నెట్టిల్లు


Sun,November 3, 2019 12:08 AM

మన చుట్టూ ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో, బయట మనసును మెలిపెట్టే సున్నిత అంశాలుంటాయి. ఇవి ప్రతీ వ్యక్తి జీవితంలో భాగమే. వీటినే కథలుగా రాసి, లఘుచిత్రాలుగా తీస్తే అద్యంతం భావోద్వేగమే..
అలాంటి లఘుచిత్రాల సమీక్షలే ఇవి..

యత్భావం తత్భవతి


దర్శకత్వం: సత్య సిద్దార్థ
శివ ఒక జులాయి. కొడుకు మీద పిచ్చి ప్రేమ భయంగా మారిపోతుందని తండ్రి భయపడుతూ ఉంటాడు. కొడుకు ఏ గొడవతో ఇంటికి వస్తాడో అని ఆందోళన చెందుతూ ఉంటాడు. ఓ రోజు దీని గురించే శివతో మాట్లాడతాడు. తండ్రి మాటలు కొత్తగా అనిపిస్తాయి. అప్పుడు తండ్రితో పందెం కాస్తాడు. నటిస్తూ ఓ అమ్మాయిని ప్రేమిస్తా, గెలుస్తా అంటాడు. తప్పు అంటాడు తండ్రి. కానీ శివ వినడు. ఈ పందెంలో భాగంగా గాయత్రి అనే అమ్మాయి వెంట పడతాడు. రోజూ వేచి చూసి ఒక రోజు ఆమెను అడ్డగించి ప్రేమిస్తున్నట్టు చెప్తాడు. దీంతో ఆ అమ్మాయి సాధారణంగానే ఇష్టం లేదు అంటుంది. ఎందుకు అని అడుగుతాడు. ఆమెకు ఎలాంటి అభిప్రాయమూ కలగడం లేదనీ, మీ ప్రేమలో అంత స్వచ్ఛత కనిపించడం లేదని చెప్తుంది. అప్పుడు శివ ఆలోచనలో పడతాడు. నటిస్తూ ప్రేమిస్తే ప్రేమ ఫలించదనుకుంటాడు. అలాగే నటిస్తూ జీవించినా జీవితం ఫలించదని తెలుసుకుంటాడు. ఒక మనిషి మారితే అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదు. ఆలోచనా విధానం మారితే చాలు అనే సందేశంతో లఘుచిత్రం ముగుస్తుంది. బాగుంది. మీరూ చూడండి.
yathbhavam

Total views 63,912+ (అక్టోబర్ 26 నాటికి) published on Oct 25, 2019

ఆ క్షణంలో


దర్శకత్వం: కేవీకే చైతన్య
నటీనటులు : చైతన్య, సాయి జ్ఞానార్క, శ్రీవిభ
అనన్య, కార్తీక్ భార్యాభర్తలు. స్వస్తిక వాళ్ల కూతురు. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడతారు. ఉన్న ఒక్క కొడుకు విదేశాల్లో ఉండడంతో కార్త్తీక్ తల్లిదండ్రులు ఇండియాలో ఒంటరిగా ఉంటారు. వారి యోగక్షేమాలు పట్టించుకొనే వారు, ఆస్పత్రికి తీసుకెళ్లే వారు ఎవరూ ఉండరు. స్వస్తిక మాత్రం నానమ్మ, తాతయ్య అంటూ రోజూ గుర్తు చేసుకుంటుంది. వాళ్లతోనే ఆడుకుంటాను అంటూ ఉంటుంది. ఒక రోజు టీవీలో ఓ అబ్బాయి వాళ్ల తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలివెళ్తాడు. ఈ సన్నివేశాన్ని స్వస్తిక టీవీలో చూస్తుంది. అప్పుడు కార్తీక్‌ను ఇలా అడుగుతుంది నానమ్మ, తాతయ్యను వృద్ధాశ్రమంలో ఉంచారా ? రేపు మీరు కూడా అక్కడే ఉంటారా? అని అమాయకంగా అడుగుతుంది. ఇది కార్తీక్‌ను తీవ్ర ఆలోచనలోకి తీసుకెళ్తుంది. మనసంతా వేధిస్తుంది. తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడికో విదేశాల్లోకి వచ్చి తప్పు చేస్తున్నామా అనే భావన కలుగుతుంది. తండ్రి ఫోన్ చేసి అతని వేదన చెప్తాడు. అప్పుడు తండ్రి కూడా అతని అభిప్రాయం చెప్తాడు. ఇంతకీ తండ్రి ఏం చెప్తాడు? కార్తిక్ ఇండియా వెళ్లి తల్లిదండ్రులను కలుస్తాడా? యూట్యూబ్‌లో చూడండి.
Ah-kshanam

Total views 2,218+(అక్టోబర్ 26 నాటికి) Published on Oct 25, 2019

D/o


దర్శకత్వం: మణిదీప్
నటీనటులు : చంద్ర, అక్షర
కరుణ స్కూల్ విద్యార్థిని. సింగిల్ ఫాదర్ అమ్మాయి. ఓ రోజూ పాఠశాల విహార యాత్ర గురించి తండ్రి బబ్లూతో మాట్లాడుతుంది. దీనికి ఆయన తీవ్రంగా కోప్పడతాడు. ముందు చదువు తర్వాతే ఏదైనా అంటాడు. స్కూల్‌కు మాత్రమే వెళ్లు ఇలాంటి టూర్లకు కాదు అని ఆగ్రహిస్తాడు. కరుణ బాధపడుతుంది. ఆయినా మరుసటి రోజు మళ్లీ అడుగుతుంది. తండ్రి మాత్రం తను మొండిగా కరుణ ను బెదిరిస్తాడు. కరుణ స్కూల్‌కు రాలేదని అదే రోజు బబ్లూ ఆఫీస్‌లో ఉండగా స్కూల్ నుంచి మెసేజ్ వస్తుంది. వెంటనే స్కూల్‌కు వెళ్తాడు బబ్లూ. కరుణను స్కూల్ గేటు బయట దించి వెళ్లాక ఆమె లోపలికి రాకుండా వీధిలోకి ఒక్కతే వెళ్తుంది. ఇది సీసీ కెమెరాలో రికార్డు అవుతుంది. రాత్రి వరకూ వెతికి వెతికి బబ్లూ ఇంటికి వస్తాడు. ఇంటి దగ్గర కరుణను చూస్తాడు. ఆమె బబ్లూ దగ్గరికి వచ్చి క్షమించాలని అంటుంది. బబ్లూ చేసిన తప్పును తెలుసుకుంటాడు. తనను ఎప్పుడూ బాధపెట్టనని చెప్తాడు. పిల్లలను ప్రేమతో పెంచాలి కానీ ప్రేమను దాస్తూ కాదని ఎమోషనల్‌గా చూపించారు. మేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, నటన అన్నీ బాగున్నాయి.
DO

Total views 4,586+(అక్టోబర్ 26 నాటికి) Published on Oct 25, 2019

#MeToo


దర్శకత్వం: హరికుమార్
నటీనటులు : పూజ, స్వర్ణప్రియ, స్నేహలత
ఇటీవల సమాజంలో చర్చనీయాంశం అయిన అంశాన్ని కథాంశంగా తీసుకొని నిర్మించిన లఘుచిత్రం మీటూ. కథ విషయానికి వస్తే.. మూడు వేర్వేరు ఘటనలను చూపిస్తూ ఆసక్తికర స్క్రీన్‌ప్లేతో నడిపించారు. ఇంట్లో ఒంటరిగా ఉండే అమ్మాయి, సినిమా అవకాశాల కోసం వచ్చిన మరో అమ్మాయి, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వచ్చిన ఇంకో అమ్మాయికి అక్కడ అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. అవకాశాల కోసం వచ్చిన అమ్మాయిలను లైంగికంగా ఇబ్బంది పెడతారు. అక్కడ భరించడం తప్ప ఆ అమ్మాయిలు ఇంకా ఏమీ చేయని స్థితి నెలకొంటుంది. ఏడ్చుకుంటూ అక్కడినుంచి వెనక్కి వస్తారు. కానీ దాన్ని తలుచుకొని బాధపడుతూ భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దంటాడు దర్శకుడు. అందుకే ఇంకో సన్నివేశంలో ఈ అమ్మాయిలే తిరగబడతారు. వేధించిన ఆ మగాళ్లను కొట్టి వెనక్కి వస్తారు. అమ్మాయిలు ఇలాంటి పరిస్థితుల్లో బాధపడడం కంటే ఆత్మైస్థెర్యంతో వాళ్లకు బుద్ధి చెప్పాలనే సందేశంతో ముగుస్తుంది. మాటలు ఏమీ లేకపోయినా సన్నివేశాలు ప్రేక్షకున్ని చివరి వరకూ తీసుకెళ్తాయి.
mee-too

Total views 1,147+ (అక్టోబర్ 26 నాటికి) Published on Oct 26, 2019

-వినోద్ మామిడాల, సెల్: 7660066469

151
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles