చిన్న మనసు.. పెద్ద బాధ్యత


Sun,November 10, 2019 02:20 AM

పిల్లలూ..! పొద్దస్తమానం ఫోన్లు, కంప్యూటర్, వీడియోగేమ్స్ అంటూ మారాం చేస్తున్నారా?.. ఇదిగో వీరిని చూడండి.. అతిచిన్న వయసులోనే ఎన్నో అద్భుతాలు చేశారు. ఉద్యమకారులుగా, బ్రాండ్ అంబాసిడర్లుగా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా, రచయితగా ఆయా రంగాల్లో తమ ప్రతిభ చూపుతున్నారు. ఈ బాలల దినోత్సవం సందర్భంగా అతి చిన్నవయసులోనే అతిపెద్ద బాధ్యతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నారుల గురించి మీరూ తెలుసుకోండి.

-పసుపులేటి వెంకటేశ్వరరావు

రూ.55 కోట్లు ఆర్జించింది

బోరమ్ ట్యూబ్ వ్లోగ్, బోరమ్ టాయ్ రివ్యూ పేరుతో రెండు యూట్యూబ్ చానెళ్లను మొదలు పెట్టింది దక్షిణ కొరియాకు చెందిన బోరమ్ అనే ఆరేండ్ల పాప. ఒక చానెల్ ద్వారా కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన లెగో టాయ్స్, పజిల్స్, మేకప్ టాయ్స్, ప్లే హౌస్ వంటి రకరకాల బొమ్మలతో ఆడుతూ వాటి పనితీరు ఎలా ఉన్నదీ సమీక్షిస్తుంటుంది. మరో చానెల్లో ముద్దు ముద్దు చేష్టలతో అల్లరి పనులు చేస్తుంటుంది. సరదా సాహసాలతో ఆశ్చర్యపరచడమేకాకుండా కడుపుబ్బ నవ్విస్తుంది. ఇలా చేయడం ద్వారా బోరమ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నది. ఆమె యూట్యూబ్ చానెళ్లలో అప్‌లోడ్ చేసిన వీడియోలను 30 కోట్ల మంది వీక్షించారు. రెండు చానెళ్లను దాదాపు మూడు కోట్లమంది ఫాలో అవుతున్నారు. దీంతో ప్రకటనల ద్వారా రూ.55 కోట్లు ఆర్జించింది ఈ చిన్నారి.
Little_Baby

చిన్నారి ఉద్యమకారిణి

మణిపూర్‌కు చెందిన ఏడేండ్ల లిసిప్రియ కంగుజమ్ వాతావరణ మార్పులు, భూతాపం వంటి ప్రపంచ సమస్యలపై ఉద్యమిస్తున్నది. అందుకోసం ప్రపంచదేశాల్లోని పెద్ద పెద్ద వేదికలపై ఉపన్యాసాలిస్తున్నది. భారత పార్లమెంటు ముందు ఫ్లకార్డులు పట్టుకొని ైక్లెమేట్ చేంజ్ లా తీసుకురావాలని ప్రదర్శనలు చేసింది. సింగపూర్, థాయ్‌లాండ్, అంగోలా వంటి దేశాల్లో పర్యటిస్తూ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను గురించి వివరించింది. పర్యావరణ సంరక్షణకు సంబంధించిన సదస్సులు ఏ దేశాల్లో జరిగినా లిసిప్రియ కంగుజమ్‌కు తప్పనిసరిగా ఆహ్వానాలు వస్తుంటాయి. పర్యావరణ సంరక్షణ కోసం పాటుపడుతున్న ఈ చిన్నారి ఉద్యమకారిణికి అరుదైన గౌరవం దక్కింది. లిసిప్రియ కృషిని గుర్తించిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2019 సంవత్సరానికిగాను వరల్డ్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్‌తో సత్కరించింది.
boram-youtuber

12 ఏండ్లకే పాతికవేల జీతం

హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన 12 ఏండ్ల సిద్ధార్థ్ ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం సంపాదించి ఔరా అనిపించాడు. ఏడో తరగతి చదువుతున్న ఈ బుడతడు చిన్నప్పటి నుంచి కంప్యూటర్‌పై ఆసక్తి కనబరిచేవాడు. సిద్ధార్థ్ తల్లిదండ్రులు కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావడంతో అతని ఆసక్తిని గమనించి కంప్యూటర్ విద్యలో ప్రోత్సహించడం మొదలు పెట్టారు. అతను నాలుగో తరగతి చదివే సమయంలో కంప్యూటర్ గేమ్స్ ఆడేవాడు. ఆ సమయంలోనే అతను ఆ గేమ్స్ ఎలా తయారవుతాయనే విషయాన్ని తెలుసుకున్నాడు. తల్లిదండ్రులు సిద్ధార్థ్‌కు సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ వంటి కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్పించారు. ఆరు నెలల్లోనే డేటా సైన్స్‌పై పట్టు సాధించాడు. ప్రస్తుతం ఏడోతరగతి చదువుతున్న అతని ప్రతిభను మోంటేన్ స్మార్ట్ బిజినెస్ ప్రైవేట్ సొల్యూషన్స్ అనే కంపెనీ గుర్తించింది. తమ సంస్థలో సిద్ధార్థ్‌కు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 12 ఏండ్లకే పాతికవేల జీతం సంపాదించే ఉద్యోగం రావడంతో అందరూ సిద్ధార్థ్‌ను ప్రశంసిస్తున్నారు.
siddhaarth-software

మన బ్రాండ్ అంబాసిడర్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు, వాటి పొడవు, సామర్థ్యం వంటి వివరాల గురించి 20 నిమిషాలపాటు ప్రసంగించి ఆకట్టుకున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన నేహాల్. అన్నారం వద్ద గోదావరినదిపై నిర్మిస్తున్న ఆనకట్టకు వాడుతున్న కొత్త సాంకేతికత గురించి అనర్గళంగా చెప్పగలడు. కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ పాయింట్‌కు మార్చడం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా పలు ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఐదేండ్ల ఈ బుడతడి ప్రతిభకు ఫిదా అయిన అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అతన్ని తెలంగాణరాష్ట్ర నీటిపారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. నేహాల్ చదువుకు అయ్యే ఖర్చంతా నీటిపారుదల శాఖ భరిస్తున్నది.
brand-ambassidor-nehal

ఫొటో తెచ్చిన బహుమతి

పంజాబ్‌లోని జలంధర్ నగరానికి చెందిన పదేండ్ల అర్షదీప్‌కు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే అతన్ని అద్భుతమైన ఫొటోగ్రాఫర్‌ను చేసింది. అర్షదీప్ తండ్రి రణదీప్ సింగ్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్. తండ్రితో కలిసి బయటకు వెళ్లేటప్పుడు అర్షదీప్ కెమెరా వెంటతెచ్చుకునేవాడు. ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ పక్షులను, జంతువులను ఫొటోలు తీస్తుండేవాడు. ఓ రోజు తండ్రితో కలిసి వెళ్తుండగా దారిలో చిన్న పైపులోకి గుడ్లగూబ వెళ్లడం చూశాడు. అది మళ్లీ బయటకు వచ్చేంతవరకు వేచి చూసి, బయటకు రాగానే ఫొటో తీశాడు అర్షదీప్. ఆ ఫొటో అతనికి అరుదైన గౌరవం తెచ్చిపెట్టింది. 2018 సంవత్సరానికిగాను అర్షదీప్‌ను యంగ్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ అవార్డు వరించింది. బ్రిటన్‌కు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రపంచంలోనే పెద్దఎత్తున వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తుంది. ఈ పోటీల్లో అర్షదీప్ తీసిన ఫొటోకు బహుమతి వచ్చింది.
arshdeep-photographer

బాధ్యతకు పెటా

మిజోరానికి చెందిన డెరెక్ సీ లాల్‌ఛన్‌హిమాకు ఆరేండ్లు. ఈ బాలుడు సైకిల్ తొక్కుతుండగా ఓ కోడిపిల్ల ప్రమాదవశాత్తు పడి చనిపోయింది. ఆ విషయం తెలియని డెరిక్ దానిని రక్షించడానికి చాలా ప్రయత్నం చేశాడు. కోడిపిల్లకు చికిత్స అందించాలని అతని తండ్రి ధీరజ్‌ను కోరగా ధీరజ్ సరదాగా నువ్వే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి చికిత్స చేయించు అన్నాడు. ఆ పసివాడు డబ్బాలో తాను దాచుకున్న రూ.10 నోటుతోపాటు కోడిపిల్లను తీసుకొని ఆసుపత్రికి వెళ్లాడు. కోడిపిల్లను బతికించమని అక్కడి వైద్యుణ్ణి కోరాడు. డెరెక్ అమాయకత్వాన్ని, మానవత్వాన్ని చూసి ముచ్చట పడిన ఓ నర్సు అతన్ని ఫొటో తీసింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డెరెక్ ప్రయత్నానికి పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా)సంస్థ దయార్థ హృదయం గల బాలుడు అవార్డును అందించింది.

గ్రీన్ మిషన్ ప్రచారకర్త

మణిపూర్‌కు చెందిన ఎలంగ్‌బామ్ వాలెంటినాదేవి అనే ఈ ఏడేండ్ల బాలికకు మొక్కలంటే ఎంతో ఇష్టం. ఆమె ఒకటో తరగతి చదివేటప్పుడు తమ ఇంటి దగ్గర రెండు మొక్కలు నాటింది. వాళ్లుండే వీధిలో కాలువల నిర్మాణంలో భాగంగా కొన్నాళ్లకు చిన్నారి నాటిన చెట్లను అధికారులు నరికేశారు. దీంతో ఆమె విలపించింది. ఆమె ఏడ్చిన వీడియో తీసిన ఆమె బంధువు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. చివరకు ఆ వీడియో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వద్దకు చేరింది. స్పందించిన ఆయన అక్కడి రాష్ట్రప్రభుత్వం పర్యావరణ సంరక్షణ కోసం అమలు చేస్తున్న గ్రీన్ మిషన్ పథకానికి ఎలంగ్‌బామ్ వాలెంటినాదేవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. తాను నాటిన చెట్ల కోసం ఏడ్చిన ఆ చిన్నారికి చాలామంది పర్యావరణ ప్రేమికులు మొక్కలు పంపి ఓదార్చారు.

135 పుస్తకాల రచయిత

హోం వర్కు చేసే వయసులో ఏకంగా పుస్తకాలు ప్రచురించడం మొదలు పెట్టాడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫజియాబాద్‌కు చెందిన 12 ఏండ్ల మృగేంద్రరాజ్. ఆరేండ్ల వయసు నుంచే పుస్తకాలు రాయడం మొదలు పెట్టాడు. పద్యాలతోపాటు రామాయణంలోని 51 పాత్రలను గురించి విశ్లేషిస్తూ కొన్ని పుస్తకాలు రాశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, వంటి ప్రముఖుల జీవితచరిత్రలకూ పుస్తకరూపమిచ్చాడు. ఇప్పటి వరకూ 135 పుస్తకాలు రాశాడు. మృగేంద్రరాజ్ రామ్, పినాక్, ప్రహస్త్ పేర్లతో ఆ పుస్తకాలను మార్కెట్‌లోకి తీసుకువచ్చాడు. ఎక్కువ బయోగ్రఫీలు రాసిన చిన్నవయస్కుడిగా గోల్డెన్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. ఎంతోమంది ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులూ అందుకున్నాడు.

238
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles