తూ మహిమాన్విత మహాదేవుడిగా ప్రాశ స్త్యాన్ని సంతరించుకున్నాడు. ఈ క్షేత్రంలో కాకతీయులు అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో కూడిన ఆలయాన్ని గౌతమేశ్వరుడికి నిర్మించారు.
Temple

ఎక్కడ ఉంది?: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి సమీపంలోని పవిత్ర గోదావరి నదీ తీరంలో శ్రీ గౌతమేశ్వర స్వామి కొలువైనాడు. అతి పురాతనమైన, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయం మంథని పట్టణానికి ప్రధాన ఆలయంగా ప్రశస్తిపొందింది.

ఆలయ చరిత్ర: శివపురాణంలోని కథనం ప్రకారం ఒకానొకప్పుడు దండకారణ్యంలో నీటి ఎద్దడి ఏర్పడింది. సమీపంలోని ఋషుల కోరిక మేరకు గౌతమ మహర్షి వరుణుడిని ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహంతో తన ఆశ్రమం వద్ద ఓ మడుగును నిర్మింపజేశాడు. ఈ మడుగులో ఎప్పుడూ నీళ్లుండేవి. అప్పటికింకా గోదావరినది ఆవిర్భావం కాలేదు. గోదావరి నదీగర్భంలో ఈ శాఖ మడుగు నేటికీ చూడవచ్చు. కాలక్రమేణా నీటి కొరత లేని గౌతమ ఆశ్రమంలో ఎందరెందరో చేరారు.

లోక కళ్యాణార్థం: ఓసారి మహర్షి శిష్యులలో ఒకరు గురు పూజకోసం నీళ్లు తేవడానికి వెళ్లి మడుగులో ఋషిపత్నులు స్నానం చేస్తున్న కారణంగా నీళ్లు తేలేకపోగా, గౌతముని భార్య ఆహల్యాదేవి వెళ్లి నీళ్లు తీసుకొస్తుంది. అయితే స్నానం చేస్తున్నవారిని లెక్క చేయకుండా నీళ్లు తీసుకురావడాన్ని వారు తప్పుపట్టారు. విఘ్నేశ్వరుని వద్దకు వెళ్లి గౌతముని ఆధిపత్యాన్ని సహించబోమని తేల్చి చెప్పారు. వారికి సర్దిచెప్పడంలో విఫలమైన విఘ్నేశ్వరుడు వారిని శాంత పరిచే ఉద్దేశంతో, లోక కళ్యాణార్థ్ధం ఒక సంఘటనను కల్పించాడు. విఘ్నేశ్వరుడు ఓ గోవు రూపంలో గౌతముని పంటచేలలోకి ప్రవేశించాడు.

గోహత్య పాపపరిహరం కోసం: ఒకనాడు మహర్షి ఆశ్రమానికి సమీపంలో ఒక ఆవు పంటను మేస్తుండడంతో వెళ్లగొట్టేందుకు ఒక దర్భ(గడ్డిపోచ) విసరడంతో అది తగిలి ఆ గోవు మరణించింది. గడ్డిపోచ తగిలే చనిపోవడంతో ఇదేదో మాయతత్వం కలిగిన గోవని, తన గోహత్య పాప విముక్తి కోసం గౌతమ మహర్షి గంగకోసం శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో.. అని అనడంతో మహర్షి తన గోహత్య పాపపరిహారం కోసం గంగను విడువాలని కోరడంతో శివుడు తన జటాజూటం నుంచి ఒక పాయను గంగాదేవి(గోదావరి)గా వదలిపెట్టాడు. ఆ జలం మృతి చెందిన గోవుపై నుంచి వెళ్లగానే అది ప్రాణంతో లేవడంతో మహర్షి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది అనేది కథనం. దీంతో తనతోపాటే శివున్నికూడా లింగరూపంలో ఇక్కడే కొలువై ఉండాలని మహర్షి కోరడంతో అతని కోరిక మేరకు గౌతమేశ్వరుడిగా ఇక్కడ కొలువుదీరాడు.

కాకతీయుల శిల్పకళ:గౌతమ మహర్షి తపస్సు చేసిన, శివుడు స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రంలో కాకతీయులు అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో కూడిన ఆలయాన్ని నిర్మించారు. గర్భాలయంతో పాటుగా మూడు మండపాలను రాతి శిలలతో చెక్కిన తీరు చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నది. ప్రతీ నిత్యం మంథనితో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి గోదావరి నదీ పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు గౌతమేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తుంటారు. మహా శివరాత్రి సందర్భంగా శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించడం ఆలయ సాంప్రదాయంగా వస్తున్నది. గౌతమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే భారీ నందీశ్వరుడు, పార్వతీ మాత, శివ పంచాయత, సీతారామ, మహాసరస్వతీ, హనుమాన్ ఆలయాలు, గోదావరి తీరంలో రామలింగేశ్వర, పంచముఖ బ్రహ్మ, మరికొద్ది దూరంలో సురాభాండేశ్వర స్వామి ఆలయాలు భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాయి.

241
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles