పథకం


Sun,November 3, 2019 04:08 AM

ప్రమాదం తర్వాత విక్ అనేక నెలలపాటు తను జీవించి ఉంటాడా? లేక మరణిస్తాడా? అన్నది పట్టించుకోలేదు. అతనికో అవకాశం ఉంటే మరణించడానికే ఇష్టపడ్డాడు. కానీ, పక్షవాతంతో చాలా అవయవాలు కదలక, మాటకూడా లేకపోవడంతో ఆ విషయంలో అతనేం చేయలేకపోయాడు.మంచం మీద కదలికలు లేకుండా పడుకుని పై కప్పువైపు చూస్తూ రోజుల తరబడి గడుపుతున్నాడు. నర్సింగ్‌లో శిక్షణ పొందిన అతని భార్య థెల్మా మాత్రం అతనికి స్నానం చేయిస్తూ, భోజనం తినిపిస్తూ, అతనికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అతని ప్రతీ అవసరాన్నీ ముందే ఊహించి, వాటిని అందిస్తూ ఉత్సాహంగా చూస్తున్నది. అతన్నించి అరగంటకి మించి దూరంగా ఉండటం లేదు.అతనికి మంచినీళ్ళు ఇస్తూ చెంపమీద ఆప్యాయంగా తడుతుంది. ఎప్పుడూ ఆ చెంపమీదే. ఎప్పుడూ అలాగే. ఆమె తన చెంప పగులకొడితే రొటీన్‌కి భిన్నంగా ఉండి విసుగు పోతుందని విక్ అనేకసార్లు అనుకున్నాడు.చివరికి థెల్మా తన సపర్యలతో అతనికి తిరిగి బతుకుమీద ఆశని కలిగించింది. అతన్ని చూడటానికి ఆమె ఎవరినీ ఇంటికి రానివ్వదు. ఎవరినీ అతన్ని ముట్టుకోనివ్వదు. దాంతో అతనికి ప్రతీ రోజు ఒకేలా ఉండి తేడా తెలీడం లేదు. క్రమంగా విక్‌కి తను మంచం ఎక్కడానికి థెల్మానే కారణం కాబట్టి, ఆమె అంటే ద్వేషం కలిగి, ఆమెని చంపాలని ఓ రోజు నిర్ణయించుకున్నాడు.ఫుట్‌బాల్ స్టారైన విక్ శారీరకంగా బలవంతుడు. థెల్మా అతనికి అభిమానిగా పరిచయమైంది. ఆమె తన అభిమానులు అందరిలోకీ ధనవంతురాలని తెలీగానే విక్ ఆలస్యం చేయకుండా ఆమెని పెండ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఓ రోజు వీకెండ్‌కి కారులో వెళుతుండగా దాన్ని డ్రైవ్ చేసే థెల్మా కునుకు తీసింది. కారు ఓ చెట్టుకి గుద్దుకోవడంతో కారుకున్న ముందు అద్దం పగిలి విక్ అందులోంచి బయటకి విసిరేయబడ్డాడు.
CRIME-STORY

థెల్మాకి చిన్నపాటి దెబ్బలు తప్ప పెద్దగా గాయాలు కాలేదు. అతనికి కుడిచేతికి కొద్దిపాటి కదలికలు తప్ప మిగిలిన శరీర భాగాలు అన్నింటికీ పక్షవాతం వచ్చింది. మాటకూడా పడిపోయింది.పక్షవాతంతో కదల్లేని మనిషి తన భార్యని హత్య చేయాలని అనుకోవడం విచిత్రమే. అతను దాని గురించి ఆలోచించడం మినహా ఇంకేం చేయలేడు. థెల్మా నిర్మానుష్యంగా ఉండే ఓ కొండమీది ఒంటరి కాటేజ్‌ని అద్దెకి తీసుకుంది. అది అతనికి ప్రశాంతతని ఇచ్చి, తన స్థితికి రాజీ పడేలా చేస్తుందని ఆమె నమ్మింది. విక్ కూడా తననలా ఎవరూ చూడటానికి ఇష్టపడక పోవడం వల్ల అది అతనికి ఇబ్బంది కలిగించలేదు. సగటున రెండు వారాలకి ఒకరు మించి ఆ కాటేజ్‌కి రారు.డార్లింగ్! ఇంతకంటే ఎక్కువ హాని కలగనందుకు సంతోషించాలి. మీరు చూడగలరు. వినగలరు. మీ కుడిచేతికి కొద్దిగా కదలిక ఉంది. త్వరలోనే మీ భోజనాన్ని మీరే తినగలరు అతనికి ఉత్సాహాన్ని కలిగించే ప్రయత్నంగా థెల్మా అప్పుడప్పుడూ చెప్తూంటుంది.

అతని చేతి కండరాలకి ఎక్సర్‌సైజ్ చేయడానికి ఓ గట్టి బంతిని కూడా ఇచ్చింది. అతని చేతికి ఆ బంతిని విసిరేంత శక్తికూడా లేదు. తను ద్వేషించే వారిమీద పూర్తిగా ఆధారపడటం ఎంత కష్టం అనుకున్నాడు. ఒకోసారి తన పరిస్థితికి ఏడుపుకూడా వస్తూంటుంది. అలాంటప్పుడు థెల్మా అతని బుగ్గలని నిమిరి, అతని ఛాతీమీద తన తలని ఉంచి చెప్తుంది.నేను ఇక్కడే ఉన్నాను. ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను. ఈ థెల్మా నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్ళదు.మనసులో అతను ఆమెకి దూరంగా వెళ్ళి తనని వంటరిగా వదలమని అరిచేవాడు. ఆమె నడకని, నవ్వుని, ఆమె ఆరోగ్యాన్ని ద్వేషించసాగాడు. డార్లింగ్! ఇవాళ నువ్వు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నావు. నీలో అభివృద్ధి జరుగుతున్నదన్నది స్పష్టం. గట్టిగా ప్రయత్నిస్తే నువ్వు త్వరలో కోలుకోగలవు. బహుశా ఓ రోజు నడవగలవు కూడా. డాక్టర్ అందుకు అవకాశం లేకపోలేదనీ అన్నాడు. నువ్వు జీవించి ఉన్నందుకు సంతోషించాలి.పోయుంటే బావుండేది. నా పక్కనే నీ శవం కూడా ఆ కారు ప్రమాదంలో ఉండి ఉంటే నాకీ చిత్రవధ ఉండేది కాదు మనసులో ఆక్రోశించాడు.ఓసారి అతనికి థెల్మా తనని చంపొచ్చనే ఆలోచన కలిగి అది భయాన్ని కలిగించింది. ఎంత కాలం తన జీవితాన్ని నాశనం చేసుకుని ఇలా తనకి కట్టుపడి ఉంటుంది? ఆమె జీవితంలోకి ఇంకొకరు ప్రవేశించడానికి తను అడ్డంకి అవుతాడు. బతికున్న శవానికి ఎంతకాలం బంధింపబడుతుంది?

అలాంటి ఆలోచనలు అతన్ని భయపెట్టి ఆమెని చంపాలనే నిశ్చయానికి బలం చేకూర్చసాగాయి. కానీ ఎలా? ఓ రోజు ఆమె అతని ఛాతీమీద తన తలని ఉంచి బీచ్‌లో తను చూసిన పీతల గురించి చెప్తూంటే, కుడిచేత్తో ఆమె మెడని నిమరసాగాడు. దాన్ని పిసికే శక్తి ఆ చేతికి ఉంటేనా? అనుకున్నాడు. ఆమెని చంపితే తనని ఎలక్ట్రిక్ చెయిర్లో కూర్చోపెట్టక పోవచ్చు. పక్షవాతపు రోగి అలా చంపడం గురించి తను ఎన్నడూ వినలేదు. కానీ, తనని మెంటల్ హాస్పిటల్‌కి పంపొచ్చు. అక్కడ నించి ఇక తను బయటపడలేడు. బదులుగా పట్టుబడకుండా ఆమెని హత్య చేస్తే తను ఆమె ఆస్తికి వారసుడు అవుతాడు. ఏదో ఓ రోజు ఎవరైనా స్పెషలిస్ట్ డాక్టర్ తనని బాగు చేయవచ్చు.అతను తన కంటికి కనపడే ప్రతీ వస్తువుని, అది హత్యాయుధంగా పనికి వస్తుందా అని పరిశీలించసాగాడు.
అతని వేళ్ళు కొద్దిగా బలం పుంజుకున్నాక థెల్మా ఓ పెన్సిల్‌ని, నోట్‌బుక్‌ని అతని ఛాతీమీద ఉంచసాగింది. అతను చెప్పాలనుకుంది అందులో రాయసాగాడు. ఓ రోజు అతను రాసాడు.

నీ వల్లే కదా నేనిలా మంచాన పడింది. ఐనా, నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావు?ఆమె అది చదివి లేచి పక్క గదిలోకి వెళ్ళిపోయింది. ఆ గదిలోంచి ఆమె ఏడుపు అతనికి చాలాసేపు వినిపించింది.ఓ రోజు అతనికో దారి దొరికింది. పథక రచన చేసాడు. ఆమె అతని నోట్లో నిద్రమాత్ర ఉంచింది. దాన్ని తన నాలిక కింద దాచి మింగినట్లు నటించాడు. తర్వాత దాన్ని తీసి, ఎండాక పక్కనే ఉన్న ఓ కవర్లో వేసాడు. ఆమెని చంపేయడానికి నిద్ర మాత్రలు సేకరించాలని నిశ్చయించుకున్నాడు. ఈ పథకం అతనికి కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. తర్వాతి కొన్ని వారాల్లో అతనో డజను మాత్రలని ఆమెకి అనుమానం కలుగకుండా సేకరించగలిగాడు. సగటు మనిషిని పది నిద్ర మాత్రలు చంపుతాయని అతను ఎక్కడో చదివాడు. కానీ, ఇంకొన్ని మాత్రల కోసం ఆగాడు. అతను బాబ్ థామ్సన్‌ని కూడా ద్వేషించసాగాడు. అతను చిరకాల మిత్రుడు. వారి కాటేజ్‌కి కొద్ది మైళ్ళ దూరంలో అతను కిరాణ దుకాణాన్ని నడుపుతున్నాడు. విక్‌కి ప్రమాదం జరిగినప్పటి నించి అతను సరుకులని స్వయంగా ఇంటికి తెచ్చిచ్చే సహాయం చేస్తున్నాడు. తను గాఢ నిద్రలో ఉండగా అతను తన ఇంటికి వచ్చి థెల్మాని కలిసి వెళ్తున్నాడనే పీడకలలు అతనికి రాసాగాయి. అతన్ని రానివ్వద్దని థెల్మాకి నోట్‌ప్యాడ్ మీద రాస్తే దాన్ని చదివి ఆమె నిర్ఘాంతపోయింది.ఇదేమిటి విక్? అతను మనకి చాలాకాలంగా మంచి మిత్రుడు. ఐనా, అతను వచ్చేది శనివారాలేగా? మిమ్మల్ని ఒంటరిగా వదిలి రెండుమూడు గంటలు అతని దుకాణానికి వెళ్ళి రావడం ఇష్టం లేక అతన్నే సామాను తెమ్మని కోరాను చెప్పింది.నాకు అతనంటే ఇష్టం లేదు. నిద్ర మాత్ర ఇవ్వు రాసాడు.ఇవి ఎక్కువ తీసుకోవద్దని, లేదా అలవాటైతే ఇవి వేసుకోకుండా నిద్ర పట్టకపోవచ్చని డాక్టర్ చెప్పారు.

అతనికో నిద్ర మాత్రని ఇచ్చింది. దాన్ని నోట్లో వేసుకున్నట్లు నటించి మంచినీళ్ళు తాగాడు.ఇప్పుడు అతని పథకంలో బాబ్‌కి కూడా ఓ పాత్రని ఇచ్చాడు. విక్ రహస్యంగా గత కొన్ని వారాలుగా రాస్తున్నట్లుగా డైరీని రాయడం ఆరంభించాడు.
థెల్మా గురించి నాకు భయంగా ఉంది. బాబ్ థామ్సన్‌తో సంబంధం ఆమెని ఇబ్బంది పెడుతున్నది. నన్నేదైనా హోమ్‌లో చేర్పించి, ఎవర్నయినా పెండ్లి చేసుకోమని థెల్మాకి చెప్పాను. నాకు బయట వాళ్ళెవరైనా ఓసారి కనపడితే బావుండును. థెల్మా డిప్రెషన్ తీవ్రస్థాయికి చేరుకుందని అనిపిస్తున్నది. బాబ్‌తో ఆమె సంబంధం క్రిటికల్ పాయింట్‌కి చేరిందని నిన్న రాత్రి వాళ్ళ సంభాషణనిబట్టి నాకు అర్థమైంది. నేను నిద్ర పోయానని అనుకున్నారు. బాబ్ తనతో ఆమెని లేచి రమ్మన్నాడు కానీ, థెల్మా నిరాకరించింది. డాక్టర్ జోన్స్‌కి వచ్చి నన్ను కలవమని ఉత్తరాలు రాసాను. కానీ, థెల్మా వాటిని పోస్ట్ చేసి ఉండదు. ఆయన రాలేదు.ఈ రకమైన అబద్ధపు సమాచారంతో డైరీని నింపసాగాడు.

ఓ శనివారం ఉదయం అతను థెల్మా హత్యకి ముహూర్తం పెట్టాడు. ఆ సాయంత్రం థామ్సన్ సరుకులతో వస్తాడు. అతనే ఆ విషాదాన్ని కనుగొంటాడు. థెల్మా నిద్ర మాత్రలు వేసుకుని తన ముందే మరణించిందని థామ్సన్ రాగానే రాసి చూపిస్తాడు.
తను సేకరించిన మాత్రలని అతికష్టం మీద పొడి చేసి మధ్యాహ్నం ఇద్దరూ కలిసి కాఫీ తాగేప్పుడు ఆమె కప్పులో కలపాలనుకున్నాడు. అది తేలిగ్గానే చేసాడు కూడా.స్టవ్‌ని ఆఫ్ చేసావా? గ్యాస్ వాసన వస్తున్నది అని రాసి చూపించాడు.
ఆమె వంటగదిలోకి వెళ్ళి వచ్చేలోగా ఆమె కాఫీలో ఆ పొడిని కలిపాడు.ఆఫ్ చేసే ఉంది ఆమె తిరిగి వచ్చి చెప్పింది.ఇద్దరి కాఫీలో రమ్ కలుపు. ఇవాళ చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం రాసాడు.కారణం ఆల్కహాల్లో నిద్రమాత్రలు త్వరగా పని చేస్తాయి. పైగా కాఫీలోని చేదు మరుగున పడుతుంది.ఆమె రమ్ తెచ్చి ఇద్దరి కాఫీల్లో కలిపింది. ఛీర్స్ చెప్పాక కాఫీ తాగుతూ చెప్పింది.డార్లింగ్! మీరు మొన్న చెప్పింది ఆలోచించాను. బాబ్ థామ్సన్ అంటే మీకు ఇష్టం లేనప్పుడు ఇక మనింటికి రావడం ఎందుకు అనిపించింది.
ఈ వారం నించి నేనే అతని షాప్‌కి వెళ్ళి వాటిని తెస్తాను. మీరు బాగా తేరుకున్నారు కాబట్టి, ఇప్పుడు మిమ్మల్ని వంటరిగా వదిలి వెళ్ళినా నాకు నిశ్చింత... సరుకులు ఐపోయాయి, నేను వెళ్ళి సరుకులు...ఎందుకో నాకు నిద్ర వస్తున్నది ఆమె చేతిలోని కప్పుని కింద పెట్టి కళ్ళు మూసుకుంది.విక్‌లో వెంటనే భయం మొదలైంది. కాటేజ్‌కి బాబ్ రాకపోతే తను, తన భార్య శవం మాత్రమే ఉండేది. ఎవరైనా ఎప్పుడు వస్తారో? అంతదాకా పక్కమీంచి కదల్లేని తను దాహంతో, ఆకలితో అలమటించాల్సిందే. ఆహారం లేకుండా తను ఎన్ని రోజులు జీవించగలడు. మంచి నీళ్ళ జగ్ చేతికి అందనంత దూరంగా ఉంది.అతను ఆమె చెంపల మీద తట్టసాగాడు. అరగంటైనా ఆమె లేవలేదు.విక్‌కి దాహం మొదలైంది.
(న్యూటన్ రోడ్స్ కథకి స్వేచ్ఛానువాదం)

180
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles