యానాం పోదామా!


Sun,November 3, 2019 03:38 AM

మనతోటి తెలుగు రాష్ట్రంలోని గోదావరి నది ఒడ్డున, తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగంగా ఉన్న పట్టణం యానాం. ఇది ఆం.ప్ర. రాష్ట్రంలో ఉన్నప్పటికీ పాలన మాత్రం కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిదే! ఇది 200 ఏండ్లు ఫ్రెంచ్ పాలనలో ఉండి, 1954లో స్వతంత్ర భారత్ లో విలీనమైంది. దీన్ని పూర్వం తెలుగు ప్రజలు కల్యాణపురం అని పిలిచేవారు. ఒక్కసారి ఇక్కడ పర్యటిస్తే ఆ అనుభూతిని ఎప్పటికీ మరవలేం.

అప్పటి ఫ్రెంచ్ కమిషనర్‌గా బుస్సీ ఉన్న క్రీ.శ.1723లో భారతదేశంలో యానాం మూడవ కాలనీగా ఫ్రెంచి పాలనలో ఉండేది. ఈ ప్రాంతాన్ని విజయనగర రాజు బొబ్బిలి యుద్ధంలో సహాయ పడినందుకుగాను అప్పటి ఫ్రెంచి జనరల్ అయిన బుస్సీకి కానుకగా ఇచ్చాడని చెబుతారు. ఇది 1954లో భారత్‌లో విలీనమైంది. ఫ్రెంచి, తెలుగు సంస్కృతుల మేళవింపు యానాంలో కనిపిస్తుంది. యానాం చాలా అందమైన ప్రదేశం. కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. గౌతమి గోదావరినది ఒడ్డున ఉన్నందున తాజా గాలిని ఆస్వాదించవచ్చు. ఈ ప్రాంతంలో తేమ అధికంగా ఉంటుంది. ఇక్కడి గౌతమినది గోదావరి ప్రధాన ఉపశాఖలలో ఒకటి. ఇది యానం తగుండా 12 కిలోమీటర్లు ప్రవహించిన తరువాత బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. అలాగే కొరింగ నది తూర్పుగోదావరి జిల్లా గుండా ప్రవహిస్తూ యానాంలోకి ప్రవేశిస్తుంది. ఈ నది యానాంలోని భూములకి సాగునీరు అందిస్తున్నది. ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నది.
Yanam

ది ఫెర్రీ రోడ్: ఒకప్పుడు మామూలు రోడ్డులాగే ఉండే ఈ రోడ్డుకు ఇరుపక్కల ప్రముఖుల విగ్రహాలను ఉంచడం ద్వారా ఫెర్రీ రహదారిని చాలా అందంగా తీర్చిదిద్దారు. దీంతో రోడ్డుపై నడుస్తూ ఆ మహానీయుల జీవిత చరిత్రను చదువుతూ ఆనందంగా గడపవచ్చు.

బీచ్‌రోడ్: యానాం బీచ్‌ను రాజీవ్‌గాంధీ బీచ్‌గా పిలుస్తారు. బీచ్‌లో బోటు షికారు, స్మిమ్మింగ్‌ను ఆస్వాదించవచ్చు. బీచ్‌లో పలు విగ్రహాలు ఆకట్టుకుంటాయి. యానాంలో కామరాజర్ పార్కు ఉంది. ఇది పిల్లల ఆటవిడుపు కేంద్రం.

వేంకటేశ్వర స్వామి దేవాలయం : వైష్ణవాలయం వీధిలో ప్రసిద్ధి చెందిన అలివేలు మంగా సహిత వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. ఇక్కడి ప్రజ లు వెంకన్న బాబు, చల్డికూడు వెంకన్న, మీసాల వెంకన్న అని పిలుస్తారు. ఈ దేవాలయంలో ఉన్న వేంకటేశ్వర స్వామి విగ్రహం ముఖం మీద మీసాలు ఉంటాయి. అందువల్ల ఇక్కడ వేంకటేశ్వర స్వామిని మీసాల వెంకన్న అని పిలుస్తారు. ఈ గుడిని 15వ శతాబ్దంలో రాజమండ్రిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజులు కట్టించారు. స్వాతంత్య్రం రావడానికి మునుపు బాల్య వివాహాలకు ఇది వేదికగా ఉండేది. వందలకొద్ది వివాహాలు జరగడం వల్ల ఈ ఊరిని కళ్యాణపురం అనీ పిలిచేవారు. దేవాలయంలోని రథం బరువు 15 టన్నులు.

మసీదు: 1848లో ఓ మసీదు నిర్మాణానికి ఫ్రెంచ్ ప్రభు త్వం స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. అప్పుడు చిన్న మసీదు నిర్మితమైంది. తరువాత 1956లో మసీదు పునరుద్ధరణ పనులు జరిగాయి. 1978లో మసీదుని పూర్తిగా ధ్వంసం చేసి తిరిగి నిర్మించారు.1999-2000లో ఎం. ఎ. సిరాజుద్దిన్ అధ్యక్షుడిగా గ్రాండ్ మసీదుగా విస్తరించారు.

యానాం టవర్

విశ్వవిఖ్యాత ఈఫిల్ టవర్‌ను తలపించే యానాం టవర్ స్థానిక గిరియాంపేటలో ఉంది. దీన్ని ఒబిలిస్కు టవర్ అని కూడా అంటారు.12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 45 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. 100.6 మీటర్ల ఎత్తున్న ఈ టవర్‌లో కింది అంతస్థులో మీటింగ్ హాల్, 21.6 మీటర్ల ఎత్తులో రెస్టారెంట్, 26.5 మీటర్ల ఎత్తులో వీక్షణ మందిరం నిర్మించారు. 53.3 మీటర్ల ఎత్తువరకు లిఫ్టులో వెళ్లొచ్చు. 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుకుని నిలబడేలా దీన్ని డిజైన్ చేశారు.
Yanam1

క్యాథలిక్ చర్చి/యానాం చర్చి

ఈ ఫ్రెంచి క్యాథలిక్ చర్చి ఫ్రెంచివారి పరిపాలనను గుర్తు చేస్తూ ఉంటుంది. దీనిని సెయింట్ ఆన్స్ క్యాథలిక్ చర్చి అని పిలుస్తారు. ఈ చర్చి ఐరోపా ఖండపు నిర్మాణశైలిలో నిర్మితమైంది.దీని నిర్మాణానికి కావలసిన సరంజామ, లోపలి సామాన్లు, అలంకరణ వస్తువులు ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకొన్నారు.ఈ చర్చికి దగ్గరలో మరో చిన్న కొండపై గుడి ఉంది, దీనిని కూడా ఫ్రెంచి పరిపాలకులు నిర్మించారు. ఈ కొండ పై నున్న గుడి పక్కన మరో కొండ పై చర్చిని ఆంగ్లేయ ఇంజినీర్లు నిర్మించారు.
Yanam2

431
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles