అందమైన పూలదారి గుల్మార్గ్


Sun,November 10, 2019 02:35 AM

కాశ్మీర్ పేరు చెప్పగానే అందమైన పచ్చదనం, ప్రకృతి సోయగం గుర్తుకు రావడం సహజం. సుందర కాశ్మీరం భారతీయులకే కాదు ప్రపంచ యాత్రికులకూ భూలోక స్వర్గమే. ఇంత అందమైన కాశ్మీరంలోని సుందర ప్రదేశాల్లో ప్రపంచంలోనే పేరుగాంచింది గుల్మార్గ్. ఇది ఉద్యానవనాలు, సరస్సులు, పర్వతాలు, పచ్చిక బయళ్లతో అలరింపజేస్తుంది.పువ్వులు పూసే.. పువ్వులు పూసే: గుల్ అంటే పువ్వులు, మార్గ్ అంటే పచ్చిక బయళ్ళు. గుల్మార్గ్ అంటే పువ్వులతో కూడిన పచ్చిక బయళ్ళు అని అర్థం. గుల్మార్గ్‌లో కనిపించే పువ్వుల వైవిధ్యం మనకు మరెక్కడా కనిపించదు. పూలరంగులలో, రూపాలలో మహాద్భుతం ఇక్కడ తాండవిస్తుంది. అందుకేనేమో ఇక్కడికి వచ్చిన సందర్శకులెవ్వరూ రంగురంగుల పువ్వులను సేకరించకుండా ఉండలేరు. జహంగీర్ చక్రవర్తి తన బహుభార్యలకు బహుమతులుగా పువ్వులను ఇచ్చేందుకు గుల్మార్డ్‌కు వచ్చాడట. ఒక్కొక్క భార్యకు ఒక ప్రత్యేక పువ్వును ఇచ్చెందుకు సేకరించగా, ఇంకా అనేక రకాల పూల జాతులు మిగిలిపోయాయట. అలా ఈ ప్రాంతానికి గుల్మార్గ్ అనే పేరు వచ్చింది. ఇక్కడి టీ చాలా ప్రసిద్ధి. కహనా అనే ఈ టీలో బాదామ్, ఏలకులు, దాల్చినీ వేసి బ్లాక్ టీ తాగుతారు. ఇక్కడ అంతా మంచు వెనీలా ఐస్క్రీమ్ పరచినట్లు ఉంటుంది. మంచి నీళ్లు దొరకవు. మంచునే వేడి చేసుకుని తాగాలి.
Gulberg

ఒక్కర్వాల్: ఒక్కర్వాల్ అనేది వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం. ఒక్కర్వాల్ అంటే గొర్రెల కాపరులు వేసవిలో పాకిస్థాన్ నుంచి గొర్రెల మందల్ని తెచ్చి గుల్మార్గ్, సోన్మార్‌ల దగ్గరకొస్తారు. వాళ్లు మందల్ని తేవటం అంతా ఆర్మీ పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఈ గొర్రెల కాపరులు కుటుంబాలతో వచ్చి చలికాలం రాగానే వెళ్లిపోతారు. ఇంకో విశేషం ఏంటంటే... ఇక్కడి కొన్ని హిందూ దేవాలయాల్లో ముస్లిం పూజారులు కూడా వున్నారు. ఆర్మీ యూనిట్లలో గుడి, చర్చి, మసీదు, గురుద్వారాలు... అన్నీ ఒకేచోట వుంటాయి.

స్ట్రాబెర్రీ లోయలు: స్ట్రాబెర్రీ తోటలు గుల్మార్గ్ లోయలోని మరో అద్భుతమైన ప్రదేశం. పండ్లుకోసే సీజన్‌లో తప్పక సందర్శించాలి. స్ట్రాబెర్రీ తోటల్లో షికారు చేయడానికి, తాజాపండ్లను రుచి చూడడానికి తోట యాజమానులు అనుమతిస్తుంటారు. ఈ ప్రదేశం బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

వింటర్ స్పోర్ట్స్ స్పాట్: హాలీడే స్పాట్‌గా ఖ్యాతిగాంచిన ఈ గుల్మార్గ్ రిసార్ట్స్ ఎప్పుడు చూసినా యాత్రికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే గోల్ఫ్ క్రీడా మైదానం ఇక్కడే ఉండటం విశేషం. అలాగే స్కైయింగ్ క్రీడకు గుల్మార్గ్‌ను ప్రత్యేక విడిదిగా చెప్పుకోవచ్చు. చలికాలపు ఆటల విడిదిగా కూడా గుల్మార్గ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

గుల్మార్గ్ బయోస్పియర్ రిజర్వ్‌లు: గుల్మార్గ్ బయో స్పియర్ రిజర్వ్‌లు వాటి పచ్చదనానికి వన్యజీవులకు ప్రసిద్ధి ఇవి సుమారు 180 చ.కీ. లలో విస్తరించి సముద్ర మట్టానికి 2,400 నుండి 4,300 మీటర్ల ఎత్తున ఉంటాయి. ఈ రక్షిత అడవి అరుదైన పక్షులకు నిలయం.

మహారాణి టెంపుల్: మహారాణి టెంపుల్‌నే రాణి టెంపుల్ అని కూడా అంటారు. ఇది గుల్మార్గ్ హిల్ స్టేషన్ మధ్యలో ఉంది. ఈ టెంపుల్‌ను 1915లో కాశ్మీర్‌లో రాజపాలన చివరిలోని మహారాజా హరిసింగ్ భార్య మోహిని బై సిసోదియా నిర్మించారు. ఈ టెంపుల్‌ను మొహినేశ్వర్ శివాలయంగా పునరుద్ధరించి గుల్మార్గ్‌లోని అన్ని మూలల నుండీ కనపడేలా చేసారు. ఈ టెంపుల్‌లో శివుడు, మాత పార్వతి వుంటారు. అన్ని సీజన్లలోను భక్తులు వస్తారు. ఇక్కడి ప్రశాంత వాతావరణంలో భక్తులు ధ్యానం కూడా చేస్తారు.

గొందోలా లిఫ్ట్: ఇది ఒక కేబుల్ కారు. దీన్ని కాశ్మీర్ ప్రభుత్వం ఆ ప్రదేశ అందాలను ఆకాశం నుండి చూపెట్టేందుకు ఏర్పరిచింది. సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తున కల ఈ లిఫ్ట్ రెండు మార్గాల్లో ప్రయాణిస్తుంది అవి గుల్మార్గ్ నుండి కొంగ్దూర్ 5 కి. మీ.లు. రెండవది కొంగ్దూర్ నుండి అఫర్వాట్ 2 కి.మీ.ల దూరంగా వుంటుంది. ఈ కేబుల్ కార్‌లో పర్యాటకులు ప్రయాణించి ఈ ప్రాంత అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. గుల్మార్గ్ నుండి కొంగ్దూర్ వెళ్ళే మార్గంలో 19 టవర్లు తగులుతాయి. ఈ లిఫ్ట్ గంటకు 1,500 మందిని చేరవేస్తుంది. కొంగ్దూర్ నుండి అఫర్వాట్ వెళ్ళే మార్గంలో 19 టవర్లు ఉంటాయి. ఇది సుమారు గంటకు 600 మందిని చేరవేస్తుంది.

మంచులో స్కేటింగ్

గుల్మార్గ్‌కు మంచులో స్కేటింగ్ చేసేందుకు విదేశీ టూరిస్టులు వస్తారు. ఆ మంచులో కాళ్లు వేస్తే మోకాళ్ల వరకు, కూరుకుపోతూ ఉంటాయి. కొంత నడిచి, గండోలాలో రోప్ వే పైన మంచుకొండల మీదకి వెళ్లవచ్చు. ఇక్కడి ప్రజలు కాగితం గుజ్జుతో రకరకాల షో పీసులు, ఎంబ్రాయిడరీ, జరీపని, తివాచీలు తయారు చేస్తారు. ఫాస్మిలాన్ అనే దారం రాట్నం మీద వడుకుతారు. రంగుల దారాలు పెన్సిలంత కర్రలకి చుట్టి వరుసగా రంగుల కలయికలో ఉంచి, సంగీతంలో సరిగమల్లా (రంగుకి ఒక ఆకారం చొప్పున) రాసు కొంటారు. అది చూసి షాల్స్ అల్లుతారు. హమ అనే ఊరిలో జరీపని కూడా చేస్తారు. ఈ జరీపనిని మావార్ అంటారు. పూర్వపు రాజులు, బాద్‌షాలు తలపాగాలు, నడుంకి కట్టుకునే పట్టాలు, అంగీలు, జరీపనితో వున్నవి ధరించేవారట. జరీపని వున్న షాల్ నేయటానికి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది.
Gulberg1

249
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles