మన్యం ప్రజలకోసం ప్రాణలర్పించిన అల్లూరి సీతారామరాజు


Sun,October 27, 2019 02:38 AM

స్వాతంత్య్రోద్యమ చరిత్రలో తెల్లదొరలకు సింహస్వప్నంగా నిలిచిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచినవాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసినవాడు. మన్యంలోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని యుద్ధవీరులుగా తయారు చేసి బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా ఉద్యమించాడు.అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంరత్య్రోద్యమంలో ఓ అధ్యాయం. స్వాతంత్య్రం పొందటానికి సాయుధ పోరాటం ఒక్కటే అని నమ్మినవాడు అల్లూరి. 27 ఏళ్ళకే స్వతంత్రం కోసం అమరుడైన అల్లూరి సీతారామరాజు చివరిపేజీ.

-మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

అల్లూరి సీతారామరాజుగా స్థిరపడిన అల్లూరి శ్రీరామరాజు 1897 జూలై 4న హేవళంబి నామ సంవత్సరం ఆషాఢ మాసం శుద్ధ పంచమి సాయంకాలం 4 గంటలకు మఖా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో విజయనగరం దగ్గరి పాండ్రంగిలో తాతగారైన మందలపాటి శ్రీ రామరాజు ఇంట జన్మించాడు. రాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత చెల్లెలు సీతమ్మ , తమ్ముడు సత్యనారాయణరాజు పుట్టారు. రాజు తల్లి సూర్యనారాయణమ్మ సంప్రదాయిక చదువు నేర్చుకొన్నది. తండ్రి వెంకటరామరాజు స్కూలు ఫైనల్ వరకు చదివాడు. చిత్రకళలోను, ఫొటోగ్రఫీలోను అభిరుచి కలదు. 1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజు తండ్రి మరణించాడు.
Alluri
ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. ఆయన కుటుంబం వివిధ ప్రాంతాల్లో .నివసించవలసి వచ్చింది. జ్యోతిషం, వాస్తుశాస్త్రం, హఠయోగం, కవిత్వం,సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవపూజ చేసేవాడు. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. దేవాలయాల్లోను, కొండలపైన, శ్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడువకుండా శ్రాద్ధకర్మలవంటి సంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవాడు.

1916 ఏప్రిల్ 26న ఉత్తరభారతదేశ యాత్రకు వెళ్లి బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూసాడు. బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు. ఈ యాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా అభ్యసించాడు. తల్లి నివసిస్తున్న కృష్ణదేవి పేట చేరుకుని అక్కడికి దగ్గర్లోని ధారకొండపై కొన్నాళ్ళు తపస్సు చేసాడు. అనేక యుద్ధవిద్యల్లోను, ఆయుర్వేద వైద్యవిద్యలోను ప్రావీణ్యుడవటం త్వరలోనే రాజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ప్రయత్నించేవాడు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేకులు కట్టడం, మూలికా వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ భారత భాగవత కథలు వినిపించడం చేసేవాడు. 1918 ప్రాంతంలో కొంగసింగిలో ఒక మోదుగ చెట్టుకింద మండల దీక్ష నిర్వహించాడు. ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యంలోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చెయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గంటందొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణ రాజు, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటి సాహసవీరులు 150 మంది దాకా ఇతని అజమాయిషీలో తయారయ్యారట.

పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. 1922 ఆగస్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవవీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపివేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. అలా ఆయన వరుసగా అనేక పోలీస్‌స్టేషన్‌లపై దాడులు నిర్వహించారు. ఆగష్టు 23న - కృష్ణదేవిపేట, ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అడ్డతీగల పోలీసు స్టేషనుపై అక్టోబర్ 15న దాడి చేశాడు. అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషనును పట్టపగలే ముట్టడించారు. తను దోసుకున్న బ్రిటీష్ తుపాకులకు లెక్కకట్టి రశీదు కూడా ఇచ్చేవాడట.అక్టోబర్ 23న ప్రత్యేక సైనిక దళాలతో వచ్చిన సాండర్స్ అనే సేవాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. డిసెంబర్ 6న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో నలు గురు రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి. తప్పించుకొన్న విప్లవవీరుల స్థావరంపై ప్రభుత్వదళాలు ఆ రాత్రి మళ్ళీ దాడి చేశాయి. ఒక గంట పైగా సాగిన భీకరమైన పోరులో మరొక 8 మంది విప్లవకారులు మరణించారు. 1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. విప్లవకారులు 1923 జూన్ 10న ధారకొండ, కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్ళి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి చేసారు కాని అక్కడ మందుగుండు సామగ్రి లేదు. అయితే బ్రిటీష్ సైన్యం మాత్రం మరింత రెచ్చిపోయింది. విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసారు. గ్రామాల్లోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురిచేసారు. మన్యాన్ని దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు.

17-4-1924న మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్ ఫర్డ్ నియమితుడయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపుణుడు. విప్లవకారులలో అగ్గిరాజు అతిసాహసిగా పేరు పొందాడు. 1924 మే 6వ తారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజు కాలికి గాయమైంది. శత్రువులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణించాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పంపారు. విప్లవకారులను పట్టుకునే ధైర్యం లేక బ్రిటీష్ సైనికులు మన్యం ప్రజల మీద దాడులు చేయడం, ఇళ్లను తగుల బెట్టడం, పంటలను దోచేయడం, ఆడవాళ్లపై అత్య చారాలు చేశారు. ఇది రాజును బాగా కలచివేసింది.తన వల్ల అమాయక ప్రజలు నష్టపోవడం ఇష్టం లేని రాజు తను లొంగిపోయి తరువాత తన ఉద్యమాన్ని కొన సాగించవచ్చని అనుకున్నాడు.
ఆ రాత్రి రాజు మంప గ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్ ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవిపేట సభకు మంప మునసబు కూడా హాజరయ్యాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవి పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. కాని తాను అటువంటి పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు.

తరువాత,1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేసి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.

584
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles