పద్య రత్నాలు-27


Sun,November 10, 2019 01:29 AM

గుణవంతుని తత్వం

ఉరుగుణవంతు డొడ్లుదన కొండపకారము సేయునప్పుడున్
బరహితమే యొనర్చు నొకపట్టుననైనను గీడుజేయగా
నెఱుగడు నిక్కమే కదయ దెట్లన గవ్వముబట్టి యెంతయున్
దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదె వెన్న భాస్కరా!!
-భాస్కర శతకం
Poem

తాత్పర్యం:మంచి చేసిన వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు చేయడంలో గొప్పతనం ఏమీ ఉండదని మన పెద్దలు అంటారు. మంచి చేసిన వారికి మంచి చేయడం మరింత గొప్ప మానవత్వం అనిపించుకొంటుంది. అలాగే, చెడు చేసిన వారికి ప్రతిగా చెడునే చేయకుండా, మంచి చేయడమే ఉత్తమ లక్షణం. ఇదే గుణవంతుని తత్వం కూడా. ఎలాగైతే, పెరుగును ఎంత చిలికినా వెన్ననే వస్తుందో అలా.

భక్తి మార్గమే శరణ్యం

నీతో యుద్ధము చేయనోప, గవితానిర్మాణ శక్తిన్నినున్
బ్రీతుం చేయగలేను, నీ కొరకు తండ్రిన్ చంపగాజాలనా
చేతన్ రోకట నిన్ను మొత్త వెఱతున్, జీకాకు నా భక్తి యే
రీతి న్నాకిక నిన్ను చూడగనగున్ శ్రీకాళహస్తీశ్వరా!
- శ్రీ కాళహస్తీశ్వర శతకం
Poem1

తాత్పర్యం:సామాన్యుడికి భక్తిని మించిన మార్గం లేదు. ఈశ్వర కరుణకోసం తనవల్ల కాని పనులు అతను చేయలేడు. అర్జునునిలా యుద్ధం చేతకాదు. కవిత్వం వల్లిస్తూ ఆనందాన్నిచ్చేలా స్వామిని ఆకర్షించలేడు. కన్నతండ్రిని చంపడం వంటి దిగజారుడుతనాన్నీ ప్రదర్శించలేడు. రోకలితో కొట్టి దబాయించే శక్తివంతుడూ కాడు. అందుకే, నాకు భక్తిమార్గమే శరణ్యం స్వామీ!

నను బ్రోవుమయ్యా..

నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా!
- శ్రీ కృష్ణ శతకం
Poem2

తాత్పర్యం:నారాయణ అన్న నామాన్ని ఎన్నిసార్లు పలికినా తనివి తీరదు కదా. ఓ శ్రీ కృష్ణా! నువు మహాలక్ష్మీపతివి. ఇటు వసుదేవునికి, అటు నందునికి సుపుత్రుడవైనావు. బ్రహ్మాండమైన కొండనే ఆభరణంగా ధరించిన వీరుడవు. నాకు నువ్వు తప్ప మరెవరు దిక్కు, నిన్నే నమ్ముకొన్నాను. నను బ్రోవుమయా స్వామీ!

నామస్మరణను మించింది లేదు!

గౌతమీ స్నానాన గడతేరుదమటన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను
దీర్ఘయాత్రలచే గృతార్థు డౌదమటన్న బడలి నీమంబులె నడపలేను
దానధర్మముల సద్గతిని జెందుదమన్న ఘనముగా నాయొద్ద ధనము లేదు
తపమాచరించి సార్థకము నొందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను
కష్టములకోర్వ నా చేతగాదు, నిన్ను
స్మరణ జేసెద నా యథాశక్తి కొలది
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- నరసింహ శతకం
Poem3

తాత్పర్యం:పవిత్ర గౌతమీ (గోదావరి) నదిలో చన్నీళ్ల స్నానం చేయలేను. తీర్థయాత్రలు చేసే ఓపికా లేదు. దానధర్మాలు చేయడానికి కావలసినంత ధనం లేదు. ముక్కు మూసుకొని తపస్సు చేయడానికి మనోనిగ్రహం లేదు. ఇంకే కష్టాలనూ భరించలేను. నాకు చేతనైన మేర నీ నామస్మరణ చేస్తాను. ఇదొక్కటే నాకున్న నిర్మల భక్తికి
నిదర్శనం స్వామీ!

215
Tags

More News

VIRAL NEWS