బేబక్క


Sun,October 27, 2019 02:12 AM

Bebakka
ఇరాక్‌లో ఒక నోరు తిరగని పట్టణంలోని మార్కెట్‌లో మానవబాంబు పేలిందని ఏడో పేజీలో వచ్చిన అర కాలమ్ వార్త ఎవరినీ ఆకర్షించే చాన్స్ లేదు. కనీసం పేలుడులో వంద మంది చనిపోయారంటే, ఆ వార్త ముందు పేజీలోకి వచ్చి నలుగురు కళ్లలో పడేదేమో. కానీ, ఆ పేలుడులో కేవలం ఇద్దరే చనిపోవడంతో ఆ పత్రిక ఎడిటర్‌కి దానికి అంతకు మించిన ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం కనిపించలేదు. అరుగులమీద కూర్చుని అక్షరం వదలకుండా పత్రిక మొత్తం చదివే పనిలేనివాళ్లు తప్ప ఆ వార్తని ఎవరూ చదవలేదు. అలా ఆ వార్త చదివిన మన రాష్ట్రంలోని ఒక మారుమూల పల్లెవారికి కూడా ఆ చనిపోయిన వారిలో ఒకరు తమ ఊరి వారని తెలియదు.

కొన్ని రోజుల ముందుకు వెళ్తే ..
కరవు జిల్లాగా పేరు పొందిన ఆ జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరిలో బ్యాంకు మేనేజర్‌గా విహారి చార్జ్ తీసుకుని రెండు రోజులయ్యింది.రోజూ మొత్తం మీద బ్యాంకుకు పది మంది కూడా వస్తున్న జాడ కనిపించలేదు అతనికి. అది కాస్త విచిత్రంగా అనిపించి ఏమిటి కస్టమర్లు ఎవరూ రావటం లేదు? అని అడిగాడు బ్యాంకు క్లర్కు రామారావుని. ఇక్కడి జనాలకు బ్యాంకుతో ఏం పని సార్? దాచుకోవడానికి డబ్బులుండవు. తీసుకోవడానికి బ్యాలెన్స్ ఉండదు. వ్యవసాయం చేయడానికి వానలు ఉండవు. ఖర్మ కాలి లోను ఇస్తే తీర్చడానికి రాబడి ఉండదు.. కవితాత్మకంగా చెప్పాడతను. అతను ప్రతి విషయాన్నీ నెగెటివ్‌గానే చూస్తాడు.. మాట్లాడతాడని విహారికి అతనితో పరిచయమయిన కొన్ని గంటల్లోనే తెలిసింది.అదేంటోయ్. చార్జ్ తీసుకునేటపుడు చూశాను. సేవింగ్స్ ఖాతాల్లో లావాదేవీలు బాగానే ఉన్నాయిగా అడిగాడు విహారి.అవన్నీ ఎన్నారై ఖాతాలు సార్ నాలుక చప్పరిస్తూ అన్నాడు రామారావు. వాటిలోకి డబ్బులొచ్చి పడితే బ్యాంకుకు మనుషులు రావడం మొదలవుతుందిఈ ఊర్లో ఎన్నారై ఖాతాలా? ఆ విషయం అప్పటిదాకా గమనించని విహారి ఆశ్చర్యంగా అన్నాడు.అసలు ఎన్నారై అంటే అప్పటిదాకా విహారి ఊహల్లో మెదిలే వ్యక్తులు వేరు. ఎన్నారైలు అంటే.. బ్రాండెడ్ డ్రెస్సులు వేసుకుని, ఖరీదైన కార్లలో తిరుగుతూ, తెలుగు సభల్లో సందడి చేసేవాళ్లు. రెండు మూడేళ్లకు ఒకసారి ఇండియా వస్తూ బంధువులకు, స్నేహితులకు బహుమతులు తెచ్చే వాళ్లు. మరీ ఎక్కువగా సంపాదిస్తే, ఊర్లో మంచి నీళ్ల ఫెసిలిటీకో, టాయిలెట్ల నిర్మాణాలకో తమ తల్లిదండ్రుల పేర్లమీద సహాయం చేసేవాళ్లు. ఎలక్షన్ల సీజన్లో వచ్చి ఏ పార్టీ టికెట్ దొరుకుతుంది.. అని పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగి లాటరీ వేసి చూసుకునేవాళ్ళు. అలాంటి అతని ఊహలు మొదటిసారి పటాపంచలయ్యాయి..ఎన్నారైలంటే కువైట్‌లో నిర్మాణ పనుల్లో కూలీలు అనీ, అబూదాబీలో షేక్ ఇంట్లో పని చేసే పనిమనుషులు అనీ అతనికి ఆ రోజే తెలిసింది. దుబాయ్‌లో కార్పెంటర్లు, షార్జాలో ప్లంబర్లు, ఇరాక్ ఆయిల్ కంపెనీల్లో వర్కర్లు, ఎన్నో దేశాల్లో నర్సులు.. అందరూ ఎన్నారైలే.

ఊరిలో జనాలతో మాట్లాడాక అతనికి ఆ ఊరి పరిస్థితి అర్థమయింది. ఆ ఊరిలో ప్రస్తుతం రైతులెవరూ మిగలలేదు. అందరూ రైతు కూలీలే. భూమి ఉన్న వారికి వ్యవసాయం చేయడానికి వానలు లేవు. చేసిన అప్పులు తీర్చడానికి దారి లేదు. వారి పరిస్థితే ఇలా ఉంటే ఇక కూలీనాలీ చేసుకునే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది? ముందు దేశంలోనే వేరే నగరాలకి వెళ్లారు. ఇప్పుడు అక్కడ కూడా బాగా పోటీ ఏర్పడింది. అందుకే విదేశాలకు వెళ్తున్నారు.బ్యాంకు క్లర్కు రామారావు చెప్పిన మాటలు అబద్ధాలు కావని వారం రోజుల్లో తెలిసింది. అకౌంట్లలోకి డబ్బులు వచ్చాయో లేదో, మొదటిసారి బ్యాంకు కళకళలాడడం మొదలు పెట్టింది. రెండు మూడు గంటల్లో వారి పని ముగించి పంపేశాడు విహారి. అందరూ వెళ్లిపోయాక కూడా బిత్తరచూపులు చూస్తున్న ఒక పిల్ల మిగిలిపోయింది. ఆ అమ్మాయి చేతిలో ఒక పాస్‌బుక్ ఉంది.ఏంటి పాప? ఏమైంది? ఎందుకలా ఉన్నావ్? అని పలుకరించాడు విహారి. అంతే జలజల ఆ పిల్ల కంట్లో నుండి నీటి చుక్కలు జాలు వారాయి.అరెరే! ఏడవకు. ఇలా రా అంటూ దగ్గరకు పిలిచాడు విహారి. పదేళ్లుంటాయేమో ఆ అమ్మాయికి. నూనె రాయక బిరుసెక్కిన జుట్టుని గట్టిగా బిగించి రెండు జడలు వేసుకుంది. వేసుకున్న గౌను రెండు చోట్ల చిరిగి ఉంది. మొహమాటంగా అతని దగ్గరకు వచ్చి చేతిలోని పాస్‌బుక్ చాపింది. ఈ పాస్‌బుక్ ఎవరిది?బేబక్కది.. అని ఏదో గుర్తుకు వచ్చినట్లు తల అడ్డుగా ఊపి, సత్యవతిది అంది. పాస్‌బుక్ మీద పేరు చూశాడు విహారి. సత్యవతి అని ఉంది. మరి బేబక్క అని ఎందుకు చెప్పావ్ నవ్వుతూ అన్నాడు. అందరూ అలానే అంటారు..ఓ.. ముద్దుపేరు అన్న మాట. ఇంతకీ బేబక్క నీకేమవుతుంది? బేబక్క అనే పేరును బట్టి ఆమె ఈ అమ్మాయికి అక్క అయి ఉంటుందని ఊహించాడు విహారి. అయినా ఆ అమ్మాయిని మాట్లాడించడం కోసం అడిగాడు.

అమ్మ
అమ్మా? ఆశ్చర్యంగా అన్నాడు విహారి. మాట్లాడుతూనే కంప్యూటర్‌లో ఆ ఆకౌంట్ వివరాలు ఫీడ్ చేస్తూ అన్నాడు. మీ అమ్మ ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది?బిక్క మొహం పెట్టింది ఆ అమ్మాయి.వాళ్లకవన్నీ తెలియవు సార్. ఎవరు ఎక్కడికి వెళ్లినా గల్ఫుకెళ్లారని చెప్తారు కల్పించుకుని చెప్పాడు రామారావు.సరే! నీకు ఏం కావాలి అడిగాడు కంప్యూటర్‌లో ఆ అకౌంట్ వివరాలు తెరిచిన విహారి.అది కూడా తెలియదా? అన్నట్లు ఒక చూపు చూసిన పిల్ల, డబ్బులు అంది.కానీ, ఇందులో డబ్బులు లేవు బ్యాలెన్స్ లేని అకౌంట్ వివరాలు చూస్తూ అన్నాడతను. మూడు నెలల నుంచి ఇదే గోల సార్. అకౌంట్లో డబ్బులు ఉంటే కదా మనం ఇచ్చేది. అర్థం చేసుకోదు. మనమేదో అప్పున్నట్లు ఇక్కడకొచ్చి ఏడిస్తే మనమేమి చేస్తాం? అన్నాడు రామారావు.అతని మాటలు పట్టించుకోకుండా అకౌంట్‌లో పాత వివరాలు చూడసాగాడు విహారి. మూడు నెలల క్రితం వరకు రెగ్యులర్‌గా నెలకి అయిదు వేలు వస్తున్నాయి. అందులో నుంచి సగం డబ్బులు బ్యాంకులో తీసుకున్న లోనుకు వెళ్తున్నాయి. ఎంత లోను తీసుకున్నారో చూశాడు. రెండు లక్షలు లోను తీసుకుంది సత్యవతి. ప్రస్తుతం డబ్బులు రాకపోవడంతో లోనులో కూడా బకాయిలు పేరుకుపోయాయి ఇప్పుడు మీ బేబక్క డబ్బు పంపడం లేదమ్మా. ఆమె ఎక్కడ ఉందో, ఎందుకు పంపడం లేదో.. మీకు కబురు లేదా?తల అడ్డంగా ఊపింది ఆ అమ్మాయి.

అడ్రస్ కానీ, ఫోన్ నంబర్ కానీ లేదా?
ఎవరో ఒకరిద్దరి దగ్గర తప్ప, అవేవీ ఉండవు సార్ విహారి అమాయకత్వాన్ని బద్దలు చేయడానికి కంకణం కట్టుకున్న రామారావు చెప్పాడు. డబ్బులు రాగానే నేనే నీకు కబురు చేస్తాలే అన్నాడు విహారి ఆ అమ్మాయితో, ఇంకేం చెప్పాలో తెలియక.
రేపు ఫీజు కట్టకపోతే అన్నని పరీచ్చ రాయనివ్వరంట మళ్లీ కళ్లలో నీళ్లు తిరుగుతుంటే అంది ఆ అమ్మాయి.ఏం పరీక్ష?అయ్యేటీ పరీక్షఆ అమ్మాయి చెప్పింది అర్థం కాక, రామారావు వైపు చూశాడు విహారి.ఐటీఐ సార్. టెన్త్ తర్వాత ఏ ప్లంబర్ కోర్సో చదివితే గల్ఫుకు వెళ్ళవచ్చని ఎక్కువమంది అలాంటివి చదువుతారుమరి మీ నాన్న ఏం చేస్తాడు? ఆ పిల్ల వేపు తిరిగి అడిగాడు విహారి.చెక్క పని చేసేవాడు. ఇప్పుడు జబ్బు చేసి ఇంట్లోనే ఉంటున్నాడు ఆ పిల్లవాడికి ఒక సంవత్సరం వృథా అయితే ఆ కుటుంబ పరిస్థితి ఏమిటో తలుచుకుంటే కడుపులో దేవినట్లయింది అతనికి. ఒక నిర్ణయానికి వచ్చాడు. ఫీజు ఎంత కట్టాలి? అని అడిగాడు.అయిదు వేలుతన అకౌంట్లో నుండి డ్రా చేసి ఆ అమ్మాయికి ఇచ్చాడు విహారి.ఆ పిల్ల కళ్లలో ఒక్కసారిగా వెలుగు. అయిదు వేలు చేతిలో పుచ్చుకుని ఒక్క పరుగు తీసింది. ఇలా అయితే మీరు ఇక్కడ పని చేయడం కష్టం సార్. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏదో ఒక కథ చెప్తారు. ఎన్ని కథలకని డబ్బులివ్వగలరు? అన్నాడు రామారావు విహారి వైపు నిరసనగా చూస్తూ.విహారి ఏం మాట్లాడలేదు. ఆ పిల్ల వయసే ఉన్న తన చెల్లెలు అతనికి గుర్తుకు వచ్చింది.రోజుకొకసారయినా తన వారితో మాట్లాడక పోతే ఎలా ఉంటుందో తెలిసిన అతనికి సంవత్సరాలుగా తల్లితో మాట్లాడని ఆ అమ్మాయి పరిస్థితి తలచుకుంటే జాలి వేసింది. ఎలా అయినా బేబక్క ఎక్కడ ఉందో కనుక్కుని ఆమె కుటుంబంతో మాట్లాడించాలని అనిపించింది అతనికి. అది జరగాలంటే ముందు బేబక్క వివరాలు తెలియాలి.ఆ సాయంత్రం పోస్ట్‌మాస్టర్ కనిపించినపుడు జరిగింది చెప్పి బేబక్క సంగతులు అడిగాడు విహారి.పోస్ట్‌మాస్టర్ ఆ ఊర్లోనే పుట్టి పెరిగినవాడు. అతనికి అక్కడి మనుషుల సంగతులు మొత్తం తెలుసు. బేబక్క మాట వినడంతోనే గట్టిగా నిట్టూర్చి అదొక విషాద కథ అన్నాడతను క్లుప్తంగా.రహస్యం కాకపోతే చెప్పవచ్చుగా అన్నాడు విహారి.

ఈ ఊర్లో రహస్యాలేం ఉండవు. అందరి జీవితాలు ఓపెన్‌గానే ఉంటాయి. కొన్నాళ్ల క్రితం ఊరో ్ల ఒక ఆర్‌ఎంపీ డాక్టర్ ప్రాక్టీస్ పెట్టాడు. అతనికి చిన్న చిన్న పనుల్లో సహాయం చేయడానికి ఒక మనిషి సహాయం కావలసి వచ్చింది. యాక్టివ్‌గా ఉండే బేబక్క ఆ పని చేయడానికి ముందుకొచ్చింది. ఇంజెక్షన్లు చేయడం, గాయాలకి బ్యాండేజీలు కట్టడం, స్లైన్ పెట్టడం నెమ్మదిగా నేర్చుకుంది. చిన్న చిన్న జబ్బులకి ఏ మందులివ్వాలో కూడా తెలుసుకుంది. కొన్నాళ్లకి ఆర్‌ఎంపీ ఇక్కడ నుండి వెళ్లిపోయాడు. అతడు లేని ఊర్లో బేబక్క అనఫీషియల్ ఆర్‌ఎంపీ అయింది. ఊరిలో ఎవరికి ఏం అవసరం వచ్చినా బేబక్కే వారికి దిక్కయింది. బేబక్క మొగుడు కార్పెంటర్ పని చేసేవాడు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. టౌనులో కార్పెంటర్ పనికి బాగానే డిమాండ్ ఉండేది. మధ్య మధ్యలో సిటీకి కూడా తీసుకెళ్లి పనిచేయించుకునే వారు. ఇంతలో అతనికి టి.బి. వచ్చింది. ఖరీదయిన మందులు, తిండి అవసరమయ్యాయి. మరోవైపు అతను పని చేయలేని స్థితికి చేరుకున్నాడు. బేబక్క మీద పూర్తి కుటుంబ బాధ్యత పడింది. మొగుడిని ఇలానే వదిలేస్తే అతను చావడం ఖాయం అని బేబక్కకి తెలుసు. అందుకే తను గల్ఫుకి వెళ్లే నిర్ణయం తీసుకుంది. ఏజెంటు అక్కడ నర్సులకి బాగా డిమాండ్ ఉందని చెప్పాడు. మీ బ్యాంకులో రెండు లక్షలు అప్పు చేసి వాడికి ఇచ్చింది. వాడే దగ్గరుండి తీసుకెళ్లాడు. ఆ తరువాత ఆమె ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడన్నా ఆ ఏజెంటును అడిగితే.. మనుషులను గల్ఫుకు పంపడం వరకు చేయగలను కానీ, వాళ్లు అక్కడ నుండి ఉత్తరం రాయకపోతే నేనేం చేయగలను అని తప్పించుకుంటున్నాడు. ఏది ఎలా ఉన్నా నెల నెలా డబ్బులయితే వస్తున్నాయి కదా అని ఇంట్లో వాళ్లు కూడా పట్టించుకోలేదు. గత మూడు నెలలుగా డబ్బులు రావడం కూడా ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియదు. ఎలా కనుక్కోవాలో అసలే తెలియదు అంటూ ముగించాడు పోస్ట్‌మాస్టర్. ఇది ఒక్క బేబక్క కథ కాదు. ఎందరి కథలో ఇలానే ఆంతమవుతున్నాయి అంటూ ముక్తాయించాడు.

విహారి మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లాక బేబక్క అకౌంట్ ఓపెనింగ్ ఫారాలు తెప్పించుకుని చూశాడు. ఎన్నారై అకౌంటుకు పాస్‌పోర్ట్ జత చేయడం తప్పనిసరి కాబట్టి దాని కాపీ దొరికింది. విహారితో పాటు బ్యాంకులో చేరిన అతని స్నేహితుడు ఫారిన్ ఎక్స్ఛేంజ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాడు. అతనికి ఫోన్ చేసి, బేబక్క అకౌంటు వివరాలు చెప్పి అందులో వస్తున్న డబ్బులు ఏ దేశం నుండి వస్తున్నాయో, ఎవరి ద్వారా వస్తున్నాయో కనుక్కోమని అడిగాడు. మరుసటి రోజు అతని నుండి వివరాలు వచ్చాయి. ఆ డబ్బులు సౌదీ నుండి వచ్చాయి. ఆ వివరాల ప్రకారం సౌదీలోని ఎక్స్ఛేంజ్ కంపెనీకి ఫోన్ చేసి ఆ డబ్బులు ఎవరు పంపుతున్నారో తెలియజేయమని అడిగాడు. వాళ్లు ఇరాక్‌లోని ఒక కంపెనీ పేరు చెప్పారు.నాకు కావలసింది కంపెనీ పేరు కాదు. అక్కడ కాంటాక్ట్ చేయడానికి ఎవరయినా ఒక మనిషి నంబర్ ఇవ్వండి అని అడిగాడు.మొదట వాళ్లు ఒప్పుకోలేదు. ఎంతో సముదాయించిన తరువాత ఎట్టకేలకు వాళ్లు ఒక నంబర్ ఇచ్చారు. విహారి పట్టువదలకుండా ఆ నంబర్‌ను కాంటాక్ట్ చేశాడు. అవతల మనిషి హిందీలో మాట్లాడుతున్నాడు. తనకి కావలసిన సత్యవతి వివరాలు చెప్పాడు విహారి.ఎవరూ? అడిగాడు అవతల వ్యక్తి.అసలు పేరు సత్యవతి. అందరూ బేబక్క అంటారు. పాస్‌పోర్టు నంబర్...అక్కర్లేదు. తను నాకు తెలుసు. ఇక్కడే ఉంది అన్నాడు అవతల వ్యక్తి. ఆమె ఫోన్ నంబర్ ఇవ్వగలరా? ఇంట్లో వాళ్లు ఒక్కసారి మాట్లాడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు అడిగాడు విహారి.ఆమె దగ్గర ఫోన్ ఉందో, లేదో నాకు తెలియదు నీ నంబర్ చెప్తే ఆమెతో ఫోన్ చేయిస్తాను అన్నాడతను.విహారి అతనికి తన నంబర్ ఇచ్చాడు.

ఇరాక్‌లో కిర్కుక్‌ని ఆయిల్ సిటీ అంటారు. దానికి దక్షిణాన ఉంది ఖుర్మాతు పట్టణం. అక్కడ ఉన్న అనేక ఆయిల్ కంపెనీలలో భారతీయ వర్కర్లు అత్యంత దయనీయ పరిస్థితుల్లో పనిచేస్తున్నారు.వీరు అక్కడ ఉన్న సంగతి వారి కుటుంబసభ్యులకే కాదు, భారత ప్రభుత్వానికి కూడా అధికారికంగా తెలియదు. భారతదేశం నుంచి ఉద్యోగాలు వెతుక్కుంటూ గల్ఫుకు వెళ్తున్న వందమందిలో ఎనభై మందిని ఇక్కడి ఏజెంట్లు టూరిస్టు వీసామీద పంపుతారు.గల్ఫు చట్టాల ప్రకారం టూరిస్టు వీసామీద వచ్చిన వారికి పని చేసుకునే అధికారం ఉండదు. ఇండియా నుండి కూలీలను పంపిన ఏజెంటుకు అక్కడ మరో ఏజెంట్‌తో సంబంధాలు ఉంటాయి. ఆ ఏజెంటు వీరిని రెండు రోజులు అటుఇటు తిప్పి ప్రస్తుతం వారికి గల్ఫులో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని తేలుస్తాడు. వారు ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడి వృథా అనీ, తిరిగి ఇండియా వెళ్లడం తప్ప మరో మార్గం లేదనీ వారిని మానసికంగా కుంగదీస్తాడు. అప్పటికే అన్ని రకాలుగా జీవితంలో ఓడిపోయి అక్కడకి చేరిన వారికి వెనక్కి ఇండియా వెళ్లే ధైర్యం ఉండదు. చివరికి ఏదో మార్గం చూడమని ఆ ఏజెంటును వీరు బతిమాలుకునేలా పరిస్థితులు కల్పిస్తారు. పోనీ గల్ఫులో కాదు కానీ... ఇరాక్ వెళ్తారా? అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి అని అడుగుతాడు ఆ ఏజెంట్.

కానీ.. ఇక్కడ నుండి అక్కడకు చేరాలంటే డబ్బులు?
ప్రస్తుతం మీకు నేను పెట్టుబడి పెడతాను. మీకు వచ్చే డబ్బుల నుండి నెలకింతని కట్టుకుంటాను అని చెప్తాడు ఆ ఏజెంట్. హామీగా వారి పాస్‌పోర్టులు తీసేసుకుంటాడు. వీరు ఒప్పుకున్న తర్వాత అనధికారికంగా నౌకల అడుగున దాచి వీరిని గల్ఫు నుండి స్మగుల్ చేసి ఇరాక్ పంపుతారు. 48 డిగ్రీల వేడిలో రోజుకు పన్నెండు నుంచి పదిహేను గంటలు పనిచేస్తూ వారు ఒక్కసారిగా కాకుండా వాయిదాల పధ్ధతిలో చచ్చిపోతారు. వారి దగ్గర ఏ విధమైన పత్రాలు ఉండవు. అసలు వారు భారతీయులని నిరూపించే ఆధారాలూ ఉండవు. వారి దగ్గర ఎలాంటి ఫోన్లూ ఉండవు. వారిని ఉత్తరాలు రాసుకోవడానికి కూడా అనుమతించరు. వారి తరపున ఏజెంట్లే ఎంతో కొంత డబ్బు ఇండియాలో వారి అకౌంటుకు పంపుతుంటారు.బేబక్క కూడా అలా ఇరాక్ చేరింది.

తన వివరాల కోసం ఎవరో ప్రయత్నిస్తున్నారని కూడా తెలియని బేబక్క ఖుర్మాతు పట్టణంలోని మార్కెట్ దగ్గరకు చేరుకుంది.మార్కెట్ విపరీతమైన రద్దీగా ఉంది.ఆమె లోపలకు నడవబోతుంటే ఆమెను అక్కడకి తెచ్చిన ఏజెంట్ కనిపించాడు. బేబక్కా! ఎప్పుడు వచ్చావ్? మూడు నెలలయింది నిన్ను చూసి. నువ్వు కనిపిస్తావేమో అని రోజూ చూస్తున్నాను అన్నాడతను. ఎందుకు? నిరాసక్తంగా అంది బేబక్క.ఇటు రా.. అంటూ అంతగా జనసంచారం లేని ఒక పక్కకి తీసుకెళ్లాడు ఏజెంట్. మీ ఊరి నుంచి బ్యాంకు మేనేజర్ ఫోన్ చేశాడు. మీ వాళ్ళు నీతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నారని చెప్పాడు. నీ నంబర్ అడిగాడు. నీ దగ్గర ఫోనే లేదన్న విషయం అతనికి చెప్పలేదు. అతని ఫోన్ నంబర్ తీసుకున్నాను. కావాలంటే నువ్వు అతని ద్వారా మీ వాళ్లతో మాట్లాడవచ్చుఅనుమానంగా చూసింది బేబక్క. మామూలుగా ఎవరినీ ఫోను మాట్లాడుకోనివ్వరు. అందుకే అనుమానంగా ఎవరినీ ఫోన్ మాట్లాడుకోనివ్వరుగా? అంది.రహస్యం. ఇది నీ ఒక్కదానికే ఇస్తున్న చాన్సు. ఎవరికీ చెప్పకు. ఉపయోగించుకోదలచుకుంటే చెప్పు, ఇప్పుడే నా ఫోన్ ఇస్తాను మరింత అనుమానంగా అతనివైపు చూసింది బేబక్క.ఎందుకంత అనుమానం. దీనికి బదులు ఏమి అడుగుతాననా? నువ్వు ఇవ్వలేనిది ఏమీ అడగనులే, రాత్రికి ఒకసారి నీ గదికి వస్తాను. ఒక్కసారికి ఒప్పుకుంటే చాలు వెకిలిగా నవ్వుతూ అన్నాడతను.అక్కడికి వెళ్లిన ఆడవాళ్లకి ఇదో అదనపు భారం. కనిపించిన ప్రతివాడి కామపు చూపుల నుండి తప్పించుకోవడం అంటే రోజూ అగ్నిపరీక్షలో నిలిచి గెలిచినట్లే. ఇప్పటికి ఎన్నోసార్లు బేబక్క అతని ఆఫర్ తిరగ్గొట్టింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనుకున్నాడతను.

అయితే బేబక్క ఫోన్ ఇవ్వమన్నట్లు చెయ్యి చాపింది. ఒప్పుకున్నట్లేనా? ఆనందంగా అడిగాడతను కన్ఫర్మ్ చేసుకోవటానికన్నట్లు. బేబక్క ఏమీ మాట్లాడలేదు. చేయి అలా చాపే ఉంచింది.అతను ఫోన్ రింగ్ చేసి ఇచ్చాడు. అవతల విహారి ఫోన్ ఎత్తాక బేబక్కకి ఇచ్చాడు.
ఫోన్లో మాట్లాడుతున్నది బేబక్కని తెలిశాక మీరు ఎలా ఉన్నారు? మీ విషయం తెలియక, మూడు నెలల నుంచి మీ దగ్గర నుంచి వచ్చే డబ్బులు కూడా రాకపోవడంతో మీ వాళ్లు కంగారు పడుతున్నారు అన్నాడు విహారి.మా వాళ్లు ఎలా ఉన్నారు? అని అడిగింది బేబక్క. ఎంత ఆపుకొందామనుకున్నా కన్నీళ్లు రాకుండా ఆగలేదు బేబక్కకి ఆ మాట అడుగుతుంటే. బాగానే ఉన్నారు. మీ గురించే గాభరా పడుతున్నారు. మీ ఆరోగ్యానికి ఏం ఇబ్బంది లేదుగా? అడిగాడతను.మూడు నెలల క్రితం నన్ను మరో పగమంది మగవాళ్లతో కలిపి ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు తెలుగులో చెప్పింది బేబక్క. పక్కన ఉన్న ఏజెంటుకు తెలుగు రాదు కాబట్టి అతనికి ఆమె మాటలు అర్థమయ్యే అవకాశం లేదు.మైగాడ్. ఎందుకు?నవ్వింది బేబక్క. మనిషికి ఒకరినొకరు చంపుకోవడానికి ఎన్ని కారణాలు లేవు. కిడ్నాప్ చేసిన మగవారిని అక్కడికక్కడే చంపేశారు. నేను ఆడదాన్ని కదా.. నేను ఉపయోగపడ్డా పడకపోయినా, నా శరీరం ఉపయోగపడుతుంది. అందుకే మూడు నెలలు సన్ను చంపకుండా ఆగారు మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అనుమానంగా అడిగాడు విహారి. ఉగ్రవాదుల చెరలో ఉంటే ఆమె తనతో ఎలా మాట్లాడుతుందో అర్థంకాక. ఇప్పుడు నేను వారి చెరలో లేను. ప్రస్తుతం ఈ శరీరం మీద వారి ఇంట్రెస్ట్ అయిపోయింది. మా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. నేను ఒక పని చేస్తే నాకు పాతిక లక్షలు ఇస్తామన్నారు. ఆ పని చేయడానికే నన్ను విడుదల చేశారు. నిజానికి నా అకౌంట్లో డబ్బు వేసేశామన్నారు. వచ్చిందా? అప్పటికప్పుడు ఆమె అకౌంట్లో చూసిన విహారి నిజంగానే పాతిక లక్షలు కనిపించాయి. నిన్నటిదాకా పాతిక రూపాయలు లేని అకౌంట్లోకి పాతిక లక్షలు రావడం అతన్ని ఎప్పుడూ లేనంత ఆశ్చర్య పరిచింది. వచ్చింది. అంతా డబ్బు ఇస్తున్నారంటే మీరు ఏం చేయాలి? అడిగాడు విహారి.దాని సంగతి తరువాత. ఆ డబ్బు ఇంట్లో వాళ్లకి జాగ్రత్తగా చేర్చండి. ఇక ఎప్పటికీ ఆ అకౌంట్లోకి డబ్బులు రావు. నా గురించి ఎవరూ వెతకొద్దు. మీ సమయం వృథా చేసుకోవద్దు. ఈ విషయం మా ఇంట్లో వాళ్లకి అర్థమయ్యేలా చెప్పండి అని ఫోన్ ఆపి, ఎదుటి వ్యక్తి చెప్పేది వినకుండా, ఫోన్ ఆఫ్ చేసి ఏజెంట్‌కు ఇచ్చేసింది బేబక్క. ఏమీ మాట్లాడకుండా రద్దీగా ఉన్న మార్కెట్ మధ్యకి వచ్చింది బేబక్క. మార్కెట్ మధ్యలో నిలబడి వీలయినంత ఎక్కువమంది చనిపోయేలా తనను తాను పేల్చుకునేందుకు ఐసిస్ కట్టిన వెల పాతిక లక్షలు. జీవితం మీదే విరక్తి కలిగిన బేబక్కకి తను చనిపోవడం ఇబ్బంది కలిగించడం లేదు. తనవల్ల ఇంత మంది మనుషులు చనిపోబోతున్నారంటేనే బాధగా ఉంది.

రాత్రికి వస్తున్నాను.. అన్నాడు ఆమెనే అనుసరిస్తున్న ఆ ఏజెంట్ చిలిపిగా చూస్తూ.మొదటిసారి నవ్వింది బేబక్క.ఎందుకు నవ్వుతున్నావ్? అర్థంకాక అడిగాడతను.రాత్రి దాకా ఆగలేకపోతున్నావా? అంది బేబక్క.అవునన్నట్లు తల ఊపాడతను.సరే పద.. అంది బేబక్క.
లాటరీ కొట్టినంత ఆనందించాడు అతను.ఇద్దరు అక్కడినుండి కొద్ది దూరం నడిచారు.అతని పక్కన నడుస్తూ అతన్ని చూస్తే, తన లాంటి వేలాది మంది బాధలకు ప్రతీకగా కనిపిస్తున్నాడు ఆ ఏజెంటు. డబ్బులు కూడా తన అకౌంటుకు చేరిపోయాయి. ఇక తను ఏం చేసినా ఐసిస్ ఏమీ చేయలేదు.ఆ మాట అనుకోగానే ఆమె చేయి పొట్టమీదకి వెళ్లింది. అక్కడ బెల్టు బాంబు తగిలింది. ఆమె చుట్టూ చూసింది. ఇక్కడ పేల్చుకుంటే తాము తప్ప ఎవరూ చనిపోరు.ఆ మాట అనుకున్న తరువాత ఆమె ఆలస్యం చేయలేదు.
మరుక్షణం అక్కడ ఒక పెద్ద విస్ఫోటనం సంభవించింది. తనను తాను పేల్చుకున్న బేబక్కతోపాటు ఏజెంటు కూడా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

అమ్మ అంత డబ్బు పంపిందా? అడిగింది బేబక్క కూతురు ఆనందంగా.అవును.. తను కూడా ఆనందంగా అన్నాడు విహారి. బేబక్క ఫోన్ పెట్టేయగానే ఆమె ఇంట్లో వాళ్ళని పిలిపించి, డబ్బు విషయం చెప్పాడు విహారి. అయితే ఆమె ఇక కనిపించదన్న విషయం మాత్రం ఎలా చెప్పాలో అర్థంకాక చెప్పలేదు.అందులో ఒక ఐదు వేలు ఇవ్వండి అడిగింది ఎప్పుడూ వచ్చే చిన్నపిల్ల. విహారి ఇచ్చిన డబ్బును తిరిగి అతని చేతిలో పెడుతూ, అమ్మకి ఎవరి దగ్గరా అప్పు చేయడం ఇష్టం ఉండదు అంది. ఆ అమ్మాయి సంస్కారానికి ఆశ్చర్యపోతూ డబ్బు తీసుకున్నాడు విహారి.ఈ విషయం ఇప్పుడే నాన్నకి చెప్తాను అంటూ ఇంటికి పరుగు తీసింది ఆ అమ్మాయి.

రెండు రోజుల తరువాత ఎప్పటిలాగానే బ్యాంకు నిర్మానుష్యంగా ఉంది. ఏం చేయాలో అర్థంకాక ఎదురుగా ఉన్న పేపర్‌లో తల దూర్చాడు విహారి. ఇరాక్‌లో ఏదో ఒక పట్టణంలో నోరు తిరగని ఒక ఊర్లోని మార్కెట్లో జరిగిన ఆత్మాహుతి ప్రయత్నం, కొద్దిగా ముందు పేలడంతో త్రుటిలో తప్పిందని ఏడో పేజీలో ఒక మూల చిన్న అక్షరాలతో ఒక వార్త వచ్చింది. విహారి ఆ వార్త చదివాడు. అతనికి బేబక్క మాటల అర్థం అప్పుడు బోధపడింది.

రచయిత పరిచయం
పుట్టగంటి గోపీకృష్ణది గుంటూరు జిల్లా తెనాలి. ప్రస్తుతం కర్ణాటకలోని ధార్వాడ్ పట్టణంలో ఉంటున్నారు. 2008లో రచనలు మొదలుపెట్టారు. ఇప్పటి వరకూ 26 నవలలు, వంద కథలు రాశారు. అవి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.


-పుట్టగంటి గోపీకృష్ణ, సెల్: 94910 91620

335
Tags

More News

VIRAL NEWS